జాతీయ వార్తలు

చట్టాలు చేయగానే సరికాదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: పార్లమెంటులో, శాసన సభల్లో చట్టాలను చేసే ప్రజాప్రతినిధులు కొత్త చట్టాలను చేసేటప్పుడు ఎలాంటి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారో వాటి అమలుకు అవసరమైన వౌలిక సదుపాయాలను కల్పించడానికి కూడా అదే ఉత్సాహాన్ని ప్రదర్శించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సూచించారు. జడ్జీల కొరత సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ ఇటీవల ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో మరోజడ్జి చట్టాలు చేయడం కాక వాటి అమలుకు అవసరమైన వౌలిక సదుపాయాలను కూడా కల్పించాలని ప్రభుత్వానికి హితవు చెప్పడం గమనార్హం. ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హాకు జస్టిస్ చలమేశ్వర్ ఈ సూచన చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శనివారం ఢిల్లీలో నిర్వహించిన ‘ఎన్‌ఫోర్స్‌మెంట్ డే’ కార్యక్రమంలో ఈ ఇద్దరూ పాల్గొన్నారు. కోర్టులనుంచి తీర్పులు పొందడంలో ఆలస్యంపై దేశవ్యాప్తంగా చర్చ, న్యాయ వ్యవస్థపై ఆరోపణ కొనసాగుతూ ఉన్నందున తాను ఇక్కడ ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నట్లు చలమేశ్వర్ చెప్పారు. తాను ప్రత్యేకించి సిన్హాకోసం ఈ ఈ సూచన చేస్తున్నానని, ఎందుకంటే ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని కూడా చలమేశ్వర్ అన్నారు. కొత్త హక్కులు, బాధ్యతలు సృష్టిస్తూ కొత్త చట్టాలను చేయడానికి చట్టసభలు అది పార్లమెంటు కావచ్చు లేదా శాసన సభలు కావచ్చు ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తాయి. అయితే ఆ చట్టాలను అమలు చేయడానికి అవసరమైన వౌలిక సదుపాయాలను కల్పించడానికి మాత్రం అవి అదే ఉత్సాహాన్ని ప్రదర్శించవు’ అని చలమేశ్వర్ అన్నారు. దీనికారణంగానే కోర్టుల్లో కేసులు పేరుకుపోతున్నాయని ఆయన అన్నారు.

బెంగాల్‌లో భారీగా పోలింగ్
78 శాతానికి పైగా నమోదు హింసాత్మక ఘటనల్లో 15 మందికి గాయాలు

కోల్‌కతా, ఏప్రిల్ 30: పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి శనివారం జరిగిన అయిదో దశ ఎన్నికల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 78.25 శాతానికి పైగా పోలింగ్ నమోదయింది. పోలింగ్ సందర్భంగా అక్కడక్కడా జరిగిన చెదురుమదురు హింసాత్మక ఘటనల్లో 15 మంది గాయపడ్డారు. హుగ్లీ జిల్లాలో 79 శాతం, దక్షిణ 24 పరగణాల జిల్లాలో 80 శాతం, దక్షిణ కోల్‌కతాలో అత్యల్పంగా 63 శాతం పోలింగ్ నమోదయిందని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. మొత్తంమీద 78.25 శాతం పోలింగ్ నమోదయిందని పేర్కొంది.
సత్‌గాచియా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అధికార తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే సోనాలి గుహపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ఎన్నికల సంఘం పోలీసులను ఆదేశించింది. తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో సిపిఎంకు చెందిన పోలింగ్ ఏజెంట్లపై దాడి చేయాల్సిందిగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలను ఆదేశిస్తూ ఆమె కెమెరాకు చిక్కడంతో ఎన్నికల సంఘం ఈ ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ సందర్భంగా జరిగిన హింస వల్ల దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఆరుగురు, హుగ్లీ జిల్లాలో ఒకరు గాయపడ్డారు. బాసంతి నియోజకవర్గంలోని భాన్‌గోన్‌ఖలి గ్రామంలో గల ఒక పోలింగ్ కేంద్రంలో ఆర్‌ఎస్‌పి కార్యకర్తలను ఓటు వేయకుండా తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులు అడ్డుకున్నారని, ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు ఆర్‌ఎస్‌పి కార్యకర్తలు గాయపడ్డారని ఒక పోలీసు అధికారి తెలిపారు. గాయపడిన వారిని బాసంతి ఆసుపత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు. బాహ్‌నగర్ నియోజకవర్గంలోని కథాలియా గ్రామంలో గల ఒక పోలింగ్ కేంద్రం ముందు ఘర్షణకు దిగిన తృణమూల్ కాంగ్రెస్, సిపిఎం మద్దతుదారులను చెదరగొట్టడానికి కేంద్ర బలగాలకు చెందిన జవాన్లు జరిపిన లాఠీచార్జిలో ఇద్దరు గాయపడ్డారు. వీరిద్దరిని బాహ్‌నగర్ ఆసుపత్రికి తరలించినట్లు ఆ అధికారి వివరించారు. హుగ్లీ జిల్లా ఆరంబాగ్ నియోజకవర్గంలోని పుయిని గ్రామంలో తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులు జరిపిన దాడిలో ఒక గ్రామస్థుని తల పగిలినట్లు ఆయన తెలిపారు. ఈ దాడికి సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త ఒకరిని అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు.

24 పరగణాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటేసేందుకు బారులు తీరిన ప్రజలు

మరో అయిదేళ్లు మోదీ కొనసాగవచ్చు

తాజా సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: కొద్ది రోజుల్లో మోదీ ప్రభుత్వం రెండేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో దేశంలో పెద్దగా మార్పు చోటు చేసుకోలేదని తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. మోదీ పరిపాలనపై సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీ ఎం ఎస్) సంస్థ నిర్వహించిన సర్వేలో 49శాతం మంది పెద్దగా మార్పు రాలేదని అభిప్రాయపడ్డారు. 15శాతం మంది పరిస్థితి దారుణంగా మారిందన్నారు. 43శాతం మంది మాత్రం కేంద్ర పథకాలు పేద ప్రజలకు అందటం లేదని అభిప్రాయపడ్డారు. అయితే ప్రధానిగా మోదీ సామర్థ్యంపై 70శాతం మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేశారు. రెండో దఫా కూడా మోదీయే ప్రధానిగా కొనసాగాలని ఎక్కువమంది అభిప్రాయ పడ్డారు. మోదీ తన వాగ్దానాలను పాక్షికంగా అమలు చేశారని 48శాతం మంది భావిస్తున్నారు.