AADIVAVRAM - Others

నెల రోజుల శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యుడు మకర రాశిలోకి మారడమే సంక్రాంతి అని అనవచ్చు. సూర్యుడు ఒక్కో రాశిలోకి మారడం సహజమే అయినా దేవతలకు ఉత్తరాయణం పగలుగాను, దక్షిణాయనం రాత్రిగాను భావిస్తాం. కనుక ఈ మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం అంటే దేవతలకు సూర్యోదయం అవడం అన్న మాట. సృష్టిలోని అన్ని జీవులకు జీవశక్తినిచ్చే సూర్యుడు ఉదయించగానే ఎలా చైతన్యం వస్తుందో అట్లానే దేవతలకు పగలు కాగానే చైతన్యం వస్తుందన్న నమ్మకంతో ఉత్తరాయణాన్ని పుణ్యకాలంగా మనం భావిస్తాం. భీష్ముడు కురుక్షేత్ర మహాసంగ్రామంలో పడిపోయినా అంపశయ్య మీద ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తరువాత మాత్రమే తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు కనుక ఈ ఉత్తరాయణ పుణ్యకాలం చాలా మంచిదన్న నమ్మకం భారతీయులందరికీ ఉంది.
అసలీ ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది అన్న నెల రోజుల క్రితమే అంటే ముందుగానే పండుగ నెల ఆరంభమైనట్లుగా భావించి సంక్రాంతికి స్వాగతాలను పలుకుతారు. ఈ పండుగ నెల ఆరంభమైన వెంటనే ధనుర్మాసం కూడా ఆరంభమవుతుంది. ఈ ధనుర్మాసంలో గోదాదేవి రంగనాథుని పూజించడం మొదలై ముప్పై రోజులు ముప్పై పాశురాలను అనుసంధానిస్తూ ‘మార్గళి’ అన్న వ్రతాన్ని ఆచరించి చివరకు భోగి పండుగ నాడు గోదాదేవి శ్రీరంగనాయకులతో వివాహం చేసుకొంటుంది.
ఇది భోగి పండుగనాడు జరిగే వివాహ మహోత్సవం. అంతేకాక పండుగ నెల మొదలుపెట్టిన రోజు నుంచి ప్రతిరోజు ఇంటి ముందర రంగవల్లులను తీరుస్తారు. కొన్ని ప్రాంతాలలో ఆవుపేడను గౌరమ్మగా తీర్చి గొబ్బెమ్మలను పెడతారు. ఆ గొబ్బెమ్మలపైన తంగేడు, గుమ్మడి పూలను అలంకరిస్తారు. ఈ గొబ్బెమ్మలను గౌరీదేవిగా ఆరాధిస్తారు. కనె్నపిల్లలంతా ‘గొబ్బీయలో గొబ్బీయలో’ అని పాడుతూ చుట్టూరా తిరిగి జానపద గీతాలు ఆలపిస్తారు. ఈ భోగి రోజున గొబ్బెమ్మలను పెట్టి సంక్రాంతి ముక్కన పక్కన రోజు ఈ గొబ్బెమ్మలను నదికి తీసుకొని వెళ్లి అక్కడ వాలాడిస్తారు. అక్కడంతా పిల్లలు, పెద్దలు చేరి ఆనందంగా పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. తిరునాళలాగా చేయడం రివాజు. అంతేకాక ఈ వాలాడించడాని కోసం ప్రత్యేకంగా ఆహారాలు అంటే పిండివంటలు, పులిహోర, పెరగన్నాలు.. ఇవన్నీ వండి తెచ్చుకొని వాటిని ఒకరికొకరు పంచుకుంటూ తింటారు. అందరూ ఐకమత్యంతో కలిసి ఉండడం ఇందులో ప్రత్యేకత. భోగి రోజు కొత్త అల్లుళ్లను కూతుళ్లను ఇంటికి పిలుస్తారు. పొద్దునే్న సూర్యోదయానికన్నా ముందు భోగి మంటలు వేస్తారు. వీటివల్ల భోగి పీడ వదులుతుందని నమ్ముతారు. ఈ మంటలో ఎండిన కొబ్బరి తాటి మట్టలను, ఇంట్లో పాడైపోయిన చీపురు, చేటలు లాంటి పాత వస్తువులను పడేస్తారు. ఇలా చేయడం వల్ల ఆ ఇంటికి పట్టిన దోషం పోతుందని నమ్ముతారు. ఆ తరువాత అభ్యంగన స్నానాలు చేసి కొత్తబట్టలు కట్టుకుంటారు.
