AADIVAVRAM - Others
స్వస్తిశ్రీ శార్వరి నామ సంవత్సర గోచార ఫలితాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మేషం: (అశ్విని, భరణి, కృత్తిక 1పా): ఆదాయం - 5, వ్యయం - 5,
రాజపూజ్యం - 3, అవమానం -1.
ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురువు గోచారరీత్యా జూన్ 29 వరకు, తిరిగి నవంబర్ 20 నుండి వత్సరాంతం వరకు దశమ స్థాన సంచారం వల్ల వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులుంటాయి. బాధ్యతలు బాగా పెరిగే అవకాశం. శ్రమ ఉన్నా సంతోషం ఉంటుంది. పదోన్నతులకు అవకాశం. కొత్త ఉద్యోగాదుల వైపు కృషి చేసే వారికి అనుకూలం. జూన్ 29 నుండి నవంబర్ 20 వరకు నవమ భావంలో సంచరించే గురువు వల్ల వైజ్ఞానిక పరిశోధనలు వెలుగులోకి వస్తాయి. సుదూర ఆథ్యాత్మిక యాత్రలకు అనుకూలం. లక్ష్యాలను సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందుతాయి. ఉపాసన, థార్మిక జీవితంపై దృష్టి.
శని ఈ సంవత్సరం పూర్తిగా వృత్తి స్థానంలో సంచారం వల్ల శ్రమాధిక్యం. అనేక బాధ్యతలు మోయాల్సి వస్తుంది. కార్యనిర్వహణలో అప్రమత్తంగా మెలగాలి. అధికారుల వల్ల సమస్యలు.. పదోన్నతుల విషయంలోను జాగ్రత్త పడాలి. సేవా రంగంలోని వారికి శుభపరిణామాలు.. పితృవర్గ వ్యవహారాల్లో సమస్యలు ఎదురయ్యే అవకాశం. లోకానికి వినియోగపడాలి.
రాహువు సెప్టెంబర్ 23 వరకు తృతీయంలో సంచారం వల్ల కమ్యూనికేషన్స్ బాగా పెరుగుతాయి. మీడియా రంగంలోని వారికి అనుకూలత. సహకార లోపాలకు అధికమైన అవకాశం. తర్వాత సంవత్సరాంతం వరకు కుటుంబ స్థానంలో సంచారం వల్ల ఆర్థిక సమస్యలు ఎదురు కావచ్చు. అధికమైన ఆదాయం ఆశించి భంగపడే అవకాశం. మాటల్లో జాగ్రత్తగా ఉండాలి.
కేతువు సెప్టెంబర్ 23 వరకు నవమ భావ సంచారం వల్ల ఆథ్యాత్మిక యాత్రలకు అవకాశం. కొంత అసంతృప్తి ఉంటుంది. ఆశించిన కార్యక్రమాలు పూర్తికాకపోవచ్చు. దానధర్మాల వల్ల మేలు. తర్వాత వత్సరాంతం వరకు అష్టమ రాశి సంచారం వల్ల అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య లోపాలకు అవకాశం. అన్ని పనుల్లోనూ జాగ్రత్తగా మెలగాలి. శ్రమాధిక్యం. ఈ రాశి వారు దత్తాత్రేయ స్తోత్ర పారాయణం, రుద్రాభిషేకం, గణపతి ఆరాధన చేసుకోవడం ద్వారా సంతోషంగా ఉండగలరు.
**
వృషభం: (కృత్తిక 2, 3, 4 పా, రోహిణి, మృగశిర 1, 2 పా)
ఆదాయం - 14, వ్యయం - 11, రాజపూజ్యం - 6, అవమానం - 1,
ఈ రాశివారికి గురువు గోచార రీత్యా జూన్ 29 వరకు తిరిగి నవంబర్ 20 నుండి వత్సరాంతం వరకు నవమ భావంలో సంచారం వల్ల ఉన్నత వ్యవహారాలపై దృష్టి. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే అవకాశం. పరిశోధనలకు రూపురేఖలు కలుగుతాయి. లక్ష్యాలను సాధిస్తారు. న్యాయ, వైజ్ఞానిక రంగాల వారికి అనుకూలత. బోధనా రంగాల వారికి గుర్తింపు. జూన్ 29 నుండి నవంబర్ 20 వరకు అష్టమ స్థాన సంచారం సమస్యలకు గురి చేస్తుంది. గౌరవ లోపాలు, అవమానాలు ఎదురు కావచ్చు. కొన్ని అనారోగ్యాలకు కూడా అవకాశం ఉంటుంది. కార్యనిర్వహణలో సమస్యలు. సంతృప్తి లోపం ఉంటుంది.
