AADIVAVRAM - Others

పేదల తిరుపతి మన్యం కొండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజాపూర్ మరియు హైదరాబాద్ ప్రాంతాలకు సుబేదార్ అయిన నిజాం రాజు బిక్ష్ ఖాన్ 18వ శతాబ్దం ప్రారంభంలో (1706) హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాడు. అప్పుడు మహబూబ్‌నగర్ జిల్లా నిజాం పాలనలోకి వెళ్లింది. ఈ ప్రాంతాన్ని పరిపాలించిన మహబూబ్ ఖాన్ రాజు మూలంగా మహబూబ్‌నగర్‌గా పేరు వాడుకలోకి వచ్చిందని విశ్వాసం.
1847 చ.కి.మీ. వైశాల్యం కలిగిన మహబూబ్ నగర్ జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 40,53,028 జనాభా కలదు. మహబూబ్ నగర్ జిల్లాకు సరిహద్దులుగా తూర్పున నల్గొండ, పశ్చిమాన కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా, దక్షిణాన కర్నూలు మరియు ఉత్తరాన రంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి.
మన్యం కొండ అనే ప్రాంతం మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రముఖమైన దర్శనీయ కేంద్రంగా పేరొంది, జిల్లాలోని దర్శనీయ కేంద్రాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ మన్యం కొండలో జిల్లా ప్రజల ఇలవేల్పుగా కొలువబడే శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం కొలువైంది. దీనినే ద్వితీయ తిరుపతి అనీ, పేదల తిరుపతి అనీ వ్యవహరిస్తారు. ఆపదలో ఉన్న ప్రజలను కాపాడుతుందని, భక్తుల కోరికలను తీరుస్తుందని ప్రజలు విశ్వసిస్తారు.
మన్యంకొండ క్షేత్ర మహాత్మ్యము
ప్రకృతి సిద్ధమైన కొండలపైన గుహలలో కొంతమంది మునీశ్వరులు భక్తులను అనుగ్రహించడానికి లోక కళ్యాణార్థమై తపస్సు చేస్తుండగా ఈ యుగారంభంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఆది శేషావతార రూపంలోగల రాతి గుహలలో స్వయం వ్యక్తమై (వెలసి) యున్నారు. మహానుభావులైన సిద్ధ పురుషులు, మునీశ్వరులు తపస్సు చేయడం వలన మునులకొండగా వాడుకలోకి వచ్చి కాలక్రమేణా మన్యంకొండగా రూపాంతరం చెంది ఆ పేరుతోనే పిలువబడుతోంది.
భాగవతోత్తములు
మన్యంకొండపై ఎందరో మహానుభావులు తపస్సిద్ధులైనారు. కొందరు పూర్వజ్ఞాన సంపన్నులు కూడా ఉన్నారు. భజన చేయు వారిని చూశారని, ఇటువంటి మహానుభావులలో నరసింహ యోగి, ఎత్తెపు రామయోగి, కాశీ రాములు, వీరప్పయ్య, హనుమద్దాసులు మొదలైన పూర్వజ్ఞాన సంపన్నులు తపస్సు చేసిన గుహలు ఇప్పటికీ కలవు. ఇందులో ముఖ్యులు ఎత్తెపు రామయోగి మరియు హనుమద్దాసులు.
మన్యంకొండలో వివిధ ప్రముఖ దర్శనీయ స్థలాలు కనీవినీ ఎరుగని స్థితిలో దర్శనమిస్తాయి. అందులో కొన్నింటిని ఈ కింది విధంగా పేర్కొనవచ్చు.
1.చెయ్యని పాదములు
2.తవ్వని కోనేరు
3.కట్టని గుడి
4.ఉలి ముట్టని స్వామీ
కొండపై మనుషులు చెయ్యని పాదాలు ఏర్పడ్డాయి. బండ త్రవ్వకుండానే కోనేరు ఏర్పడింది. పెద్దపెద్ద నాలుగు బండలలో మనుషులు కట్టని గుడి ఏర్పడింది. శిలపై మనుషులు చెక్కకుండానే స్వామివారి ప్రతిమ ఏర్పడింది.