మూడు రోజుల పండుగ వేళలలో కొత్త పంటలు రైతుల ఇంటికి చేరతాయి. ఆ ఆనందంతో రైతు పౌష్యలక్ష్మిని ఆరాధించడం ఈ పండుగలోని అంతరార్థం. అందుకే ఈ సంక్రాంతి నెల రోజులు జానపద కళాకారులంతా వారివారి కళలను ప్రతి ఇంటి ముందూ లేక ప్రతి వీధి కూడలిలో ప్రదర్శిస్తుంటారు. ఇలా ప్రదర్శించిన కళాకారులకు రైతు తన పంటలో కొంత భాగాన్ని లేక రైతు ఆ ప్రదర్శన వారికి ప్రీతి కలిగించేట్లుగా పంటను వారికి దానం ఇస్తూంటాడు. సంక్రాంతి రోజు లేదు అనకుండా దానం ఇవ్వడం వల్ల దానం తీసుకొన్న వారికి దానం చేసిన వారికి కూడా పుణ్యరాశి పెరుగుతుందని నమ్ముతారు. కొత్త బియ్యంతో పొంగలి వండి పంట పొలాల మీద, ఇంటి మీద చల్లడం వల్ల ఇంట్లోని వారికి దృష్టి దోషం పోతుందని, పౌష్య లక్ష్మి సంతోషించి అనేక వరాలను ఇస్తుందని నమ్ముతారు. ఇలా పర్యావరణాన్ని సంరక్షిస్తారు. వరికంకులను జొన్న కంకులను వాటిక కట్టి పక్షులకు కూడా ఆహారాన్ని ఇవ్వడం సంక్రాంతిలో భాగమే.
సంక్రాంతి తరువాత రోజు కనుమ పండుగ. ఇది పశుల పండుగ. వ్యవసాయానికి ముఖ్య భూమికలైన పశువులను ఆ రోజు కడిగి వాటికి బొట్టు పెట్టి పూజిస్తారు. పశువుల కొమ్ములకు మంచి రంగులు వేస్తారు. ఈ రోజు పొంగలి వండి పశువులకు తినిపిస్తారు.
సంక్రాంతి రోజు, కనుమ రోజు పశువులలో పందాలు కూడా ఆడుతారు. ఎడ్ల పందాలు, కోడి పందాలు కొన్ని చోట్ల ఘనంగా జరుపుతారు.
సంక్రాంతి రోజు మగపిల్లలంతా గాలిపటాలు ఎగురవేసి వారి ఆనందాన్ని తెలుపుతారు. ఈ గాలిపటాలకు దీపాలు అమర్చి రాత్రిపూట కూడా ఎగురవేయడం కూడా సంప్రదాయంగా వస్తున్నదే.
ఇలా మూడు రోజులే కాక నెల రోజుల పండుగ సంక్రాంతి. అందుకే ఇది పెద్ద పండుగగా జరుపుకుంటారు. పిల్లా పెద్దలతోపాటుగా సర్వమానవాళి సంతోషంతో జరుపుకునే పండుగ కనుక ఇది పెద్ద పండుగ. ఈ పండుగలో లేమి అనేది ఎవరికీ ఉండకూడదు అన్నట్లుగా ఉన్నవారు లేనివారికిచ్చి అందరూ కలిమిలేములను మరిచి సంతోషంగా పండుగను జరుపుకోవడం ఈ సంక్రాంతి విశేషం.

-జంగం శ్రీనివాసులు