జాతీయ వార్తలు

రైతుకు చేరువకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాలకు బడ్జెట్‌లో ఇచ్చిన ఊతాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎన్‌డిఎ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రైతులకు చేరువై వారిని గరిష్ఠస్థాయిలో పంటల బీమా పథకం పరిధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని కోరారు. ప్రతి ఎంపీ కూడా ఈ లక్ష్యాన్ని ఓ సవాలుగా తీసుకోవాలని, తమ నియోజకవర్గాల పరిధిలో విస్తృత స్థాయి ఫలితాలను సాధించాలని మోదీ స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన బిజెపి ఎంపీల సమావేశంలో స్వల్ప వ్యవధిపాటు మాట్లాడిన ప్రధాని కేంద్ర బడ్జెట్‌కు సంబంధించి చేసిన ప్రతిపాదనలను, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు, రైతాంగానికి కల్పించిన వెసులుబాటును ప్రస్తావించారు. గంటపాటు జరిగిన ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ప్రభృతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన జైట్లీ కొత్త బడ్జెట్‌లో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టామన్నారు. వౌలిక సదుపాయాల కల్పన, వ్యాపార, పెట్టుబడుల అనుకూల పరిస్థితుల్ని కల్పించడం ద్వారా ఆర్థిక వృద్ధికి వెసులుబాటు కల్పించామన్నారు. బీమా, పెన్షన్ల పునాదులపై సమాజాన్ని నిర్మించే దిశగా బలమైన చర్యలు తీసుకున్నామన్నారు. ఆరోగ్య బీమా, ప్రజలకు జీవిత బీమా సౌకర్యాలను ఈ లక్ష్యం కోసమే ప్రవేశ పెట్టామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ రంగాలకు కొమ్ముకాస్తోందని, రైతు వ్యతిరేకంగా పని చేస్తోందన్న విపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు బడ్జెట్ ఊతం చాలా బలంగా పనిచేస్తుందని బిజెపి, ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలు స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. తమిళనాడు, అస్సాం, కేరళ, పశ్చిమ బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు త్వరలో ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా బడ్జెట్ ప్రతిపాదననలు ఎన్డీయే పట్ల సానుకూల దృక్పథకానికి దోహదం చేసేవే అవుతాయని ఎంపీలు అభిప్రాయపడ్డారు. జెఎన్‌యు, హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ తదితర అంశాలను ప్రస్తావించిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వీటిపై విపక్షాలు చేస్తున్న దాడులను గట్టిగా తిప్పికొట్టాలని కోరారు. ఇటీవల హెచ్‌ఆర్‌డి మంత్రి స్మృతి ఇరానీ లోక్‌సభలో చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగం ప్రశంసనీయమని వెంకయ్య నాయుడు పేర్కొన్నప్పుడు సమావేశంలో హర్షధ్వానాలు చెలరేగాయి.

మంగళవారం జరిగిన బిజెపి ఎంపీల సమావేశానికి మోదీకి స్వాగతం పలుకుతున్న అమిత్ షా

ఏపీలో ‘ఆహార పథకం’ భేష్

కేంద్ర మంత్రి పాశ్వాన్ ప్రశంస
కేటాయింపుల కన్నా తక్కువ
ఇస్తున్నారని కింజారపు విమర్శ

ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి
న్యూఢిల్లీ, మార్చి 1: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహార భద్రత పథకాన్ని బాగా అమలు చేస్తోందని కేంద్ర పౌర సరఫరాలు, ఎరువుల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ప్రశంసించారు. పాశ్వాన్ మంగళవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో తెలుగుదేశం సభ్యుడు కింజారపు రామమోహన్ నాయుడు అడిగిన ఉపప్రశ్నకు బదులిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌కు గతంలో ఏ మేరకు ఆహార ధాన్యాలు లభించేవో ఇప్పుడు కూడా ఆ మేరకు అందజేస్తున్నామని రాంవిలాస్ పాశ్వాన్ చెప్పారు. మూడు సంవత్సరాల కేటాయింపులను సగటుగా తీసుకుని ఆహార ధాన్యాలను కేటాయిస్తున్నామని చెప్పారు. రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఆహార భద్రత పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు ఒక లక్ష 86 వేల మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించిన కేంద్ర ప్రభుత్వం వాస్తవానికి 1 లక్షా 44 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే అందజేస్తోందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిన దానికంటే తక్కువ బియ్యం విడుదల చేయటం వలన రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతోందని చెప్పారు. బియ్యం లోటును భర్తీ చేసుకునేందుకు రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం అదనంగా 1,500 కోట్లను ఖర్చును భరిస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా మిగతా 44 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రాయితీ ధరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలని నాయుడు డిమాండ్ చేశారు.
తెలంగాణకు ఎందుకు ఇవ్వరు?
ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ తెలంగాణలో కరువు నెలకొన్న ప్రాంతాలకోసం అదనపు ఆహార ధాన్యాలను విడుదల చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ విన్నపాన్ని కేంద్రం ఎందుకు పట్టించుకోవటం లేదని నిలదీశారు. ఎన్‌డిఏ ప్రభుత్వం ఆహార భద్రత పథకాన్ని నీరుగారుస్తోందని దుయ్యబట్టారు. ప్రతి గర్భిణీ స్ర్తికి ఆరువేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసే పథకాన్ని ఎందుకు సక్రమంగా అమలు చేయటం లేదని ఆయన పాశ్వాన్‌ను నిలదీశారు.
మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రారంభించిన అంత్యోదయ ఆవాస్ యోజన పథకాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారని ఒవైసీ ప్రశ్నించారు.

