రుచి

తీపి, కారాల సంక్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతి పెద్ద పండుగల్లో మొదటిగా చెప్పుకునేది సంక్రాంతి పండుగనే.. కొత్త పంటలు ఇంటికి వచ్చి ప్రతి ఇల్లూ ధనధాన్యాలతో, భోగభాగ్యాలతో కళకళలాడుతుంటుంది. మరి అలాంటి ఆనందకరమైన రోజుల్లో పిండి వంటలు లేకపోతే ఎలా? అందుకే సంక్రాంతి రోజు రకరకాల పిండివంటలను తప్పనిసరిగా చేసుకుంటారు తెలుగువారు. అందులో ముఖ్యమైనవి అరిసెలు, సకినాలు, జంతికలు.. ఇవి లేకుండా సంక్రాంతి పండుగ జరగదంటే అతిశయోక్తి కాదు. మరి అవి ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా..

కారం సకినాలు

కావలసిన పదార్థాలు
బియ్యం: నాలుగు కప్పులు
నువ్వులు: అరకప్పు
వాము: మూడు చెంచాలు
ఉప్పు: తగినంత
నూనె: వేయించడానికి సరిపడా
కారం: రెండు చెంచాలు
జీలకర్రపొడి: రెండు చెంచాలు
వెల్లుల్లి ముద్ద: పావు కప్పు

తయారుచేసే విధానం

బియ్యాన్ని కడిగి నీళ్లలో నాలుగైదు గంటలు నానబెట్టాలి. తరువాత నీళ్లు వంపేసి బియ్యాన్ని బట్టపై ఆరబెట్టాలి. బియ్యంలోని నీరంతా పోయి బియ్యం కాస్త తడిగా ఉన్నప్పుడే పిండి పట్టించుకోవాలి. లేదా మిక్సీలో వేసి మెత్తని పిండిలా చేసుకోవాలి. తరువాత బాణలిలో నూనె వెయ్యకుండా నువ్వుల్ని వేయించుకుని బియ్యప్పిండిలో వేయాలి. ఇందులోనే వాము, తగినంత ఉప్పు, వెల్లుల్లి ముద్ద, కారం, జీలకర్ర పొడి వేసి నీళ్లు పోసుకుంటూ మురుకుల పిండిలా కలిపి పెట్టుకోవాలి. నిమ్మకాయంత సైజులో పిండిని తీసుకుని వేళ్లతో తడిబట్టపై గుండ్రంగా మూడు, నాలుగు చుట్లు వచ్చేలా చుట్టుకోవాలి. ఇలా మిగిలిన పిండినీ చేసుకుని నూనెలో ఒకటి రెండు చొప్పున వేసి వేయించుకుని తీసుకోవాలి. చల్లారాక ఎయిర్‌టైట్ కంటైనర్‌లో వేసుకుంటే వారం, పదిరోజుల వరకు నిల్వ ఉంటాయి.

సగ్గుబియ్యం చెక్కలు

కావలసిన పదార్థాలు

బియ్యం: మూడు కప్పులు
పెసరపప్పు: కప్పు
సగ్గుబియ్యం: అరకప్పు
నువ్వులు: రెండు చెంచాలు
జీలకర్ర: చెంచా
వెన్న: చెంచా
కారం: తగినంత
ఉప్పు: తగినంత
నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం

బియ్యం, పెసరపప్పు, సగ్గుబియ్యాన్ని కలిపి మెత్తగా పిండిలా చేసుకోవాలి. ఈ పిండిలో నువ్వులు, జీలకర్ర, తగినంత ఉప్పు, కారం, వెన్న వేసుకుని బాగా కలపాలి. ఇందులో తగిననన్ని నీళ్లు పోసుకుని చపాతీ పిండిలా కలపాలి. ఐదు నిముషాల తర్వాత ఈ పిండిని చిన్న చిన్న చెక్కల్లా ఒత్తుకుని కాగిన నూనెలో వేసి, కాస్త రంగు మారాక తీసేసుకుంటే కరకరలాడే సగ్గుబియ్యం చెక్కలు రెడీ.

పుట్నాల జంతికలు

కావలసిన పదార్థాలు

పుట్నాల పిండి: కప్పు
సెనగపిండి: కప్పు
కారం: తగినంత
ఉప్పు: సరిపడా
వాము: ఒక చెంచా
నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం

ఒక గినె్నలో పుట్నాల పిండి, సెనగపిండి, తగినంత ఉప్పు, కారం, వాము, రెండు చెంచాల నూనె వేసి బాగా కలిపి సరిపడా నీళ్లతో జంతికల పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని కొంచెం కొంచెంగా జంతికల గొట్టంలో పెట్టి కాగిన నూనెలో జంతికల్లా వత్తుకుని వేగాక తీసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన, కరకరలాడే పుట్నాల జంతికలు రెడీ.

