AADIVAVRAM - Others

ఆదివాసీ సంస్కృతికి నిలువెత్తు సాక్ష్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో అనేక గిరిజన తెగలున్నాయి. అందులో చిత్రకళతో బలమైన సంబంధాలు గలవి గోండు, నాయక్‌పోడ్, కోయ తెగలు. ఒక్కో తెగ ఒక్కో రకమైన ‘వస్తువు’ను తీసుకోవడంలో నైపుణ్యం ప్రదర్శించేవి. ‘్భన్నత్వంలో ఏకత్వం’ చందంగా అడవి జీవితం.. అందాలు.. శ్రమ.. సంస్కృతీ సంప్రదాయాలు, దేవుళ్లు, ఉత్సవాలు.. ఇలా అనేకం వారి చిత్రకళలో దర్శనమిస్తాయి. ఆ చిత్రకళలో అమాయకత్వం, నిర్మలత్వం, నిజాయితీ, నిండుదనంతో పాటు తరతరాలుగా వస్తున్న ‘శైలి’ కనిపిస్తుంది. ఆ ‘శైలి’ మైదాన ప్రాంత చిత్రకారులకు అబ్బడం కష్టం. అందుకే ఆయా గిరిజన తెగల యువత తమ సృజన శక్తిని, దేశీరంగుల నాణ్యతను, తమకే ప్రత్యేకమైన ‘లైన్’ (రేఖలు)ను లోకానికి చాటుతోంది. విశేషమేమిటంటే... కేవలం చిత్రకళనే కాక ‘మాస్క్’లను రూపొందించి, వాటికి సజీవ రంగులద్ది దైవత్వం తీసుకురావడం వారికే చెల్లింది.
నాయక్‌పోడ్ గిరిజన తెగకు చెందిన పసుల అంజన కుమార్ అద్భుతమైన మాస్క్‌లను రూపొందించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. తమ తెగకు చెందిన అద్భుత కళను లోకానికి పరిచయం చేస్తున్నారు. కర్రతో, పేపర్‌మెష్‌తో తయారుచేసే ఈ మాస్క్‌లు గంభీరంగా తమ తెగ దేవుళ్లుగా భావించే మూర్తులను ఆయన ఎంతో నైపుణ్యంతో చిత్రిక పట్టారు. చూడ్డానికి తల భాగమే (మాస్క్) అయినా అందులో అపురూపమైన వైవిధ్యం కనిపిస్తోంది. సాంబమూర్తి అనే తమ దేవుని బొమ్మ (మాస్క్)ను తిలకిస్తే ఆ వైచిత్రికి విభ్రమ చెందుతాం. శివుడి రూపం గిరిజనుల దృష్టి కోణంలో ఎలా ఉంటుందో ఈ మాస్క్ పట్టి చూపుతుంది. మైదాన ప్రాంత చిత్రకారులు వేసే శివుని బొమ్మల్లో శివునికి మీసాలు కనిపించవు. వీరు వేసే చిత్రాల్లో గంభీరమైన మీసాలు, పౌరుషానికి చిహ్నంగా కనిపిస్తాయి. అంతేనా?... కాదు చిన్న ‘గడ్డం’ కూడా కనిపిస్తుంది. నుదుటి విభూతి రేఖలు మధ్యన బొట్టు, తలపై భారీ కిరీటం లాంటి తొడుగు.. దానిపై సర్పాలు, రకరకాల అద్భుత రంగులతో తీర్చిదిద్దిన అలంకరణ, కంఠానికి ఓ అపురూప ఆభరణం, చెవులకు సైతం ఆకర్షణీయ ఆభరణాలు. మొత్తం మీద విలయమూర్తి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మెడ నుంచి తల వరకే కనిపించే ఈ మాస్క్ కేవలం గిరిజన చిత్రకారులు మాత్రమే ఊహించి వేయగలరనిపిస్తుంది. ఎంతో నైపుణ్యం, అనుభవం, ఆలోచన ఉంటే తప్ప అది ఆకృతి దాల్చదనిపిస్తుంది. ఇలాంటి మాస్క్‌లను అంజన కుమార్ అతి సులభంగా వేసి అందరినీ అబ్బురపరుస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలం మాగారం గ్రామంలో 1990 సంవత్సరంలో నాయక్‌పోడ్ తెగలో పుట్టిన పసుల అంజనకుమార్ పాల్వంచలో ఆశ్రమ పాఠశాలలో చదువుకున్నారు. పాఠశాల రోజుల నుంచే బొమ్మలు వేసే అలవాటు అబ్బింది. తన తండ్రి పసుల బుచ్చయ్య స్వతహాగా చిత్రకారుడు కావడంతో అంజనకుమార్ తన తండ్రిని అనుకరిస్తూ బాల్యం నుంచే చిత్రరంగం పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. సీనియర్ చిత్రకారుడు బుచ్చయ్యకు పాల్వంచలో ఓ దుకాణం ఉండేదట. అక్కడ చాలామందికి ‘పొట్రేట్స్’ వేసి ఇచ్చేవాడట. అలాగే తమ గిరిజన సంప్రదాయ బొమ్మలు వేసేవాడని మాస్క్‌లను తయారుచేసేవాడని అంజనకుమార్ అంటున్నారు.
