నిజామాబాద్

బడి బాట విజయవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూన్ 6: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు, బడి ఈడు బాలలందరినీ పాఠశాలల్లో చేర్పించేందుకు వీలుగా చేపట్టిన బడి బాట కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా మండలాల ఎంఇఓలు, తహశీల్దార్లతో బడి బాట కార్యక్రమంపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా జె.సి మాట్లాడుతూ, సర్కారీ బడుల్లో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు ప్రతి నివాస ప్రాంతంలోనూ ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి సర్వేలు నిర్వహించాలన్నారు. బడి ఈడు పిల్లలను గుర్తించి వారు ఏ పాఠశాలలో చదువుతున్నారనే వివరాలను సేకరించాలన్నారు. బడికి వెళ్లని వారిని గుర్తిస్తూ, తప్పనిసరిగా వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐదేళ్ల వయస్సు గల పిల్లలందరూ తప్పనిసరిగా పాఠశాలల్లో చదువుకునేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ విషయమై పిల్లల తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులను ఆరవ తరగతిలో చేర్పించాలని, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 7వ తరగతి పూర్తి చేసుకున్న వారిని ఆయా పాఠశాలల్లో 8వ తరగతిలో చేరేలా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతిలో సాధించిన ఉత్తీర్ణత గురించి విస్తృత ప్రచారం చేసేలా కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు. ఈ నెల 13న జిల్లాలోని అన్ని పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులకు ప్రభుత్వంచే అందజేయబడే పాఠ్య పుస్తకాలపై సంబంధిత పాఠశాల ముద్ర తప్పనిసరిగా ఉండాలన్నారు. ఆ పాఠ్య పుస్తకాలు ఇతర పాఠశాలకు చెందిన విద్యార్థుల వద్ద ఉన్నట్టు కనిపిస్తే సంబంధిత పాఠశాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బడులలో విద్యార్థులకు పంపిణీ చేసిన ప్రభుత్వ పాఠ్య పుస్తకాల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని ఆదేశించారు. గతేడాది ప్రభుత్వ పాఠశాలల్లో 1.97లక్షల మంది విద్యార్థులను చేర్పించగా, ఈ ఏడాది 2.15లక్షల మందిని చేర్పించాలనే లక్ష్యంతో బడిబాట కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ప్రధానంగా జిల్లాలో ఇరవై మంది వరకు మాత్రమే విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో వారి సంఖ్య గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సర్వే సందర్భంగా ఆంగ్ల మాధ్యమంపై ఆసక్తి ఉన్న విద్యార్థులను గుర్తించాలని అధికారులకు సూచించారు. కాగా, రెవెన్యూ అంశాలపై సమీక్ష జరుపుతూ, రెవెన్యూ శాఖకు సంబంధించి సాదాబైనామాలను రాష్ట్ర వ్యాప్తంగా క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు. 2014 జూన్ 2వ తేదీ నుండి కొనుగోలు చేసిన భూములకు ఇది వర్తిస్తుందన్నారు. ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియ కేవలం గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తుందని, మున్సిపల్, కార్పొరేషన్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని భూములకు ఎంతమాత్రం వర్తించదని స్పష్టం చేశారు. సాదాబైనామాలకు ఈ నెల 15వ తేదీలోగా మీ సేవలో దరఖాస్తులు చేసుకోవాలని జె.సి సూచించారు. దరఖాస్తుదారుల నుండి మీ సేవ నిర్వహకులు 35రూపాయల రుసుము మాత్రమే తీసుకోవాలని సూచించారు. సాదా బైనామా వివరాలను మీ సేవ కేంద్రాల వద్ద ఫ్లెక్సీలలో పొందుపర్చి ఏర్పాటు చేయడంతో పాటు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించాలని ఆర్డీఓలను ఆదేశించారు. గ్రామాల్లో జోగినీలు, హెచ్‌ఐవి పేషెంట్ల వివరాలు, వారి స్థితిగతులను సంబంధిత విఆర్‌ఓలు తెలుసుకుని జాబితాను అందిస్తే, వారి జీవనాధారం కోసం ఒక ఎకరం చొప్పున భూమిని అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వర్షాలు అనుకూలిస్తున్నందున రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్ధం అవుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో విఆర్‌ఓలు తమతమ కార్యస్థానాల్లో రైతులకు అందుబాటులో ఉంటూ సకాలంలో ఎరువులు, విత్తనాలు అందేలా చూడాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు జె.సి రాజారాం, జిల్లా విద్యాశాఖ అధికారి లింగయ్యతో పాటు ఆయా మండలాల తహశీల్దార్లు, ఎంఇఓలు, ఎంపిపిలు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.

