AADIVAVRAM - Others

ఈ కారు వెనక్కి వెళుతుంది! (లోకం పోకడ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పదండి ముందుకు... పదండి తోసుకు’ అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అయితే అందరూ అలా అనుకోకపోవచ్చు. పైపెచ్చు దానికి భిన్నంగా కూడా ఆలోచించవచ్చు. అంటే ఏమిటంటారా? ఇంకేముంది... ‘పదండి వెనక్కు వెను వెనక్కు’ అనేవారు కూడా ప్రపంచంలో ఉంటారు. అలా అన్నంత మాత్రాన అదేమంత తిరోగమనం అనుకోనక్కరలేదు. ఎందుకంటే అలా వెనువెనక్కి వెళ్లే ఒక యువకుడు అందరి చేతా ఔరా అనిపిస్తున్నాడు మరి. ఆ యువకుడే పంజాబ్‌లోని బటిండాకి చెందిన హర్‌ప్రీత్‌దేవ్. అతను ఉపాధి కోసం టాక్సీ నడుపుతుంటాడు. అయితే ఇందులో ఎలాంటి ప్రత్యేకత లేదు. కానీ దేవ్ తన కారును వెనక్కి నడుపుతాడు. అలా చేయడంలో అతను ఎంతో నైపుణ్యం చూపుతాడు. అతనలా కారులో వెనుకపాటున సాగిపోవడం చూసే వారికి భయం కూడా వేస్తుంది. దాదాపు పదకొండేళ్ల నుండి ఇలా అతను కారుతో వెనక్కి వెళ్లే విద్యను ప్రదర్శిస్తున్నాడు. ఇందుకు గాను అతను ప్రభుత్వం నుండి ప్రత్యేక లైసెన్సును కూడా పొందాడు. ఇలా కారును వెనకమాలకి తిప్పుతాడు కదాని అతన్ని ఆషామాషీ వ్యక్తి అనుకోవడానికి లేదు. ఎందుకంటే అతను 2005లో మన దేశంలోని రాజస్థాన్ నుండి పాకిస్తాన్‌లోని లాహోర్ వరకు తన కారుని వెనక్కి పరుగులు పెట్టించాడు. అలా చేస్తూ భారత్-పాకిస్తాన్‌లు స్నేహ పూరిత వాతావరణంతో మెలగాలని ఆకాక్షించాడు. దీనిని అందరూ స్వాగతించారు. ఫియట్ పద్మిని కారు యజమాని అయిన దేవ్ కారుతో వెనక్కి వెళ్లే విద్యను 2003లో మొదలుపెట్టాడు. కొన్నాళ్లకే ఆ విద్యలో నిష్ణాతుడిగా నిరూపించుకున్న తర్వాత తన కారు మీద ‘బ్యాక్ గేర్ ఛాంపియన్’ అని రాసుకుని మరీ వెనక్కి కారుని ఉరకలెత్తించడం మొదలుపెట్టాడు. అతని కారుకి నాలుగు రివర్స్ గేర్లు, ఒకే ఒక్క ఫార్వర్డ్ (ముందుకు తీసుకెళ్లే) గేరు ఉంటుంది. గంటకి 50 కిలోమీటర్ల వేగంతో కారుని వెనక్కి పరిగెత్తించే దేవ్ తన కారుకి అంబులెన్స్ సైరన్‌ని ఏర్పాటు చేసుకున్నాడు. దాని వల్ల ఇతర వాహనాలు, పాదచారులు అప్రమత్తమవుతారని అంటాడు. తన నైపుణ్యంతో గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకోవాలని అతను ఒకసారి ప్రయత్నించాడు. అయితే అప్పటికే యుకెకి చెందిన జాన్‌స్మిత్ అనే వ్యక్తి పేరిట ఆ రికార్డు ఉండడం వల్ల అది సాధ్యం కాలేదు. అయితే అతను వాహనంతో వెనక్కి వెళ్లిన దూరాన్ని అధిగమించడం ద్వారా ఆ రికార్డును ఛేదించాలని దేవ్ ఆశిస్తున్నాడు. అతని సాధనే అతను కోరుకునే లక్ష్యాలకు చేరుస్తుందని ఆశిద్దాం.

- దుర్గాప్రసాద్ సర్కార్