అలా స్వయంకృషితో చిత్రాలు గీయడం, కర్రతో, పేపర్‌మెషన్‌తో మాస్క్‌లు తాను తయారుచేయడం నేర్చుకున్నానంటున్నారాయన.
సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసిన అంజనకుమార్ కంప్యూటర్‌పై 3డి బొమ్మలు గీయగలనని, అలాగే కాన్వాస్‌పై ‘కలర్ డెప్త్’తో త్రీ డైమెన్షన్ ఎఫెక్ట్ తీసుకురాగలనని చెబుతుంటే అంజనకుమార్ ఓ నాయక్‌పోడ్ యువకుడిగా కాక అద్భుత జ్ఞాన సంపద గల మైదాన ప్రాంత విద్యావంతుడిగా అగుపిస్తాడు. టాలెంట్ ఎవడబ్బ సొమ్ము కాదన్న ఓ సినిమా పాటను అంజనకుమార్ మా టలు జ్ఞాపకానికి తెస్తాయి.
ప్రస్తుతం ఓ ప్రైవేట్ నిర్మాణరంగ సంస్థలో సైట్ ఇంజనీర్‌గా పని చేస్తూ గిరిజన సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న ఆర్ట్ క్యాంప్‌లకు ఆయన హాజరవుతున్నారు. తమ సంస్కృతిని తెలిపే చిత్రాలతో, ముఖ్యంగా మాస్క్‌లతో అందరినీ ఆకర్షిస్తున్నాడు. చిత్రకళా రంగంలో ‘ఆఫ్రికన్ మాస్క్’ అత్యంత పురాతనమైనదని భావిస్తారు. నాయక్‌పోడ్ సంప్రదాయంలో అంజనకుమార్ తయారుచేసే మాస్క్‌లు ఆ పరంపరను కొనసాగిస్తున్నారనిపిస్తోంది. నాయక్‌పోడ్ గిరిజన తెగ చరిత్రను ‘తోటీస్’ అనే ఆశ్రీత తెగవాళ్లు పటం కథరూపంలో చెబుతారు. ఆ ‘పటం’లోనూ చిత్రకళ బలంగా తొంగిచూస్తుంది. పాండవులకు - నాయక్‌పోడ్‌లకు సంబంధముందనీ, భీముడిని పెళ్లాడిన హిడింబి నాయక్‌పోడ్ తెగకు చెందినదేనని వీరు విశ్వసిస్తున్నారు. ఆ మేరకు పటం కథను రసరమ్యంగా చెబుతూ ఉంటారు.
భీముడిని దేవుడిగా పూజించడంతోపాటు కాకతీయుల కాలంలో రాచకొండ రాజ్యాన్ని పాలించిన తమ తెగవాడైన సింగబోయడిని సైతం వీరు ఆరాధిస్తారు. మొత్తం పదిమంది దేవుళ్ల కర్రబొమ్మలను ఈ తెగవారు రూపొందిస్తారు. ఒకదానికొకటి ఏ మాత్రం సంబంధం లేని విధంగా అవి రంగుల్లో దర్శనమిస్తాయి. దాంతో వారి కళాకౌశలం ఎలాంటిదో తేటతెల్లమవుతోంది. కొమ్మచెక్కితే బొమ్మరా.. ఆ బొమ్మనే అమ్మరా.. అన్న చందంగా వారు దేశీ రంగులతో తీర్చిదిద్దిన ఆ బొమ్మలను ఇప్పటికీ పూజిస్తున్నారు. రంగులు, రేఖలు, బొమ్మలు నాయక్‌పోడ్‌ల జీవితంలో అంతర్భాగమని అర్థమవుతోంది.
కోయల జీవితాన్ని చిత్రిస్తున్న నవీన్
ఇక కోయల చిత్రకళ మరో రకమైనది. విభిన్నంగా కనిపిస్తుంది. కోయ చిత్రకళను వర్తమాన ప్రపంచానికి వట్టె నవీన్ పరిచయం చేస్తున్నారు. గిరిజన తత్వం ఆయన బొమ్మల్లో ద్యోతకమవుతోంది. ఓ మట్టి పాత్రపై మినియేచర్ పద్ధతిలో మొత్తం అడవిలోని జీవులను ఆయన చిత్రిక పట్టారు. అలాగే వివిధ ప్రాణులతో పాటు వ్యవసాయ పరికరాలు, పశువులు అక్కడ దర్శనమిస్తాయి. గిరిజన తెగ ప్రపంచాన్ని మినియేచర్ బొమ్మల్లో చూపడం కోయ తెగ చిత్రకళ ప్రత్యేకతగా కనిపిస్తోంది. ఎద్దు కొమ్ములు, నెమలి ఫించాలు గల పగిడీ ధరించి నృత్యాలు చేసే బొమ్మలు సైతం కనిపిస్తాయి. ఆ పగిడీ చిత్రరూపంలో వొదిగినప్పుడు కొంత నైరూప్యాన్ని సంతరించుకుని కొత్త అందాలు వొలకబోస్తోంది. వాస్తవికతకు సృజన జతపరచడం నవీన్ ప్రత్యేకత.
