Others

సంతోషాల యాత్ర.. అమ్మ జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్లో: యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
- చండీ సప్తశతి
అమ్మ ఆరాధన ప్రకృతి ఆరాధనే. ఈ ఆరాధన ప్రాంతీయ ఆచార వ్యవహారాలను బట్టి ఆరాధనా విధానాలు మారుతుంటాయ. కానీ శక్తి ఆరాధన ప్రతి ప్రాంతంలోనూ ఉంటుంది. వ్యవసాయమే ముఖ్యమైన వృత్తిగా ఉన్న మనదేశంలో శక్తి ఆరాధన భిన్న ప్రాంతాలలో విభిన్నరూపాలలో భిన్నత్వంలో ఏకత్వానికి రూపంగా కనిపిస్తుంది.
తెలంగాణా ప్రాంతంలో జరిగే బోనాల పండుగ తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతుంది. ఈ బోనాలపండుగనే ఆషాఢ జాతర అనీ పిలుస్తారు. సికింద్రాబాద్‌లోని శ్రీఉజ్జయినీ మహాకాళి దేవాలయం, హైదరాబాద్ పాతబస్తీ షాలిబండలో వెలసిన ప్రాచీన అక్కన్న మాదన్న మహంకాళీ దేవాలయం, పాతబస్తీలోని లాల్‌దర్వాజా మహంకాళి అమ్మవారి దేవాలయాలు ప్రముఖంగా బోనాల ఉత్సవాలను నిర్వహిస్తాయి. గ్రామదేవతలకు బోనాలు సమర్పిస్తూ లక్షలాదిగా ప్రజలు ఈ ఉత్సవాలకు తరలివస్తారు. ఈ బోనాల జాతరలో ఎన్నో ఆచారాలువస్తున్నాయ. వాటిల్లో బోనాలు, సాక, ఫలహారం బండ్లు, పోతురాజులు, రంగం, అంబారీ ఊరేగింపులు ముఖ్య మైనవి.
ఘటోత్సవం
ఈ బోనాలు 15 రోజుల జరుపుతారు. ఈ ఉత్సవం అమ్మవారికి ఎదురెళ్ళి పుట్టింటి నుంచి తీసుకుని వచ్చే ఎదురుకోళ్ళతో ప్రారంభమవుతుంది. దీనే్న ఘటోత్సవం అంటారు. ఘటం అంటే కలశమని అర్థం. అంటే పూర్ణకుంభస్వాగతమన్న మాటే. పూర్ణకుంభ స్వాగతమే కాలక్రమంలో ఘటంగా మారిపోయందని అంటారు. ప్రత్యేకమైన కలశంలో అమ్మవారిని ఆవాహన చేసి పురవీధులలో ఊరేగిస్తారు. అసలైన బోనాల ఉత్సవం ముందురోజు వరకు ఉదయం, సాయంత్రం అమ్మవారు ఈ ఘటంపై సూక్ష్మరూపంలో ఆశీనురాలై పురవీధులగుండా సంచారం చేస్తుంది.
బోనాలు
శక్తిస్వరూపిణియైన మహాకాళికి భక్తిప్రపత్తులతో సమర్పించే నైవేద్యమే (్భజనమే) బోనం.ఈ బోనంను (ప్రసాదాన్ని) భక్తులు తాము మొక్కుకున్న రీతిలో సమర్పించుకుంటుంటారు. ఆషాఢ జాతర రోజున మహిళలు తలారా స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి, మడితో బోనం తయారుచేసి ఆ మొక్కుబడిని ఒక పాత్రలో ఉంచి ప్రసాదం అపవిత్రం కాకుండా పాత్రపై దీపం పెట్టి తలపై పెట్టుకుని వివిధ ప్రాంతాల నుంచి తరలివెళ్లిఅమ్మవాఠికి సమర్పించి మొక్కు తీర్చుకుంటారు. ఈ రోజున స్ర్తిలు ముఖానికి పసుపు రాసుకుని తడిబట్టలతో ఆలయానికి రావడం సంప్రదాయం. మహిళలు బోనాలను నెత్తిన పెట్టుకుని తప్పెట్ల మోతలతో, మంగళవాయిద్యాలతో విభిన్న రీతుల నృత్యాలు చేసే పురుషులు వెంటరాగా అమ్మవారి గుడికి ఆనందోత్సాహాలతో వస్తారు. ఇలా వచ్చినవారు సాకను సమర్పిస్తారు. సాక సమర్పణ వల్ల ఆచల్లని తల్లి తమను తమ కుటుంబాలను చల్లగా చూస్తుందని భక్తులు భావిస్తారు.
