AADIVAVRAM - Others

తేనె తీయదనమున్న భాష.. తెలుగు భాష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కారణజన్ములైన వారి జీవితాలు మొదటి నుంచీ చివరి దాకా ఒక పద్ధతిగా సాగిపోతూంటాయి. మనిషి వెంట నీడలా అప్రయత్నంగానే కీర్తిప్రతిష్టలు కూడా వెన్నంటే ఉంటాయి.
‘తెలుగు వారలకున్ తేట తెల్లముగను
తెలుగులో నెల్ల విద్దెలఁ దెలుపనెంతు
అన్ని విధముల నను గాంచు నాంధ్రదేశమునకు
నా యచ్చియున్న యప్పనము దీర్తు’
అని ప్రతిజ్ఞ చేసిన పుంభావ సరస్వతి ‘హరికథా పితామహ’ శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు.
‘స్వయం తీర్ణః పరాన్‌తారయతి’ అనే సూక్తికి నిలువెత్తు సాక్షి నారాయణదాసు. ఆయనకు తెలియనిది లేదు. ఆయన స్పృశించని ప్రక్రియంటూ ఏదీ లేదు.
‘మొలక లేతదనము తలిరుల
నవకంబు
మొగ్గ సోగదనము పూవుతావి
తేనె తీయదనము తెనుగునకే గాక
పరుష సంస్కృతాఖ్య భాషకేది?’
ఈ పాదానికి పాఠాంతరం ‘మొఱకు కఱకు దయ్యపు నుడికేది’ అని దాసుగారు తన చివరి రోజుల్లో రాసుకున్నారు. అన్నంత మాత్రాన, యితర భాషల పట్ల చిన్నచూపు ఉందని గానీ, సదభిప్రాయము లేదని గానీ అనుకోవడానికి ఎంత మాత్రమూ వీలు లేదు. సంస్కృత భాషలోనే దివ్యమైన హరికథామృతం రాసిన గడుసరి వ్యక్తి. అచ్చమైన తెలుగులో ఒకవైపు ఏడు శతకాలు, మరోవైపు సంస్కృత భాషలో ఉమర్‌ఖయ్యామును ఆంధ్రీకరించిన ఘనుడు. ‘త్రిలింగ దేశ భాషైవ పరుషాక్షర వర్జితా,/ విస్పష్టా సర్వ సులభా స్వతంత్రా సర్వలౌకికా’ అన్నారు. (కచ్ఛపీశ్రుతులు)
ఇప్పుడు వాడుకలో వున్న దేశ భాషలలో తెలుగు భాష ఒక్కటే పరుషాక్షరాలు లేకుండా కనిపించేది.
అచ్చతెలుగులో కనిపించేవన్నీ సులభాక్షరాలే. తెలుగు భాషలోని పదాలన్నీ అజంతాలయి వుండటంవల్ల స్పష్టత ఉంటుంది.
భాషాంతర పదాల సహాయం లేకుండానే ఈ భాషను సులభంగా అర్థం చేసుకోవచ్చు.
తెలుగుదేశమే దేశం
తెలుగు మనిషే మనిషి
భాష అంటే తెలుగు భాషే- అని ఢంకా బజాయించిన చతుర వచస్వి, చారుమనస్వి ఆదిభట్ల.
తెలుగు భాష మీద దాసుగారికున్న విపరీతమైన అభిమానం ఎంతవరకూ వెళ్లిందంటే, అచ్చ తెలుగులో అత్యంత సరళమైన మాటల్లో పద్యాలు, కీర్తనలు రచించడం, ఒక ప్రజ్ఞయితే, ఆయన పెట్టిన అచ్చ తెలుగు పేర్లు, ఆ మాటలు.. ‘న భూతో న భవిష్యతి’
‘రెంట త్రాగుడు తిండి మెట్టంటు వేలుపు’ -సింహాచల క్షేత్ర దేవుడి తెలుగు పేరు.
రెంట త్రాగుడు =ఏనుగు
రెంట త్రాగుడు తిండి - సింహము = సింహాద్రి
భగవద్గీతకు ‘వేల్పు మాట - మన్కి= అంటే ఆయువు.
మిన్కు = ఆయుర్వేదం
మన్కి మిన్కు - ఆయుర్వేద విషయాలు
సీమ పల్కు - అచ్చ తెలుగు నిఘంటువు
తెలుగు భాషాభిమానులకు ఆనందం కలిగించే ఈ పేర్లు, ‘తెలుగు భాష యింత గొప్పదా’ అని గర్వంగా చెప్పుకునేలా చేస్తాయి.
ఆంధ్ర భాషను ప్రస్తుతించే నారాయణదాసు, శ్రీపాద కృష్ణమూర్తి శాస్ర్తీ ఎంతో సన్నిహితులు.
మహా భాగవతాన్ని తెనిగించి దాసుగారి అభిప్రాయం కోసం విజయనగరం వచ్చి వ్రాతపతిని ఆయనకు అందించారట.
భాగవతం తెలుగు చేశాను. మీ అభిప్రాయం కోరుతున్నాను అన్నారు శాస్ర్తీ.
-దశమస్కంధ భాగాన్ని తీసి పుటలన్నీ తిప్పేస్తూ, కాసేపు ఆగి,
శాస్ర్తి! ‘నల్లని వాడు పద్మనయనంబుల వాడు’ అనే పోతన పద్యానికి దరిదాపుగా ఎత్తుగడగల పద్యం కోసం వెదుకుతున్నానన్నారట.
అష్ట భాషా విశారదుడైన ఆదిభట్ల అచ్చ తెలుగులో ఎన్నో గ్రంథాలు రచించారు.
అచ్చ తెలుగు వారచ్చ తెనుంగు
తెలియని యెడ వారి తెల్విదొసంగు
తేట తీయని అచ్చ తెలుగు రాకున్న
తెలుగు వారికెద్ది తెలియుట సున్న’
తేట తీయని యచ్చ తెనుగను వాడు
వాసికెక్కిన చదువరి మొనగాడు’
యిలా అచ్చ తెనుగు భాషని, మాట్లాడేవారిని ప్రశంసిస్తూ, రానివాణ్ణి తెగడారు.
‘పార్వతీ కల్యాణం’ అనవచ్చు. కానీ ‘గౌరప్ప పెండ్లి’ అనేవారు దాసుగారు. పార్వతీ దేవి తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి మెప్పించి పెండ్లి యాడడం యితివృత్తం.
దీన్ని హరికథగా చెప్పిన వారిలో దాసుగారి ప్రియ శిష్యులు వాజపేయి యాజుల సుబ్బయ్యగారు ప్రముఖులని మా నాన్నగారు చెప్పేవారు. ఈ కథలోని కీర్తనలు సుబ్బయ్యగారు మా తండ్రిగారూ కలిసి, మా స్వగ్రామమైన పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరులో చెరువుగట్టుపై కూర్చుని పాడుకునేవారుట. ఆంగ్ల పదాల ప్రభావంతో దూరవౌతున్న ఈ రోజుల్లో దాసుగారి పట్టుదలను తెలుగువారు కొంతైనా పట్టుకుంటే చాలు.
*

చిత్రాలు.. ఆదిభట్ల నారాయణదాసు యువకుడిగా * కాస్త వయసు మీద పడ్డాక..

-మల్లాది సూరిబాబు