రుచి

చిరుధాన్యాలతో పసందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. హెల్దీగా ఉండాలంటే ఏం తినాలి? ఎంత తినాలి? ఎలాంటివి తినడం ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది అంటూ.. ప్రతిదానినీ పరీక్షిస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటున్నారు. ఈ నేపథ్యమంలో చాలామంది హెల్దీ డైట్ వైపుకు మళ్లుతున్నారు. దీనికి తోడు ఆరోగ్యనిపుణుల సలహా మేరకు చిరుధాన్యాలను వారి డైలీ మెనూలో చేర్చుకుంటున్నారు. అయితే ఈ చిరుధాన్యాలను తినడమంటే చాలా బోర్ అనుకుంటున్నారా? వీటితో రుచికరమైన ఆహారం తయారుచేసుకుంటే సరి.. మరి చిరుధాన్యాలతో చేసుకునే వంటలేంటో చూద్దామా..

అరికెల పలావు

కావలసిన పదార్థాలు
అరికెలు: కప్పు
ఉల్లి తరుగు: కప్పు
పచ్చిమిర్చి: నాలుగు
అల్లం-వెల్లుల్లి ముద్ద: రెండు చెంచాలు
కూరగాయల ముక్కలు: కప్పు
షాజీర: అర చెంచా
ధనియాల పొడి: ఒక చెంచా
నిమ్మరసం: ఒక చెంచా
నెయ్యి: రెండు చెంచాలు
పుదీనా: పావు కప్పు
ఉప్పు: తగినంత
బిర్యానీ మసాలా దినుసులు
దాల్చిన చెక్క: చిన్న ముక్క
లవంగాలు: నాలుగు
యాలకులు: నాలుగు
మిరియాలు: అర చెంచా
సోంపు: అర చెంచా
జాపత్రి: కొద్దిగా
తయారుచేసే విధానం
అరికెలను రెండు, మూడు సార్లు కడిగి తగినన్ని నీళ్లు జతచేసి రెండు గంటలపాటు నానబెట్టుకోవాలి. బిర్యానీ మసాలా దినుసులన్నీ రెండున్నర కప్పుల నీళ్లలో మరిగించి, వడకట్టి పక్కన ఉంచాలి. స్టౌపై మందపాటి గినె్నలో నెయ్యి వేసుకుని వేడి అయిన తరువాత షాజీర, పచ్చిమిర్చి తరుగు, ఉల్లితరుగు, కూరగాయల ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ దోరగా వేయించుకోవాలి. తరువాత పుదీనా, అల్లం-వెల్లుల్లి ముద్ద చేర్చుకుని పచ్చివాసన పోయేవరకు కలియబెట్టాలి. వడకట్టుకున్న నీళ్లు, ఉప్పు, జత చేసి మరగనివ్వాలి. నానబెట్టుకున్న అరికెల బియ్యంలో నీళ్లు ఒంపేసి మరుగుతున్న మసాలా నీటిలో అరికెలను వేయాలి. దీనిపై మూతపెట్టి సన్నటి మంటపై పులావులా వండుకోవాలి. మధ్యలో ఒకటి రెండుసార్లు గరిటెతో తిప్పుతూ మూత ఉంచి ఉడికించాలి. దించేముందు ధనియాలపొడి, నిమ్మరసం, నెయ్యి వేసి పూర్తిగా కలియబెట్టి దింపేయాలి. దీనిపై పుదీనా తరుగు వేసి వేడివేడిగా వడ్డించాలి.