ఫలహారపుబండ్లు
బోనాల పండుగరోజున భక్తులు అమ్మవారికి ఇష్టమైన పదార్థాలను తమ, తమ ఇళ్ళలో తయారుచేసుకుని వాటిని అందంగా అలంకరించిన బండిలో పెట్టుకుని వచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి కొంత సమర్పించి అక్కడ ఉన్న భక్తులందరూ కలసి పంచుకుని తిరిగి మిగిలింది ఇంటికి తీసుకుని వెళ్ళి కుటుంబసభ్యులందరూ దాన్ని మహాప్రసాదంగా తీసుకుంటారు. ఈ విధంగా వందల సంఖ్యలో భక్తులు బండ్లపై ప్రసాదాలు తెచ్చి అమ్మవారికి సమర్పించడమే ఫలహారపుబండ్లు అంటారు.
పోతురాజుల వీరంగం
పోతురాజు అంటే అమ్మవారి సోదరుడు. ఇతడు శరీరమంతా పసుపు రాసుకుని, లంగోటి ధరించి, కాళ్ళకు గజ్జెలు కట్టుకుని, కళ్ళకు కాటుకతో, కుంకుమ దిద్దుకుని, నోటిలో పచ్చటి నిమ్మకాయలు పెట్టుకుని నడుము చుట్టూ వేపమండలు కట్టుకుని, కొరడాగా చేసుకున్న పసుపుతాడును ఝుళిపించుకుంటూ తప్పెట వాయిద్యాలకు అనుగుణంగా నాట్యం చేస్తూ ఆనందోత్సాహాల మధ్య పోతురాజులు కదిలివెళ్ళడం బోనాల పండుగలో ఓ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది.
రంగం
భవిష్యవాణిని చెప్పే వేడుకనే ‘రంగం’. దీనికోసమే ఎందరో భక్తులు ఎదురుచూస్తుంటారు బోనాల పండుగను ఆదివారం నిర్వహించిన మరుసటి రోజు సోమవారం ఉదయం అమ్మవారి ముఖమండపంలోని మాతంగేశ్వరి ఆలయం వద్ద దేవికి ఎదురుగా ఒక అవివాహిత మహిళ పచ్చికుండపై నిలబడుతుంది. ఆమె అమ్మవారివంకే చూస్తూ దేవీకళను తనపై ఆవహింపజేసుకుని భవిష్యత్తులో జరిగే పరిణామాలను, ముఖ్య విషయాలను తన వాక్కుతో వ్యక్తం చేస్తుంది. దీనే్న రంగం అని అంటారు. ఇలా భవిష్యవాణిచెప్పే మహిళని మాతంగిఅంటారు. మాతంగి ఒక కత్తికి మాంగళ్యధారణ చేసి జీవితాంతం అవివాహితగా ఉండిపోతుంది.
అంబారీ ఊరేగింపు
ఈ వేడుకల తర్వాత అమ్మవారి చిత్రపటాన్ని ప్రత్యేకంగా అలంకరించిన ఏనుగుపై ఉంచి మంగళవాయిద్యాలతో పురవీధులగుండా ఊరేగించుకుంటూ తీసుకుని వెళ్ళి సాగనంపి ఉత్సవాన్ని ముగిస్తారు. ఇలా ఈ బోనాల పండుగ వేడుకలు సామూహికంగా ప్రజలందరూ ఐకమత్యంగా నిర్వహిస్తారు.
భగవద్భక్తిని, తరతమభేదాలు నశించడాన్ని, ఐకమత్యం అనే భావాలు ప్రజలలో నాటుకునేట్లు చేసే ఈ పండుగ భావిపురోగతికి ప్రతీకగా నిలుస్తుంది. కనుక అందరూ ఈ పండుగను ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆశిద్దాం.

-చివుకుల రామమోహన్