శని వత్సరాంతం వరకు నవమ స్థానంలో సంచారం వల్ల ఆశించిన సంతృప్తి ఉండకపోవచ్చు. ఆథ్యాత్మిక, థార్మిక విషయాలపై దృష్టి కేంద్రీకరించడం మంచిది. లోక వ్యవహారాల్లో ఇబ్బందులుంటాయి. యాత్రల వల్ల మరింత మేలు కలుగుతుంది. ఉపాసనలు నిరంతరం నిర్వహించడం వల్ల మేలు. కార్యనిర్వహణలో ఇబ్బందులు. పరిశోధనల్లో ఫలితాలు తేలవు.
రాహువు సెప్టెంబర్ 23 వరకు కుటుంబ స్థాన సంచారం వల్ల ఆర్థిక వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. ఆశింపులు పెరుగుతాయి. నిల్వధనం కోల్పోవచ్చు. మాట విలువ తగ్గుతుంది. బంధువర్గ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. తదుపరి వత్సరాంతం వరకు లగ్నభావంలో సంచరించడం వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోవచ్చు. కోరికలు పెరుగుతాయి. ఆశలు అదికమవుతాయి.
కేతువు సెప్టెంబర్ 23 వరకు అష్టమ భావ సంచారం వల్ల అనుకోని సమస్యలుంటాయి. అరోగ్యం కోల్పోయే అవకాశం. బంధువర్గాల వారితో ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఆర్థిక సమస్యలుంటాయి. తర్వాత వత్సరాంతం సప్తమ భావ సంచారం వల్ల భాగస్వామ్యాల్లో సమస్యలుంటాయి. పరిచయాల వల్ల ఇబ్బందులు కలుగవచ్చు. సామాజిక అనుబంధాల్లో జాగ్రత్త అవసరం. ఈ రాశివారు గణపతి ఆరాధన, దుర్గస్తోత్రం, దత్తపారాయణాదులు నిరంతరం నిర్వహించుకోవడం వల్ల మేలు కలుగుతుంది.
**
మిథునం: (మృగశిర 3, 4 పా, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పా):
ఆదాయం - 2, వ్యయం - 11, రాజపూజ్యం - 2, అవమానం - 4.
ఈ రాశి వారికి గురువు గోచార రీత్యా జూన్ 29 వరకు తిరిగి నవంబర్ 20 నుండి వత్సరాంతం వరకు అష్టమ భావంలో సంచారం వల్ల అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్యం, గౌరవ లోపాలు. దానధర్మాలు చేయాలి. పెద్దలకు సన్మానాలు నిర్వహించాలి. ధర్మకార్యాల నిర్వహణ మంచిది. కార్యనిర్వహణలో లోపాలకు అవకాశం. జూన్ 29 నుండి నవంబర్ 20 వరకు సప్తమ స్థాన సంచారం వల్ల భాగస్వామ్యాల్లో అనుకూలత. వైవాహిక అనుబంధాలు మెరుగుపడతాయి. కొత్త పనుల నిర్వహణపై దృష్టి కేంద్రీకరిస్తారు. పరిచయాలు విస్తరిస్తాయి. వేరు వేరు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది.
శని వత్సరాంతం వరకు అష్టమ స్థానంలో సంచారం వల్ల ఆరోగ్య లోపాలకు అవకాశం. అన్ని పనుల్లోనూ ముందుజాగ్రత్త అవసరం. ఆహార విహారాల్లో సమస్యలుంటాయి. ఊహించని నష్టాలుంటాయి. శారీరకమైన శ్రమ పెరుగుతుంది. వ్యాయామం అవసరం. వ్యాపార వ్యవహారాల్లోనూ ఇబ్బందులుంటాయి. నిర్ణయాదులలో ఆచితూచి వ్యవహరించాలి.
రాహువు సెప్టెంబర్ 23 వరకు లగ్నభావంలో సంచారం వల్ల నిర్ణయ లోపాలుంటాయి. ఆత్మవిశ్వాసం కోల్పోవచ్చు. తొందరపాటు కూడదు. దురాశ కూడదు. అపోహలకు అధికమైన అవకాశం ఉంటుంది. తదుపరి వత్సరాంతం వరకు వ్యయ భావంలో సంచారం వల్ల కాలం, ధనం వ్యర్థమయ్యే సూచనలు. ప్రయాణాదుల్లో ముందు జాగ్రత్తలుండాలి. విశ్రాంతి లోపం.
కేతువు సెప్టెంబర్ 23 వరకు సప్తమ భావ సంచారం వల్ల భాగస్వామ్యాల్లో ఒత్తిడులుంటాయి. పరిచయాలు స్నేహానుబంధాల్లో నిరాశ ఏర్పడుతుంది. వ్యాపార భాగస్వామితో సమస్యలు. దానధర్మాల వల్ల మేలు. తర్వాత వత్సరాంతం షష్ఠ్భావ సంచారం వల్ల పోటీ రంగంలో అనుకూలత. వ్యతిరేకతలను జయిస్తారు. శ్రమ ఉన్నా ఫలితాలు సాధించే ప్రయత్నం ఉంటుంది. ఈ రాశివారు రుద్రాభిషేకం, హనుమదారాధన, దుర్గాస్తోత్ర పారాయణాదులు చేయడం వల్ల మేలు. దానధర్మాలు అవసరం.