పాక్, బంగ్లా సరిహద్దుల్లో
రాడార్లు, సెన్సర్ల ఏర్పాటు
న్యూఢిల్లీ, మార్చి 1: చొరబాట్లను అదుపు చేయడానికి పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల వెంబడి రాడార్లు, సెన్సర్లు, కెమెరాలు ఏర్పాటు చేయడానికి ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు ప్రభుత్వం మంగళవారం లోక్‌సభకు తెలియజేసింది. అంతేకాకుండా కంచె ఏర్పాటు చేయడానికి కష్టంగా ఉండే కొండప్రదేశాలు లాంటి క్లిష్టంగా ఉండే అనేక చోట్ల రాడార్లు, సెన్సర్లు, కెమెరాలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, కమాండ్, కంట్రోల్ సొల్యూషన్లు అన్నిటినీ సమీకృతం చేయడం ద్వారా సాంకేతికపరమైన పరిష్కారాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. ప్రారంభంలో పంజాబ్, గుజరాత్ (సర్‌క్రీక్), దక్షిణ బెంగాల్, త్రిపుర, జమ్మూ ప్రాంతాల్లో ప్రయోగాత్మక అధ్యయనాన్ని చేపట్టాలని నిర్ణయించాం. భారత్-పాక్ సరిహద్దుపై జమ్మూ ప్రాంతంలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి 10 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని కూడా ఆయన చెప్పారు. ఈ ఏడాది జనవరి 2న పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి సహా పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు సరిహద్దులు దాటి వచ్చి ఉగ్రవాద దాడులు జరిపిన ఉదంతాలు గతంలో ఎన్నో జరిగాయి.
పచౌరీపై 1400 పేజీల చార్జిషీట్
న్యూఢిల్లీ, మార్చి 1: ద ఎనర్జీ రీసెర్చీ ఇనిస్టిట్యూట్ (టిఇఆర్‌ఐ) కార్యనిర్వహక ఉపాధ్యక్షుడు ఆర్‌కె పచౌరీపై ఢిల్లీ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. కంపెనీ మాజీ ఉద్యోగినిపై లైంగికదాడికి పాల్పడినట్టు ఆయనపై అభియోగం. దీనిపై 1400 పేజీల చార్జిషీట్‌ను మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ శివానీ చౌహాన్‌కు అందజేశారు. పచౌరీ కేసుకు సంబంధించి 23 మంది సాక్షులను విచారించారు. నిందితుడిపై ఐపిసిలోని 354, 354ఎ, 354డి, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గత ఏడాది ఫిబ్రవరి 13న పచౌరీపై ఎఫ్‌ఐఆర్ నమోదుకాగా, మార్చి 21న ముందస్తు బెయిల్ మంజూరైంది.

రోహిత్ తల్లిని
ఆదుకోండి
చంద్రబాబుకు విహెచ్ లేఖ
ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, మార్చి 1: హెచ్‌సియులో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేముల కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ఏపి ప్రభుత్వం రోహిత్ వేముల తల్లి రాధికకు గుంటూరులో ఇంటి స్థలం కేటాయించడంతోపాటు ఆర్థిక సాయం చేయాలని విహెచ్ తన లేఖలో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండాలని ఆయన అన్నారు. దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయాన్ని ఆయన లేఖలో ప్రస్తావించారు. మానవీయ కోణంలో అదుకోవాలన్న ఆయన ప్రభుత్వ సాయంవల్ల కొంతలో కొంతైనా రోహిత్ తల్లికి స్వాంతన చేకూర్చినట్టవుతుందని విహెచ్ తెలిపారు.

పార్లమెంటుకు
పాదయాత్ర నేడు
జెఎన్‌యు విద్యార్థుల నిర్ణయం
న్యూఢిల్లీ, మార్చి 1: దేశద్రోహం కేసులో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్, మరో ఇద్దరు విద్యార్థుల అరెస్టుకు వ్యతిరేకంగా బుధవారం పార్లమెంటుకు భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు. దేశద్రోహం ఆరోపణలపై జెఎన్‌యు, హైదరాబాద్ యూనివర్సిటీ, దేశంలోని ఇతర ప్రాంతాల్లో అసమ్మతి గొంతు నులమడాన్ని నిరసిస్తూ తాము బుధవారం పార్లమెంటు సంఘీభావ ప్రదర్శన నిర్వహించబోతున్నామని జెఎన్‌యు విద్యార్థి సంఘం ఉపాధ్యక్షురాలు షెహ్లా రషీద్ షోరా చెప్పారు. బుధవారం మధ్యాహ్నం మండీహౌస్ ప్రాంతంనుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రలో ఢిల్లీలోని వివిధ వర్శిటీలకు చెందిన విద్యావేత్తలు, విద్యార్థులు పాల్గొంటారని ఆమె చెప్పారు. ‘ప్రధానమంత్రి కార్యాలయం, మానవ వనరుల మంత్రిత్వ శాఖ, హోం మంత్రి దృష్టికి మా సమస్యలను తీసుకువెళ్లాలని అనుకుంటున్నాం. ఢిల్లీ పోలీసు వ్యవస్థ పని తీరుపట్ల, అరెస్టు చేసిన విద్యార్థి నాయకులు కన్హయ్య, ఉమర్, అనిర్బన్‌లపై కొనసాగుతున్న భౌతిక దాడుల బెదిరింపులపైన మా ఆందోళనను జాతీయ మానవ హక్కుల కమిషన్, మైనారిటీ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లాలని అనుకుంటున్నాం’ అని ఆమె చెప్పారు. అరెస్టు చేసిన ముగ్గురు విద్యార్థులను విడుదల చేయడం, వారిపై దేశద్రోహం అభియోగాలను రద్దు చేయడం, వారి సస్పెన్షన్‌ను రద్దు చేయాలనేవి తమ ప్రధాన డిమాండ్లని ఆమె చెప్పారు.