జాతీయ వార్తలు

ఇషత్ జహాన్.. లష్కరే మానవబాంబే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: పాకిస్తాన్ సంతతికి చెందిన అమెరికన్, లష్కర్-ఎ-తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాది డేవిడ్ కోల్‌మాన్ హెడ్లీ గురువారం ముంబయి కోర్టు ముందు విచారణలో ఒక కీలక అంశాన్ని వెల్లడించాడు. 2004లో గుజరాత్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఇషత్ జహాన్ ఎల్‌ఇటి ఉగ్రవాద సంస్థకు చెందిన మానవబాంబేనని తెలిపాడు. ఇషత్ జహాన్‌ది బూటకపు ఎన్‌కౌంటర్ అని అప్పట్లో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. హెడ్లీ వెలికి తెచ్చిన ఈ అంశంతో ఆనాటి వివాదాస్పద ఎన్‌కౌంటర్ అంశం మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ముంబయిపై ఉగ్రవాదులు జరిపిన దాడి (26/11) కేసులో ఇటీవలే అప్రూవర్‌గా మారిన హెడ్లీ గురువారం కూడా అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముంబయి కోర్టు ముందు విచారణకు హాజరయ్యాడు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్.. ఎల్‌ఇటి కమాండర్ జకీయుర్ రెహ్మాన్ లఖ్వీ చెప్పిన ‘సరిగా నిర్వహించకపోవడంతో విఫలమైన ఆపరేషన్’ గురించి అడగ్గా, హెడ్లీ బదులిస్తూ 19 ఏళ్ల ముంబయి యువతి ఇషత్ జహాన్ పేరును ప్రస్తావించాడు. భారత్‌లో మరో ఎల్‌ఇటి ఆపరేటివ్ ముజామిల్ బట్ నిర్వహించిన విఫలమైన ఆపరేషన్ గురించి లఖ్వీ తన వద్ద ప్రస్తావించాడని, అందులో ఎల్‌ఇటికి చెందిన ఒక మహిళా సభ్యురాలు మృతి చెందిందని హెడ్లీ కోర్టుకు చెప్పాడు. ఆ ఆపరేషన్‌లో పాల్గొన్న సభ్యుల పేర్లు తదితర వివరాలు వెల్లడించాలని నికమ్ అడగ్గా, పోలీసులతో కాల్పులు జరిగాయని, అందులో ఒక మహిళా మానవబాంబు మృతి చెందిందని లఖ్వీ చెప్పాడని హెడ్లీ తెలిపాడు. ఈ సందర్భంగా నికమ్ మూడు పేర్లు చెప్పగా, అందులోనుంచి జహాన్ అనే పేరును హెడ్లీ ధ్రువీకరించాడు. ఎల్‌ఇటిలో మహిళా విభాగం ఉందని, అబు అయిమాన్ తల్లి దానికి నేతృత్వం వహించారని హెడ్లీ తెలిపాడు. 2004 జూన్ 15న అహ్మదాబాద్ నగర శివార్లలో గుజరాత్ పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు- ఇషత్ జహాన్, జావేద్ షేక్ అలియాస్ ప్రణేశ్ పిళ్లై, అమ్జదలి అక్బరలి రాణా, జీషన్ జోహార్ మృతిచెందిన విషయం తెలిసిందే.
సాజిద్ మీర్‌కు ముందు ముజామిల్ బట్ తమ గ్రూపుకు నేతృత్వం వహించాడని హెడ్లీ చెప్పాడు. అబు దుజునా అనే వ్యక్తి తనను ముజామిల్‌కు పరిచయం చేసినట్లు అతను తెలిపాడు. భారత బలగాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు తాను, ముజామిల్ కలిసి ఒకసారి కాశ్మీర్‌కు వెళ్లామని హెడ్లీ వెల్లడించాడు. భారత్‌లో ఉగ్రవాద ఆపరేషన్లు నిర్వహించడానికి, తనకు పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ, ఎల్‌ఇటి ప్రధానంగా వనరులు సమకూర్చాయని హెడ్లీ వివరించాడు. 2008 నవంబర్‌లో ఉగ్రవాదులు ముంబయి నగరంపై దాడి జరపడానికి ముందు పాకిస్తాన్‌కు చెందిన తహవుర్ రాణా ముంబయిని సందర్శించాడని అతను తెలిపాడు.

ఇషత్ జహాన్ (ఫైల్ ఫొటో)