**
కర్కాటకం: (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష): ఆదాయం - 11, వ్యయం - 8,
రాజపూజ్యం - 5, అవమానం - 4.
ఈ రాశి వారికి గురువు గోచార రీత్యా జూన్ 29 వరకు తిరిగి నవంబర్ 20 నుండి వత్సరాంతం వరకు సప్తమ భావంలో సంచారం వల్ల భాగస్వామ్యాల్లో అనుకూలత. వివాహాది కార్యక్రమాలకు పూనుకోవచ్చు. సామాజిక గౌరవం పెరుగుతుంది. వ్యాపారాదులకు అనుకూలం. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం. జూన్ 29 నుండి నవంబర్ 20 వరకు షష్ఠ స్థాన సంచారం వల్ల పోటీ రంగంలో గుర్తింపు లభించవచ్చు. వ్యతిరేకతలపై విజయం. కాంపిటీషన్స్‌లో పై చేయి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. శత్రు, రోగ, ఋణాలపై విజయం సాధిస్తారు. కార్యనిర్వహణ దక్షత పెంచుకుంటారు.
శని వత్సరాంతం వరకు సప్తమ స్థానంలో సంచారం వల్ల భాగస్వామ్యాల్లో సమస్యలుంటాయి. పరిచయాలు, స్నేహానుబంధాల్లో ఒత్తిడులుంటాయి. అనుబంధాలను కాపాడుకోవాలి. వ్యాపార భాగస్వామితో ఇబ్బందులు పడే అవకాశం. బద్దకం పెరిగే అవకాశం. అపోహలు తగ్గించుకోవాలి. నష్టాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రమతో కార్యాలుంటాయి.
రాహువు సెప్టెంబర్ 23 వరకు వ్యయ స్థాన సంచారం వల్ల కాలం ధనం వ్యర్థం అవుతాయి. విశ్రాంతి లోపం సంభవం. వ్యర్థమైన ప్రయాణాలు. పరామర్శలకు అవకాశం. ఆసుపత్రులలో చేరకుండా చూసుకోవాలి. నిద్ర సంబంధమైన ఇబ్బందులు. తదుపరి వత్సరాంతం వరకు లాభ స్థాన సంచారం సంతోషాన్నిస్తుంది. ఆశింపు పెరుగుతుంది. అధిక ప్రయోజనాలుంటాయి.
కేతువు సెప్టెంబర్ 23 వరకు షష్ఠ భావ సంచారం వల్ల వ్యతిరేకతలుంటాయి. పోటీలు, ఒత్తిడులు అధికమవుతాయి. కాంపిటీషన్స్‌లో విజయానికి అధికమైన శ్రమ ఉంటుంది. ఋణబాధలు అధికం. తర్వాత వత్సరాంతం వరకు ఆలోచనల్లో ఒత్తిడులు. క్రియేటివిటీ తగ్గవచ్చు. నిర్ణయాదుల్లో లోపాలు. సంతానవర్గంతో జాగ్రత్తగా మెలగాలి. ప్రణాళికా లోపాలకు అవకాశం. ఈ రాశి వారు దుర్గాస్తోత్ర పారాయణం, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తూ దానధర్మాలు అధికంగా చేయాలి.
**
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1పా): ఆదాయం - 14, వ్యయం - 2,
రాజపూజ్యం - 1, అవమానం - 7
ఈ రాశివారికి గురువు గోచార రీత్యా జూన్ 29 వరకు తిరిగి నవంబర్ 20 నుండి వత్సరాంతం వరకు షష్ఠ భావంలో సంచారం వల్ల వ్యతిరేకతలు పెరుగుతాయి. గుర్తింపు లభిస్తుంది. పోటీల్లో అనుకూలత. శ్రమాధిక్యం. కార్యనిర్వహణ దక్షత. పోటీ రంగంలో నిలదొక్కుకుంటారు. ఋణబాధల నుండి క్రమంగా విముక్తి. శత్రువులపై విజయం. జూన్ 29 నుండి నవంబర్ 20 వరకు సప్తమ స్థాన సంచారం వల్ల సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. పరిచయాలు పెంచుకుంటారు. కొత్త పనులపై దృష్టి. వైవాహిక అనుబంధాలు కలిగే అవకాశం. వ్యాపారాల్లో శుభ పరిణామలు. ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నం.
శని వత్సరాంతం వరకు షష్ఠ స్థానంలో సంచారం వల్ల పోటీలు, ఒత్తిడులు, చికాకులుంటాయి. సేవారంగంలోని వారికి అనుకూలత. శ్రమతో కార్యాలుంటాయి. గుర్తింపు కోసం ప్రయత్నం ఉంటుంది. ఋణబాధలు చాలా కష్టంగా తీరుతుంటాయి. కొత్త పనుల నిర్వహణలో అప్రమత్తంగా మెలగాలి. రోగ నిరోధక శక్తి తగ్గే సూచనలు. అన్ని పనుల్లోను ఒత్తిడులుంటాయి.
