జాతీయ వార్తలు

పప్పులుడకని ‘ఫేస్‌బుక్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: దేశ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్న నెట్ న్యూట్రాలిటీకి అంతిమంగా టెలికామ్ నియంత్రణా సంస్థ ‘ట్రాయ్’ కూడా ఓటేసింది. వెబ్ వినియోగదారుల నుంచి ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు విభిన్న రకాల చార్జీలు వసూలు చేయడంపై ‘ట్రాయ్’ సోమవారం నిషేధం విధించి నెట్ న్యూట్రాలిటీకి ఊతమిచ్చింది. తద్వారా ‘ఫేస్‌బుక్’ లాంటి ప్రముఖ సామాజిక మాధ్యమాలు సహా వినియోగదారులకు విభిన్న రకాల డేటా టారిఫ్‌లు ఆఫర్ చేస్తున్న ఇతర ఆపరేటర్లకు తీవ్రమైన షాక్ ఇచ్చింది. అంతేకాకుండా నెట్ న్యూట్రాలిటీ నిబంధనలను ఉల్లంఘించిన సర్వీస్ ప్రొవైడర్లకు రోజుకు 50 వేల రూపాయల చొప్పున గరిష్ఠంగా 50 లక్షల రూపాయల వరకూ జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. ‘ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేటరీ టారిఫ్స్ ఫర్ డేటా సర్వీసెస్ రెగ్యులేషన్-2016’ పేరుతో రూపొందించిన ఈ నిబంధనల వివరాలను ‘ట్రాయ్’ చైర్మన్ ఆర్‌ఎస్.శర్మ వెల్లడించారు. ఈ నిబంధనలను సోమవారం నుంచే అమలులోకి తీసుకొస్తున్నామని, కనుక కంటెంట్‌ను ఆధారంగా చేసుకుని డేటా సేవలకు ఏ సర్వీస్ ప్రొవైడర్ కూడా వివక్షాపూరితమైన చార్జీలు విధించడం గానీ, వసూలు చేయడం గానీ చేయరాదని ఆయన తేల్చిచెప్పారు. ఒకవైపు ‘ఫేస్‌బుక్’ లాంటి సంస్థలు ‘ఫ్రీ బేసిక్స్’ ప్లాట్‌ఫామ్ (ఉచిత పథకాల) ద్వారా వినియోగదారులకు అందజేస్తున్న సేవలపై, మరోవైపు ఎయిర్‌టెల్ లాంటి సర్వీస్ ప్రొవైడర్లు గతంలో ఇదేవిధమైన పథకాలను ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తి నెట్ న్యూట్రాలిటీపై దేశంలో విస్తృత చర్చ జరుగుతుండటంతో ‘ట్రాయ్’ ఈ నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది. దీంతో వినియోగదారులకు కొన్ని వెబ్‌సైట్లను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్న ‘ఫేస్‌బుక్’ లాంటి సంస్థలకు తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు.

