AADIVAVRAM - Others

రాజమార్గం( కథ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవంతీపుర రాజ్యానికి విక్రమసేనుడు రాజు. విక్రమసేనుడికి ప్రజల సంక్షేమం కంటే తన వినోద విలాసాల పట్లే మక్కువ ఎక్కువ. తరచుగా వేటకు వెళ్లడం, మిగిలిన సమయాన్ని సంగీత నృత్య కార్యక్రమాలలో గడుపుతూ ప్రజా పాలనని పూర్తిగా విస్మరించాడు. దీనితో అవకాశవాదులైన భజనపరులంతా రాజుగారి చుట్టూ చేరి పొగడ్తలతో తప్పుడు సలహాలతో తమ ప్రతాపాన్ని చూపించేవారు.
విద్య, వైద్యం, తాగునీరు వంటి కనీస వసతులు కూడా కరవై ప్రజలు అష్టకష్టాలు పడుతుండేవారు. ముఖ్యమైన పనులను నిర్లక్ష్యం చేస్తూ, అంతగా ప్రాధాన్యత లేని విషయాలకు డబ్బు వెచ్చించడం ప్రజలకు రుచించకపోయినా రాజుగారికి ఎదురుచెప్పే ధైర్యం లేక ఎలాగో లాగ కాలం వెళ్లబుచ్చుతున్నారు. దీనిని అదనుగా చేసుకొని రాజ్యమంతా అరాచకం, అవినీతి పెరిగిపోయాయి. ఇదేమీ తెలియని విక్రమసేనుడు మాత్రం పొగడ్తలను నమ్ముతూ తనంతటి రాజు ఎక్కడా లేడనుకుంటూ మురిసిపోయేవాడు.
ఒకరోజు తన అనుచరులతో కలిసి వేటకు బయలుదేరిన రాజుగారు సింహాన్ని తరుముతూ అడవిలో దారి తప్పిపోయి, చీకటి పడటంతో అక్కడ కనిపించిన ఆశ్రమానికి మంత్రితో సహా చేరుకున్నాడు. బయట హోరుమని వర్షం మొదలయ్యింది. రాత్రికి అక్కడే తలదాచుకోవాలని నిర్ణయించుకుని తలుపు తట్టాడు. లోపలి నుండి వచ్చిన ఒక వృద్ధుడు ఆ రాత్రి వారికి ఆహారాన్ని ఆశ్రయాన్ని ఇవ్వడానికి అంగీకరించాడు.
ఆకలి మీద ఉన్న విక్రమసేనుడికి అక్కడ పెట్టిన ఆహారం అమృతంలా అనిపించింది. బాగా అలసిపోయి ఉండడం చేత, కటిక నేల మీదనే ఒళ్లు తెలీకుండా నిద్రపోయారు ఇరువురూ.
మరుసటి రోజు ఉదయం నిదుర లేవగానే, విక్రమసేనుడు వృద్ధుడితో రాత్రి తనకి ఆశ్రయమిచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతూ తక్షణం తనతో కలిసి కోటకు రావాలనీ, తాను అందించే రాజమర్యాదలను అందుకోవాలని కోరాడు. కోరింది రాజుగారు కనుక కాదనలేక వృద్ధుడు ఒక చిరునవ్వు నవ్వుతూ ‘ఒక్క నిమిషం మహారాజా...’ అంటూ ఇంటిలోనికి వెళ్లి పెద్ద తాళంకప్ప ఒకటి చేత పట్టుకు వచ్చాడు. గుమ్మం పైన ఉన్న బాగా అరిగిపోయి పాతబడిన రెండు చెప్పులకు, ఆ కప్పని వేసి, తాళం జేబులో దాచుకుంటూ ‘ఇంక.. పదండి’ అన్నాడు.
అతడి వైఖరి చూసి ఆశ్చర్యపోతూ మంత్రి ‘ఇదేదో వింతగా ఉంది మీ ఇంటి తలుపులు తెరిచే ఉన్నవి. విలువైన వస్తువులన్నీ ఎక్కడివక్కడే ఉండగా... ఎందుకూ పనికిరాని ఈ చెప్పులకు తాళం వెయ్యడం విడ్డూరంగా ఉంది’ అన్నాడు.
దానికి జవాబుగా వృద్ధుడు మరోసారి నవ్వుతూ ‘తమరు ఏమీ అనుకోకపోతే ఇదే రాజమార్గం’ అన్నాడు.
‘నాకేమీ అర్థం కాలేదు కొంచెం వివరంగా చెప్పండి’ అన్నాడు తెల్లముఖం వేసిన మంత్రి.
ఏదోలా ధైర్యం తెచ్చుకున్న వృద్ధుడు శూన్యంలోకి చూస్తూ ‘విలువైన, ముఖ్యమైన విషయాలను నిర్లక్ష్యం చేస్తూ పనికిమాలిన విషయాలకు ప్రాధాన్యత నివ్వడమే మా రాజుగారి పద్ధతి అని ప్రజలంతా అనుకుంటున్నారు. నేను కూడా దానినే పాటిస్తున్నాను’ అన్నాడు. అది విన్న విక్రమసేనుడికి తన తప్పు ఏమిటో అర్థమయ్యింది. తన తప్పుని నేర్పుగా తెలియజేసినందుకు వృద్ధుడిని అభినందించి, ఆనాటి నుండీ తన పద్ధతులను మార్చుకుని అచిర కాలంలోనే మంచి రాజుగా ప్రజల మన్ననలు పొందాడు.

-గరిమెళ్ల నాగేశ్వరరావు