రాహువు సెప్టెంబర్ 23 వరకు లాభ స్థాన సంచారం వల్ల అన్ని పనుల్లోనూ అనుకూలత. లాభాలు పెరుగుతాయి. దురాశ కూడా ఉంటుంది. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. నూతన కార్యక్రమాల నిర్వహణలో జాగ్రత్త. తదుపరి వత్సరాంతం వరకు వృత్తి స్థాన సంచారం వల్ల అనేక బాధ్యతలను ఒకేసారి నిర్వహించాల్సి వస్తుంది. అధికారిక సమస్యలు. గౌరవం తగ్గే అవకాశం.
కేతువు సెప్టెంబర్ 23 వరకు పంచమ భావ సంచారం వల్ల ఆలోచనల్లో ఒత్తిడులంటాయి. సంతానవర్గంతో సమస్యలు. క్రియేటివిటీ లోపం ఉంటుంది. ఆందోళన, అపోహలు తగ్గించుకోవాలి. తర్వాత వత్సరాంతం వరకు చతుర్థ్భావ సంచారం వల్ల సౌకర్యాలపై అధికమైన ఆసక్తి. గృహ వాహనాదులపై దృష్టి. ఆహార విహారాలపై దృష్టి ఉన్నా అసంతృప్తి తప్పదు. ఈ రాశివారు దుర్గాస్తోత్ర పారాయణం, లక్ష్మీ అష్టకం, దత్తాత్రేయ స్తోత్ర పారాయణలు చేసుకోవడం వల్ల శుభఫలితాలుంటాయి.
**
కన్య: (ఉత్తర 2, 3, 4 పా, హస్త, చిత్త 1, 2 పా): ఆదాయం - 2, వ్యయం - 11,
రాజపూజ్యం - 4, అవమానం - 7
ఈ రాశివారికి గురువు గోచార రీత్యా జూన్ 29 వరకు తిరిగి నవంబర్ 20 నుండి వత్సరాంతం వరకు పంచమ భావంలో సంచారం వల్ల సంతానవర్గంతో అనుకూలత. క్రియేటివిటీ పెరుగుతుంది. ఆలోచనాశక్తి, ప్రణాళికాబద్ధమైన జీవనం బాగా ఉంటుంది. వ్యవహార దక్షత. అనేక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది. గుర్తింపు. జూన్ 29 నుండి నవంబర్ 20 వరకు చతుర్థ స్థాన సంచారం వల్ల ఆహార విహారాలపై దృష్టి, సౌకర్యాలు పెంచుకుంటారు. గృహ వాహనాదులను సాధించే ప్రయత్నం. శ్రమ ఉన్నా సంతోషంగా గడుపుతారు. భౌతికమైన జీవితం, సౌఖ్యంపై దృష్టి. విద్యార్థులకు అనుకూలత.
శని వత్సరాంతం వరకు పంచమ స్థానంలో సంచారం వల్ల ఆలోచనల్లో బద్ధకం ఉంటుంది. కొత్త పనుల నిర్వహణలో శ్రమించాలి. సంతాన వ్యవహారాల్లో సమస్యలను ఎదుర్కొంటారు. ఆందోళన ఉంటుంది. వ్యవహార లోపాలు. సృజనాత్మక తగ్గవచ్చు. కొత్త నిర్ణయాదుల విషయంలో ఇతరుల సలహా తీసుకోవాలి. సంతానం కోరుకునే వాళ్లకు నిరాశ ఎదురయ్య అవకాశం.
రాహువు సెప్టెంబర్ 23 వరకు దశమ స్థాన సంచారం వల్ల వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమ ఉంటుంది. అనేక రకాల కార్యక్రమాలు ఒకేసారి నిర్వహించాల్సి వస్తుంది. సామాజిక గౌరవం కోసం ప్రయత్నిస్తారు. తదుపరి వత్సరాంతం వరకు నవమ స్థాన సంచారం వల్ల సుదూర ప్రయాణాలపై దృష్టి. కొంత అసంతృప్తి దైవిక, థార్మిక కార్యక్రమాల్లో లోపాలు. దానాల వల్ల మేలు.
కేతువు సెప్టెంబర్ 23 వరకు చతుర్థ భావ సంచారం వల్ల సౌకర్యాలు శ్రమకు గురిచేయవచ్చు. ఆహార విహారాల్లో ఇబ్బందులు. గృహ వాహనాదుల వల్ల వచ్చే సంతోషం కోల్పోయే అవకాశం. సౌఖ్య లోపం తర్వాత వత్సరాంతం వరకు తృతీయ భావ సంచారం వల్ల పెద్ద సహకారం లభిస్తుంది. దగ్గరి ఆథ్యాత్మిక ప్రయాణాలుంటాయి. సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త. ఈ రాశి వారు గురు స్తోత్ర పారాయణలు, గణపతి ఆరాధన, హనుమదారాధన వల్ల మేలు కలుగుతుంది.