నేటి నుండి రంజాన్
ఉపవాస దీక్షలు

ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబాద్, జూన్ 6: ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసం ఉపవాస దీక్షలు మంగళవారం నాటి నుండి ప్రారంభం కానున్నాయి. గల్ఫ్ దేశాల్లో సోమవారం రోజునే ఉపవాస దీక్షలు ప్రారంభం కావడంతో, ఆ మరుసటి రోజు నుండి ఇక్కడ రంజాన్ దీక్షలు చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మేరకు రంజాన్ మాసం ప్రారంభమైనట్టు సోమవారం సాయంత్రం మత పెద్దలు ప్రకటించారు. ఈ విషయం ప్రజలందరికీ తెలియాలన్న ఉద్దేశ్యంతో రంజాన్ మాసం మొదలయ్యిందనడానికి సంకేతంగా అన్ని మసీదులలో సైరన్‌లను మోగించి, ప్రత్యేక ప్రార్థనల(తరాహ్‌వీ నమాజ్)కు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నేటి నుండి నెల రోజుల పాటు ఎక్కడా లేని సందడి నెలకోనుంది. ఇప్పటికే రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ నగరంతో పాటు జిల్లాలోని అన్ని ముఖ్య పట్టణాలు, మండల కేంద్రాల్లో విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల క్రితమే కలెక్టర్ యోగితారాణా, ఎస్పీ విశ్వప్రసాద్, నగర మేయర్ ఆకుల సుజాత, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ తదితర శాఖల అధికారులతో కలిసి నగరంలోని ఈద్గాలు, ప్రముఖ మసీదులను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. రంజాన్‌ను దృష్టిలో పెట్టుకుని ముస్లిం మైనార్టీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కాగా, పవిత్ర ఖురాన్ అవతరించిన మాసం కావడంతో ముస్లింలు రంజాన్‌కు ఎనలేని ప్రాధాన్యత ఇస్తారు. సాధారణ సమయాల్లో చేసిన ప్రార్థనల కంటే రంజాన్ నెలలో దైవం సూచించిన మార్గంలో పయనిస్తూ మనస్ఫూర్తిగా ప్రార్థనలు చేస్తే అనేక రెట్లు ఎక్కువగా పుణ్యం లభిస్తుందని విశ్వసిస్తారు. అందుకే అత్యంత భక్తిశ్రద్ధలు, నియమనిష్ఠలతో రంజాన్ మాసంలో అధిక సమయాన్ని ప్రార్థనలు, ఖురాన్ పఠనం, భక్తి ప్రవచనాలు ఆలకించడం, ప్రత్యేక నమాజులు చేయడం, దాన ధర్మాలు జరపడానికి ప్రతి ఒక్కరూ ఆసక్తిని కనబరుస్తారు. అన్నింటికి మించి ఈ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులంతా ఉపవాస దీక్షల ద్వారా తమ భక్తి భావాన్ని చాటుకుంటారు. తెల్లవారుజామునే (సహర్) మితంగా భోజనం చేసిన అనంతరం ఎంతో కఠిన పద్ధతులను పాటిస్తూ పొద్దంతా ఉపవాసం ఉంటారు. తిరిగి సూర్యాస్తమయం వేళలో (ఇఫ్తార్ విందు)తో ఉపవాసం ముగిస్తారు. నెల రోజుల పాటు ప్రతిదినం ఇదే తరహాలో ఉపవాసాలు కొనసాగిస్తారు. చివరి రోజున ఈద్-ఉల్-్ఫతర్ వేడుకతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రంజాన్ మాసానికి వీడ్కోలు పలుకుతారు. ఏడేళ్ల వయస్సు నిండిన చిన్నారుల నుండి మొదలుకుని ఆరోగ్యంగా ఉండి, శరీర అవయవాలు సహకరించే స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికీ రంజాన్ మాసంలో ఉపవాసం పాటిస్తూ ప్రత్యేక ప్రార్థనల్లో సమయాన్ని వెచ్చించాలన్న మహ్మద్ ప్రవక్త బోధనలను తుచ తప్పకుండా పాటిస్తారు. ఈ మాసంలో దురలవాట్లకు బానిసలుగా ఉండే వ్యక్తులు కూడా మద్యపాన సేవనం, జూదం వంటి వ్యసనాలను త్యజించి దైవ మార్గంలో పయనించడం ద్వారా ఏడాది పొడుగునా చేసుకున్న పాపాల నిష్కృతికి పాటుపడతారు. పవిత్రత, త్యాగానికి ప్రతీకగా భావిస్తూ ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా జరుపుకునే ఈ వేడుకల కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేందుకు వీలుగా మసీదులను ముస్తాబు చేశారు. రెండు రోజుల ముందు నుండే మైనార్టీ ఏరియాలలోని అన్ని రహదారులను శుభ్రం చేయిస్తున్నారు. రోడ్లపై ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించి పారిశుద్ధ్య సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రార్థనల కోసం తరలివచ్చే ముస్లిం సోదరులకు ఎలాంటి అసౌకర్యం ఏర్పడకుండా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇదిలాఉండగా, రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నగరంలో అప్పుడే సందడి వాతావరణం మొదలైంది. ఈ మాసంలోనే లభించే ప్రత్యేక వంటకాలను అందించేందుకు హోటళ్ల నిర్వాహకులు సన్నాహాలను పూర్తి చేసుకున్నారు. రంజాన్‌ను పురస్కరించుకుని నగరంలోని ప్రధాన కూడళ్లలో ప్రత్యేక వస్త్ర దుకాణాలు సైతం వెలిశాయి.

