జాతీయ వార్తలు

లష్కరే, జైషేలకు.. పాక్ ఆర్థిక, సైనిక సాయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 9: పాకిస్తాన్‌లో ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌లకు పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ ఆర్థిక, సైనికపరమైన మద్దతు ఇచ్చేదని, ముంబయి ఉగ్రవాద దాడుల్లో ప్రధాన నిందితుల్లో ఒకడైన పాకిస్తానీ అమెరికన్ డేవిడ్ కోల్మన్ హెడ్లీ వెల్లడించాడు. వరసగా రెండోరోజు మంగళవారం కూడా అమెరికానుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇక్కడి కోర్టు ముందు ఇచ్చిన వాంగ్మూలంలో ముంబయిలో భారతీయ రక్షణ శాస్తజ్ఞ్రులపైన, సుప్రసిద్ధ సిద్ధి వినాయక ఆలయంపైన కూడా ఉగ్రవాదులు దాడి చేయడానికి వేసుకున్న పథకం గురించి కూడా అతను వెల్లడించాడు. లష్కరే తోయిబాతోపాటుగా తాను పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐకి కూడా పని చేసానని, ఐఎస్‌ఐ అధికారి బ్రిగేడియర్ రియాజ్ 2008నాటి ముంబయి ఉగ్రవాద దాడుల ప్రధాన కుట్రదారయిన లష్కరే తోయిబా అగ్రనేత జకీవుర్ రెహమాన్‌కు అనుచరుడిగా పనిచేసే వాడనే విషయం తనకు తెలుసునని కూడా హెడ్లీ చెప్పాడు. ‘నేను ఐఎస్‌ఐకి కూడా పని చేస్తున్నాను. నేను పాక్ ఆర్మీకి చెందిన చాలా మంది అధికారులను కలిశాను’ అని ప్రత్యేక జడ్జి జిఎస్ సనప్ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో హెడ్లీ చెప్పాడు. హెడ్లీ వాంగ్మూలం బుధవారం కూడా కొనసాగుతుంది.
లష్కరే తోయిబా, అల్‌ఖైదాలతో సన్నిహితంగా కలిసి పని చేసిన పాక్ ఆర్మీ, ఐఎస్‌ఐకి చెందిన ముగ్గురు అధికారులు కల్నల్ షా, లెఫ్టెనెంట్ కల్నల్ హంజా, మేజర్ సమీర్ అలీలలతో పాటుగా రిటైర్డ్ ఆర్మీ అధికారి అబ్దుల్ రెహమాన్ పాషా పేర్లను కూడా హెడ్లీ వెల్లడించాడు. లష్కరే తోయిబా, అల్‌ఖైదాలు సమన్వయంతో కలిసి పనిచేసేలా చూడడం తనకు అప్పగించిన బాధ్యత అని హెడ్లీ చెప్పాడు. జైషే, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్‌లకు ఐఎస్‌ఐ ఆర్థిక, సైనిక మద్దతును అందించేదని కూడా అతను చెప్పాడు. అయితే వాళ్లూ వీళ్లూ చెప్పిన సమాచారం ఆధారంగా తాను ఈ అభిప్రాయానికి వచ్చినట్లు అతను చెప్పుకున్నాడు.
