AADIVAVRAM - Others

జన వనం.. ఏడుపాయల సంబరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాసిన్ని నీళ్లుపోసినా సంతృప్తిచెంది కరుణించేది పరమశివుడు. విభూతితో అభిషేకించినా, మారేడు దళములు సమర్పించినా చివరకు శివా నీవేదిక్కని చేతులు జోడించి కొలిచినా సంతుష్ఠుడవుతాడు సృష్టిలయకారుడు, గంగాధరుడు, గౌరీమనోహరుడు. భక్తులపాలిట కొంగుబంగారమై వారికి సకల సౌకల్యానిస్తాడు బోళాశంకరుడు. ద్వాదశ జ్యోతిర్లింగాలుగా అవతరించినట్లుగానే భక్తుల కోరికల మేరకు వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో అవతరించి భక్తసులభుడిగా మొక్కులు అందుకుంటున్నాడు. ఓం నమః శివాయని ఒక్క దళాన్ని సమర్పిస్తే యముడు సైతం దగ్గరకు రాడని భక్తులు విశ్వసిస్తారు. సదాశివుడిని పరమపవిత్రంగా ఆరాధిస్తూ ఉపవాస దీక్షలతో రాత్రంతా జాగారం చేసే మహాశివరాత్రి వేడుకలకు ఉమ్మడి మెదక్ జిల్లాలో వివిధ నామాలు, రూపాలతో వెలసిన శివాలయాలు ముస్తాబవుతున్నాయి. ఈ నెల 14వ తేదీన మహాశివరాత్రి వేడుకలను పురస్కరించుకుని దక్షిణ కాశీగా ఫరడవిల్లుతున్న ఝరాసంగం కేతకి సంగమేశ్వర ఆలయం, మెదక్ మండలం ముత్తాయికోట సిద్దేశ్వర ఆలయం, పెద్దశంకరంపేట మండల పరిధిలోని కొప్పోలు సంగమేశ్వర ఆలయం, పటన్‌చెరు మండలం బీరంగూడ మల్లికార్జున స్వామి మందిరం, సిద్దిపేట పట్టణంలోని కోటిలింగేశ్వరాలయం, భోగేశ్వరాలయం, శరభేశ్వరాలయం, మార్కాండేయ దేవాలయం, కొమురవెళ్లి మల్లికార్జున మందిరం, హుస్నాబాద్ మండలం పొట్లపల్లి స్వయంభూ ఆలయం, కొహెడలోని శివాలయం, దుబ్బాక నియోజకవర్గంలోని కూడవెళ్లి రామలింగేశ్వర ఆలయం, చౌదరిపల్లి దుబ్బ రాజేశ్వర ఆలయం, చెల్లాపూర్‌లోని సోమేశ్వర మందిరం, రేకులకుంట మల్లికార్జున స్వామి ఆలయం, మిరుదొడ్డి మండలం అందే శివాలయం, తొగుటలోని కోటిలింగేశ్వర మందిరం, ఎల్లారెడ్డిపేటలోని త్రికూటేశ్వరాలయం, కొండపాక మండల పరిధిలోని దుద్దేడలో వెలసిన శంభుని ఆలయం, మర్పడగలోని విజయదుర్సామేత సంతాన మల్లికార్జున స్వామి ఆలయాలను సందర్శించే భక్తుల కోసం దేదీప్యమానంగా ముస్తాబు చేస్తున్నారు. దేశంలోనే భిన్నంగా మహాశివరాత్రి వేడుకల్లో భక్తుల కోటొక్క మొక్కులు అందుకునే అపరశక్తి స్వరూపిణి ఏడుపాయల వనదుర్గా దేవి ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర పురాణాల ద్వారా స్పష్టమవుతోంది.