కోవా కజ్జికాయలు

కావలసిన పదార్థాలు

మైదాపిండి: నాలుగు కప్పులు
నెయ్యి: నాలుగు చెంచాలు
కోవా: రెండున్నర కప్పులు
కొబ్బరి తురుము: కప్పు
యాలకులపొడి: చెంచా
బాదం ముక్కలు: నాలుగు చెంచాలు
జీడిపప్పు ముక్కలు: నాలుగు చెంచాలు
ఎండుద్రాక్ష: నాలుగు చెంచాలు
పంచదార: ఒకటింపావు కప్పు

తయారుచేసే విధానం

ముందుగా ఒక గినె్నలోకి మైదాను తీసుకుని అందులో నెయ్యివేసి కలపాలి. తరువాత కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని మృదువుగా, చపాతీపిండిలా కలపాలి. పిండికి పైన కొద్దిగా నెయ్యిరాసి, పిండిపై తడిబట్ట వేసి కప్పి పక్కన ఉంచాలి. మరో గినె్నలోకి కోవాను తీసుకుని మెత్తగా చిదమాలి. స్టవ్‌పై పాన్ ఉంచి అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. కాగాక ఇందులో కోవాను వేసి అది గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి. ఇందులో పంచదారపొడి, యాలకులపొడి వేసి కలపాలి. తరువాత దీనిలో బాదం, జీడిపప్పుముక్కలు, కొబ్బరి తురుము, ఎండుద్రాక్ష వేసి రెండు నిముషాలు వేయించి, దించి చల్లారనివ్వాలి. ముందుగా కలిపి ఉంచుకున్న మైదాపిండిని చిన్న చిన్న ముద్దలు చేసుకుని చిన్న చిన్న పూరీల్లా వత్తుకోవాలి. ఒక్కోదాంట్లో కాస్త కోవా మిశ్రమాన్ని వేసి కజ్జికాయల మాదిరిగానే వేళ్లతో కాస్త మెలిపెట్టినట్లుగా అంచుల్ని నొక్కాలి. అన్నింటినీ ఇలాగే చేసుకుని నెయ్యి లేదా నూనెలో వేయించి తీసి సర్వ్ చేసుకోవచ్చు.

మినప్పప్పు జంతికలుమినప్పప్పు జంతికలుమినప్పప్పు జంతికలు

కావలసిన పదార్థాలు

బియ్యప్పిండి: నాలుగు కప్పులు
మినప్పప్పు: కప్పు
వాము: ఒక చెంచా
వెన్న: పావు కప్పు
ఉప్పు: తగినంత
కారం: అరచెంచా
నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం

మినప్పప్పును రెండు గ్లాసులు నీళ్లు పోసి కుక్కర్‌లో మూడుకూతలు వచ్చేవరకు ఉడికించుకుని తీసుకోవాలి. తరువాత నీటిని వంపేసి అందులో బియ్యప్పిండి, మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని జంతికల పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని జంతికల గొట్టంలో కొద్దిగా తీసుకుని కాగుతున్న నూనెలో జంతికల్లా వేసుకుని దోరగా వేగాక తీసేస్తే కరకరలాడే మినప్పప్పు జంతికలు రెడీ.

నేతి అరిసెలు

కావలసిన పదార్థాలు

బియ్యం: అరకిలో
బెల్లం: అరకిలో
నూనె: వేయించడానికి
నెయ్యి: వేయించడానికి
తెల్ల నువ్వులు: 100 గ్రాములు

తయారుచేసే విధానం

ముందుగా బియ్యాన్ని నాన బెట్టుకోవాలి. తరువాత నానిన బియ్యాన్ని పిండి కొట్టించుకోవాలి. బెల్లాని మెత్తగా తురుముకుని ఒక గినె్నలో వేసి కొద్దిగా నీళ్లను పోసి స్టవ్‌పై ఉంచాలి. నెమ్మదిగా కలుపుతూ ఉండ పాకాన్ని రానివ్వాలి. తరువాత ఈ పాకంలో నెమ్మదిగా బియ్యప్పిండిని వేస్తూ బాగా కలపాలి. దీనిలో నువ్వులను కూడా వేసి ముద్దగా తయారుచేయాలి. ఇలా తయారైన ముద్దను చలిమిడి అంటారు. ఈ చలిమిడిని చిన్న చిన్న ఉండలుగా చేసి చేతితో గుండ్రంగా వత్తుకోవాలి. తరువాత స్టవ్‌పై బాణలిని ఉంచి సగం నూనె, సగం నెయ్యిని వేసి వేడి చేసుకోవాలి. చేసుకున్న అరిసెలను ఇందులో వేసి బంగారు రంగు వచ్చేంతవరకు వేయించి తీసేసుకోవాలి. ఇలా బయటకు తీసిన వాటిని అరిసెల గరిటెతో గట్టిగా వత్తి ఒక గంట ఆరబెట్టాలి. తరువాత గాలి చొరబడని డబ్బాల్లో నిల్వచేయాలి. ఇవి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. వేడివేడిగా అరిసెలు చేసుకుని అప్పటికప్పుడు తినాలనుకునేవారు పాకం పట్టిన చలిమిడిని ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. అరిసెలను నేతితోనే కాల్చుకోవాలనుకునేవారు నూనెను వాడాల్సిన అవసరం లేదు.