2008 నవంబర్ 26న ముంబయి దాడులు జరగడానికి ఏడాది ముంచే నగరంపై దాడి చేయడానికి పథకం ప్రారంభమయిందని టార్గెట్లను గుర్తించడానికి ఏడుసార్లు నగరానికి వచ్చిన హెడ్లీ వెల్లడించాడు. తాజ్‌మహల్ హోటల్‌లో జరిగే ఒక భారత రక్షణ శాస్తజ్ఞ్రుల సమావేశంపై దాడి చేయాలని లష్కరే తోయిబా మొదట అనుకుందని, దానికోసం హోటల్‌కు చెందిన ఒక డమీని కూడా తయారు చేసిందని అతను చెప్పాడు. అయితే ఆయుధాలు, వ్యక్తుల స్మగ్లింగ్‌లో ఇబ్బందులు, సమావేశం షెడ్యూల్ వివరాలు లేకపోవడం లాంటి సమస్యల కారణంగా ఆ ఆలోచనను విరమించుకున్నట్లు చెప్పాడు. నగరంలోని ప్రముఖ సిద్ధివినాయక ఆలయం, నేవల్ స్టేషన్‌ల వద్ద కూడా తాను రెక్కీ నిర్వహించినట్లు అతను వెల్లడించాడు. భారత్‌లో జరిగిన ఉగ్రవాద దాడులకు లష్కరే తోయిబానే పూర్తి బాధ్యురాలని అంటూ, అన్ని ఆదేశాలు కూడా లఖ్వీనుంచే వచ్చేవని చెప్పుకునే వారని హెడ్లీ వెల్లడించాడు. అంతేకాదు ఐఎస్‌ఐ అధికారి బ్రిగేడియర్ రియాజ్ లఖ్వీ మనిషని కూడా అతను చెప్పాడు. జడ్జి లఖ్వీ ఫోటోను చూపించినప్పుడు అతను దాన్ని గుర్తు కూడా పట్టాడు. తమ తరఫున గూఢచర్య నిర్వహించడానికి ఆర్మీవాళ్లను రిక్రూట్ చేయాలని ఐఎస్‌ఐ తనకు చెప్పిందని కూడా అతను తెలిపాడు.
‘2007 నవంబర్-డిసెంబర్ మధ్యలో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశానికి లష్కరే తోయిబా మిలిటెంట్లు సాజిద్ మిర్, అబూ కాఫా హాజరయ్యారు. ముంబయిపై ఉగ్రవాద దాడులు జరపాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. తాజ్‌మహల్ హోటల్ వద్ద రెక్కీ నిర్వహించే బాధ్యతను నాకు అప్పగించారు’ అని ముంబయి దాడులు జరపాలన్న పథకానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ హెడ్లీ చెప్పాడు. తాజ్‌మహల్‌లోని కాన్ఫరెన్స్ హాలులో భారతీయ రక్షణ శాస్తజ్ఞ్రుల సమావేశం జరగబోతున్నట్లు మిర్, కాఫాలకు సమాచారం తెలిసిందని, ఆ సమావేశం జరిగే సమయంలో దాడి చేయాలని వారు అనుకున్నారని కూడా చెప్పాడు. దానికోసం వాళ్లు తాజ్ హోటల్ డమీని కూడా కూడా తయారు చేసారన్నాడు. అయితే సమావేశం హాలులోకి ఆయుధాలు, మనుషులను తీసుకెళ్లడం లాంటి సమస్యల కారణంగా ఆ ఆలోచన విరమించుకున్నారని కూడా చెప్పాడు. సిద్ధి వినాయక ఆలయం దాడి పథకం గురించి చెప్తూ ‘ఆ ఆలయం వీడియో తీయాలని మిర్ ప్రత్యేకంగా నన్ను అడిగాడు’ అని హెడ్లీ చెప్పాడు. 2007 నవంబర్‌కు ముందు ముంబయిపై దాడి చేయాలనే ఆలోచన లేదని కూడా హెడ్లీ స్పష్టం చేశాడు. కాగా, ఐస్‌ఐతో తనకు ఎలా సంబంధాలు ఏర్పడ్డాయో, ఐఎస్‌ఐకి, లష్కరే తోయిబా, అల్‌ఖైదా, జైషే మహమ్మద్‌లాంటి పాక్ ఉగ్రవాద సంస్థలకు ఉన్న సంబంధాలను బైటపెట్టిన హెడ్లీ జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు వౌలానా మసూద్ అజర్ తనకు తెలుసునని, ఒకసారి తాను అతనిని కలిశానని కూడా చెప్పాడు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముంబియ కోర్టు ముందు ఇచ్చిన వాంగ్మూలాన్ని విలేఖరులకు వివరిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్