AADIVAVRAM - Others

దానం ( కథాసాగరం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఔదార్యం మంచి లక్షణం. దానం గొప్ప గుణం. త్యాగం సాటిలేని గుణం. చరిత్రలో కొంతమంది ఈ అత్యున్నత లక్షణాలు కలిగిన వాళ్లున్నారు. వాళ్లని ప్రపంచమెప్పటికీ మరచిపోదు. అట్లాంటి వాళ్లలో కర్ణుడు ఒకడు. అందుకనే అతన్ని దానకర్ణుడు అన్నారు. ఎప్పుడు ఎవరు ఏమి అడిగినా కాదనకుండా ఇచ్చేవాడు కర్ణుడు.
ఇవ్వడంలో ఔదార్యమే తప్ప ఆలోచన ప్రసక్తి లేనివాడు కర్ణుడు. ఇవ్వడంలో ఎంత ఆనందముందో ఇచ్చే వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. ఇస్తే తమ దగ్గర వున్నదంతా పోయి తాము బికారులుగా మిగిలిపోతామేమో అని భయపడే వాళ్లు ఎప్పుడూ ఇవ్వలేరు.
కానీ దానం చేసేవాణ్ణి దైవం చల్లగా చూస్తుంది. అతని ఆత్మ అపూర్వ ఆనంద తరంగితమవుతుంది. అతను నిర్ధనుడయిపోయినా ఎప్పుడూ తను కోల్పోయానని అనుకోడు. పైగా తను ఎంతో పొందానని అనుకుంటాడు. తరిగిపోని ఆనంద ఐశ్వర్యాన్ని అందుకున్నానని అనుకుంటాడు.
కర్ణుడికి దానం చెయ్యడానికి నిర్ణీత సమయమంటూ లేదు. అవసరం వున్న వాళ్లు ఏ సమయంలో వచ్చినా ఆదుకునేవాడు.
ఒకరోజు కర్ణుడు స్నానం చేస్తున్నాడు. తలంటి స్నానం చేస్తున్నాడు. ఒక వజ్రాలు పొదిగిన గినె్నలో నూనె ఉంది. శ్రీకృష్ణుడు అప్పుడే కర్ణుని ఇంటికి వచ్చాడు. కర్ణుడు స్నానం చేస్తున్నట్లు తెలిసింది. ఆ స్నాన మందిరానికి వచ్చాడు. అక్కడున్న వజ్రాల గినె్న కృష్ణుని కంటపడింది. కృష్ణుడు ఎప్పుడూ ఎదుటి వాళ్లని ఆటపట్టిద్దామనుకునే వాడు కదా! కర్ణుని పరీక్షిద్దామనుకున్నాడు.
‘కర్ణా! నిన్ను ఒకటి కోరాలనుకుంటున్నాను’ అన్నాడు.
‘కృష్ణా! నిరభ్యంతరంగా నీకు ఏం కావాలో అడుగు. నా దగ్గర వున్నది. నాకు వీలయింది ఏదయినా సరే నీకిస్తాను’ అన్నాడు కర్ణుడు.
కృష్ణుడు ‘ఈ వజ్రాలు తాపిన నూనె గినె్న నాకివ్వు’ అన్నాడు కృష్ణుడు.
‘దానికేం భాగ్యం. తప్పక తీసుకో’ అని కర్ణుడు ఎడం చేతితో ఆ వజ్రాల గినె్నను కృష్ణుడికి అందించాడు. కారణం కుడిచేతిలో వున్న తైలంతో తలను మర్దనం చేసుకుంటున్నాడు. అందువల్ల ఎడం చేతితో ఇవ్వాల్సి వచ్చింది.
కృష్ణుడు ‘ఎడం చేతితో ఇవ్వడం మర్యాద కాదు. కుడిచేతితో ఇస్తే తీసుకుంటాను’ అన్నాడు.
కర్ణుడు ‘కృష్ణా! నాకు ఎడంచేతితో నీకు ఇవ్వాలన్న అహంకారం లేదు. నేను కుడిచేతితో తలపై తైలం రుద్దుకుంటున్నాను. అందుకని నువ్వు ఎడం చేతిలో వున్న గినె్నను తీసుకో’ అన్నాడు.
కృష్ణుడు ‘తొందర లేదు. నువ్వు కుడిచేతిని శుభ్రంగా కడిగిన అనంతరమే ఇవ్వు. తీసుకుంటాను’ అన్నాడు.
దానికి కర్ణుడు ‘కృష్ణా! ఆలస్యం అమృతం విషం. ఇచ్చినప్పుడే స్వీకరించు. ఎందుకంటే ఇప్పుడు నాకున్న ఉదార గుణం మరుక్షణానికి మాయం కావచ్చు. నేను ఈ క్షణం బతికి వున్నాను. ఇంకో క్షణానికి సజీవంగా ఉంటానని ఏమిటి? మృత్యువు చర్యలు ఊహకందవు. పైగా మనుషుల బుద్ధి చంచలమైంది. ఇప్పుడున్న దానగుణం ఇంకో క్షణానికి లాభ గుణంగా మారిపోవచ్చు. పైగా నువ్వు అన్నట్లు కుడిచేతిని కడుక్కుని వజ్రాల గినె్నను నీకిచ్చేలోగా నాకు దానిపై వ్యామోహం కలగవచ్చు. అసలు అప్పటికి నేను బతికి ఉంటానో లేదో హామీ ఇవ్వలేను కదా! అందుకని ఈ పరిస్థితులు రాకముందే నీకు వజ్రాల గినె్నను ఇవ్వాలని ఎడం చేతితో ఇచ్చాను’ అన్నాడు.
కర్ణుని వివేకానికి విచక్షణకు కృష్ణుడు ముగ్ధుడయ్యాడు.
*

- సౌభాగ్య, 9848157909