జాతీయ వార్తలు

‘సుప్రీం’ తీర్పు తర్వాతే రామాలయంపై నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలహాబాద్, ఫిబ్రవరి 8: టైటిల్ సూట్‌పై అలహాబాద్ హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు తీర్పును వెలువరించిన తర్వాత అయోధ్యలో రామాలయ నిర్మాణంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి కల్‌రాజ్ మిశ్రా స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి ఆయన అలహాబాద్‌లో విలేఖర్లతో మాట్లాడుతూ, టైటిల్ సూట్‌పై సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పు వచ్చేవరకు ఎదురుచూడాల్సిందేనని, ఈ తీర్పు వెలువడిన తర్వాత ఉత్పన్నమయ్యే పరిస్థితిని బట్టి రామాలయ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో ముందుకు సాగాలని తాము భావిస్తున్నప్పటికీ అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలన్న బిజెపి వైఖరిలో ఎటువంటి మార్పూ లేదని ఆయన చెప్పారు. రామాలయ నిర్మాణంపై ప్రధాని నరేంద్ర మోదీ వౌనాన్ని వీడాలని, అయోధ్యను సందర్శించి అక్కడ ఆలయ నిర్మాణంపై నిబద్ధతను చాటుకోవాలని గత వారం జరిగిన విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) సమావేశంలో సంఘ్ పరివార్ విజ్ఞప్తి చేయడంపై అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ కల్‌రాజ్ మిశ్రా పై విషయాలను స్పష్టం చేశారు.

తెలుగు రాష్ట్ర శాఖలకు బిజెపి కొత్త అధ్యక్షులు

బడ్జెట్ సమావేశాల అనంతరం జాతీయ కార్యవర్గం భేటీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల బిజెపి శాఖలకు కొత్త అధ్యక్షులు రానున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు పూర్తయిన వెంటనే బిజెపి జాతీయ కార్యవర్గం సమావేశం కానున్నది. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి చర్చించిన అనంతరం తమిళనాడు, పంజాబ్, అస్సాం తదితర ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాన్ని ఖరారు చేయటంతోపాటు జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు మరికొన్ని రాష్ట్రాల బిజెపి శాఖలకు కొత్త అధ్యక్షులను నియమిస్తారని పార్టీ వర్గాలు వెళ్లడించాయి. బిజెపి అంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు హరిబాబు, తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి స్థానంలో యువతరానికి చెందిన వారికి అవకాశం ఇస్తారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదిలా ఉంటే నామినేటెడ్ పదవుల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలను నియమించటం మరింత జాప్యం అవుతుందని బిజెపి సీనియర్ నాయకుడొకరు తెలిపారు. ప్రధాని మోదీ ఇటీవల బిజెపి అనుబంధ సంస్థల అధ్యక్షులు, నాయకులతో సమావేశమైనప్పుడు నామినేటెడ్ పదవుల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులను నియమించే అంశం చర్చకు వచ్చింది. నామినేటెడ్ పదవులను భర్తీ చేయటం వలన పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపెరు వచ్చే ప్రమాదం ఉన్నదనే అభిప్రాయం వ్యక్తమైందని, నరేంద్ర మోదీ కూడా నామినేటెడ్ పదవుల భర్తీపట్ల విముఖత వ్యక్తం చేశారని చెబుతున్నారు.

మేడారం జాతరకు
ప్రత్యేక రైలు నడిపించండి

ఎంపీ రాపోలు విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: సమ్మక్క, సారక్క జాతరకోసం సికింద్రాబాద్ నుండి మణుగూరు వరకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ రైల్వే బోర్డు అధ్యక్షుడు ఏ.కె.మిఠల్‌ను కోరారు. ఆనంద భాస్కర్ సోమవారం మిఠల్‌ను కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రం అందజేశారు. ప్రత్యేక రైలును ఫిబ్రవరి పదో తేదీ నుండి నెలాఖరు వరకు నడిపించాలని కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్, కర్నాటక నుండి దాదాపు కోటిమంది గిరిజనులు, ఇతరులు సమ్మక్క సారక్క జాతరకు హాజరవుతారు కాబట్టి వారి సౌకర్యార్థం ప్రత్యేక రైలును నడిపించాలని ఆయన మిఠల్‌కు వివరించారు. జాతర జరిగే ప్రదేశం మేడారానికి చేరేందుకు ప్రజలు ఆర్‌టిసితోపాటు ప్రైవేట్ బస్సులపై ఆధారపడుతున్నారని ఆనంద భాస్కర్ తెలిపారు. మేడారానికి వెళ్లేందుకు ఖమ్మం జిల్లాలోని మణుగూరు రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడివరకు ప్రత్యేక రైలు నడిపించాలని ఆయన కోరారు.

ఒక మృతదేహమే దొరికింది
సియాచిన్‌లో కొనసాగుతున్న గాలింపు

శ్రీనగర్, ఫిబ్రవరి 8: ఆరు రోజుల క్రితం సియాచిన్ ప్రాంతంలో హిమపాతం వల్ల మంచులో కూరుకుపోయి మృతి చెందిన పది మంది సైనికుల్లో ఒకరి మృతదేహాన్ని సైన్యం సోమవారం వెలికితీసింది. మిగతా తొమ్మిది మంది మృతదేహాల కోసం గాలిస్తున్నట్లు రక్షణ శాఖ ప్రతినిధి ఇక్కడ చెప్పారు. మిగతా తొమ్మిది మంది మృతదేహాల కోసం సైనిక బృందాలు భారీగా కురిసిన మంచులో తీవ్రంగా గాలిస్తున్నాయి. సజీవ సమాధి అయిన సైనికులకోసం ఈ బృందాలు కొన్నిసార్లు 30 అడుగులకు మించి లోతుగా తవ్వుతున్నాయి. ఆరు రోజుల క్రితం హిమపాతం వల్ల పది మంది సైనికులు సజీవ సమాధి అయినప్పటి నుంచే వారిని రక్షించడానికి సైనిక బృందాలు సహాయక చర్యలను ప్రారంభించాయి. వరుసగా ఆరు రోజుల నుంచి కొనసాగిస్తున్న గాలింపు చర్యల్లో సోమవారం ఒకరి మృతదేహాన్ని వెలికితీయగలిగినట్లు శ్రీనగర్‌లోని రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ ఎన్.ఎన్.జోషి చెప్పారు. అయితే ఈ మృతదేహం ఎవరిదనేది ఇంకా గుర్తించలేదని ఆయన తెలిపారు. 19వేల అడుగుల ఎత్తున గల సియాచిన్‌లో హిమపాతం వల్ల సైనిక పోస్టు మంచులో కూరుకుపోవడంతో సహాయక చర్యలను సమన్వయం చేయడంతోపాటు ఈ సున్నిత ప్రాంతంలో నిరంతరం కాపలా కాయడానికి కొత్త క్యాంపును ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.