AADIVAVRAM - Others

చిన్ని జీవి.. పెద్ద సాయం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాంతిపురంలో సోమయ్య అనే ఓ పేదవాడు ఉండేవాడు. అతడికి ఎవ్వరూ లేరు. అతడు ప్రతిరోజూ అడవికెళ్లి కట్టెలు కొట్టుకుని తెచ్చి గ్రామంలో అమ్ముకుని జీవించేవాడు. కష్టపడితేనే తిండి. ఒక్కోరోజు కట్టెలకు తగిన వెల కూడా దొరికేది కాదు. ఓమారు అలా మూడు రోజులు కట్టెల మోపు మోసుకుంటూ ఊరంతా తిరిగినా ఎవ్వరూ కొనలేదు. పొట్టనిండా నీరు తాగి పడుకున్నాడు. మూడు రోజులు కడుపులోకి ఏమీ పడక సోమయ్యకు కళ్లు తిరగసాగాయి.
మరునాడు ఎలాగో లేచి కట్టెల మోపు నెత్తికెత్తుకుని మెల్లిగా నడవసాగాడు. రెండు వీధులు తిరిగేసరికి ఒక చెట్టు కింద ఒక కుక్క మూలుగుతూ కనిపించింది. అతడికి జాలేసింది. నోరున్న తానే ఆకలికి తాళలేక అవస్థ పడుతుంటే, పాపం నోరు లేని ఆ జీవికి ఏమి బాధో అనుకుని, కట్టెల మోపు కిందకి దించేసి, ఆ కుక్క వద్దకెళ్లాడు. దాని కాల్లో ఎలా గుచ్చుకుందో ఒక పెద్ద ముల్లు దిగి ఉంది. కింద కూర్చుని దాని కాలు తన వొళ్లో పెట్టుకుని తన మెడలో ఆంజనేయ బిళ్ల కట్టుకుని వేసుకున్న తాటికి ఉన్న ఒక పిన్నీసు తీసుకుని ఆ ముల్లు తీశాడు. నోటితో ఊది తల గుడ్డతో వేడిగా కాపడం పెట్టాడు. ఆ శునకం తోకాడిస్తూ తన సంతోషాన్ని వ్యక్తపరచింది. సోమయ్య దాని వీపు నిమిరి, తిరిగి కట్టెల మోపు తలకెత్తుకుని ‘కట్టెలమ్మా! కట్టెలు, కట్టెలు’ అని లేని ఓపిక తెచ్చుకుని అరుస్తూ ముందుకు సాగాడు.
ఆ శునకం ముందుకు వచ్చి అతడి పంచె కొస పట్టుకుని ముందుకు నడవసాగింది. మూడు వీధుల అవతల ఉన్న ఒక ఇంటి ముందు వెళ్లి ఆగింది ఆ శునకం. అక్కడ నిలబడి మొరగసాగింది. ఆ ఇంటి గృహిణి బయటకొచ్చి కుక్కను చూసి సంతోషంగా ‘ఎక్కడికెళ్లావు రాజూ! మూడు రోజుల నుంచీ!’ అంటూ ఆప్యాయంగా దాని తల నిమిరింది.
అప్పుడు చూసింది అక్కడ తల మీద కట్టెల మోపుతో నిల్చి ఉన్న సోమయ్యను, ఆ శునకం సోమయ్యనూ, తన యజమానురాలిని మార్చిమార్చి చూడసాగింది. ఆమెకు అర్థమైంది. అతడు దానికేదో సాయం చేశాడని. ‘ఏం బాబూ! నీకు మా రాజు ఎక్కడ కనిపించిందీ?’ అని అడిగిందామె.
సోమయ్య విషయం చెప్పాక, ఆమె ‘నాకు వరుసగా పది రోజులపాటు కట్టెల మోపులు కావాలి. ఇంట్లో శుభకార్యం ఉంది. బాగా ఆకలి మీద ఉన్నట్లున్నావ్. కాళ్లూ చేతులూ కడుక్కో నూతి దగ్గర. అన్నం పెడతాను’ అని చెప్పి లోనికెళ్లి పెద్ద అరిటాకు నిండా అన్నం, కూరలూ తెచ్చి పెట్టింది. ఆకలితో కళ్లు తిరుగుతుండగా, ఆమె విస్తరి నిండా అన్నం తెచ్చి అన్నపూర్ణమ్మ తల్లిలా పెట్టగానే సోమయ్య కళ్లు నీటితో నిండి, ఆమె పాదాలకు నమస్కరించాడు.
‘అయ్యో! ఇదేంటి బాబూ! మా రాజు కనపడక మూడు రోజుల నుంచీ వెతుకుతున్నాం. మాకు సాయం చేసావు. పైగా నాకు అవసరమైన ఎండు కట్టెపుల్లలు పొయ్యిలోకి సమయానికి అందించావు’ అంటూ అతడి కట్టెలకు తగిన వెల, సోమయ్య అడక్కుండానే ఇచ్చింది. సోమయ్య శునకాన్ని కృతజ్ఞతాపూర్వకంగా వీపు నిమిరి ఇంటికి బయల్దేరాడు. చూశారా! మనం చిన్న నోరులేని జీవికి కాస్తంత సాయం చేస్తే అవీ తప్పక మనకు సాయం చేస్తాయి. ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు కదా!

-ఆదూరి హైమావతి