ఊదల పిజ్జా

కావలసిన పదార్థాలు
ఊదలు: అరకప్పు
గోధుమపిండి: అరకప్పు
బేకింగ్ పౌడర్: అర చెంచా
ఉప్పు: తగినంత
నెయ్యి: రెండు చెంచాలు
ఉల్లితరుగు: అరకప్పు
క్యాప్సికమ్ తరుగు: అరకప్పు
టమోట తరుగు: అరకప్పు
మష్రూమ్ తరుగు: అరకప్పు
స్వీట్‌కార్న్: చెంచా
టమోట సాస్: పావు కప్పు
మొజెల్లా చీజ్: తగినంత
తయారుచేసే విధానం
ఊదలను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లను జతచేసి సుమారు రెండు గంటలపాటు నానబెట్టాలి. తరువాత నీళ్లను ఒంపేసి ఊదలను గ్రైండర్‌లో వేసి మెత్తటి పిండిలా రుబ్బి గినె్నలోకి తీసుకోవాలి. దీనికి గోధుమపిండి, ఉప్పు, బేకింగ్ పౌడర్‌లను జతచేసి బాగా కలిపి సుమారు ఆరు గంటలపాటు పులియబెట్టాలి. స్టవ్‌పై పాన్‌ను ఉంచి వేడిచేయాలి. దీనిపై నెయ్యివేసి కాగిన తరువాత పులియబెట్టిన పిండిని గరిటతో తీసుకుని పెనంపై వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. దీంతో పిజ్జా బేస్ సిద్ధమైనట్లే. తరువాత 180 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర అవెన్‌ను ఐదు నిముషాల పాటు వేడిచేయాలి. బేకింగ్ ట్రేలో అల్యూమినియం ఫాయిల్ పేపర్ వేసి తయారుచేసి ఉంచుకున్న పిజ్జా బేస్‌ను ట్రేలో ఉంచాలి. దీనిపై టమోట సాస్, మొజెల్లా చీజ్, టమోట తరుగు, ఉల్లి తరుగు, క్యాప్సికమ్ తరుగు, మష్రూమ్ తరుగు, స్వీట్‌కార్న్ గింజలు ఒకదానిపై ఒకటి వేయాలి. దీన్ని పదినిముషాల పాటు ఒవెన్‌లో బేక్ చేసి బయటకు తీయాలి. తరువాత వేడివేడిగా అందించాలి. పిల్లలు దీనిని ఎంతో ఇష్టంగా తింటారు.

అండుకొర్రల ఊతప్పం

కావలసిన పదార్థాలు
అండుకొర్రలు: పావుకప్పు
మినపప్పు: చెంచా
అల్లం-పచ్చిమిర్చి ముద్ద: చెంచా
ఉప్పు: తగినంత
నూనె: తగినంత
టమోట తరుగు: రెండు చెంచాలు
కొత్తిమీర తరుగు: రెండు చెంచాలు
తయారుచేసే విధానం
అండుకొర్రలు, మినపప్పులను విడివిడిగా శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు పోసి విడివిడిగానే ముందు రోజు రాత్రి నానబెట్టాలి. మరుసటిరోజు ఉదయం నీళ్లు ఒంపేసి గ్రైండర్‌లో వేసి తగినన్ని నీళ్లు జతచేస్తూ మెత్తగా రుబ్బుకోవాలి. దీనిలో అల్లం పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. తరువాత స్టవ్‌పై పెనం ఉంచి వేడయ్యాక ఊతప్పంలా వేసుకుని పైన టమోట తరుగు, ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు వేసి మూత ఉంచాలి. బాగా కాలిన తరువాత రెండో వైపుకు తిప్పకుండా మరికాస్త నూనె వేసి తీసేయాలి. దీన్ని కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటుది.

కొర్ర దోశ

కావలసిన పదార్థాలు
కొర్రలు: మూడు కప్పులు
మినపప్పు: కప్పు
మెంతులు: పావు చెంచా
ఉప్పు: తగినంత
నూనె: తగినంత
తయారుచేసే విధానం
కొర్రలు, మెంతులు, మినపప్పులను విడివిడిగా తగినన్ని నీళ్లు జతచేసి ముందు రోజు రాత్రి నానబెట్టాలి. మరుసటిరోజు ఉదయం నీళ్లను ఒంపేయాలి. గ్రైండర్‌లో మినపప్పు, కొర్రలు, మెంతులు వేసి కొద్దికొద్దిగా నీళ్లు జతచేస్తూ దోసెలపిండిలా మెత్తగా రుబ్బుకోవాలి. సుమారు ఆరేడు గంటలు అలాగే ఉంచాలి. పిండి పొంగిన తరువాత దీనిలో ఉప్పు జతచేయాలి. అలవాటు ఉన్నవాళ్లు సోడా ఉప్పును కూడా జతచేసుకోవచ్చు. స్టవ్‌పై దోసెల పెనం ఉంచి వేడయ్యాక కొద్దిగా నెయ్యి రాసుకుని, రుబ్బి ఉంచుకున్న పిండిని దోసెల్లా వేసుకోవాలి. రెండు వైపులా దోరగా కాల్చుకున్న తరువాత ప్లేటులోకి తీసుకుని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే భలే ఉంటాయి.