ఉగ్రవాదం, ఉపాధిపైనే చర్చ

నేటి నుంచి రెండు రోజుల పాటు రాష్టప్రతి అధ్యక్షతన గవర్నర్ల సదస్సు
ఢిల్లీకి చేరుకున్న ఉమ్మడి రాష్ట్రా ల ప్రథమ పౌరుడు నరసింహన్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన మంగళవారం నుంచి రెండు రోజుల పాటు ఇక్కడ జరుగనున్న గవర్నర్ల సదస్సులో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అనుసరించాల్సిన వ్యూహం, ఉద్యోగాల కల్పన అంశాలు ప్రధాన చర్చనీయాంశాలు కానున్నాయి. ఈ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పాల్గొంటారు. 23 రాష్ట్రాల గవర్నర్లు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు ఈ సదస్సుకు హాజరవుతారని రాష్టప్రతి సచివాలయం సోమవారం ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సదస్సులో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ సోమవారమే ఢిల్లీకి చేరుకున్నారు.
దేశ భద్రతపై ఈ సదస్సులో చర్చిస్తారు. ముఖ్యంగా ఉగ్రవాద, తీవ్రవాద కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరిస్తూ అంతర్గత భద్రతతో పాటు విదేశాల నుంచి పొంచి ఉన్న ముప్పుపై చర్చిస్తారు. అలాగే నైపుణ్య అభివృద్ధిపై కేంద్రీకరిస్తూ యువతకు ఉద్యోగాలు కల్పించడంపై, విద్యార్థులు మధ్యలో బడి మానేయడంపై ఈ సదస్సులో చర్చిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్, 2022 నాటికి అందరికీ స్వంత ఇళ్లు, స్మార్ట్ సిటీల కార్యక్రమాల గురించి, ఉన్నత విద్య నాణ్యతను మెరుగుపరచడంపై కూడా ఈ సదస్సులో చర్చిస్తారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని కూడా ఈ సదస్సులో సమీక్షిస్తారు. ఈ 47వ గవర్నర్ల సదస్సు రాష్టప్రతి భవన్‌లో జరుగుతుంది. ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ, కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు ఈ సదస్సులో పాల్గొంటారు.

అవిశ్వాస తీర్మానంలో తప్పేమిటి?
అసెంబ్లీలోనే ఆమోదించారు కదా! అరుణాచల్ పరిణామాలపై సుప్రీం నేడు తదుపరి విచారణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8:అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాల్లో తప్పేమిటని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. స్పీకర్‌ను తొలగించిన తర్వాత డిప్యూటీ స్పీకర్ ఆ బాధ్యతను చేపట్టిన తర్వాతే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని చేపట్టారని, అందులో తప్పుబట్టాల్సిన అంశమేమిటని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. స్పీకర్‌ను తొలగించిన అనంతరమే డిప్యూటీ స్పీకర్ ఆ బాధ్యతను చేపట్టారని, అప్పుడే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం చేపట్టడం..దాన్ని సభ ఆమోదించడం జరిగిందని ఐదుగురు సభ్యుల సుప్రీం కోర్టు ధర్మాసనం తెలిపింది. ‘ఇందులో మాకు ఎలాంటి తప్పు కనిపించడం లేదు’అని సుప్రీం బెంచి పేర్కొన్నప్పుడు ‘ప్రాథమికంగా మీ అభిప్రాయం సరైనదే’నని కాంగ్రెస్ తరపున వాదించిన సీనియర్ అడ్వకేట్ ఎఫ్‌ఎస్ నారిమన్ తెలిపారు. ముఖ్యమంత్రి, ఆయన మంత్రి మండలి ప్రమేయం లేకుండా సొంతంగా అసెంబ్లీని గవర్నర్ సమావేశ పరచకూడదని ఎక్కడా లేదని తిరుగుబాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరపున వాదించిన న్యాయవాది రాకేష్ ద్వివేది తెలిపారు. అయితే ఇందుకు సభలో చర్చించాల్సిన అంశం ఉండాలన్నదే నిబంధన అని వెల్లడించారు. ఒకసారి సభ సమావేశమైన తర్వాత అందులో ఏ రకమైన చర్చ జరగాలి, నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపై గవర్నర్‌కు ఎలాంటి పాత్ర ఉండదన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గవర్నర్లకు విశేషాధికారాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. జనవరిలో జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలను డిసెంబర్‌లో ఎందుకు నిర్వహించారంటూ అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జెపి రాజ్‌ఖోవాను సుప్రీం కోర్టు ఇంతకు ముందు నిలదీసింది. జనవరిలోనే అసెంబ్లీని నిర్వహించడం వల్ల నష్టమేమి ఉండేదని సుప్రీం బెంచి ప్రశ్నించిన నేపథ్యంలో రెబెల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరపు న్యాయవాది ఈ వివరణ ఇచ్చారు. కాగా, ఈ అంశంపై తదుపరి విచారణ మంగళవారం కూడా జరుగుతుంది.