**
తుల: (చిత్త 3, 4 పా, స్వాతి, విశాఖ 1, 2, 3 పా): ఆదాయం - 14, వ్యయం - 11, రాజపూజ్యం - 7, అవమానం - 7
ఈ రాశి వారికి గురువు గోచార రీత్యా జూన్ 29 వరకు తిరిగి నవంబర్ 20 నుండి వత్సరాంతం వరకు చతుర్థ భావంలో సంచారం వల్ల ఆహార విహారాల్లో అనుకూలత. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. గృహ వాహనాదులు సమకూర్చుకుంటారు. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. విద్యా రంగంలోని వారికి అత్యంత అనుకూలత. జూన్ 29 నుండి నవంబర్ 20 వరకు తృతీయ స్థాన సంచారం వల్ల సంప్రదింపులకు అనుకూలం. పెద్దల సహకారం లభిస్తుంది. మంచి వార్తలు అందుకుంటారు. దగ్గరి ఆథ్యాత్మిక ప్రయాణాలు. మీడియా రంగంలోని వారికి అనుకూలత. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. వ్యవహార దక్షత.
శని వత్సరాంతం వరకు చతుర్ధ స్థానంలో సంచారం వల్ల సౌకర్య లోపాలుంటాయి. శ్రమతో కార్యక్రమాలుంటాయి. విద్యార్థులు బాగా శ్రమించాల్సి వస్తుంది. ఆహార విహారాలు సమయానికి అందకపోవచ్చు. గృహ వాహనాదుల కోసం అనవసరమైన శ్రమ చేయవద్దు. శారీరక శ్రమకు సిద్ధపడాల్సిన అవసరం ఉంటుంది. కార్యనిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కోవాలి.
రాహువు సెప్టెంబర్ 23 వరకు నవమ స్థాన సంచారం వల్ల సుదూర ప్రయాణాలపై దృష్టి. విదేశాలకు ప్రయత్నించేవారికి అనుకూలత. అసంతృప్తి. దైవ కార్యక్రమాలకు దూరం కాకూడదు. గౌరవం తగ్గే సూచనలు. తదుపరి వత్సరాంతం వరకు అష్టమ స్థాన సంచారం వల్ల అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్యం. అనవసర వ్యయం ఉంటుంది. వ్యవహార లోపాలు.
కేతువుసెప్టెంబర్ 23 వరకు తృతీయ భావ సంచారం వల్ల సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త అవసరం. సహకార లోపాలుంటాయి. వార్తలలో ఇబ్బందులు. కార్యనిర్వహణలో నైరాశ్య ధోరణి. ఆథ్యాత్మిక యాత్రల వల్ల మేలు. తర్వాత వత్సరాంతం వరకు కుటుంబ భావ సంచారం వల్ల నిల్వ ధనం తగ్గిపోవచ్చు. మాటవిలువ తగ్గుతుంది. నిరాశ పెరుగుతుంది. కుటుంబ లోపాలు. ఈ రాశివారు రుద్రాభిషేకం, గణపతి ఆరాధనలు, ఆదిత్య స్తోత్ర పారాయణలు చేయడం, దానాదులు చేయడం వల్ల మేలు.
**
వృశ్చికం: (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ఠ)
ఆదాయం - 5, వ్యయం - 5, రాజపూజ్యం - 3, అవమానం -3.
ఈ రాశి వారికి గురువు గోచార రీత్యా జూన్ 29 వరకు తిరిగి నవంబర్ 20 నుండి వత్సరాంతం వరకు తృతీయ భావం సంచారం వల్ల మంచి వార్తలు వింటారు. పెద్దల, గురువుల, ఆథ్యాత్మిక వేత్తల సహకారం లభిస్తుంది. సంప్రదింపుల్లో శుభ పరిణామాలు. మీడియా రంగంలోని వారికి అనుకూలత. దగ్గరి ప్రయాణాలుంటాయి. సంతోషం. జూన్ 29 నుండి నవంబర్ 20 వరకు కుటుంబ స్థాన సంచారం వల్ల మాట విలువ పెరుగుతుంది. కుటుంబంలోని వారి సహకారం వారికి అభివృద్ధి కలుగుతుంది. కుటుంబం, బంధువర్గాల వారి అనుకూలత. శుభ కార్యక్రమాల నిర్వహణ చేస్తూ ఉంటారు.
శని వత్సరాంతం వరకు తృతీయ స్థానంలో సంచారం వల్ల సేవక రంగంలోని వారి సహకారం లభిస్తుంది. సంప్రదింపులకు అనుకూలత. ఆథ్యాత్మిక యాత్రల వల్ల సంతోషం. ఇతరులకు తాము సహకరించడం మంచిది. ఆశించిన, ఎదురుచూస్తున్న వార్తలు ఆలస్యంగా అందుతాయి. సమాచారం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీడియా వారికి శ్రమ.