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
కార్యకర్తలకు మంత్రి పోచారం పిలుపు
బాన్సువాడ, జూన్ 6: గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్రంలో టిఆర్‌ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలు, నాయకులపైనే ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం బాన్సువాడలో నిర్వహించిన మండల స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సముచిత న్యాయం కల్పించేలా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతోందన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతులకు యంత్రలక్ష్మి తదితర పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. ఈ పథకాలపై ప్రజలకు విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చూసి ప్రతిపక్షాలు బెంబెలెత్తుతున్నాయని, వారు చేసే ఆరోపణలను తిప్పికొడుతూ సరైన సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఎన్నో ఆశలతో టిఆర్‌ఎస్‌కు పట్టం కట్టగా, వారి ఆశయాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులైన ప్రజలకు అందే విధంగా చూడాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపైనే ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు అనేక కొత్తకొత్త పథకాలను కూడా అమలు చేస్తున్న ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. నెలకు ఒకసారి మండల పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, మూడు మాసాలకు ఒకసారి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలను నిర్వహించాలని మండల బాధ్యులకు సూచించారు. గతంలో టిఆర్‌ఎస్ మండల కార్యదర్శిగా పని చేసిన మోహన్‌నాయక్‌ను సోమవారం నాటి సమావేశంలో మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న నాయకులు, కార్యకర్తలను మంత్రి అభినందించారు. పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన నార్ల సురేష్‌గుప్త సేవలను కొనియాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చూసి, బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు అయ్యేందుకు టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు నాయకులు సైతం తెరాసలో చేరేందుకు క్యూ కడుతున్నారని అన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్
వధువు తల్లిదండ్రులకే వర్తింపు
రాష్ట్రంలో పేద కుటుంబాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బిసిలకు కల్యాణలక్ష్మి, మైనార్టీలకు షాదీముబారక్ పథకం కింద అందజేస్తున్న 51వేల రూపాయల మొత్తం ఇకనుండి వధువు తల్లిదండ్రులకే చెందే విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. అందువల్ల తెరాస నాయకులు, కార్యకర్తలు తమతమ గ్రామాల్లో జరిగే పెళ్లిలకు సంబంధించి, వధువు తల్లిదండ్రులకే ఈ ఆర్థిక చేయూత అందే విధంగా చూడాలని మంత్రి సూచించారు. అర్హత కలిగిన కుటుంబాలతో దరఖాస్తు చేయించి, పెళ్లికి 10రోజుల ముందే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కు అందించే విధంగా చూడాలన్నారు. అనంతరం జరిగే పెళ్లి వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు నార్ల సురేష్‌గుప్తాతో పాటు జడ్పీ కోఆప్షన్ సభ్యుడు అలీముద్దీన్ బాబా, సింగిల్ విండో చైర్మన్ వై.కృష్ణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, తెరాస నాయకులు మహ్మద్ ఎజాజ్, డాక్టర్ అంజిరెడ్డి, జంగం గంగాధర్, పోతురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దాడులు చేస్తే ఊరుకునేది లేదు
ప్రెస్ అకాడమీ చెర్మన్
అల్లం నారాయణ
