AADIVAVRAM - Others

ఇవి దాటాలంటే గుండె గుభిల్లే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూమి అన్నిచోట్లా ఒకేతీరులో ఉండదు. ఎగుడుదిడుగు లోయలు, లోతైన పల్లాలు, కొండలు, కోనలతో నిండి ఉంటుంది. అదే ప్రకృతి సృష్టి. అలా ఉండడమే అందం. అయితే ఇలాంటి ప్రదేశాల్లో మనుషులు ఒక చోటు నుండి మరో చోటుకి ప్రయాణించాలంటే వీలు కాదు. అందుకే పురాతన కాలం నుంచే వారధులు నిర్మించారు. ఈ వారధులు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోను, అన్ని ప్రాంతాల్లోను కనిపిస్తాయి. ఇలా నిర్మించిన వారధుల్లో కొన్ని అందంగా, ఆహ్లాదంగా, వాటి మీదుగా ప్రయాణిస్తుంటే ఒళ్లు పులకిస్తే, మరికొన్ని వారధులు భయంకరమైన అనుభవాలుగాను, ఒళ్లు జలదరించేవిగా ఉన్నాయి. అలా భీతిగొలిపే కొన్ని వారధుల గురించి తెలుసుకుందాం.
నేపాల్‌లోని గాసా బ్రిడ్జి
ఇదొక భయంకరమైన బ్రిడ్జి. నేపాల్‌లోని గస్ గ్రామంలో ఉన్న ఈ బ్రిడ్జి తాళ్లు, వైర్లతో నిర్మించారు. గ్రామం నుండి బయటికి వెళ్లాలన్నా, బయటి నుండి గ్రామంలోకి ప్రవేశించాలన్నా ఈ బ్రిడ్జే ఆధారం. ఈ బ్రిడ్జి గుండా మనుషులే కాకుండా సైకిళ్లు, ఇతర చిన్నచిన్న వాహనాల ద్వారా పాలు, ఇతర ఆహారపదార్థాలను కూడా కావలసిన చోటుకు అతి జాగ్రత్తగా తరలిస్తూ ఉంటారు. పెద్దవారు, పిల్లలు కూడా ఈ బ్రిడ్జి మీదుగానే రాకపోకలు సాగిస్తుంటారు. ఇది ప్రమాదభరితంగా ఉన్నప్పటికీ ఇక్కడ పక్కా బ్రిడ్జి నిర్మించేందుకు స్థానిక యంత్రాంగం కానీ, అధికారులు గానీ ఎలాంటి ప్రయత్నాలు చేయడంలేదు. ఒకవేళ పట్టుతప్పి కింద పడితే ఏకంగా అగాథంలోకి, అగాథంలో పారే సెలయేటిలో పడిపోవడం ఖాయం.
కారిక్‌రిడ్ రోప్ బ్రిడ్జి
నార్తర్న్ ఐర్లాండ్‌లోని యాంట్రిమ్ టౌన్‌లో గల కారిక్‌రిడ్ రోప్ బ్రిడ్జి పొడవు 21 మీటర్లు. ఈ బ్రిడ్జికి 30 మీటర్ల దిగువన పారే సెలయేరు ఉంటుంది. ఈ బ్రిడ్జి గుండా మనుషులు నడుస్తున్నప్పుడు బ్రిడ్జి తాళ్లు సాగడం వల్ల, గాలి వల్ల బాగా కదులుతూ ఉంటుంది. అందుకే దీని మీద నడవాలంటే స్థానికులు, టూరిస్టులు భయపడుతుంటారు. దీని మీద అటు నుండి ఇటు నుండి అటు నడవడం సాహసంగా టూరిస్టులు భావిస్తుంటారు.
స్విఫ్ట్ బ్రిడ్జి
స్విట్జర్లాండ్‌లోని స్విఫ్ట్ బ్రిడ్జిని చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. స్విట్జర్లాండ్‌లోని ఆల్ఫ్‌గాడ్‌మాన్ అనే ప్రాంతంలో ఉన్న ఈ బ్రిడ్జి పొడవు 180 మీటర్లు. దీనికి 110 మీటర్ల దిగువన జలపాతం ఉంటుంది. పైగా ఈ బ్రిడ్జికి అటు చివర, ఇటు చివర ఎటువంటి రక్షణ ఉండదు. అలాగే బ్రిడ్జి మధ్యలో సపోర్ట్‌గా ఎటువంటి నిర్మాణాలు గానీ, పట్టి ఉంచే ఏర్పాటు గానీ లేకపోవడం వల్ల దీని మీదుగా మనుషులు నడుస్తున్నప్పుడు ఈ బ్రిడ్జి ఊగుతూ ప్రాణాలు కొడిగడుతూ ఉంటాయి.
