Others

వినయవిధేయతలకే అగ్రతాంబూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైహయ రాజ వంశానికి చెందిన కృతవీర్యుని కుమారుడే మహాబలశాలియైన కార్తవీర్యార్జునుడు. దివ్యాస్త్ర బలసంపన్నుడైన కార్తవీర్యార్జునుడు ధర్మమార్గావలంబియై సప్త ద్వీపాలతో గూడిన భూమండలమును ఏకచ్ఛాత్రాధిపత్యంగా పాలించాడు. నారాయణాంశ కలిగిన కలిగినవాడు దత్తాత్రేయుని ఆరాధించి ఓజస్సు, ఇంద్రియమహత్వము శత్రువిజయము, కీర్తి, తేజస్సు, అష్టసిద్ధులు, వేయి చేతులు కలుగునట్లు వరముపొందాడు.
ఓరోజు అగ్నిదేవుని ఆకలి తీర్చుటకై పర్వతారణ్యములు, పట్టణములు, గ్రామాలు , పల్లెసీమలను ఆహారంగా అగ్ని దేవునికి సమర్పించాడు. కానీ, ఈ సందర్భంలో అనుకోకుండా వసిష్ఠుని ఆశ్రమం దగ్ధమైంది. వసిష్ఠ మహర్షి దీనికి ఆగ్రహించి ‘కార్తవీర్యార్జునా! నీ బాహువులను పరశురాముడు ఖండించుగాక!’ అని శాపం ఇచ్చాడు.
కొన్నాళ్లు తరువాత విధివశాన కార్తవీర్యార్జునుని పుత్రులు దుర్మార్గులుగా తయారు అయ్యారు. పండిత పుత్రుడు శుంఠుడన్న లోకరీతికనుగుణంగా కార్తవీర్యార్జునుని పుత్రులు అజ్ఞానులుగా అధర్మాచరణులుగా పెరుగుతూ ఉన్నారు.
వీరు ఓసారి జమదగ్ని ఆశ్రమానికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ జమదగ్ని లేరు. అది చూసి వీరు ఆ ఆశ్రమంలో ఉన్న ఆవును, దూడను బలవంతంగా బంధించి రాజాంతఃపురానికి తీసుకుని వెళ్లిపోయారు. ఈ వార్త కోపిష్ఠి అయిన పరశురామునికి తెలిసింది. ఆయన మిక్కిలి కోపోద్రిక్తుడై తన గండ్రగొడ్డలితో కార్తవీర్యుని తల నరికి యాగధేనువును, దూడను తన ఆశ్రమానికి తిరిగి తీసుకొని వెళ్లాడు. దుర్మార్గులగు కార్తవీర్యుని పుత్రులు పరశురాముడు చేసిన విషయాన్ని తెలుసుకొని పరశురామునికి తగిన బుద్ధి చెప్పాలనుకొన్నారు. వెంటనే వారు హుటాహుటిన జమదగ్ని ఆశ్రమానికి వెళ్లారు..అక్కడ ధ్యానం చేసుకొంటున్న జమదగ్నిని చూశారు. సమాధిస్థితిలో ఉన్న ఆయన్ను చూసి ఇదే మంచి సమయమని నిశ్చయించుకున్నారు. వెంటనే ఆ మునీంద్రుని తల నరికి తమ తండ్రిని చంపినందుకు పరశురామునిపై కక్ష తీర్చుకున్నారు. ఈ సంగతి తెలుసుకొన్న పరశురాముడు ఆగ్రహోద్రగుడై హైహయ రాజ వంశీయులనే కాదు అసలు ఈ భూమిమీద ఉన్న క్షత్రియ రాజులందరినీ తన గండ్రగొడ్డలితో నరికి రాజవంశాలన్నీ నిర్మూలించివేస్తానని ప్రతిజ్ఞ పూని అనేక మంది రాజ వంశాలను నిర్మూలించాడు.