సామల టమాటా బాత్

కావలసిన పదార్థాలు
సామలు: కప్పు
ఉల్లి తరుగు: పావు కప్పు
పచ్చిమిర్చి: రెండు
క్యారట్ తురుము: పావు కప్పు
ఉడికించిన బఠాణి: కప్పు
కరివేపాకు: రెండు రెబ్బలు
అల్లం తురుము: చెంచా
ఆవాలు: చిన్న చెంచా
పచ్చి శనగపప్పు: చిన్న చెంచా
మినపప్పు: చిన్న చెంచా
టమోటా తరుగు:
పావు కప్పు
పసుపు: చిటికెడు
కారం: పావు చెంచా
కొత్తిమీర: ఒక చెంచా
నీళ్లు: తగినన్ని
ఉప్పు: తగినంత
నెయ్యి: రెండు చెంచాలు
తయారుచేసే విధానం
సామలకు తగినన్ని నీళ్లు జతచేసి శుభ్రంగా కడిగి సుమారు రెండు గంటలపాటు నానబెట్టాలి. తరువాత స్టవ్‌పై కుక్కర్ ఉంచి వేడయ్యాక కొద్దిగా నెయ్యి వేసి కాగాక ఆవాలు, పచ్చిమిర్చి, సెనగపప్పు, మినపప్పు, ఉల్లితరుగు, అల్లం తరుము, ఉడికించిన బఠాణీలు, క్యారట్ తరుగు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. తరువాత టమోట తరుగు, పసుపు, మిరపకారం వేసి మరోమారు కలపాలి. దీనికి తగినన్ని నీళ్లను జతచేసి ఉప్పు వేసి మరిగించాలి. తరువాత సామలను వడకట్టి మరుగుతున్న మసాలా నీళ్లలో సామలను వేసి కలియబెట్టి మూత పెట్టేయాలి. మూడు విజిల్స్ వచ్చాక దింపేయాలి. చివరిగా కొత్తిమీర చల్లి కొబ్బరి చట్నీతో కానీ, కొత్తిమీర చట్నీతో కానీ తింటే భలే రుచిగా ఉంటుంది.

వరిగ సమోసా

కావలసిన పదార్థాలు
వరిగ పిండి: కప్పు
గోధుమ పిండి: కప్పు
బంగాళాదుంపలు: రెండు
ఉల్లి తరుగు: పావు కప్పు
ఉడికించిన బఠాణి: పావు కప్పు
పచ్చిమిర్చి: 3
కరివేపాకు: రెండు రెబ్బలు
నూనె: వేయించడానికి సరిపడా..
ఉప్పు: తగినంత
ఆవాలు: చిన్న చెంచా
జీలకర్ర: చిన్న చెంచా
తయారుచేసే విధానం
ఒక పాత్రలో వరిగ పిండి, గోధుమ పిండి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లను జత చేస్తూ చపాతీపిండిలా ముద్ద చేసుకోవాలి. దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేయాలి. ఒక్కో ఉండను తీసుకుని చపాతీలా ఒత్తుకుని మధ్యలోకి కట్ చేసుకోవాలి. తరువాత బంగాళాదుంపలను ఉడికించి తొక్కతీసి చేతితో మెత్తగా చిదమాలి. స్టవ్‌పై బాణలి ఉంచి వేడయ్యాక కొద్దిగా నూనె వేసి వేడయ్యాక, ఆవాలు, జీలకర్ర వేయాలి. చిటపటలాడాక ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, బంగాళాదుంప మ్యాష్, బఠాణీ, ఉప్పు జతచేసి అన్నింటినీ వేసి బాగా కలపాలి. తరువాత సగానికి కట్ చేసి చపాతీలో తయారుచేసుకున్న బంగాళాదుంప కూరను ఉంచి సమోసాల్లా చుట్టుకోవాలి. ఇలా అన్నింటినీ చుట్టుకున్న తరువాత స్టవ్‌పై నూనెను ఉంచి వేడిచేయాలి. ఒక్కొక్కటిగా ఈ సమోసాలను వేసి బంగారురంగు వచ్చేవరకు వేయించి పిల్లలకు వేడివేడిగా టమోట సాస్‌తో అందించాలి.