రుచి

వేడివేడి దోసెలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందరికీ ఇష్టమైన టిఫిన్ దోసె. ముఖ్యంగా పిల్లలు పొద్దునే్న స్కూలుకు వెళ్లేటప్పుడు కానీ, డబ్బాలో పట్టుకెళ్లడానికి కానీ దోసెల్ని ఇష్టపడుతుంటారు. కానీ రోజూ ఒకేరకం దోసెలు తినాలంటే వారికి బోర్ కొట్టేస్తుంది. ఎప్పటికప్పుడు వెరైటీగా ఉండే దోసెలు కావాలంటారు. దోసెల్లో రోజుకో కొత్తరకం ప్రయోగాలు చేస్తూ ఉంటే.. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. మరింకెందుకాలస్యం.. ఆ వెరైటీ దోసెల తయారీని చూద్దామా..
*
అండుకొర్రల ఊతప్పం
*
కావలసిన పదార్థాలు
అండుకొర్రలు: పావుకప్పు
మినపప్పు: చెంచా
అల్లం-పచ్చిమిర్చి ముద్ద: చెంచా
ఉప్పు: తగినంత
నూనె: తగినంత
టమోట తరుగు: రెండు చెంచాలు
కొత్తిమీర తరుగు:
రెండు చెంచాలు
తయారుచేసే విధానం
అండుకొర్రలు, మినపప్పులను విడివిడిగా శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు పోసి విడివిడిగానే ముందు రోజు రాత్రి నానబెట్టాలి. మరుసటిరోజు ఉదయం నీళ్లు ఒంపేసి గ్రైండర్‌లో వేసి తగినన్ని నీళ్లు జతచేస్తూ మెత్తగా రుబ్బుకోవాలి. దీనిలో అల్లం పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. తరువాత స్టవ్‌పై పెనం ఉంచి వేడయ్యాక ఊతప్పంలా వేసుకుని పైన టమోట తరుగు, ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు వేసి మూత ఉంచాలి. బాగా కాలిన తరువాత రెండో వైపుకు తిప్పకుండా మరికాస్త నూనె వేసి తీసేయాలి. దీన్ని కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటుది.
*
చిల్లీ చీజ్ దోసె
*
కావలసిన పదార్థాలు
బియ్యం: అరకిలో
మినపప్పు: 100 గ్రాములు
శనగపప్పు: 50 గ్రాములు
ఉప్పు: తగినంత
చీజ్: 50 గ్రాములు
పచ్చిమిర్చి: ఆరు
తయారుచేసే విధానం
బియ్యం, మినపప్పు, శనగపప్పులను ఐదు గంటలపాటు నానబెట్టి రుబ్బుకోవాలి. ఉదయం ఇందులో కొద్దిగా ఉప్పు కలుపుకోవాలి. పచ్చిమిర్చిలను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. దోసెల పెనాన్ని స్టవ్‌పై ఉంచి వేడిచేయాలి. తరువాత రుబ్బి పెట్టుకున్న పిండిని దోసెగా పోసుకోవాలి. దీనిపై పచ్చిమిర్చి తరుగు, చీజ్ తరుగును పట్టించాలి. తరువాత నూనె వేసి దోరగా కాల్చి తీయాలి. ఈ దోసెను కొబ్బరి పచ్చడితో కానీ, పల్లీ పచ్చడితో కానీ తింటే భలే ఉంటుంది.
*
రాగి దోసెలు
*
కావలసిన పదార్థాలు
రాగిపిండి: 300 గ్రాములు
బియ్యం పిండి: 75 గ్రాములు
చిక్కటి, పుల్లటి పెరుగు:
50 గ్రాములు
ఉల్లిపాయ: ఒకటి
పచ్చిమిర్చి: మూడు
కరివేపాకు: ఒక రెమ్మ
కొత్తిమీర: ఐదు గ్రాములు
ఆవాలు: చిన్న చెంచా
జీలకర్ర: చిన్న చెంచా
ఎండుమిర్చి: మూడు
ఉప్పు: తగినంత
నీళ్లు: 100 మిల్లీలీటర్లు
తయారుచేసే విధానం
వెడల్పాటి గినె్నలో రాగిపిండి, బియ్యప్పిండిలకు ఉప్పు చేర్చి కలుపుకోవాలి. ఇందులోనే పెరుగు కూడా చేర్చి బాగా కలిపి పక్కన ఉంచాలి. మరోవైపు బాణలి పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, తరిగిన ఎండుమిర్చితో తాలింపు వేయాలి. ఈ తాలింపును పిండిలో వేయాలి. తరువాత ఉల్లిపాయను, పచ్చిమిర్చిని సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకులను కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు ముక్కలను పిండిలో వేసి కలపాలి. ఇందులో తగినన్ని నీళ్లు పోసి పిండిని గరిటె జారుగా కలుపుకోవాలి. వేడి పెనంపై దోసెలు పోసుకుని నూనె పోస్తూ రెండు వైపులా కాల్చుకోవాలి. వీటిని కొబ్బరి చట్నీతోకానీ, టొమాటో చట్నీతో తింటే చాలా బాగుంటాయి. ఆరోగ్యం కూడా..
