జాతీయ వార్తలు

ఐఆర్‌ఎస్ వెబ్‌సైట్ హ్యాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ఆదాయం పన్ను శాఖకు చెందిన ఇండియన్ రెవిన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) అధికారిక వెబ్‌సైట్‌ను పాకిస్తాన్‌కు చెందిన కొన్ని ముఠాలు హ్యాక్ చేశాయి. ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఐఆర్‌ఎస్‌ఆఫీసర్స్‌ఆన్‌లైన్.జిఓవి.ఇన్’ అనే ఈ అధికారిక వెబ్‌సైట్‌ను శనివారం తెల్లవారుజామున హ్యాక్ చేశారని, అప్పటినుంచి అది అందుబాటులో లేకుండా పోయిందని అధికారులు చెప్పారు. ‘పాకిస్తాన్ జిందాబాద్’, ‘మేము పాక్ సైబర్ దాడి బృందం సభ్యులం’ లాంటి సందేశాలు దానిలో ఉంచారని వారు చెప్పారు. అసౌకర్యానికి చింతిస్తున్నామని, త్వరలోనే తాము అందుబాటులోకి వస్తామనే ఓ సందేశాన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు, దేశంలోని ఐటి శాఖకు చెందిన క్షేత్రస్థాయి కార్యాలయాలకు మధ్య అధికారిక సంధానకర్తగా పని చేసే ఈ వెబ్‌సైట్ ఉంచింది. దీనికి సంబందించి ఆ వెబ్‌సైట్ భారతీయ ఇంటర్నెట్‌లో తలెత్తే హ్యాకింగ్ సమస్యలు లాంటి వాటిని చూసే నోడల్ ఏజన్సీ అయిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (సిఇఆర్‌టి-ఇన్)కు ఒక నివేదిక కూడా పంపింది.

విపత్తుల సహాయానికి
జాగిలాలకు ప్రత్యేక శిక్షణ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను కాపాడటంతో తమ సిబ్బందికి చేదోడు వాదోడుగా ఉండేలా ఎన్‌డిఆర్‌ఎఫ్ తొలిసారి 162 జాగిలాలకు శిక్షణ ఇస్తోంది. గత ఏడాది నేపాల్‌లో భూకంపం పెనువిధ్వంసాన్ని సృష్టించినప్పుడు, అలాగే ఉత్తరాఖండ్, జమ్మూ-కాశ్మీరు, తమిళనాడులో భారీ వరదలు సంభవించినప్పుడు విశేష సేవలందించిన ఎన్‌డిఆర్‌ఎఫ్ ప్రస్తుతం ‘మిషన్ మోడ్’లో ఈ జాగిలాలకు శిక్షణ ఇస్తోంది. భూకంపాలు, ఇతర విపత్తులు సంభవించినప్పుడు శిథిలాల్లో చిక్కుకున్న వారిని గుర్తించడంలో ఎన్‌డిఆర్‌ఎఫ్ ఈ జాగిలాలకు విస్తృతస్థాయిలో ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. ఇప్పటికే ఈ శిక్షణ దాదాపు పూర్తయిందని, ప్రస్తుతం ఈ జాగిలాలతో డ్రిల్స్, ఫీల్డ్ ఎక్సర్‌సైజ్‌లు చేయిస్తున్నామని ఎన్‌డిఆర్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఓపి.సింగ్ పిటిఐ వార్తా సంస్థకు వివరించారు.

18న సెంట్రల్ వర్శిటీల
వైస్‌చాన్సలర్ల సమావేశం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో దళిత పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడడం, అనంతర పరిణామాల నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ నెల 18న దేశంలోని మొత్తం 46 సెంట్రల్ యూనివర్శిటీల వైస్ చాన్స్‌లర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సెంట్రల్ వర్శిటీలలో అణగారిన వర్గాల పట్ల వివక్షను అంతమొందించేందుకు ఉన్న మార్గాలపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో రోహిత్ వేముల ఆత్మహత్య సంఘటనపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉండటంతో అంతకుముందే వైస్ చాన్స్‌లర్ల సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.