జాతీయ వార్తలు

రాష్ట్ర ప్రభుత్వ అధికారాలకు కొరివి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైనితాల్, ఏప్రిల్ 19: ఉత్తరాఖండ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ తీరును రాష్ట్ర హైకోర్టు తీవ్ర పదజాలంతో తప్పుబట్టింది. రాష్ట్రంలో రాష్టప్రతి పాలన విధించడం ద్వారా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ హక్కుల్ని కేంద్రం కాలరాసిందని, ఆ విధంగా కల్లోలాన్ని సృష్టించిందని వ్యాఖ్యానించింది. ఓ ప్రభుత్వం మెజార్టీని నిర్థారించడానికి అసెంబ్లీలో బలపరీక్షే సరైన విధానమని..అలాంటి పరీక్ష పవిత్రతను నీరుగార్చడానికి వీల్లేదని తెలిపింది. తమ బలాన్ని నిరూపించుకునేందుకు అధికార, విపక్షాలు ఎమ్మెల్యేలను లోబరచుకుంటాయా, అవినీతి విశృంఖలమవుతుందా అన్న ఆరోపణలతో నిమిత్తం లేకుండా ప్రభుత్వ మెజార్టీని అసెంబ్లీలో బలపరీక్ష ద్వారానే తేల్చాలని, అదే ఇప్పటికీ అనుసరించాల్సిన మార్గమని హైకోర్టు డివిజన్ బెంచి ఉద్ఘాటించింది.
రాష్ట్రంలో 356 రాజ్యాంగ అధికరణ ప్రయోగానికి సంబంధించి అనేక కోణాల్లో కేంద్రాన్ని ప్రశ్నించిన హైకోర్టు 3కేంద్రం, రాష్ట్రంలో భిన్న పార్టీల ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. రాష్టప్రతి పాలన విధింపు విషయంలో కేంద్రం చెబుతున్న కారణాలను అంగీకరిస్తే..అది భవిష్యత్‌లో అనేక విపరిణామాలకు దారితీస్తుంది. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాష్టప్రతి పాలన విధించే మార్గాలను వెతుక్కునేందుకు కేంద్రానికి అవకాశం కల్పించినట్టవుతుంది2అని పేర్కొంది. అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే రాజ్యాగంలోని 356 అధికరణను ప్రయోగించాలని ప్రధాన న్యాయమూర్తి కెఎమ్ జోసఫ్, న్యాయమూర్తి వికె బిస్త్‌లతో కూడిన హైకోర్టు బెంచి ఉద్ఘాటించింది.
అప్పటి ముఖ్యమంత్రి హరీశ్‌రావత్ బలపరీక్ష జరిగే వరకూ రాష్టప్రతి పాలన విధించకుండా ఉండాల్సిందన్న అభిప్రాయాన్ని న్యాయమూర్తులు వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోవాలని రావత్ ప్రభుత్వాన్ని గత నెల 23న గవర్నర్ ఆదేశించారే తప్ప 356 అధికరణను ప్రయోగించాలని సిఫార్సు చేయలేదని హైకోర్టు పేర్కొంది. బలపరీక్ష జరగాల్సిన 28లోగా రకమైన అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని రాష్టప్రతి పాలన విధించారంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది. స్టింగ్ ఆపరేషన్ ద్వారా సేకరించిన వివరాల ప్రాతిపదికగానే కేంద్ర పాలన విధించాలన్న నిర్ణయానికి రావడం అర్థరహితమని పేర్కొంది. గత నెల 26న తొమ్మిది మంది రెబెల్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ అనర్హులుగా ప్రకటిస్తారని కేంద్రానికి ముందే తెలిసే అవకాశం లేదని తెలిపింది. ఒక వేళ కేంద్ర కేబినెట్‌కు ఈ విషయం ముందే తెలిసినా..ఆ అంశాన్ని రాష్టప్రతి పాలన విధించడానికి ప్రాతిపదికగా తీసుకోవడం అసబద్ధమని కోర్టు వ్యాఖ్యానించింది. ఒక వేళ అదే కోణంలో నిర్ణయం తీసుకుని ఉంటే..రాష్ట్రం పట్ల కేంద్రం పక్షపాత వైఖరితో వ్యవహరిస్తోందన్న ఆరోపణలకు ఆస్కారం ఇచ్చినట్టవుతుందని తెలిపింది.

