క్రీడాభూమి

ఉత్కంఠకు తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెట్టు వీడిన నవాజ్ సర్కారు * పాకిస్తాన్ జట్టుకు లైన్ క్లియర్
టి-20 ప్రపంచ కప్‌కు అనుమతి * పటిష్ఠ భద్రత కల్పిస్తామన్న భారత్

ఇస్లామాబాద్/న్యూఢిల్లీ, మార్చి 11: ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ జట్టు పాల్గొంటుదా? లేదా? అన్న దానిపై గత కొంత కాలం నుంచి కొనసాగుతున్న ఉత్కంఠకు తెర పడింది. భారత్‌లో జరిగే ఈ టోర్నీలో పాల్గొనేందుకు పాక్ ప్రభుత్వం శుక్రవారం ఎట్టకేలకు తమ జట్టుకు అనుమతి ఇచ్చి ఈ సస్పెన్స్‌కు ముగింపు పలికింది. టి-20 ప్రపంచ కప్ టోర్నీలో పాక్ జట్టుకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని భారత్ భరోసా ఇవ్వడంతో భారత్‌లో పాక్ జట్టు పర్యటనకు నవాజ్ షరీఫ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హోం శాఖ మంత్రి చౌదరి నిసార్ అలీ ఖాన్‌తో శుక్రవారం సుదీర్ఘ ఉన్నత స్థాయి సమావేశం ముగిసిన అనంతరం పాక్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నజామ్ సేథీ ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానులకు శుభవార్త. భారత్‌లో జరిగే ప్రపంచ కప్ టి-20 టోర్నీలో పాకిస్తాన్ జట్టు పాల్గొనేందుకు పాక్ హోం శాఖ అనుమతి ఇచ్చింది. దీంతో పాక్ జట్టు శుక్రవారం రాత్రి దుబాయ్‌కి బయలుదేరి అక్కడి నుంచి కోల్‌కతా చేరుకుంటుంది’ అని ఆయన తెలిపాడు. టి-20 ప్రపంచ కప్ టోర్నీ సందర్భంగా పాక్ జట్టుకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని భారత్ హామీ ఇచ్చిందని, ఆ తర్వాత ప్రభుత్వం ఈ విషయమై న్యూఢిల్లీలోని పాక్ హైకమిషనర్‌తో మాట్లాడిన తర్వాత భారత్‌లో పాక్ జట్టు పర్యటనకు అనుమతి ఇచ్చిందని ఆయన చెప్పాడు. అలాగే పాక్ హైకమిషనర్ శుక్రవారం న్యూఢిల్లీలో భారత హోం శాఖ కార్యదర్శితో సమావేశమై భద్రతా ఏర్పాట్ల గురించి చర్చించారని, ఆ తర్వాత టి-20 ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొనే జట్లన్నింటికీ పటిష్టమైన భద్రత కల్పిస్తామని భారత విదేశీ వ్యవహారాల శాఖ కూడా ఒక ప్రకటనలో భరోసా ఇచ్చిందని నజామ్ సేథీ వివరించాడు.
హోం శాఖ కార్యదర్శితో పాక్ హైకమిషనర్ భేటీ
ఇదిలావుంటే, అంతకుముందు న్యూఢిల్లీలో పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ప్రపంచ కప్ టి-20 టోర్నీ విషయమై భారత హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షిని కలసి చర్చలు జరిపారు. ఈ చర్చలు సానుకూల దిశలో సాగాయని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచ కప్ టి-20 టోర్నీలో పాల్గొనే అన్ని జట్లకు పటిష్టమైన భద్రత కల్పించడంతో పాటు వాటికి అవసరమైన ఇతర ఏర్పాట్లు చేస్తున్నామని, కనుక ఈ విషయమై ఆందోళన చెందవలసిన అవసరం లేదని పాక్ హైకమిషనర్‌కు రాజీవ్ మిశ్రా స్పష్టం చేశారని వికాస్ స్వరూప్ ఆ ప్రకటనలో వివరించారు. అయితే పాక్ జట్టుకు నిరంతరం కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆ శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి స్పష్టమైన హామీలు ఇచ్చారని చౌదరి నిసార్ అలీ ఖాన్ ప్రస్తుతం సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌కు వివరించడంతో భారత్‌లో పాక్ జట్టు పర్యటనకు ఆయన అనుమతి ఇచ్చారని పిసిబికి చెందిన ఉన్నతాధికారి ఒకరు పిటిఐ వార్తా సంస్థకు తెలిపాడు.
భారత్‌లో పాకిస్తాన్ జట్టు పర్యటనపై తమకు ఆందోళనలు ఉన్నాయని, కనుక భద్రత విషయమై భారత ప్రభుత్వం లిఖిత పూర్వక హామీ ఇచ్చే వరకూ తమ జట్టును టి-20 ప్రపంచ కప్ టోర్నీకి పంపబోమని పాక్ ప్రభుత్వం గత కొంత కాలం నుంచి బెదిరిస్తూ వచ్చిన విషయం విదితమే. అయితే పాక్ ఆటగాళ్లతో పాటు అధికారులకు, మీడియా సిబ్బందికి, అభిమానులకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని భారత్ హామీ ఇవ్వడంతో పాక్ ప్రభుత్వం మెట్టు దిగక తప్పలేదు. భారత్‌లో పాక్ జట్టు పర్యటనకు నవాజ్ షరీఫ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఎంతో సానుకూల పరిణామమని పిసిబి చైర్మన్ షహర్యార్ ఖాన్ అన్నాడు. ‘ప్రపంచ కప్ టి-20 టోర్నీలో పాకిస్తాన్ ఆట చూడాలని ప్రజలు కాంక్షిస్తున్నారు. మేము కూడా మా జట్టును ఆ టోర్నీకి పంపాలని కోరుకున్నాం. కానీ భారత పర్యటనలో పాక్ జట్టుకు భద్రతా పరమైన ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వం అనుమానాలను వ్యక్తం చేసింది. అయితే ఈ అనుమానాలను భారత ప్రభుత్వంతో పాటు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ), అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) నివృత్తి చేయడంతో కథ సుఖాంతమైంది’ అని షహర్యార్ ఖాన్ అన్నాడు. ప్రపంచ కప్ టి-20 క్రికెట్ టోర్నీలో పాల్గొనేందుకు పాక్ జట్టు భారత్‌కు వెళ్లకపోతే పిసిబికి దాదాపు 150 లక్షల డాలర్ల మేర నష్టం వాటిల్లుతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది తమకు చాలా పెద్ద మొత్తమని షహర్యార్ ఖాన్ గతంలో వాపోయాడు. (చిత్రం) ఇస్లామాబాద్‌లో విలేఖర్లతో మాట్లాడుతున్న పిసిబి ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నజామ్ సేథీ