నిజామాబాద్

లక్ష్యం దిశగా హరితహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూన్ 9: పచ్చదనాన్ని పెంపొందిస్తూ, అటవీ విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణ హరితహారం కార్యక్రమానికి ఈసారి పరిస్థితులు అనుకూలిస్తుండడం జిల్లా యంత్రాంగానికి ఊరటనందిస్తోంది. సీజన్ ఆరంభానికి ముందే జిల్లాలో గత వారం రోజుల నుండి అన్ని ప్రాంతాల్లోనూ ఒక మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తుండడంతో ఈసారి హరితహారం విజయవంతమవుతుందనే నమ్మకం బలపడుతోంది. గతేడాది జిల్లాలో మూడున్నర కోట్ల వరకు మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించుకుని సుమారు 400పైచిలుకు నర్సరీల్లో పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తూ మొక్కల పెంపకం చేపట్టారు. అయితే తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా కనీసం 80లక్షల వరకు కూడా మొక్కలు నాటలేకపోయారు. వేలాది మొక్కలు నర్సరీలకే పరిమితమవగా, సగానికి పైగా మొక్కలు ఆలనాపాలనా కరువై ఎండిపోయాయి. మరికొన్ని చోట్ల నాటిన మొక్కల్లో కనీసం పాతిక శాతం మొక్కల ఉనికి కూడా ప్రస్తుతం కనిపించడం లేదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లా పర్యటనకు హాజరైన సమయంలో నాటిన మొక్కల జాడ కూడా కనుమరుగైందంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. రాష్ట్రంలోనే అత్యల్ప వర్షపాతం నిజామాబాద్‌లో కురియడంతో హరితహారం కార్యక్రమం అమలుపై తీవ్ర ప్రభావం చూపింది. అదృష్టవశాత్తు ఈసారి ముందస్తుగానే వానలు కురుస్తుండడం, మునుముందు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ భరోసా కల్పిస్తుండడంతో జిల్లా యంత్రాంగం హరితహారం కార్యక్రమంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోంది. వర్షాలు అనుకూలించనున్నందున ఎలాగైనా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి లక్ష్యాన్ని సాధించాలనే దిశగా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈయేడు జిల్లాలో 3.35కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. వీటిలో 76లక్షల మొక్కలను జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో, మరో 2.59కోట్ల మొక్కలను అటవీ శాఖ ఆధ్వర్యంలో నాటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే నర్సరీల్లో మొక్కలను సంరక్షిస్తూ ఈ నెలాఖరు నాటికి వాటిని క్షేత్ర స్థాయికి చేర్చేలా చర్యలు చేపడుతున్నారు. ఏయే ప్రాంతానికి ఏ రకానికి చెందిన ఎన్ని మొక్కలు అవసరమన్నది నివేదికల రూపంలో వివరాలు సేకరిస్తున్నారు. తదనుగుణంగా ఆయా ప్రాంతాలకు మొక్కలు కేటాయించనున్నారు. 7.95లక్షల హెక్టార్ల వైశాల్యం కలిగిఉన్న నిజామాబాద్ జిల్లాలో కేవలం 21శాతం మాత్రమే అటవీ విస్తీర్ణం ఉంది. రాష్ట్ర సగటుతో పోల్చి చూసినా, ఇది నాలుగు శాతం మేర తక్కువగానే ఉంది. దీంతో ఇప్పటికే వర్షాభావంతో నిజామాబాద్ జిల్లాలో కరవు ఛాయలు దట్టంగా అలుముకుని ఉన్నాయి. ఈ పరిస్థితిని అధిమించేందుకు అటవీ విస్తీర్ణాన్ని 35శాతానికి పెంచాలనే లక్ష్యంతో పెద్దఎత్తున హరితహారం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రకృతి సహకారం లభించక తొలి ఏడాదే గట్టి ఎదురుదెబ్బ తగలడంతో, ఈసారి మొదట్లో ఒకింత వర్షాభావ పరిస్థితులు ఎదురైనా మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం వివిధ వర్గాల వారిని భాగస్వాములు చేస్తూ గ్రామాల వారీగా కమిటీలను ఏర్పాటు చేస్తోంది. సర్పంచ్‌ల అధ్యక్షతన ఏర్పడే ఈ కమిటీల్లో అటవీ శాఖ, డ్వాక్రా మహిళలు, ఎంపిటిసిలు తదితరులను భాగస్వాములు చేస్తూ విరివిగా మొక్కలు నాటడం, నాటిన మొక్కలను సంరక్షించడం, అటవీ విస్తీర్ణం అంతరించిపోకుండా చూడడం, మొక్కల పెంపకంపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి బాధ్యతలను అప్పగిస్తున్నారు. గతేడాది తరహాలో కాకుండా నీటి వనరులు అందుబాటులో ఉన్న చోట నర్సరీలను ఏర్పాటు చేస్తూ, వాటిలో టేకు, ఎర్రతురాయి, పచ్చతురాయి సీమతంగేడు, నిద్రగనే్నరు, కానుగ, సిసు, ఏడాకులపాల, పొగుడ, దిరిశనము, అడవిబాదం, చైనాబాదాం, సిల్వర్‌ఓక్, తబూబియ, వేప, తపసి, తెల్లమద్ది, నల్లమద్ది, గుమ్మడిటే, సుబాబుల్‌తో పాటు జామ, నిమ్మ, దానిమ్మ, చింత, ఉసిరి, రేగు, బొప్పాయి, మునగ, ఈత, మారేడు, నేరేడు తదితర రకాల మొక్కల పెంపకాన్ని చేపడుతున్నారు.