బెంగళూరులో రెండో రోజూ ఉద్రిక్తత

గార్మెంట్ కార్మికుల ఆందోళన హింసాత్మకం పలు వాహనాలు నిప్పు..పోలీసు స్టేషన్‌పై దాడి లాఠీచార్జి, భాష్పవాయు ప్రయోగం

బెంగళూరు, ఏప్రిల్ 19: ప్రావిడెంట్ ఫండ్ కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా స్థానిక గార్మెంట్ ఫ్యాక్టరీ కార్మికులు జరుపుతున్న ఆందోళన రెండోరోజు మంగళవారం ఆందోళనకారులు పలు బస్సులకు నిప్పు పెట్టడమే కాకుండా ఒక పోలీసు స్టేషన్‌పై దాడి చేయడంతో ఆందోళన హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు హెబ్బగోడి పోలీసు స్టేషన్‌పై రాళ్లు రువ్వడమే కాకుండా అక్కడ పార్క్ చేసి ఉన్న పలు వాహనాలకు నిప్పు పెట్టారు. హింసకు దిగిన ఆందోళనకారులను చెదరగొట్టడానికి తాము లాఠీచార్జి చేయడంతో పాటు భాష్పవాయు గోళాలను సైతం ప్రయోగించాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. కర్నాటక రోడ్డు రవాణా సంస్థకు చెందిన రెండు బస్సులు, బెంగళూరు మెట్రోపాలిటన్ రవాణా సంస్థకు చెందిన ఒక బస్సుకు ఆందోళనకారులు నిప్పు పెట్టినట్లు వారు చెప్పారు. బనే్నరుఘట్ట, జాలహళ్లి క్రాస్, ఐటి సంస్థల కేంద్రమైన ఎలక్ట్రానిక్ సిటీ తదితర ప్రాంతాల్లో ఆందోళనకారులు ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలపైన రాళ్లు రువ్విన సంఘటనలు జరిగాయి. ఆందోళన కారణంగా ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్లే హొసూర్ రోడ్డు, గార్మెంట్ ఫ్యాక్టరీలు పెద్ద సంఖ్యలో కేంద్రీకృతమై ఉన్న తుంకూర్ రోడ్డులాంటి నగరంలోకి వచ్చి, వెళ్లే మార్గాల్లో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్‌లు చోటు చేసుకున్నాయి.
పరిస్థితి అదుపులోనే ఉందని, అయితే నగర శివార్లలో మాత్రం కొన్ని సమస్యలున్నాయని నగర పోలీసు కమిషనర్ ఎన్‌ఎస్ మేఘరిక్ చెప్పారు. అదనపు పోలీసు బలగాలను ఆ ప్రాంతాలకు పంపించామని, పరిస్తితిని అదుపులోకి తేవడం జరుగుతోందని ఆయన చెప్పారు. మంగళవారం ఆందోళన చేస్తున్న గార్మెంట్ వర్కర్లతో మిగతా కార్మికులు కూడా చేరినట్లు ఆయన చెప్పారు.
బెంగళూరులో దాదాపు 12 లక్షల మంది గార్మెంట్ కార్మికులున్నట్లు ఆయన తెలిపారు. హెబ్బగోడి, జాలహళ్లి ప్రాంతాల్లో పరిస్థితి అదుపు తప్పిందని, అదనపు బలగాలను అక్కడికి పంపించినట్లు రాష్ట్ర డిజిపి ఓం ప్రకాశ్ చెప్పారు. ఆందోళన హింసాత్మకంగా మారుతుందని తాము ఊహించలేదని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపైన, జనంపై రాళ్లు రువ్విన వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు.

ఇపిఎఫ్ నిబంధనలకు వ్యతిరేకంగా మంగళవారం
బెంగళూరులో ఓ బస్సును దగ్ధం చేసిన ఆందోళనకారులు