కార్తవీర్యుడు రావణుని కన్ననూ అత్యంత బలపరాక్రమ సంపన్నుడు. ఒకప్పుడు దశకంఠుడు ససైన్యంతో నర్మదా తీరమునకు వచ్చి శివలింగార్చన చేయాలని సంకల్పించాడు. ఆ సమయంలో కార్తవీర్యార్జునుడు తరుణీమణులతో జలక్రీడల్లో ఆనందిస్తూ ఉన్నాడు. తన వేయి చేతులతో నదీ ప్రవాహాన్ని కార్తవీర్యుడు అడ్డగించాడు. నదీజలాలన్నీ కార్తవీర్యుని అడ్డగింపువల్ల వెనుకకు ప్రవహించాయి. ఆ సమయంలోనే రావణుడు శివర్చాన చేస్తున్నాడు. వెనుకకు తిరిగిన నదీ ప్రవాహవేగానికి రావణుని శివార్చన పూజాద్రవ్యాలన్నింటినీ నదీజలాల్లో కొట్టుకుని పోయాయి.
ఈ సంఘటనకు రావణునికి కోపం వచ్చింది. దీనికి కారణమేమిటో కనుక్కోమని తన మంత్రి పురోహితులకు రావణుడు చెప్పాడు. వారు వెళ్లి అక్కడున్న కార్తవీర్యుడే ఈ ప్రవాహాన్ని వెనుకకు తిప్పటం వల్ల ఈ సంఘటన జరిగిందన్న విషయం తెలుసుకొని వచ్చి తమ రాజైన రావణునికి చెప్పారు.
కార్తవీర్యుని మదమణచాలని రావణుడు కార్తవీర్యుని పైకి సైన్యాన్ని పంపాడు. అపుడు కార్తవీర్యుని మంత్రులు రావణుని సైన్యం చేత వధించబడ్డారు. ఆ దృశ్యం చూసి కార్తవీర్యుడు ఆగ్రహించి తానే స్వయంగా నదీజలాల నుంచి ఒడ్డుకు చేరి తన వేయి చేతులతో ఇరవై చేతులున్న రావణునితో కదనానికై కాలుదువ్వాడు. రావణుడు కార్తవీర్యుని కయ్యంలో కాలు కదుపలేక నేలపై చతికిల పడ్డాడు. దాంతో కార్తవీర్యుడు మోకాళ్లతో పొడుస్తూ కోతిని పట్టినట్టు కాళ్లు చేతులు కట్టివైచి చెరసాలలో రావణుని బంధించాడు. దీనిని చూసి దేవదుంధులు మ్రోగాయి. ఆకసం నుంచి పుష్ప వర్షము గురిసింది.
కార్తవీర్యుడు హుటాహుటిన మాహిష్మతీనగరానికి వచ్చి కార్తవీర్యుని తాత పులస్త్య బ్రహ్మకు ఈ విషయాన్ని వివరించి చెప్పాడు. అపుడు పులస్త్య బ్రహ్మ ‘‘నాయనా కార్తవీర్యా! వత్సా! నా మాట గౌరవించి రావణుని విడిచి పెట్టుము. నీ బాగుకోరి చెప్తున్నాను’’ అని చెప్పాడు.
పెద్దలయందు గౌరవ భావం, వినయం కలిగిన కార్తవీర్యుని తన తాత మాటను గౌరవించి రావణునికి బంధవిముక్తిని కలిగించి తగిన గౌరవ మర్యాదలు చేశాడు. రావణుడు కూడా అప్పుడున్న పరిస్థితులు కార్తవీర్యుని బాహుబలం లెక్కించి కార్తవీర్యునితో మైత్రినే వాంఛించాడు. అట్లా రావణుని కార్తవీర్యుని మధ్యలో మైత్రి పొసిగింది. ఆ తరువాత తగిన మర్యాదలతో లంకానగరికి రావణుడిని కార్తవీర్యుడు పంపివేశాడు. ఈ విషయాన్ని తెలుసుకొన్నవారికి ఎప్పుడు, ఎవరితోనైనా ఎలా మెలగాలన్న విషయం అర్థం అవుతుంది. బలముంది కదా అని ఎవరిపైకీ కాలుదువ్వ కూడదు. అందరినీ సోదరభావంతో చూసినపుడే ప్రకృతి గానీ, పరమాత్మగానీ మెచ్చుతాడు. ఎంత ఆధిక్యమున్నా వినయ విధేయతలకే అగ్ర తాంబూలం ఇవ్వాలి.

- ఆర్. రామారావు 9492191360