జాతీయ వార్తలు

స్వేచ్ఛను నులిమేస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రతిపక్షాలు, పౌర సమాజం, విద్యార్థుల స్వేచ్ఛాగళాన్ని అణచివేసేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. సోమవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ధోరణిని సోనియా ఎండగట్టారు. ఏ రకమైన స్వేచ్ఛ, ప్రశ్నించే తత్వం, చర్చ, అసమ్మతికి తావులేని విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగకుండా కాంగ్రెస్ అడ్డుపడుతోందన్న ప్రభుత్వ ఆరోపణలను తిరస్కరించారు. పార్లమెంట్‌ను అడ్డుకోవాలన్న ఉద్దేశం తమకులేదని, శాసన సంబంధిత బాధ్యతలను పార్లమెంట్ నిర్వర్తించే విషయంలో తాము ఏవిధంగానూ అడ్డుకోవడం లేదని తేటతెల్లం చేశారు. అయితే, ప్రభుత్వం మాత్రం దీనికి భిన్నంగానే తమపై ఆరోపణలు చేస్తోందన్నారు. జెఎన్‌యు వివాదంలో ప్రజాస్వామ్య విధానాలను ప్రభుత్వం అణగదొక్కిందని, అన్ని రకాలుగానూ సమతూకాన్ని కోల్పోయిందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని తమ పార్టీ తీవ్రంగానే ప్రస్తావిస్తుందని స్పష్టం చేశారు. ముందుగా లోక్‌సభలో విపక్షాల గొంత నొక్కటం, అనంతరం పౌర సమాజ కార్యకర్తలను అణచివేయటం వంటి చర్యలు చేపట్టిన ప్రభుత్వం, ఇప్పుడు వర్శిటీలపై దృష్టి సారించిందన్నారు.
సిడబ్ల్యుసి సమావేశ వివరాలను పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ మీడియాకు వివరించారు. బిజెపి, ఆరెస్సెస్ దాని అనుబంధ సంస్థలు దేశవ్యాప్తంగా సృష్టిస్తోన్న అలజడులపై సిడబ్ల్యుసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందన్నారు. ముఖ్యంగా దేశ సమగ్రతను, సామరస్యాన్ని దెబ్బతీసేలా జరుగుతున్న ప్రయత్నాలను గర్హించిందన్నారు. జెఎన్‌యు విద్యార్థులకు సంబంధించి జరుగుతున్న వివాదాన్ని ప్రస్తావించిన ఆయన, ప్రజాస్వామ్య గళాన్ని కూడా ప్రభుత్వం అణగదొక్కుతోందని ఆరోపించారు. ఢిల్లీలో శాంతి భద్రతల పరిస్థితి కుప్పకూలిపోవడం పట్ల కాంగ్రెస్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిందన్నారు. అనంతరం వర్కింగ్ కమిటీ సమావేశ వివరాలతో ప్రకటన వెలువడింది. ఉన్నత విద్యా సంస్థల్లోను, ఇతర సంస్థల్లో జరుగుతున్న పరిణామాలు, దేశ రాజధానిలోని ఓ కోర్టులో జరిగిన హింసాకాండ దిగ్బ్రాంతి కలిగించాయని ఆ ప్రకటనలో కాంగ్రెస్ పేర్కొంది. ఇదంతా భావ ప్రకటన స్వేచ్ఛపై జరిగిన ఉద్దేశపూర్వక దాడేనని అభివర్ణించింది. తప్పుడు కథనాలు, క్లిప్పింగులతో దేశభక్తి, జాతీయ వాదానికి సంబంధించి తామనుకున్న విధంగానే కథనాలను ప్రభుత్వం ప్రసారం చేస్తోందని, ఆ విధంగా తన లోపాలను కప్పిపుచ్చుకుంటోందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అభిప్రాయపడింది.

చిత్రం... కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో
మాట్లాడుతున్న పార్టీ అధినేత్రి సోనియా గాంధీ