జాతీయ వార్తలు

పాక్ దాడి భగ్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎయిర్‌బేస్‌పై విరుచుకుపడిన ముష్కర మూక తిప్పికొట్టిన భద్రతా దళాలు
పఠాన్‌కోట్‌లో 16 గంటల హోరాహోరీ ఐదుగురు పాక్ ఉగ్రవాదులు హతం
ముగ్గురు జవాన్లు మృతి జైషే మహమ్మద్‌పై అనుమానం: రాజ్‌నాథ్
సైన్యం తెగువకు హ్యాట్సాఫ్: ప్రధాని త్రివిధ దళాధిపతులతో పారికర్ అత్యవసర భేటీ

పఠాన్‌కోట్, జనవరి 2: భారీ ఆయుధాలతో వచ్చిన పాకిస్తాన్ ముష్కరమూకలు భారత వైమానికదళ స్థావరంపై దాడి చేశారు. శనివారం తెల్లవారుజామున పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానికదళ స్థావరంపై దాడికి విఫలయత్నం చేశారు. 16 గంటల సుదీర్ఘ పోరు తర్వాత భద్రతాదళాలు దాడికి దిగిన ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. దాడిలో ముగ్గురు జవాన్లు మృతిచెందగా, మరో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. రష్యా పర్యటన నుంచి తిరిగివస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మికంగా లాహోర్‌లో ఆగిన వారంరోజులకే దాడి జరగడం గమనార్హం. వైమానిక స్థావరంలో ఉన్న ఫైటర్ జెట్ విమానాలు, యుద్ధ హెలికాప్టర్లను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఆర్మీ దుస్తుల్లో వచ్చిన కొంతమంది ఉగ్రవాదులు భారత్- పాక్ అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పటాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లోకి చొరబడడానికి ప్రయత్నించారు. అయితే అప్రమత్తంగా ఉన్న భద్రతా దళాలు కాల్పులు జరపడంతో బహిర్వలయాన్ని దాటి ముందుకు వెళ్లలేకపోయారు. ఇరుపక్షాల మధ్య పెద్దఎత్తున సాగిన కాల్పుల్లో దాడికి పాల్పడిన ఐదుగురు మిలిటెంట్లను భద్రతా దళాలు మట్టుపెట్టగా, టెర్రరిస్టుల కాల్పుల్లో ఒక కమాండో, వైమానిక దళానికి చెందిన ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మరో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. ‘పఠాన్‌కోట్ ఆపరేషన్‌లో దాడికి పాల్పడిన మొత్తం ఐదుగురు మిలిటెంట్లను మట్టుబెట్టిన సాయుధ బలగాలను, ఇతర భధ్రతా దళాలను అభినందిస్తున్నా’ అని ఆపరేషన్ ముగిసిన తర్వాత హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. భారత్ అభివృద్ధి చెందడం గిట్టనివారే దాడికి పాల్పడ్డారని కర్నాటక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ మైసూరులో అన్నారు. భారతీయ జవాన్ల తెగువను చూసి గర్విస్తున్నానని వ్యాఖ్యానించారు.
పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి చొరబడినట్టు భావిస్తున్న ఉగ్రవాదులు కాందహార్ హైజాక్ ఉదంతంలో విడుదలైన కరుడుగట్టిన ఉగ్రవాది వౌలానా మసూద్ అజర్ నేతృత్వంలోన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారై ఉంటారని భావిస్తున్నారు. మూడు రోజుల క్రితమే భారత్‌లోకి చొరబడిన ఉగ్రవాదులు, శనివారం తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో ఎయిర్‌బేస్‌పై దాడికి ఉపక్రమించారు. వారి టార్గెట్లు ఎయిర్‌బేస్‌లోని మిగ్ -21 ఫైటర్ జెట్ విమానం, ఎంఐ-25 హెలికాప్టర్లే అయి ఉంటాయని కూడా భద్రతా అధికారులు అనుమానిస్తున్నారు. దాడిలో జైషే మహమ్మద్ హస్తం ఉండే అవకాశాలు లేకపోలేదని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి దృష్ట్యా ప్రస్తుతం గోవాలో ఉన్న రక్షణ మంత్రి మనోహర్ పారికర్ హుటాహుటిన ఢిల్లీకి తిరిగి వచ్చి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ‘అన్ని ఏజన్సీలు సకాలంలో స్పందించి, తక్షణం చర్య తీసుకోవడం ద్వారా వైమానిక దళానికి చెందిన విలువైన ఆస్తులను ధ్వంసం చేయాలన్న ఉగ్రవాదుల పథకాన్ని భగ్నం చేయగలిగాం’ అని భారత వైమానిక దళం ఒక ప్రకటనలో పేర్కొంది. ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి భద్రతా దళాలు సిద్ధంగా ఉన్నందున వారు ఐఏఎఫ్ కాంప్లెక్స్‌లోని బహిర్వలయంలో ఉన్న ‘లంగర్’ (వంట శాల)ను దాటి ముందుకు వెళ్లలేకపోయారని దోవల్ నేరుగా పర్యవేక్షించిన ఆపరేషన్ గురించి వివరించిన అధికారులు చెప్పారు. పంజాబ్‌లో ఏడాది కాలంలో జరిగిన రెండో పెద్ద ఉగ్రవాద దాడి ఇది. గత ఏడాది జూలైలో ముగ్గురు ఉగ్రవాదులు గురుదాస్‌పూర్‌లోని దినానగర్ పోలీసు స్టేషన్‌పై దాడి చేయడం తెలిసిందే. కాగా, పంజాబ్‌లో మరో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నారన్న అనుమానంతో భద్రతా దళాలు గాలింపు జరిపే పరిధిని పెంచాయి. వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లను కూడా గాలింపుకోసం రంగంలోకి దించారు.
జై జవాన్: మోదీ
భారత్ అభివృద్ధిని ఓర్వలేని మానవత్వంలేని ఉగ్రవాద మూకలే పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై దాడి చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్‌లో దుయ్యబట్టారు. సీమాంతర ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా సిబ్బందిని ప్రశంసించారు. ప్రాణాలొడ్డి ఉగ్రవాద దాడిని భద్రతా బలగాలు తిప్పికొట్టాయని కొనియాడారు. భారత జవాన్లపట్ల తనకు గర్వంగా ఉందని మోదీ ట్వీట్ చేశారు. భారతదేశం అభివృద్ధిని దెబ్బతీయటమే ఉగ్రవాదుల లక్ష్యంగా కనిపిస్తోందన్నారు. ఉగ్రవాదుల దాడిపై దేశమంతా ఒకే స్వరంతో మాట్లాడితే మంచిదంటూ ఎన్డీయేపై విమర్శలు గుప్పిస్తున్న విపక్షాలకు చురకలు వేశారు. ఉగ్రవాదుల దాడికి గట్టి జవాబు చెబుతామని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు శనివారం తెల్లవారుజామున చేసిన దాడిపై స్పందిస్తూ ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో విజయం సాధించిన జవాన్లను ప్రశంసించారు. జవాన్ల సాహసంపట్ల దేశం గర్విస్తోందని వ్యాఖ్యానించారు. (చిత్రం) టెర్రరిస్టులు దాడికి పాల్పడిన ఎయిర్‌బేస్ వద్ద సాయుధ వాహనంతో మోహరించిన జవానులు, దాడిలో మృతిచెందిన జవాను ఇకాదర్ సింగ్ కుటుంబాన్ని పరామర్శిస్తున్న పంజాబ్ సిఎం ప్రకాష్ సింగ్ బాదల్