AADIVAVRAM - Others

పారని పొగడ్తలు(కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక రైతు దగ్గర రాము, సోము అనే ఇద్దరు పనివాళ్లుండేవారు. సాగు చేయడంలో రైతుకు సాయపడడమే వాళ్ల పని.
కష్టపడి పనిచేయడం, అందులో చిత్తశుద్ధి జోడించడం రాముకి అలవాటు. సోము మాత్రం పనిలో నటన కనబరచి పొగడ్తలతో యజమానిని బుట్టలో పడేసేవాడు.
పొగడ్తల రుచి మరిగిన యజమాని సోముని మంచి పనివాడిగా గుర్తించి, సోమూ మాదిరిగా ఇంకా కష్టపడి పనిలో శ్రద్ధ చూపాలని రాముకి అప్పుడప్పుడు చీవాట్లు పెడుతుండేవాడు.
తన కష్టానికి ప్రోత్సాహం లేకపోవడమే కాక, చీవాట్లు దరి చేరడం రాముని బాధించినా, పని పట్ల ఉన్న అంకిత భావాన్ని ఏ మాత్రం తగ్గించేవాడు కాదు.
ఒక సంవత్సరం పంటకాల సమయం వచ్చింది. రైతుకి వ్యక్తిగత పని, పొరుగు దేశంలో ఉండటంతో వ్యవసాయాన్ని ఇద్దరు పనివాళ్లకు అప్పజెప్పి వెళ్లిపోయాడు.
రోజులు గడుస్తున్నాయి. రాము కష్టం వృథా కాలేదు. పుష్కలమైన పంట విరగాసి పండింది.
కొద్దిరోజులకు యజమాని పని పూర్తి చేసుకొని స్వదేశానికి తిరిగి వచ్చాడు. పంట పరిస్థితి చూడడానికి పొలం బాట పట్టాడు.
యజమానిని చూసిన రాము ఆనందంతో ఎదురెళ్లి పంటను చూపిస్తూ ‘అందరి కష్టం వృథా కాలేదు!’ అని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
రాము మాటలకు సోము గతుక్కుమన్నాడు. యజమాని రాము మాటల్ని విశ్వసిస్తే తన పని బండారం బయటపడుతుందేమోనన్న అనుమానం కలిగిన సోము ‘అయ్యా! తమరు ధర్మప్రభువులు. అదృష్టం మీ వెంట నడుస్తుంది. అదృష్టవంతుడికి అందరూ దాసోహమేనని పెద్దలంటారు. అందుకే దేవతలు దీవించి ఇంత పంటను మీకు కానుకగా అందించారు’ రాముకి పోటీగా పొగడ్తలు అందుకున్నాడు.
యజమానికి సోము మాటలు మాత్రమే రుచించాయి. ‘కష్టంకన్నా అదృష్టం గొప్పది. ఇదంతా నా మహిమే’ అంటూ ఒకింత గర్వంతో మీసం మెలేశాడు యజమాని.
యజమాని తన దారికి వచ్చినందుకు సోము గర్వంగా రాము వైపు చూశాడు. రాము చిన్నబుచ్చుకున్నాడు.
పంట కోత పూర్త కావడంతో వరికుప్పలన్నీ ఒకచోట వేశారు. మంచి రోజు చూసుకొని నూర్పులు ప్రారంభించారు.
ఎక్కడ నుండో ఒక నిప్పు కణం వచ్చి వరికుప్పలపై పడింది. అంతే మొదట పొగలు ప్రారంభమై, ఆ తరువాత మంటలు చెలరేగాయి.
రాము మంటలు ఆర్పేందుకు నీటి కోసం బావి దగ్గరకు పరుగు తీశాడు. ఏం చేయాలో తోచలేదు యజమానికి.
సోము మాత్రం తీరికగా కూర్చొని ‘ఏమి మంటలు? ఏమి మంటలు! సాక్షాత్తు అగ్నిదేవుడే మీ అదృష్టాన్ని చూడడానికి వచ్చినట్టుంది. ఆ దేవుడికి కూడా మిమ్మల్ని దర్శించుకొనే భాగ్యం ఇప్పటికి కలిగింది’ పొగడ్తల దండకం ప్రారంభించాడు.
పంట తగలబడిపోతూంటే సోము కాలక్షేప ప్రవర్తన పట్ల యజమానికి ఒళ్లు మండింది. సోమును ఒక్క తన్ను తన్ని ‘నువ్వు కూడా నీటిని తెచ్చే ప్రయత్నం చెయ్యి’ అంటూ గద్దించాడు.
ముగ్గురూ అందుబాటులో ఉన్న నీటిని మండుతున్న వరికుప్పలపై చిమ్మడం వల్ల మంటలు అదుపులోకి వచ్చి పంటను కొంతమేర కాపాడుకోవడం జరిగింది. ముగ్గురి శ్రమ వృథా కాకపోవడంతో యజమాని సంతృప్తి చెందాడు.
‘రామూ! ఈ మంటలతో నాలో ఉన్న పొగడ్తల మత్తు వదిలింది. అదృష్టం కన్న శ్రమను నమ్ముకోవడమే గొప్పదని తెలుసుకున్నాను. మూర్ఖత్వంతో సోము చెప్పిన అదృష్టానే్న నమ్ముకుంటే పంట అంతా కాలి బూడిద అయ్యేది. వరికుప్పల్లో దాగింది నీ శ్రమ కాబట్టి దానిని కాపాడుకోవడానికి వెంటనే స్పందించి నీటికై పరుగు తీశావు. పని దొంగకు శ్రమ విలువ తెలియదు. కబుర్లతో కాలక్షేపం చేయడమే వాళ్ల నైజమని రుజువు చేశాడు సోము. పొగడ్తల మత్తులో అప్పుడప్పుడు నిన్ను మందలించినందుకు ఇప్పుడు సిగ్గు పడుతున్నాను’ అంటూ రాముని అక్కున చేర్చుకున్నాడు యజమాని.
పారని పొగడ్తలతో సోము తలదించుకున్నాడు.
‘శ్రమించేవాడికి గౌరవం దక్కుతుంది. పని దొంగకు పరాభవం ఎదురౌతుంది. ఇప్పటికైనా తెలుసుకో. పొగడ్తలపై పెట్టే శ్రద్ధ పనిపై పెడితేనే ఇక్కడ నీ ఉద్యోగం ఉంటుంది’ అని హెచ్చరించి సోముని విడిచిపెట్టాడు యజమాని.
అప్పటి నుండి పనికి చేటు తెచ్చే పొగడ్తలను వినడం కూడా మానుకున్నాడు యజమాని.

-బి.వి.పట్నాయక్