రుచి

ఇన్‌స్టెంట్ పచ్చళ్ళు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊరగాయలు అంటే ఆంధ్రుల అభిమాన పచ్చళ్లు. అవి లేకుండా భోజనం పూర్తికాదు. వీటిని పెట్టడానికి కాస్త అనుభవం ఉండాలి. ఆ ఇబ్బందులేవీ లేకుండా సులువుగా అప్పటికప్పుడు తయారుచేసుకుని తినగలిగే కొన్ని పచ్చళ్ళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముల్లంగి పచ్చడి
కావలసిన వస్తువులు
ముల్లంగి కాయ ముక్కలు - 1 కప్పు
ఆవపొడి - 2 టీ స్పూన్లు
మెంతిపొడి - 1/2 టీ స్పూన్
కారం - 1 టీ.స్పూన్
ఇంగువ - కొద్దిగా
చిక్కని చింతపులుసు - 1 టీ.స్పూన్
పసుపు - కొద్దిగా
నూనె - 2 టీ. స్పూన్లు

తయారుచేసే విధానం : ముందుగా కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు విడివిడిగా వేయంచుకుని, పొడి చేసి పెట్టుకోవాలి. కారం ఇంట్లో ఉంటుంది కాబట్టి దాని గురించి ఆలోచించనక్కరలేదు. ముందుగా ఒక బాణ్ణీ తీసుకుని, దాన్లో నూనె వేసి మరగనివ్వాలి. నూనె రెడీ అయ్యాక అందులో ఇంగువ వేసి మంచి వాసన వచ్చాక, దాన్లో ముల్లంగి కోరు వేసి కొద్దిగా వేపాలి. మరీ ఎర్రగా వేపెయ్యకూడదు. కొద్దిగా వేపి పచ్చి వాసన పోయాక దాన్లో కొద్దిగా నీళ్ళుపోయాలి. కోరు మెత్తబడటానికి సరిపడా. మరీ ఎక్కువ పోస్తే ముద్దలా అయిపోతుంది. నీళ్ళు పోసాక మనం రెడీ చేసిపెట్టుకున్న చింతపండు రసం వేసి బాగా కలిపి రసంతోపాటు ఉడకనివ్వాలి.
ఇలా చేయడంవల్ల పులుపు రుచి కోరుకు పడుతుంది. ఇప్పుడు ఆ నీళ్ళు ఆరిపోయవరకు పొయ్యిమీద ఉంచాలి. నీరు ఆవిరి అయిపోయి దాన్లోని నూనె బయటికి వస్తుంది. వచ్చాక ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న మెంతి పొడి, ఆవపొడి, కారం, సరిపడా ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి ఒక నిమిషం సేపు స్టౌమీద ఉంచి దింపెయ్యాలి. నూనె సరిపోలేదు అంటే ఇంకొంచెం పోసుకోవచ్చు. అంటే ముల్లంగి ఊరగాయ రెడీ అయిపోతుంది. చల్లారాక అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది.
ఇలాగే కేరెట్‌తో కూడా చేసుకోవచ్చు. ఈ ముల్లంగి ఊరగాయకి మరీ ముదురుది, మరీ లేతది కాకుండా మధ్యస్తంగా ఉండే ముల్లంగి అయితే బాగుంటుంది.
దోసకాయ ఊరగాయ
దోసకాయ ముక్కలు - 1కప్పు
ఆవపిండి - 2 టేబుల్ స్పూన్లు కారం - టేబుల్ స్పూన్
ఉప్పు - సరిపడా, పసుపు - కొద్దిగా, నూనె - 2 టేబుల్ స్పూన్లు
తయారుచేసే విధానం: దోసకాయని ముక్కలు చేసుకుని ఓ బౌల్‌లో వేసుకోవాలి. తోలుతోబాటే ముక్కలు కూడా కట్ చేసుకోవాలి. ముక్కలు చిన్నగా వుంటే తినడానికి బాగుంటాయి. ముక్కలు బౌల్‌లో వేశాక అందులోనే ఆవపిండి, కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి ఆ తర్వాత నూనె వేసి కలిపి ఓ పక్కగా పెట్టుకోవాలి. కొద్దిసేపయిన తర్వాత కలిపి చూస్తే ఉడికినట్టుగా ఊట కన్పిస్తుంది. అప్పుడు హాయిగా అన్నంలో వేసుకుని తినవచ్చు. ఊరీ ఊరని దోసకాయ అద్భుతంగా ఉంటుంది. ఇందులో వేయ్యాల్సిన ఆవపిండి, కారం అన్నీ పచ్చివే. వేయించినవి కావు. పోపుల డబ్బాలో ఉన్న ఆవాల్ని మిక్సీలో వేసి పొడి చేసి వాడుకోవచ్చు. కావాలంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు.
నిమ్మకాయ ఊరగాయ
దోర నిమ్మకాయలు - 2
ఎండు మిరపకాయలు - 6
మెంతులు - 1/2 టీ.స్పూన్
ఇంగువ - కొద్దిగా
పసుపు - కొద్దిగా
ఉప్పు - సరిపడా
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
తయారుచేసే విధానం
ముందుగా నిమ్మకాయల్ని మధ్యకి రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసిన ఒక్కో ముక్కని తిరిగి మధ్యకి రెండుగా కట్ చెయ్యాలి. అలా కట్ చేసిన ముక్కల్ని మళ్లా ఒక్కోదాన్ని మూడేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంటే ఒక్కో నిమ్మకాయని పనె్నండు ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట.
అలా కట్ చేసిన ముక్కల్ని ఓ పక్కగా ఉంచుకున్నాక, ఓ బాణ్ణీ తీసుకుని దానిలో మెంతులు, మిరపకాయలు విడివిడిగా వేయంచి చల్లారాక పొడి చేసుకుని పెట్టుకోవాలి.
ఇప్పుడు అదే బాణ్ణీలో నూనె వేసి వేడెక్కాక, అందులో నిమ్మకాయ ముక్కలు వేసి రెండు మూడు సార్లు కలిపి ముక్కలు మెత్తపడేందుకు సరిపడినన్ని నీళ్లు పోసి మూత పెట్టి సన్న సెగమీద మెత్తపడనివ్వాలి. కొద్దిగా నీరు ఉండగానే అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న మెంతి పొడి, మిరపపొడి, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి దింపెయ్యాలి. మనం పోసిన నూనె బయటికి తేలి కనిపిస్తుంది. ఆ నూనె సరిపోదు అంటే కావలసినంత వేసుకోవచ్చు. చిన్న చిరుచేదుతో ఇన్‌స్టెంట్ నిమ్మ ఊరగాయ మంచి రుచిగా తినడానికి బావుంటుంది. దీన్ని దోశలలో కూడా ఉపయోగించుకోవచ్చు.

- పూర్వీ