కామారెడ్డి, జూన్ 6: జర్నలిస్టులపై దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని తెలంగాణ రాష్ట్ర మొదటి ప్రెస్‌అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. సోమవారం ఆయన డివిజన్‌లోని నాగిరెడ్డిపేట్ మండలం పోచారం గ్రామంలో ఒక జర్నలిస్టు కుటుంభాన్ని పరామార్శించేందుకు వచ్చారు. ముందుగా ఆయన గ్రామ పొలిమేరల్లోని ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేసిన అనంతరము ఆయన పోచారం గ్రామంలో ఉంటున్న ఎలక్ట్రానిక్స్ మీడియా జర్నలిస్టు విష్ణువర్దన్‌రెడ్డి కుటుంభాన్ని పరామార్శించారు. జర్నలిస్టు తండ్రికి మేజర్ శస్త్ర చికిత్స జరగడంతో పరామార్శించేందుకు ఆయన వచ్చారు. అనంతరము మెదక్-నిజామాబాద్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న వన్యప్రాణి అభయారణ్యం అతిథిగృహం వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, మెదక్ జిల్లాలో జర్నలిస్టులపై కొందరు కాంగ్రెస్ నాయకులు దాడులు చేయడం అమానుషం అని అన్నారు. జర్నలిస్టులపై దాడులు చేస్తే ఏలా ఎదుర్కొవాలో తెలుసని, తమకు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన అనుభవం ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. జర్నలిస్టులపై దాడుల చేస్తే ఇక సహించబోమని అన్నారు. రాజకీయాల్లో అనుభవజ్ఞులైన కాంగ్రెస్ నాయకులు జర్నలిస్టులపై దాడులకు పాల్పడటం విడ్డూరంగా ఉందని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో చేస్తుందని అన్నారు. త్వరలో జర్నలిస్టులకు డబూల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టనుందని, దీని కోసం ప్రభుత్వం వందకోట్ల రూపాయలు విడుదల చేసిందన్నారు. జర్నలిస్టు సంక్షేమ నిధికి ప్రభుత్వం ప్రతి ఏటా 10కోట్ల రూపాయలు మంజూరు చేస్తుందని, తెలంగాణ సర్కార్ అధికారంలో వచ్చి రెండేళ్లు అయ్యిందని, రెండేళ్లకు సంబంధించిన 20కోట్ల రూపాయల జర్నలిస్టు సంక్షేమ నిధిని ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. 2014నుండి జర్నలిస్టు యూనియన్‌లతో సంబంధం లేకుండా గుర్తింపు పొందిన ఏ జర్నలిస్టు కుటుంభాల్లోని సభ్యులు ఎవ్వరైన మృతి చెందిన, ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబానికి 3వేల పింఛన్, వారి కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉండి 10వ తరగతి వరకు చదువుతుంటే వారి ఖర్చుల నిమిత్తం నెలకు వెయ్యి రూపాయలు అందించడం జరుగుతోందని అన్నారు. ఇంతే కాకుండా ప్రమాదంలో ఎవరైనా గాయపడితే వారి చికిత్స కోసం 50వేల రూపాయలు అందించడం జరుగుతోందని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఈప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టు పాత్ర కూడా కీలకం అని అన్నారు. త్వరలో జర్నలిస్టులకు అక్రిడేషన్‌కార్డులు జారీ అవుతాయని అన్నారు. ఆయనతో పాటు నాగిరెడ్డిపేట్ జడ్పీటిసి కాశీనారాయణ, జాన్కంపల్లి సర్పంచ్ డాక్టర్.సాయులు, టిఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.

సిద్ధులగుట్టపై వరుణ యాగం
ఆర్మూర్, జూన్ 6: తెలంగాణ అంతటా సమృద్ధిగా వర్షాలు కురియాలని ప్రార్థిస్తూ సోమవారం ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ నవనాథ సిద్ధులగుట్టపై ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వరుణ యాగం నిర్వహించారు. ఆలయ అర్చుకుడు కుమార్ శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛరణ మధ్య యజ్ఞం చేశారు. ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఈ వరుణ యాగానికి హాజరుకావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల హాజరు కాలేదు. కాగా ఆలయ కమిటీ అధ్యక్షుడు ఏనుగు శేఖర్‌రెడ్డి, భరత్‌గ్యాస్ సుమన్, మున్సిపల్ చైర్‌పర్సన్ స్వాతిసింగ్, టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంచార్జీ ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డిలు వరుణ యాగంలో పాల్గొని పూజలు చేశారు. అలాగే శివాలయం, రామాలయంలలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రంజాన్ ప్రార్థనా స్థలాలు ముస్తాబు
ఎల్లారెడ్డి, జూన్ 6: ముస్లీం సోదరులకు అత్యంత పవిత్ర మాసమైన రంజాన్ మాస ఉపవాస దీక్షలను మంగళవారం నుంచి ప్రారంభ మవుతున్నాయని స్థానిక మజిద్ సదర్ గయాజుద్దిన్ తెలిపారు. సోమవారం సాయంత్రం నెల వంక దర్శనమివ్వడంతోమంగళవారం నుంచి రంజాన్ ఉపవాస దీక్షలను ప్రారంభించడం జరుగుతోందన్నారు. ఇందుకోసం పట్టణంలోని మసీదులను విద్యుత్ దీపాల కాంతులతో సుందరంగా అలంకరించారు.