అళహరి వంశీయుల కృషి
శ్రీరంగం సమీపంలో గల అళహరి గ్రామ నివాసి అళహరి కేశవయ్య కలలో శ్రీ శ్రీనివాసుడు దర్శనమిచ్చి కృష్ణానదీ తీర ప్రాంతంలో గల (మునులకొండ) మన్యం కొండపై నేను వెలసి యున్నాను. నువ్వు వెంటనే వెళ్లి నిత్య విధి సేవా కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా ఆదేశించి అదృశ్యమయ్యెను. అళహరి కేశవయ్య మేల్కొని స్వామి వారి ఆజ్ఞ ప్రకారం వెంటనే కుటుంబ సమేతంగా మన్యంకొండ సమీపంలోని కోట కదిరి గ్రామం వచ్చి స్థిరపడి కొండపైన గల స్వామివారికి సేవ చేయడం ఆరంభించారు. అళహరి కేశవయ్య కూడా దక్షిణాదిలో గల అన్ని దివ్య క్షేత్రాలు దర్శించి తరించిన మహానుభావుడు. ఒకానొక రోజు సమీపంలో గల కృష్ణా నదిలో స్నానం చేస్తూ గొంతు వరకు నీటిలో ఉండి, సూర్య భగవానునికి దోసిటిల అర్ఘ్యం వదులుచున్న సమీపంలో చెక్కని శిలారూపంలో గల శ్రీ వేంకటేశ్వర స్వామీ ప్రతిమ నదిలో అలల ద్వారా వచ్చి, కేశవయ్య దోసిలిలో నిలిచెను. నదిలో నుండి వచ్చి దోసిలిలో నిలిచిన విగ్రహాన్ని పరిశీలించగా, శ్రీ శ్రీనివాసునిగా గుర్తించి స్వామి ప్రతిమను తీసుకువచ్చి మన్యంకొండపై శేష సాయి రూపంలోగల గుహలో ప్రతిష్ఠించి, నిత్య ధూప దీప నైవేద్యాలతో స్వామిని ఆరాధించి సంతసించాడు. స్వామి ముందుగల మండపంలో ఆంజనేయ, గరుడాళ్వారు విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ కొండపై శివకేశవులకు ఎలాంటి భేదము లేదు. కేశవుడు సహస్ర శిరస్సులు గల శేషాద్రిపై శ్రీ లక్ష్మీదేవి సమేతంగా వెలయగా, శివుడు పార్వతీదేవీ సమేతుడై హిమగిరుల యందు వెలసినట్టు తెలియుచున్నది.
క్షేత్ర పాలకుడు వీరభద్ర స్వామి సన్నిధిలో స్వామివారి పాదాలు, మునుల కొండ, జువి తీర్థములు, సందిదోన మునుల గుహలు చూడవచ్చు. శ్రీ రామయోగి చెప్పిన గుర్తుల ఆధారంగా హనుమదాసుల వారు జన్మించారు. వారికీ మైసూరు లక్ష్మాంబచే గురూపదేశం జరిగింది. తర్వాత హనుమద్దాసుల వారికీ భద్రాచలంలో శ్రీరాముల వారి సన్నిధిలో రామతారక ఉపదేశం జరిగింది. ప్రహ్లాదుని లక్షణాలు కలిగియుండి భగవంతుని యందు భక్తితో దినదినాభివృద్ధి చెందాడు. స్వామి వారిని అనేక విధములుగా కీర్తించాడు. శ్రీ హనుమద్దాసుల వారు కీర్తించి పాడిన భజన కీర్తనల పుస్తకం అచ్చువేయబడి పామర జనులు పఠించి కీర్తించుటకు అందుబాటులో కలదు.
వారు వాడిన ‘తంబూర’ స్వామి సన్నిధిలో ఉంది. శ్రీ హనుమద్దాసుల వారు, స్వామి ఆజ్ఞ మేరకు మన్యంకొండను రెండవ తిరుపతిగా ప్రచారం చేసి భక్తుల హృదయాలలో భక్తి విశ్వాసములు పెంపొందించాడు.
అభిషేకం గురించి కోనేరు త్రవ్వగా కోనేరులో బండ పడింది. ఒంటికాలిపై ఏక దీక్షతో భజన చేయగా బండ పగిలి నీరు ఉద్భవించింది. తర్వాత అళహరి రామయ్య వంశపారంపర్య ధర్మకర్తగా దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేశాడు. ఆగమ శాస్త్ర ప్రకారంగా దేవాలయ రాజ్య గోపురం, ప్రహరీ గోడలు, యాత్రికులు బస చేయుటకు సత్రములు నిర్మించారు. మంచినీటి వసతి, విద్యుత్ దీపాలంకారం భక్తులు దేవాలయానికి సునాయాసంగా వాహనములపై, కాలి నడకన చేరుకొను నిమిత్తము మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ వారి సహకారంతో ఘాట్ రోడ్డు వేయించారు.
హనుమద్దాసుల వారి ఆజ్ఞ మేరకు దిగువ కొండలో అలివేలు మంగమ్మ ఆలయం కట్టించారు. స్వామివారి స్వప్న ఆజ్ఞ మేరకు ఉత్సవమూర్తులను తిరుపతి నుండి తీసుకొని వచ్చారు. స్వామి వారికి వెండి, బంగారు ఆభరణములు మరియు ఆరాధన పాత్రలు చేయించారు. వారి కుమారుడైన నారాయణ స్వామి వంశపారంపర్య ధర్మకర్తగా దేవాలయ అభివృద్ధికి పాటుపడుతునానరు. ఈ విధంగా ఏడు తరాలుగా అళహరి వంశీయులు స్వామివారి సేవలో తరిస్తున్నారు.

-డా. పోలం సైదులు 94419 30361