AADIVAVRAM - Others

రాజు - మంత్రి (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుర్మతి రాజ్యానికి చక్రపాలుడు రాజుగా ఉండేవాడు. ధీరోదాత్తుడు అతని మంత్రి. చాలా తెలివైనవాడు. చక్రపాలుని తరువాత అతని కుమారుడు విక్రపాలుడు రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించాడు. విక్రపాలునిది వక్ర బుద్ధి. మంత్రి మాట వినేవాడు కాదు. ఒకనాడు మంత్రి విక్రపాలుని కలిసి ‘మహారాజా! మన రాజ్యంలో సత్రంల కొరత ఉంది. అందువలన రాజ్యానికి వచ్చే బాటసారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక సత్రాలను ఏర్పాటు చేయవలసి ఉంది’ అన్నాడు.
దానికి విక్రపాలుడు ‘సత్రాలు ఏర్పాటు చేస్తే ప్రజలు అక్కడే తిష్ట వేసి సోమరులుగా తయారవుతారు. కనుక ఇప్పుడు వాటి ఏర్పాటు ముఖ్యం కాదు’ అన్నాడు.
మరో సందర్భంలో మంత్రి ‘మహారాజా! క్రిందటి సంవత్సరం వర్షాలు పడక ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ సంవత్సరం వర్షాలు బాగా పడే అవకాశం ఉందని మన పండితులు చెబుతున్నారు. కనుక ఈ వేసవిలో చెరువుల కాలువల పూడికలు తీయిస్తే మనం నీటిని నిల్వ చేసుకోగలం. పైగా ప్రజలకు ఈ వేసవిలో పని కల్పించినట్టు అవుతుంది’ అన్నాడు.
దానికి రాజు ‘రాబోయే వర్షానికి ఇప్పుడు ధనం వెచ్చించడం దండగ’ అంటూ మంత్రి మాటను తోసిపుచ్చాడు.
మరో సందర్భంలో ‘మహారాజా! మన సైన్యంలో చాలామంది వయస్సులో పెద్దవారై పోయారు. పైగా ఆయుధాలు కూడా తగ్గిపోయాయి. కనుక యువకులను సైన్యంలో చేర్చుకోవడం, ఆయుధాలను సమకూర్చుకోవడం చాలా ముఖ్యం’ అన్నాడు.
‘ఎప్పుడో వచ్చే యుద్ధం కోసం ఇప్పుడు ధనం ఖర్చు చేయడం అవివేకం. మీరూ మీ సలహాలూ’ అని మంత్రిని చిన్నబుచ్చాడు. ఇలా చాలా సందర్భాలలో రాజు మంత్రిని కించపరుస్తూ వచ్చాడు.
మనస్తాపం చెందిన మంత్రి ధీరోదాత్తుడు ‘మహారాజా మా వియ్యంకులకి సుస్తీగా ఉందని తెలిసింది. నేను చూచి రావడానికి ఒక వారం రోజులు సెలవు మంజూరు చేయవలసింది’ అని అడిగాడు.
‘మంచిది. మీ సలహాలు వినే కంటే మీకు సెలవు మంజూరు చెయ్యడమే మంచిది’ అన్నాడు రాజు విక్రపాలుడు.
మంత్రి వెళ్లిన కొద్ది రోజులకే దుర్మతికి పక్కనున్న అలంపురం రాజు దుర్మతి రాజ్యంపై దండయాత్ర ప్రకటించాడు. అంతేగాదు దుర్మతి పొలిమేరల్లో సైన్యాన్ని మోహరించాడు. వేగులు వచ్చి ‘మహారాజా! అలంపురం రాజు సైన్యంతో మన పొలిమేరల్లో వున్నాడు. అతని దగ్గర చాలా సైన్యం ఉంది. అధునాతన ఆయుధాలు ఉన్నాయి. చాలా సులువుగా మన రాజ్యాన్ని వశపరచుకోగలడు అనిపిస్తోంది’ అన్నారు.
పొరుగు రాజు దండెత్తి వచ్చాడని మహారాజు చక్రపాలునికి తెలిసింది.
వెంటనే అందరినీ సమావేశపరచమని ఆదేశించాడు.
‘ఈ సమయంలో మన మహామంత్రిగారు ఉంటే ఏదో ఒక సలహా ఇచ్చేవారు. వారు కూడా సరియైన సమయానికి ఊరు వెళ్లడం జరిగింది’ అన్నారు మిగిలిన పండితులు, విద్యావేత్తలు.
‘అసలు మంత్రిగారు ఊరు వెళ్లడం ఏమిటి? వారు ఎప్పుడూ రాజ్యం వదిలి వెళ్లేవారు కాదే’ అన్నాడు.
తరువాత ఆంతరంగికుల ద్వారా మంత్రిగారు వెళ్లడానికి గల కారణం తెలుసుకొన్నాడు చక్రపాలుడు.
తన కుమారుని తప్పిదాన్ని మన్నించి వెంటనే రాజ్యానికి రావలసిందిగా ధీరోదాత్తునికి కబురు పంపాడు చక్రపాలుడు. అప్పటికే పొరుగు రాజు తన సైన్యంతో పొలిమేరలలో విడిది చేసాడని తెలిసిన మంత్రి రాజ్యానికి బయలుదేరాడు.
‘మహామంత్రీ! ఉపద్రవం ముంచుకు వచ్చింది. ఇప్పుడు కర్తవ్యం మీరే తెలపాలి’ అన్నాడు చక్రపాలుడు.
తన తప్పిదాన్ని మన్నించమని కోరాడు విక్రపాలుడు.
‘మహారాజా! ఇప్పుడు మనం యుద్ధం చేసే పరిస్థితుల్లో లేము. కనుక సంధి చేసుకోవడం ఒక్కటే మార్గం. అందుకు మన పండితులలో వున్న వినయ శర్మని పంపుదామని అనుకుంటున్నాను’ అన్నాడు.
మహారాజు అనుమతితో వినయ శర్మను సంధి నిమిత్తం అలంపురం రాజు వద్దకు పంపాడు మంత్రి.
అతనితో తమ రాజ్యం అడవిలో దొరికే జవ్వాది, కస్తూరి, పుట్టతేనె, మొదలగు సుగంధ ద్రవ్యాలు, రకరకాలైన మణులు, మాణిక్యాలు ఇచ్చి పంపాడు. మహామంత్రి చెప్పినట్టుగా మాట్లాడి అలంపురం రాజుకు తమ రాజు సందేశం విన్నవించాడు వినయ శర్మ. ఇరు రాజ్యాల రాజులకు సంధి కుదిరింది. అలంపురం రాజు సేనలను వెనక్కి తిప్పాడు. తరువాత విక్రపాలుడు మహామంత్రి నేతృత్వంలో అనతికాలంలోనే సైన్యాన్ని వృద్ధి చేసి బలమైన రాజుగా ఎదిగాడు.

కూచిమంచి నాగేంద్ర