ఝరాసంగం కేతకి సంగమేశ్వరుడు
పూజకు పనికిరావంటూ తాను శపించిన మొగలి పువ్వుతోనే నిత్య పూజలు అందుకుంటూ దక్షిణ కాశీగా ప్రసిద్దిగాంచిన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం శివరాత్రి వేడుకలకు సిద్ధమవుతోంది. ఇక్కడ బాణాకారంలో పరమ శివుడు వెలిసాడని పురాణాల్లో అనేక రకాలుగా పేర్కొనబడింది. పూజార్హత లేని మొగలి పువ్వుతో సంగమేశ్వరుడికి నిత్యం ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కేతకి అనే అప్సరసను శివుడు శపించాడని, ఓ ముని శపించడం వల్ల మోక్షం కల్పించాలని కేతకి శివుడిని వేడుకోవడం వల్లనే ఇక్కడ సంగమేశ్వరుడుగా అవతరించి మొగలి పువ్వులతో పూజలు అందుకుంటున్నట్లు భక్తులు చెప్పుకుంటారు. కుబేరుడు శాపగ్రస్త రాజుగా కుష్టు రోగంతో జన్మించి వేటకు బయలుదేరి వచ్చి దాహంతో ఇక్కడి ఓ గుంతలో నీరు త్రాగడం వల్ల రోగం మటుమాయం కావడం వల్ల ఇక్కడ మందిరాన్ని నిర్మింపజేసినట్లు మరో కథ ప్రాచుర్యంలో ఉంది. ఆలయానికి వెనుకభాగంలో ఉన్న అమృత కుండంలోకి కాశీ నుండి గంగా అంతర్వాహిణిగా ఓ ధార వచ్చి సంగమిస్తుందని, అందుకే ఈ క్షేత్రాన్ని ఝరాసంగం, దక్షిణ కాశీగా పిలుచుకుంటారని భక్తుల ప్రగాడ విశ్వాసం. ఇక్కడి రాజగోపురంపై నంది, భృంగి, చండీశ్వర శిల్పాలు, పైన ఐదు కలశాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అమృతగుండంలో స్నానం చేస్తే సకల రోగాలు మటుమాయమవుతాయని భక్తుల అపార నమ్మకం. మేలిమి సొగసులు అద్దుకున్న అపురూప శిల్పకళా వైభవం దర్శనమిస్తోంది. సంగమేశ్వర క్షేత్రంలో అణువణువు దైవపుణీతమై వెలుగొందుతుంది. మహాశివరాత్రితో పాటు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో భక్తజన సందడి నెలకొంటుంది. ప్రతి అమావాస్య రోజున భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామి వారి సన్నిధిలో తరిస్తారు. శివుడికి అత్యంత ప్రీతికరమైన సోమవారం కూడా ఇక్కడ భక్తుల సందడి కనిపిస్తుంది. ముక్కుకు ముక్కెర, మెడలో తాళిబొట్టు, ఎర్రని తిలకం నుదుట దిద్దుకుని దక్షిణ ముఖంతో పరమేశ్వరి దర్శనమిస్తోంది. అమ్మవారికి ఎదురుగా బాణాలింగాకారంలో వెలసిన సంగమేశ్వరుడిని శ్రీశైలంలో మల్లికార్జున స్వామి లింగానికి తలతో స్పర్శించి దర్శించుకున్నట్లుగానే ఇక్కడ కూడా భక్తులు దర్శనం చేసుకుంటారు. శంకరుడికి నమ్మిన బంటుగా ఉండే నందీశ్వరుడికి భక్తులు వినతులు చేసుకుంటారు. వినాయకుడు, అతిబలశాలియైన హనుమ, గ్రహరాజులైన నవగ్రహాలు ఉప ఆలయాలుగా భక్తుల మొక్కులు అందుకుంటున్నారు. పానవట్టం నుండి విడిగా ఉన్న లింగాన్ని చేతి వేళ్లతో పైకెత్తితే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. జంగమార్చకుల వేదమంత్రాలతో శైవాగమన సంప్రదాయ పద్ధతిలో పరమేశ్వరుడు నిత్య పూజలు అందుకొంటూ అలరారుతున్నాడు. ఇక్కడి ఉత్సవాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్టల్ర నుండి వేలాదిగా భక్తులు తరలివస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓం నమః శివాయచ...శివ తరాయచా అంటూ శివపంచాక్షరి నామం ఝరాసంగం క్షేత్రంలో భక్తుల మదిలో మారుమ్రోగనుంది.
కొండదేవతగా వనదుర్గ..
ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్దిగాంచిన దేవాలయాల్లో అత్యంత ప్రాముఖ్యమైంది. మంజీరా నది ఒడ్డున వెలసిన ఈ ఆలయానికి ఘనమైన చరిత్ర ఇమిడి ఉంది. సుమారు 800 సంవత్సరాల క్రితం ఆలయం వెలసినట్లు ఇక్కడి చరిత్ర ద్వారా అవగతమవుతుంది. కీకారణ్యంలో గంగా, యుమున, గోదావరి, కృష్ణ, నర్మద, సింధూ, బ్రహ్మపుత్ర అనే పేర్లతో ఏడుపాయలుగా చీలి ప్రవహించే మంజీరను గరుడగంగ అని కూడా పిలుస్తారు. త్రేతాయుగంలో శ్రీ వేదవ్యాస, వశిష్ఠ, వాల్మీకి, శైనక, భృగాధి మహర్షుల నివాస యోగ్యమైన నైమిశారణ్యం పోలిన గొప్ప దండకారణ్యం. ద్వాపర యుగంలో అర్జునుడి కుమారుడైన పరిక్షిత్ మహారాజు వేట కోసం ప్రస్తుత అమ్మవారు దుర్గ్భావాని వెలసిన ప్రాంతానికి రాగా తీవ్రమైన దాహం వేసింది. సమీపంలో ఒక ఋషి ఆశ్రమం ఉండటంతో అక్కడికి వెళ్లగా, తపోధ్యానంలో నిమగ్నమై ఉన్న ఒక ముని కనిపించాడు. పరిక్షిత్ మహారాజు దాహం తీర్చమని ఆ సాధువును కోరినా, కఠోర తపస్సులో ఉన్న రుషిపుంగవుడు వినిపించుకోలేదు. ఎన్నో సార్లు పలుకరించే ప్రయత్నం చేసినా మునిలో చలనం లేకపోవడంతో కోపం వచ్చిన పరిక్షిత్ మహారాజు అవమానంగా భావించాడు. సమీపంలో విగతజీవిగా పడివున్న పామును తెచ్చి తపస్సులో ఉన్న ముని మెడలో వేసి తన రాజ్యానికి వెళ్లిపోయాడు. కాసేపటికి తపోనిష్ఠ నుండి బయటకు వచ్చిన మునీశ్వరుడు ఈ చేష్టకు ఆగ్రహించి తనపై ఈ చర్యకు ఉపక్రమించిన వ్యక్తి ఏడు రోజుల్లోగా పాము కాటుకు గురై మరణించాలని శపించాడు. ముని శాపగ్రస్తుడైన పరిక్షిత్ మహారాజు ఏడు రోజుల వ్యవధిలో పాముకాటుతో మరణించాడు. తన తండ్రి మరణానికి కారణం తెలుసుకున్న పరిక్షిత్ కుమారుడు జనమేజయుడు సర్పజాతిని అంతించేందుకు ఉపక్రమించాడు. ఈ నేపథ్యంలోనే ఏడుపాయల సమీపంలో సర్పయాగానికి శ్రీకారం చుట్టాడు. ఈ యాగంలో సర్పాలన్ని ఒక్కొక్కటిగా ఆహుతి అవుతుండటం భరించలేక నాగుల తల్లి కదృహ కుమిలిపోతుంది. ఆమె బాధను చూడలేని సవతి వినుత ఓదార్చి మహాబలవంతుడైన తన కుమారుడు గరుత్మంతుడిని పిలిచి నాగ కులాన్ని రక్షించాల్సిందిగా ఆజ్ఞాపిస్తుంది. తల్లి ఆనతి మేరకు గరుత్మంతుడు గంగాదేవి వద్దకు వెళ్లి తన తమ్ముళ్లను యాగం నుండి మోక్షం కల్పించాలని వేడుకుంటాడు. గరుత్మంతుని కోరికను మన్నించిన గంగాదేవి తన కాలి అందె (మంజీర)ను ఇస్తుంది. గరుత్మంతుడు ఆ అందెను తీసుకుని వస్తుండగా అది మహారాష్టల్రోని బీడ్ జిల్లా బాలాగాట్ కొండల (బాలాది పర్వతం) వద్ద పడి జలమయం అవుతుంది. నీటిలో పడిన అందె కోసం గరుత్మంతుడు వెతుకుతుండగా- నీవుపైనుండి వెళుతుంటే అందె నీవెంట పరుగులు పెడుతుందని ఆకాశవాణి పేర్కొంటుంది. అప్పుడు గరుత్మంతుడు మంజీరను సర్పయాగ ప్రాంతం వరకు తీసుకువచ్చి సప్తరుషుల పేర్లతో ఏడుపాయలుగా చీలుస్తాడు. దీంతో మంజీర మొత్తం సర్పయాగాన్ని తడిపి పరిసమాప్తం చేసి నాగులకు మోక్షం కల్పిస్తుంది. యాగాన్ని నిలిపివేయడానికై సర్పజాతి పితామహుడైన వాసుకి కోరిక మేరకు వనదుర్గ భవానీ మాత స్వయంభూగా ఏడుపాయల సమీపంలో ఓ రాతి గుహలో