ఐగిల్‌డు మిడి బ్రిడ్జి
ఫ్రాన్స్‌లో ఉన్న ఐగిల్‌డు మిడి బ్రిడ్జి అత్యంత ప్రమాదకరమైన బ్రిడ్జిగా టూరిస్టులు అభివర్ణిస్తూ ఉంటారు. సముద్రమట్టానికి 12,600 అడుగుల ఎత్తులో ఉండే ఈ బ్రిడ్జి మీద ప్రయాణం అంటే ప్రాణాలతో చెలగాటమని అంటారు. దూరం దూరంగా ఉండే రెండు కొండలను కలుపుతూ ఈ బ్రిడ్జి నిర్మించారు. గుండె జబ్బులున్న వారు ఈ బ్రిడ్జి మీద ప్రయాణం చేయకపోవడమే మంచిదని అంటారు. ఈ బ్రిడ్జి మీద ప్రయాణిస్తుండగా కిందకి చూస్తే హోరుమని పారుతూ నీళ్లు, దాదాపు శరీరానికి తగులుతూ మేఘాలు కనిపించడం వల్ల గుండెలు గుబగుబలాడిపోతాయి. సాహసాలంటే ఇష్టపడే వారే ఈ బ్రిడ్జి మీద ప్రయాణిస్తూ ఉంటారు.
మారీన్‌బ్రూక్ బ్రిడ్జి
జర్మనీలో గల మారీన్‌బ్రూక్ బ్రిడ్జి కూడా రెండు కొండలను కలుపుతూ నిర్మించిన బ్రిడ్జే. బెవేరియన్ ఆల్ఫ్స్ అని పేరు గల కొండల మధ్యలో నిర్మించిన ఈ బ్రిడ్జి చూడడానికి అందంగా ఉన్నా దీనిపై ప్రయాణం కూడా ప్రమాదకరమే అంటారు టూరిస్టులు.
తమన్ నెగారా నేషనల్ పార్క్ బ్రిడ్జి
మలేషియాలో గల తమన్ నెగారా నేషనల్ పార్క్ బ్రిడ్జి 550 మీటర్ల పొడవున ఉంటుంది. ఈ బ్రిడ్జికి 40 మీటర్ల దిగువన జలజల పారే సెలయేరు ఉంటుంది. నేరోగా ఉండే ఈ బ్రిడ్జి మీద ప్రయాణం భయం గొలుపుతుంది. వర్షాకాలంలో ఈ బ్రిడ్జి మీదుగా ప్రయాణించేందుకు స్థానికులు కూడా భయపడుతుంటారు. ఈ ప్రాంతాన్ని చూసేందుకు వచ్చే టూరిస్టులు దీని గుండా ప్రయాణించి భయంతో కూడిన ఆనందాన్ని ఆస్వాదిస్తుంటారు.
గుండె గుబగుబలాడే గ్లాస్ బ్రిడ్జి
చైనాలోని హునాన్‌లో గల షినుజాయి జువో పార్కులో గల గ్లాస్ బ్రిడ్జి ప్రపంచ సందర్శకులకొక అద్భుతం. 984 అడుగుల పొడవు, భూమి నుండి 590 అడుగుల ఎత్తులో గల ఈ బ్రిడ్జి అడుగు భాగం పూర్తిగా గాజుతో నిర్మించడం వల్ల కింది అగాథం కళ్లకు కట్టినట్లు కనిపిస్తూ అడుగు ముందుకు వేయడానికి ఒళ్లు జలదరించిపోతుంటుంది. అడుగు తీసి అడుగు వేసిన ప్రతిసారీ కాళ్ల కింద అద్దం ఉందా? పగిలిపోయిందా? అని బెంబేలుపడుతూనే టూరిస్టులు ముందుకు సాగుతుంటారు. కొందరైతే మధ్యలోనే వణికిపోతూ ప్రయాణం ఆపేసి కూలబడిపోతారు. పాపం వారిని సహచరులు మెల్లగా నడిపించుకుని, లాక్కుని వెళ్లే దృశ్యాలు అక్కడ సర్వసాధారణం. రెండు పొరల 24 మిల్లీమీటర్ల మందం గల అద్దంతో ఈ బ్రిడ్జిని తయారు చేశారు. మామూలు విండో గ్లాసుకన్నా ఇది 24 రెట్ల బలం కలిగి ఉంటుంది. కలప, ఇనుప సపోర్టులు, కాళ్ల కింద అద్దాలతో నిర్మించబడిన ఈ బ్రిడ్జి మీద నడవడం నిజంగా సాహసం కిందకే వస్తుందని అంటారు టూరిస్టులు. అందుకే దీనికి ‘హీరో బ్రిడ్జి’ అనే పేరు వచ్చింది.
*
- దుర్గాప్రసాద్ సర్కార్

- దుర్గాప్రసాద్ సర్కార్