జాతీయ వార్తలు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో కాంగ్రెస్ గళమెత్తింది. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా ఢిల్లీలోని ఆంధ్రభవన్ వద్ద పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి నాయకత్వాన కాంగ్రెస్ బృందం ఆందోళన చేపట్టింది. ప్రత్యేక హోదాపై కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ 13 జిల్లాల నుంచి సేకరించిన మట్టి,నీరు,కోటి సంతకాలను ప్రధాని నరేంద్రమోదీకి అందజేసేందుకు కాంగ్రెస్ అపాయింట్‌మెంట్ కోరింది. సుమారు 4గంటల సేపు ఆంధ్రభవన్ గోదావరి బ్లాక్ ముందు నిరసన తెలిపిన కాంగ్రెస్ నేతలు ప్రధాని మోదీని కలిసేందుకు బయలుదేరారు. ఆంధ్రభవన్ వెలుపల ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. కాగా కాంగ్రెస్ బృందం ఏపి భవన్ నుంచి రోడ్డుపైకి రాగానే ఢిల్లీ పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు ఇతర నాయకులను పార్లమెంట్ స్ట్రీట్‌ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ 16 రోజుల క్రితమే ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోరినా ఇప్పటి వరకూ సమాచారం లేదన్నారు. పార్లమెంట్‌లోప్రత్యేక హోదా కోసం, విభజన హామీల కోసం మద్దతు తెలిపిన అన్ని పార్టీల నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చిన సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన నిలదీశారు. ఏపి ప్రజల ఆత్మాభిమానాన్ని మోదీ దెబ్బతీశారని ఆరోపించారు. పార్లమెంట్ ద్వారా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రపంచానికి చాటిచెప్పామని రఘువీరా స్పష్టం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో ప్రత్యేక హోదాపై తీర్మానం చేశారన్నారు. అలాగని చంద్రబాబు నిజాయితీ తాము విశ్వసించమని ఆయన చెప్పారు. ఏపి ప్రజలను తెలుగుదేశం, బిజెపిలు మోసం చేశాయని పిసిసి అధ్యక్షుడు విమర్శించారు.
కాగా రాజ్యసభ సభ్యులు జెడి శీలం, కెవిపి రామచందర్‌రావులు జామీను ఇచ్చి కాంగ్రెస్ నేతలను విడుదల చేయించారు. తరువాత కాంగ్రెస్ నాయకుల బృందం ఉపరాష్టప్రతి హామీద్ అన్సారీని కలిసి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరిస్తూ వినతి పత్రం ఇచ్చింది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి సారధ్యంలో చేపట్టిన ‘చలోఢిల్లీ’ కార్యక్రమం బుధవారం ముగిసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన ప్రకటించారు.

చిత్రం... ఢిల్లీలోని ఆంధ్రభవన్ వద్ద ధర్నా చేస్తున్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు