AADIVAVRAM - Others

ఆరిన మంట (కథాసాగరం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది ఒక యూదుల పవిత్ర దినం. యూదు మతంలో సంస్కరణలు తెచ్చిన, యూదు మతానికి చైతన్యాన్నిచ్చిన బాల్షెమ్తోవ్ సంప్రదాయాన్ని కొనసాగించిన వాళ్లలో ఆయన మనుమడు కూడా ప్రసిద్ధుడు. ఆయన కూడా రబ్బీ.
ఆ పవిత్రమయిన రోజు కొంతమంది అతని ఇంటిలో సమావేశమయ్యారు. ప్రార్థనకు సమాయత్తమయ్యారు. దూర ప్రాంతం నించీ ఒక వ్యాపారస్థుడు రావాల్సి ఉంది. అతను దైవభక్తి పరుడు. అందరూ అతని కోసం ఎదురుచూశారు. కానీ ఆలస్యమవుతోంది. అందుకని ప్రార్థన ప్రారంభించారు.
రబ్బీ పవిత్ర గ్రంథం తోరా నుండి కొన్ని అధ్యాయాలు చదివాడు. వాటికి వ్యాఖ్యానం చేశాడు. అందరూ నిశ్శబ్దంగా విన్నారు.
అది రష్యాలో చలికాలం రోజులు. బయట మంచు తుఫాను. బయట భరించలేని చలి. కానీ కిటికీలు తలుపులు వేసి ఉండటంతో లోపల వెచ్చగా ఉంది.
అందరూ వలయంగా కూర్చున్నారు. మధ్యలో ఒక స్టూలు. దానిపై ఒక క్యాండిల్ వెలుగుతోంది. ఆ వెలుగులో అందరూ కూర్చున్నారు. ఆ గదిలో ఆ వెలుగు తప్ప ఏమీ లేదు. పాటలు పాడారు. దైవ సంకీర్తన చేశారు.
అంతలో హఠాత్తుగా క్యాండిల్ మంట అటూ ఇటూ కదిలింది. రబ్బీ క్యాండిల్ మంట వేపు చూశాడు. ఆ మంట గాలికి కదుల్తున్నట్టు నాట్యం చేసింది. ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే గదిలో అంతా నిశ్శబ్దం. గాలి జాడ లేదు. ఈదురుగాలి వీస్తున్నట్లు మంట ఒకపక్కగా సాగి ఒక్కసారిగా వెలిగి ఆరిపోయింది. గదంతా చీకటి కమ్ముకుంది.
అక్కడున్న ఒక వ్యక్తి క్యాండిల్ వెలిగించడానికి సిద్ధపడ్డాడు. రబ్బీ వారించాడు. ఎందుకు వద్దన్నాడో అతనికి అర్థం కాలేదు. అందరూ పది నిమిషాలు చీకట్లో ఉన్నారు.
అంతలో ఎవరో తలుపు తట్టారు. రబ్బీ వెళ్లి తలుపు తీశాడు. బయట మంచు తుఫాను. ఒక వ్యక్తి బట్టలు మాసి, తల చెదిరి, ముఖమంతా రక్తంతో కనిపించాడు. కానీ అతని పెదాలపై చిరునవ్వు కదులుతోంది.
రబ్బీ ఆశ్చర్యంగా అతన్ని ఆపాదమస్తకం చూసి అతన్ని లోపలికి ఆహ్వానించాడు. అతను ఎవరో కాదు. అందరూ ఎదురుచూస్తున్న వ్యాపారస్థుడు. మొదట అతన్ని స్నానం చేయమని వేడి పానీయమిచ్చి విషయమేమిటని రబ్బీ అడిగాడు. ఇంత భయంకరమయిన మంచు తుఫానులో ఎలా వచ్చావన్నాడు.
వ్యాపారస్థుడు జరిగిందంతా వివరంగా చెప్పాడు. ‘నేను రెండు రోజుల క్రితం బయల్దేరాను. ఒంటరిగా వెళ్లకూడదని, దారిలో దొంగల భయముంటుందని తెలుసు. అయినా నేను వెళుతున్నది పవిత్ర దిన సమావేశానికి, మీ ప్రవచనాలు వినడానికీ కదా, అంత భయపడాల్సిన పనే్లదని బయల్దేరాను. మంచు తుఫాను కూడా ఉంది. ఒళ్లు కొంకర్లు పోయే చలి.
అంతలో ఒక దొంగల గుంపు నన్ను చుట్టుముట్టింది. వాళ్లు నా గుర్రం మీద నించీ నన్ను కిందికి లాగారు. కిందపడేసి తొక్కాడు. నా దగ్గర వున్న సంచిలో వెతికారు. నా బట్టలు చింపి డబ్బు కోసం చూశారు. వాళ్లు ఎంత వెతికినా వాళ్లకు ఏమీ దొరకలేదు.
‘డబ్బు ఎక్కడ దాచావు?’ అన్నాడొక దొంగ.
‘ఏం డబ్బు? నా దగ్గర డబ్బు లేదు’ అన్నాను.
అతను నా మూతి మీద గుద్దాడు. రక్తం కారింది.
నేను మూతి తుడుచుకుంటూ ‘నిజంగా నా దగ్గర ధనం లేదు. నేను పవిత్ర దినం ప్రార్థన కోసం పక్క ఊరు వెళుతున్నాను. నేను సాయంత్రానికల్లా అక్కడకు చేరుకోవాలి. దయచేసి నన్ను వదిలిపెట్టండి’ అని ప్రార్థించాను.
వాళ్లు నా మాటలు నమ్మలేదు. నా పట్ల జాలి చూపించలేదు.
‘నీ మీటలు మేము నమ్మం. కాసేపట్లో మా నాయకుడొస్తాడు. ఆయన వచ్చాకా నీ పని పడతాం’ అని నన్ను ఒక చీకటి గదిలో బంధించారు.
అనుకోకుండా ఈ ప్రమాదంలో చిక్కుకున్నాను, ‘దేవుడు నన్ను పరీక్షింపదలచుకున్నాడేమో’ అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండిపోయాను.
కాసేపటికి ఆ దొంగల నాయకుడు వచ్చాడు. దొంగలు అతనితో నా గురించి చెప్పారు. ఎంత కొట్టినా అతను తన దగ్గర డబ్బు ఏమీ లేదని, తను ఒక పండుగ రోజు ఉత్సవానికి పక్క ఊరు వెళుతున్నట్లు చెప్పాడని అన్నారు.
దొంగల నాయకుడు నన్ను బంధించిన గదిలోకి వచ్చాడు. ‘అయితే నీ దగ్గర డబ్బు లేదంటావు. బహుశా ఎక్కడయినా దాచావేమో’ అన్నాడు.
నేను ‘లేదు. ఆ అవసరం లేదు. పక్క ఊళ్లో ఒక రబ్బీ ఇంట్లో ప్రార్థనా సమావేశం జరుగుతోంది. నేనా సమావేశానికి హాజరు కావడానికి వెళుతున్నాను. ఇంతలో మీ వాళ్లు నన్ను బంధించారు. నన్ను నమ్మండి’ అన్నాను.
ఎందుకో ఆ దొంగల నాయకుడికి నాపైన నమ్మకం ఏర్పడింది. నా మాటలు నమ్మాడు. నన్ను క్షేమంగా వదిలి నా గుర్రాన్ని నాకిచ్చాడు.
నేను దేవునికి కృతజ్ఞత చెప్పి గుర్రం మీద బయల్దేరాను. గాఢమయిన చీకటి. కాసేపటికి గుర్రం కదలకుండా ఆగిపోయింది. నేను కొట్టినా అది కదల్లేదు. నాకు దిక్కుతోచలేదు. చిమ్మచీకటి. అప్పుడు హఠాత్తుగా ఒక నక్షత్రం లాంటి మెరుపుతో ఒక దీపకళిక నా ముందు కనిపించింది. ఆ కాంతిలో నేను ముందుకు సాగే కొద్దీ ఆ దీపకళిక కూడా కదిలే నక్షత్రంలా సాగింది. ఆ దీపం వెలుగు ఆసరాతో నేను మీ ఇంటి ముందు ఆగాను. ఇది దేవుని అద్భుతం! మీ ఇంటి ముందు ఆగగానే దీపం అదృశ్యమైంది’ అన్నాడు.
అంతా విన్న రబ్బీ ఆరిపోయిన క్యాండిల్ వేపు చూశాడు. ఎవరూ వెలిగించలేదు. కానీ అది అప్పటికే దానంతట అది వెలుగుతోంది. దైవం చేసే అద్భుతానికి ఆశ్చర్యపడి రబ్బీ కళ్లలో నీళ్లు కదులుతూ ఉంటే చేతులు జోడించి దేవుడికి నమస్కరించాడు.

- సౌభాగ్య, 9848157909