వెలిసింది. మంజీర నది అమ్మవారి పాదలను స్పృశిస్తూ ప్రవహిస్తోంది. సర్పయాగానికి సంబంధించిన బూడిద (విభూతి) నేటికి లభ్యమవుతోంది. భక్తుల కోరిన కోర్కెలను తీరుస్తూ వెలసిన వనదుర్గాదేవికి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మహోత్సవాలు అట్టహాసంగా కొనసాగుతాయి. సాధారణంగా మహారాత్రి పర్వదినం రోజున పరమశివుడిని పూజించే ఆనవాయితీ ఉన్నా, అమ్మవారికి మాత్రం ఇక్కడ ఉత్సవాలు కొనసాగడం దేశంలోనే అరుదైన సందర్భం అని చెప్పవచ్చు. వనదుర్గ పేరుతో ప్రపంచంలో రెండే రెండు దేవాలయాలు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. ఒకటి జమ్ము- ాశ్మీర్‌లో ఉండగా, రెండవది ఏడుపాయల వనదుర్గా దేవి ఆలయంగా ప్రసిద్ధి చెందినట్లు ప్రపంచ పర్యాటక శాఖ ఇటీవల ధ్రువీకరించింది. ఏడుపాయల పరిసర ప్రాంతాల్లో శివాలయం, సాక్షి గణపతి ఆలయం, గంగా భవాని, ముత్యాలమ్మ, ఎల్లమ్మ మందిరం, అమ్మవారి ఆలయానికి వెనుకబాగంలో మునిపుట్ట, మురళీకృష్ణ దేవాలయాలు వెలిశాయి. అమ్మవారి ఆలయం ముందుభాగంలో సంతాన గుండం ఉంది. ఈ గుండంలో దంపతులు పుణ్యస్నానాలు చేస్తే సంతాన ఫలం ఖాయమన్న విశ్వాసం నెలకొంది. ఏడుపాయల జాతరలో తెలంగాణ జానపద జీవన సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెబుతూ విశిష్ట జానపద వేదికగా ఖ్యాతినార్జించింది. కోరికలు తీర్చే కొండ దేవతగా, కష్టాలు తీర్చే కరుణామయిగా భక్తజన కోటితో దుర్గామాత సుమారు వెయ్యి సంవత్సరాల నుండి జేజేలు అందుకుంటోంది. ఒకప్పుడు మహాశివరాత్రికే భక్తులు కనిపించే వారు. ప్రస్తుతం రవాణా సౌకర్యం, ఇతర సదుపాయాలు మెరుగుపడటంతో నిత్యకల్యాణం, పచ్చతోరణంలా ఫరడవిల్లుతోంది. మాఘమాసంలో భక్తులు మంజీరా నదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, కార్తీక మాసంలో లక్ష కార్తీక దీపోత్సవం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. డప్పు చప్పుళ్లకు దీటుగా దరువేస్తూ శివసత్తుల పూనకాలు, పోతరాజుల కొరడా విన్యాసాలు, బోనాల ఊరేగింపులతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. మహాశివరాత్రి వేడుకల్లో ఏడుపాయల్లో నిర్వహించే ఎడ్లబండ్ల ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకోవడం ప్రత్యేకత. వేసవి కాలం వచ్చిందంటే పర్యాటకులకు ఏడుపాయల దివ్యక్షేత్రం ఓ ప్రత్యేక విడదిగా మారనుంది. ప్రతి ఆదివారం వేల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారి సేవలో నిమగ్నమవుతారు. అమ్మను భక్తితో పూజించి ఆశిస్సులు పొందిన తన్మయత్వంలో విందులు కూడా అదే స్థాయిలో నిర్వహించుకుంటారు. ఏడుపాయల అమ్మ ఆశీర్వాదాలు పొందడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, ఒడిశా, చత్తీస్‌గఢ్, బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుండి లక్షలాదిగా తరలివస్తారు. ఆదిపరాశక్తి అయిన ఏడుపాయల వనదుర్గను కొంగుబంగారంగా కొలుస్తున్న భక్తులకు ఆ పరమశివుడు కూడా ఆశీస్సులు అందజేస్తాడని పెద్దలు చెబుతుంటారు.

-తమ్మలి మురళీధర్