వరంగల్ జిల్లా, మంగపేట మండలం, తొండ్యాల లక్ష్మీపురంలో 1992 సంవత్సరంలో పుట్టిన వట్ట నవీన్ ఏటూరు నాగారంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదివాడు. ఆరవ తరగతిలో డ్రాయింగ్ టీచర్ కుమారస్వామి పరిచయం చేసిన చిత్రకళ తనతో పాటే పెరుగుతూ వచ్చిందంటున్నారు. ఆ సారు ప్రోత్సాహం వల్ల చిత్రకళపై ఇష్టం పెరిగిందంటున్నారు. అలా ఆశ్రమ పాఠశాలలో ఉన్నప్పటి నుంచే వేట బొమ్మలు, గండభేరుండ పక్షి, కట్టెలమోపు ఎత్తుకుని నడుస్తున్న స్ర్తి ఇట్లా అనేక బొమ్మలు గీశానని నవీన్ చెప్పారు.
గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ‘టాలెంట్ హంట్’లో భాగంగా తనను గుర్తించి హైదరాబాద్‌లోని మాసాబ్‌ట్యాంక్ వద్ద గల గిరిజన భవన్‌లో తమకు శిక్షణ ఇప్పించారని అక్కడ రామకృష్ణ సార్ తమకెన్నో మెళకువలు నేర్పించారని, దాంతో కాన్వాసుపై గిరిజన చిత్రాలు గీయడం సులువయిందంటున్నారు. అంతకు ముందే జిల్లా స్థాయిలో డ్రాయింగ్‌లో సర్ట్ఫికెట్ కోర్సు చేయడం కారణంగా చాలా విషయాలు త్వరగా అర్థం చేసుకుని కోయ తెగ జీవితాన్ని కాన్వాసుపై తర్జుమా చేసేందుకు వీలు చిక్కిందని నవీన్ అంటున్నారు. మట్టిరంగు, తెలుపు రంగు తాను ఎక్కువ వాడతానని తెలిపారు.
హనుమకొండలో బిఎస్సీ, ఎంఎస్సీ పూర్తి చేసి ఇప్పుడు బి.ఇడి. చదువుతున్న నవీన్ చిత్రకళతోపాటు విద్యకు అధిక ప్రాధాన్యత నిస్తున్నారు. తనతోపాటు చాలామంది గిరిజన యువకులు చిత్రకళా రంగంలో ఉన్నారని, వారందరితో ఒక ‘గ్రూప్’ను ఏర్పాటు చేసి తమ సృజనను, కౌశలాన్ని కోయ సంస్కృతిని మరింత బలంగా ప్రపంచం ముందుకు తీసుకొస్తామని నవీన్ అంటున్నారు.
దేశవ్యాప్తంగా వర్ల, సవర, పిథోడ, బిల్లు, గోండు తెగల చిత్రకళ ప్రముఖంగా నిలుస్తోంది. ఇప్పుడు అదనంగా నాయక్‌పోడ్, కోయ తెగల చిత్రకళను తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ప్రపంచం ముందుకు తీసుకొస్తోంది. ఆ రకంగా వారి వారి ప్రత్యేక సంస్కృతి సంప్రదాయాలే గాక చిత్రకళాశైలి, రంగుల పొందిక, ఎంపిక చేసుకునే వస్తువు గూర్చిన అవగాహన ఇతరులకు తెలుస్తోంది. గిరిజన చిత్రకారులకు పేరు ప్రఖ్యాతులే గాక ఆర్థికంగా ఎదిగేందుకు ఇది ఉపకరిస్తోంది.
నాయక్‌పోడ్ చిత్రకారుడు పసుల అంజనకుమార్, కోయ చిత్రకారుడు వట్ట నవీన్ నేపథ్యం పరిశీలిస్తే వీరు వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినప్పటికీ స్వయంకృషితో చిత్రకళను ఔపోసన పట్టడమేగాక మెరుగైన ‘విద్య’ను ఒడిసిపట్టారు. నిజంగా వీరు అభినందనీయులు, ఆయా గిరిజన తెగలు గర్వించదగ్గ అడవి బిడ్డలు. తమ అస్తిత్వాన్ని చిత్రాల ద్వారా లోకానికి చాటుతున్న నైపుణ్యంగల ఆదివాసీలు. మైదాన ప్రాంతం వారికి, ఆదివాసీ యువకుల మధ్య గల దూరాన్ని చెరిపేస్తున్న ధీరులు, సరికొత్త ప్రపంచపు అంచులు తాకాలని తాపత్రయపడుతూ ఆ ప్రస్థానం ప్రారంభించిన వీరి చిత్రకళ ‘మేడారం జాతర’ కావాలని ఆశిద్దాం!

పసుల అంజనకుమార్.. 9652185995 వట్ట నవీన్.. 7093768425

-వుప్పల నరసింహం 99857 81799