రాహువు సెప్టెంబర్ 23 వరకు అష్టమ స్థాన సంచారం వల్ల అనుకోని సమస్యలుంటాయి. అనేక ఇబ్బందులను ఎదుర్కోవాలి. అపోహలుంటాయి. ఊహించని సంఘటనలు. కార్యనిర్వహణలో ఒత్తిడులు. తదుపరి వత్సరాంతం వరకు సప్తమ స్థాన సంచారం వల్ల భాగస్వామితో సమస్యలు. పరిచయాలు, స్నేహానుబంధాలు ఇబ్బంది పెట్టే అవకాశం. అపోహలు అధికం.
కేతువు సెప్టెంబర్ 23 వరకు ద్వితీయ భావ సంచారం వల్ల కుటుంబ ఆర్థికాంశాలలో కొంత జాగ్రత్త ఉండాలి. మాటల్లో నైరాశ్య ధోరణి ఉంటుంది. నిల్వధనం కోల్పోవచ్చు. బంధువర్గంతో జాగ్రత్తగా మెలగాలి. తర్వాత వత్సరాంతం వరకు లగ్నభావ సంచారం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గే సూచనలు. బాధ్యతల ఒత్తిడులుంటాయి. నైరాశ్య ధోరణి తగ్గించుకోవాలి. శ్రమాధిక్యం. ఈ రాశి వారు గణపతి ఆరాధన, దుర్గాస్తోత్ర పారాయణ, లక్ష్మీ నృసింహ స్తోత్ర పారాయణలు చేయడం వల్ల మేలు కలుగుతుంది.
**
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా): ఆదాయం - 8, వ్యయం -11,
రాజపూజ్యం - 6, అవమానం - 3.
ఈ రాశివారికి గురువు గోచార రీత్యా జూన్ 29 వరకు తిరిగి నవంబర్ 20 నుండి వత్సరాంతం వరకు ద్వితీయ భావంలో సంచారం వల్ల మాట విలువ పెరుగుతుంది. భావ వ్యక్తీకరణ వల్ల ప్రయోజనాలు. కుటుంబ, బంధువర్గ వ్యవహారాల్లో శుభ పరిణామాలు. నిల్వధనం పెంచుకుంటారు. సంతోషం, పుణ్యం ప్రోగు చేసుకుంటారు. జూన్ 29 నుండి నవంబర్ 20 వరకు లగ్న స్థాన సంచారం వల్ల నిర్ణయాదులకు అనుకూలం. కొత్త పనులు సంతోషాన్నిస్తాయి. బాధ్యతలు పెంచుకుంటారు. గుర్తింపు, గౌరవం కలుగుతుంది. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. అనేక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది. సంతృప్తి.
శని వత్సరాంతం వరకు ద్వితీయ స్థానంలో సంచారం వల్ల మాట విలువ తగ్గే సూచనలు. ఎదుటివారు సరిగా అర్థం చేసకోలేక పోవచ్చు. నిల్వధనం తగ్గిపోయే సూచనలు. బంధువర్గ వ్యవహారాల్లో సమస్యలుంటాయి. కుటుంబ వ్యవహారాల్లో కావల్సిన సంతోషం దొరక్క పోవచ్చు. అన్ని పనుల్లోనూ జాగ్రత్తగా మెలగాలి. వౌనంగా ఉంటూ, ధ్యానం చేసుకుంటూ ఉండాలి.
రాహువు సెప్టెంబర్ 23 వరకు సప్తమ స్థానం సంచారం వల్ల భాగస్వామ్యాల్లో సమస్యలు ఎదురుకావచ్చు. పరిచయాలు, స్నేహానుబంధాల్లో అప్రమత్తంగా మెలగాలి. వ్యాపారాదుల్లో లోపాలుంటాయి. తదుపరి వత్సరాంతం వరకు షష్ఠ స్థాన సంచారం వల్ల వ్యతిరేకతలను అధిగమిస్తారు. పోటీలలో గుర్తింపు సాధించే ప్రయత్నం. ఋణాదుల సమస్యలుంటాయి.
కేతువు సెప్టెంబర్ 23 వరకు లగ్న భావ సంచారం వల్ల ఆత్మవిశ్వాస లోపాలుంటాయి. నిర్ణయాదుల్లో ఇబ్బందులు, నైరాశ్యం ఉంటుంది. బాధ్యతల నిర్వహణలో ఇబ్బందులుంటాయి. ఏదో కోల్పోయిన భావనలు. తర్వాత వత్సరాంతం వరకు వ్యయ భావ సంచారం వల్ల కాలం, ధనం వ్యర్థం కావచ్చు. ప్రయాణాలకు అవకాశం. ఆథ్యాత్మిక యాత్రల వల్ల మేలు. విశ్రాంతి లోపం. ఈ రాశి వారు రుద్రాభిషేకం, హనుమదారాధన, ఆదిత్య హృదయ పారాయణ, గణపతి ఆరాధనల వల్ల మేలు కలుగుతుంది.
