AADIVAVRAM - Others

శరణువేడితే.. అభయ ప్రదానం (రాస క్రీడాతత్త్వము-16)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

19 శ్లోకాలు గల ఈ చిన్న గోపికాగీతకు చాలా విస్తారమైన వ్యాఖ్యానాలు ఉన్నప్పటికీ, సంగ్రహ తాత్పర్యం మాత్రమే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం.
గోపికలు గానం చేసే మధుర గీతానికి గల పూర్వాంగాన్ని ప్రధాన గ్రంథంలోనే మనం వివరించుకొని వున్నాం కనుక, దానిని పునరుక్తి చేయకుండా సూటిగా గీతాలలోనికి వెళ్ళిపోదాం.
జయతి తేధికం జన్మనా వ్రజ
శ్శ్రయత ఇందిరా శశ్వదత్ర హి
దయిత! దృశ్యతాం దిక్షు తావకా
స్త్వయి ధృతాసవస్త్వాం విచిన్వతే ॥

1
(తా॥ ఓ ప్రియా! నువ్వు జన్మించిన దగ్గరనుంచీ మా గోకులం స్వర్గం కంటే కూడా సర్వోన్నతంగా వుంది. ఎందుకంటే, లక్ష్మీదేవి ఇక్కడే శాశ్వతంగా నిలిచి వుండిపోతోంది. కానీ, ఈనాడు నీ కోసం ప్రాణాలు బిగబట్టుకొని వున్న నీ దాసీలంతా నీ కోసం నలు దిక్కులా వెతుకుతున్నారు. దయచేసి వారి వంక చూడు.)
శరదుదాశయే సాధుజాత స
త్సరసిజోదర శ్రీముషా దృశా
సురతనాద! తే-శుల్కదాసికా
వరద నిఘ్నతో నేహ కిం వధః ॥
2
(తా॥ ఓ ఆనందదాయకా! అందరికీ వరాలు ఇచ్చే స్వభావం నీది. మేము నీకు జీతం లేని దాసీలం. మమ్మల్ని మాత్రం నువ్వే నీ చూపులతో చంపేస్తున్నావు. ఎటువంటి చూపులవి? శరత్కాలంలో సరస్సులలో చక్కగా వికసించిన పద్మాల బొడ్డులలోని సౌందర్యం మొత్తాన్ని దొంగిలించి, రంగరించుకున్న చూపులవి. ఓ వరదాయకా! అలా చూపులతో మమ్మల్ని పొడిచి చంపితే అది హత్య కాదా?)
విషజలాప్యయాత్ వ్యాలరాక్షసాత్
వర్షమారుతాత్ వైద్యుతానలాత్
వృషమయాత్మజాత్ విశ్వతో భయాత్
ఋషభ! తే వయం రక్షితా ముహుః ॥
3
(తా॥ ఓ పురుషశ్రేష్ఠా! నువ్వు మానవమాత్రుడవని మేము అనుకోవడం లేదు. ఎందుకంటే, కాళీయసర్పంవల్ల యమునానదీ జలం విషమయం అయిపోతే, ఆ విషప్రమాదం నుంచి నువ్వే గోకులాన్ని రక్షించావు. అఘాసురుడు అనేవాడు కొండచిలువ రూపంలో వచ్చి మీద పడితే, నువ్వే రక్షించావు. దేవేంద్రుడు గాలి వాన గుప్పిస్తే, గోవర్ధనపర్వతం ఎత్తి, నువ్వే మమ్మల్ని రక్షించావు. పిడుగు మా ఊరి మీద పడితే, దానిని కూడా నువ్వే ఆపావు. వృషభాసురుడి పీడనుంచి నువ్వే రక్షించావు. మయాసురుడి పుత్రుడైన వ్యోమాసురుడినుంచి కూడా నువ్వే మమ్మల్ని రక్షించావు. నువ్వు మానవమాత్రుడివైతే ఇవన్నీ సాధ్య మవుతాయా?)
న ఖలు గోపికానందనో భవాన్
అఖిల దేహినామంతర్మాదృక్
విఖనసా-ర్థితో విశ్వగుప్తయే
సఖ! ఉదేయివాన్ సాత్వతాం కులే ॥
4
(తా॥ హే సఖా! నువ్వు మా గోపికలలో ఒకత్తె అయిన యశోదకు పుత్రుడవు కాదు. మామూలు దేవతవు కూడా కాదు. సమస్త జీవులలోని చిత్త ప్రవృత్తులు అన్నిటికీ సాక్షివైన పరమాత్మవే నువ్వు. బ్రహ్మదేవుడు ఈ లోకాన్ని రక్షించడం కోసం నిన్ను ప్రార్ధించడం వల్ల, నువ్వు ఈ యాదవుల వంశంలో అవతరించావు.)
విరచితాభయం వృష్ణ్ధిర్య! తే
చరణమీయుషాం సంసృతేర్భయాత్
కరసరోరుహం కాంత కామదం
శిరసి ధేహి న శ్రీ్శకరగ్రహమ్ ॥
5
(తా॥ ఓ యదువంశశ్రేష్ఠా! సంసారం బంధాల వల్ల భ యపడ్డవారు నీ పాదాలను శరణువేడితే, వారికి నువ్వు అభయ ప్రదానం చేస్తూ వుంటావు. అటువంటి నీ చేయి సాక్షాత్తుగా లక్ష్మీదేవిని పట్టుకొని వుంటుంది. అలాంటి ఆ చేయి కోరినవారి కోరికలన్నీ తీరుస్తూ వుంటుంది. హే ప్రియా! అటువంటి నీ కరపద్మాన్ని మా శిరస్సుల మీద వుంచి, శక్తిపాతం చేయి. మేము కోరేది ఇంతే.)
వ్రజజనార్తిహన్! వీర! యోషితాం
నిజజనస్మయధ్వంసనస్మిత
భజ సఖే! భవత్ కింకరీస్స్మ నో
జలరుహాననం చారు దర్శయ ॥
6
(తా॥ ఓ వీరా! మా గోకులం వారి కష్టాలన్నీ పోగొట్టేది నువ్వే. మేము నీ వాళ్ళమే. కానీ, నీ వాళ్ళలో ఎవరికైనా గర్వం కలిగితే నువ్వు దాన్ని నవ్వుతూ, నవ్వుతూనే ధ్వంసం చేసివేస్తావు. అందుకే ఇప్పుడు నువ్వు మాయమైపోయావు. కానీ, ఓ ప్రియా! మేము నీకు దాసీలం. అందుకని మమ్మల్ని ఆదుకో. సుందరమైన నీ ముఖపద్మాన్ని మాకు చూపించు.)
ప్రణతదేహినాం పాపకర్శనం
తృణచరానుగం శ్రీనికేతనమ్
ఫణిఫణార్పితం తే పదాంబుజం
కృణు కుచేషు నః కృంధి హృచ్ఛయమ్ ॥
*
(ఇంకా వుంది)
*
రాసక్రీడ శృంగారం కాదా?.. - కుప్పా వేంకట కృష్ణమూర్తి.. ఎమ్మెస్కో ప్రచురణ.. ప్రతులకు- 1-2-7, భానుకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమల్‌గూడ, హైదరాబాద్-29. మరియు అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో..

- కుప్పా వేంకట కృష్ణమూర్తి 9866330060