**
మకరం: (ఉత్తరాషాఢ 2, 3, 4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా):
ఆదాయం -11, వ్యయం -5, రాజపూజ్యం - 2, అవమానం - 6.
ఈ రాశి వారికి గురువు గోచార రీత్యా జూన్ 29 వరకు తిరిగి నవంబర్ 20 నుండి వత్సరాంతం వరకు లగ్నభావంలో సంచారం వల్ల నిర్ణయాదుల్లో అనుకూలత. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. బాధ్యతలు విస్తరిస్తాయి. అనేక కార్యక్రమాలను నిర్వహించాలి. గుర్తింపు, గౌరవాదులకు ప్రయత్నం. శ్రమ ఉన్నా అన్ని పనుల్లో అనుకూలత. జూన్ 29 నుండి నవంబర్ 20 వరకు వ్యయ స్థాన వల్ల మంచి పనులకు ఖర్చులు చేస్తారు. విశ్రాంతి లభిస్తుంది. ఆథ్యాత్మిక యాత్రలు చేస్తారు. దానధర్మాల వల్ల అత్యంత అనుకూలత. గురువుల కోసం వెచ్చిస్తారు. ధర్మ కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొనడం వల్ల మేలు కలుగుతుంది.
శని వత్సరాంతం వరకు లగ్న స్థాన సంచారం వల్ల బద్ధకం బాగా పెరుగుతుంది. శ్రమాధిక్యం. కార్యనిర్వహణ లోపాలు. ఆత్మ విశ్వాసం కోల్పోతారు. ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్త అవసరం. బాధ్యతల నిర్వహణలో అప్రమత్తంగా మెలగాల్సి వస్తుంది. నిర్ణయాదులు తీసుకునే ముందు ఇతరులతో సంప్రదింపులు చేయడం మంచిది. ఆలస్య నిర్ణయాదుల వల్ల సమస్యలుంటాయి.
రాహువు సెప్టెంబర్ 23 వరకు షష్ఠ స్థాన సంచారం వల్ల వ్యతిరేకతలపై విజయం. గుర్తింపు కోసం ప్రయత్నం. ఋణ రోగాదులను అధిగమించే ప్రయత్నం. పోటీ రంగంలో గుర్తింపు. అధికమైన ఆశింపు ఉంటుంది. తదుపరి వత్సరాంతం వరకు పంచమ స్థాన సంచారం వల్ల క్రియేటివిటీ పెంచుకునే ప్రయత్నం. సంతానంతో జాగ్రత్త. ప్రణాళికాబద్ధమైన జీవితం కోల్పోవచ్చు.
కేతువు సెప్టెంబర్ 23 వరకు వ్యయ భావ సంచారం వల్ల వ్యర్థమైన ఖర్చులు అధికం. పారమార్థిక జీవనం వల్ల మేలు. దానధర్మాలు సంతోషాన్ని సంతృప్తినీ ఇస్తాయి. విశ్రాంతి లోపం సంభవం. తర్వాత వత్సరాంతం వరకు లాభ భావ సంచారం వల్ల అనేక రూపాల్లో ప్రయోజనాలు ఏర్పడతాయి. లాభాలున్నా జాగ్రత్త వహించాలి. పెద్దలతో ఇబ్బందులు. ఈ రాశి వారు రుద్రాభిషేకం, హనుమదారాధన, కరావలంబ స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం పారాయణం చేసుకోవడం మంచిది.
**
కుంభం: (్ధనిష్ట 3, 4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పా)
ఆదాయం -11, వ్యయం - 5, రాజపూజ్యం - 5, అవమానం -6
ఈ రాశివారికి గురువు గోచార రీత్యా జూన్ 29 వరకు తిరిగి నవంబర్ 20 నుండి వత్సరాంతం వరకు వ్యయ భావంలో సంచారం వల్ల వేరు వేరు రూపాల్లో ఖర్చులుంటాయి. విందులు, వినోదాలు, విహారాల కోసమే కాకుండా దైవ ధర్మ కార్యక్రమాల కోసం కాలం, ధనం, శ్రమ వెచ్చిస్తారు. విశ్రాంతి లభిస్తుంది. ఆథ్యాత్మిక ప్రయాణాదులపై దృష్టి. గృహ వాహనాదులు సాధించే ప్రయత్నం. సంతోషంగా ఉంటారు. జూన్ 29 నుండి నవంబర్ 20 వరకు లాభస్థాన సంచారం వల్ల అనేక రూపాల్లో ప్రయోజనాలుంటాయి. పెద్దల ఆశీస్సులు. కొత్త పనుల నిర్వహణపై దృష్టి. వ్యవహార దక్షత. ఆలోచనలకు రూపకల్పన.
శని వత్సరాంతం వరకు వ్యయ స్థాన సంచారం వల్ల కాలం, ధనం వ్యర్థమయ్యే సూచనలు అధికం. శ్రమాధిక్యం. దానధర్మాల వల్ల మాత్రమే మేలు కలుగుతుంది. విశ్రాంతి లోపం అధికం. ఆసుపత్రులను దర్శించాల్సి వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. పరామర్శలకు అవకాశం ఉంటుంది. నిర్ణయాదులు ఇబ్బంది పెడతాయి. వ్యవహారాల్లో సమస్యలు అధికమవుతాయి.
రాహువు సెప్టెంబర్ 23 వరకు పంచమ స్థాన సంచారం వల్ల ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. సంతాన సమస్యలుంటాయి. క్రియేటివిటీ ఉంటుంది. కొత్త పనులపై దృష్టి. అపోహలకు, దురాశలకు అవకాశం. తదుపరి వత్సరాంతం వరకు చతుర్థ స్థాన సంచారం వల్ల సౌకర్యాలు శ్రమకు గురిచేస్తాయి. ఆహార విహారాలపై అధికమైన ఆసక్తి. ఆశించిన సంతోషం అందదు.
కేతువు సెప్టెంబర్ 23 వరకు లాభ భావ సంచారం వల్ల వేరు వేరు రూపాల్లో ప్రయోజనాలుంటాయి. ముఖ్యంగా ఆథ్యాత్మిక లాభాలు. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. ఆశీస్సులు అందుకోవాలి. తర్వాత వత్సరాంతం వరకు దశమ భావ సంచారం వల్ల కార్యనిర్వహణలో లోపాలుంటాయి. అధికారులతో సమస్యలు. సామాజిక గౌరవం తగ్గే సూచనలు. వ్యవహార లోపాలు. ఈ రాశివారు నృసింహ స్వామి స్తోత్రాలు, లక్ష్మీ అష్టోత్తరం, శివారాధనలు చేసుకోవడం వల్ల మేలు కలుగుతుంది.
**
మీనం: (పూర్వాభాద్ర 4 పా, ఉత్తరాభాద్ర, రేవతి) ఆదాయం - 8, వ్యయం - 11,
రాజపూజ్యం - 1, అవమానం - 2.
ఈ రాశివారికి గురువు గోచార రీత్యా జూన్ 29 వరకు తిరిగి నవంబర్ 20 నుండి వత్సరాంతం వరకు లాభభావంలో సంచారం వల్ల వేరు వేరు రూపాల్లో ప్రయోజనాలుంటాయి. లాభాలు సంతోషాన్ని, సంతృప్తినీ ఇస్తాయి. అనేక కార్యక్రమాలను నిర్వహించే ప్రయత్నం ఉంటుంది. పెద్దల ఆశీస్సులు పరిపూర్ణంగా పొందుతారు. లక్ష్యాలను సాధిస్తారు. జూన్ 29 నుండి నవంబర్ 20 వరకు దశమ స్థాన సంచారం వల్ల వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులున్నా గుర్తింపు, గౌరవాదులు లభిస్తాయి. పదోన్నతులకు అవకాశం. సామాజిక వ్యవహారాల్లో అనుకూలత. పితృవర్గ వ్యవహారాలను సంతోషంగా నిర్వహిస్తారు.
శని వత్సరాంతం వరకు లాభ స్థాన సంచారం వల్ల అన్ని రూపాల్లోనూ ప్రయోజనాలుంటాయి. ఆశించిన లాభాలు అందుకున్నా అనవసర వ్యర్థం ఉండకపోవచ్చు. పెద్దలతో కొంత జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. అన్ని పనుల్లోనూ కొంత అనుకూలత ఉంటుంది. వేరు వేరు నిర్ణయాదులు తీసుకునే ప్రయత్నం. శ్రమ ఉన్నా ఫలితాలు అధికం. దురాశ ఉండకూడదు.
రాహువు సెప్టెంబర్ 23 వరకు చతుర్ధ స్థాన సంచారం వల్ల ఆహారవిహారాలపై దృష్టి ఉన్నా ఆశించిన సంతోషం అందకపోవచ్చు. శ్రమాధిక్యం. వేరు వేరు రూపాల్లో సంతోషాలు అందుతాయి. తదుపరి వత్సరాంతం వరకు తృతీయ స్థాన సంచారం వల్ల ప్రయాణాదులపై ఆసక్తి. సోదరవర్గంతో జాగ్రత్త. సహకారం లభిస్తుంది. సంప్రదింపులున్నా మంచి వార్తలు అందకపోవచ్చు.
కేతువు సెప్టెంబర్ 23 వరకు దశమ భావ సంచారం వల్ల వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులుంటాయి. కార్యనిర్వహణలో లోపాలు. అధికారులతో సమస్యలు అధికం. అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. తర్వాత వత్సరాంతం వరకు నవమ భావ సంచారం వల్ల ఆథ్యాత్మిక యాత్రలుంటాయి. కావల్సినవి పొందుతున్నా కొంత అసంతృప్తి, నిరాశ తప్పదు. ఈ రాశి వారు గణపతి ఆరాధన, దుర్గా స్తోత్ర పారాయణలు చేసుకోవడం, అధికంగా దానధర్మాలు చేయడం మంచిది.