*
సోయా దోసె
*
కావలసిన పదార్థాలు
సోయా పాలు: ఒక కప్పు
గోధుమ పిండి: పావు కప్పు
పచ్చిమిర్చి: ఒకటి
ఉల్లి తరుగు: అర కప్పు
కొత్తిమీర తరుగు: ఒక చెంచా
బేకింగ్ సోడా: పావు చెంచా
నూనె: తగినంత
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
గోధుమ పిండిలో సోయాపాలను వేసి కలపాలి. ఇందులోనే పచ్చిమిర్చి, ఉల్లితరుగు, కొత్తిమీర తరుగు, బేకింగ్ సోడా, ఉప్పు వేసి బాగా దోసెల పిండిలా కలుపుకోవాలి. స్టవ్‌పై దోసెల పెనాన్ని ఉంచి వేడయ్యాక కలుపుకున్న పిండిని దోసెలా వేసుకోవాలి. నూనె వేసి రెండువైపులా కాల్చుకోవాలి. దీన్ని టొమాటో సాస్‌తో వడ్డించాలి.
*
కొర్ర దోసె
*
కావలసిన పదార్థాలు
కొర్రలు: మూడు కప్పులు
మినపప్పు: కప్పు
మెంతులు: పావు చెంచా
ఉప్పు: తగినంత
నూనె: తగినంత
తయారుచేసే విధానం
కొర్రలు, మెంతులు, మినపప్పులను విడివిడిగా తగినన్ని నీళ్లు జతచేసి ముందు రోజు రాత్రి నానబెట్టాలి. మరుసటిరోజు ఉదయం నీళ్లను ఒంపేయాలి. గ్రైండర్‌లో మినపప్పు, కొర్రలు, మెంతులు వేసి కొద్దికొద్దిగా నీళ్లు జతచేస్తూ దోసెలపిండిలా మెత్తగా రుబ్బుకోవాలి. సుమారు ఆరేడు గంటలు అలాగే ఉంచాలి. పిండి పొంగిన తరువాత దీనిలో ఉప్పు జతచేయాలి. అలవాటు ఉన్నవాళ్లు సోడా ఉప్పును కూడా జతచేసుకోవచ్చు. స్టవ్‌పై దోసెల పెనం ఉంచి వేడయ్యాక కొద్దిగా నెయ్యి రాసుకుని, రుబ్బి ఉంచుకున్న పిండిని దోసెల్లా వేసుకోవాలి. రెండు వైపులా దోరగా కాల్చుకున్న తరువాత ప్లేటులోకి తీసుకుని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే భలే ఉంటాయి.
*
ఆనియన్ రవ్వ దోసె
*
కావలసిన పదార్థాలు
బొంబాయిరవ్వ: ఒక కప్పు
బియ్యం పిండి: ఒక కప్పు
పచ్చిమిర్చి: మూడు
అల్లం: అర అంగుళం
మిరియాలు: అర చెంచా
జీలకర్ర: పావు చెంచా
ఉప్పు: తగినంత
ఉల్లిపాయలు: మూడు
వేయించిన జీడిపప్పు పలుకులు:
మూడు చెంచాలు
తయారుచేసే విధానం
బియ్యం పిండి, రవ్వలకు నీళ్లు చేర్చి గంట జారుడుగా కలుపుకోవాలి. ఇందులో జీలకర్ర, ఉప్పు వేయాలి. పిండిని నాలుగు గంటల పాటు పక్కన ఉంచి పులియనివ్వాలి. ఉల్లి, పచ్చిమిర్చి, అల్లంలను సన్నగా తరిగి పిండిలో వేసుకోవాలి. అలాగే జీడిపప్పు పలుకులు, మిరియాలు కూడా వేసి కలుపుకోవాలి. పెనాన్ని స్టవ్‌పై ఉంచి వేడయ్యాక పిండిని దోసెల్లా వేసుకోవాలి. నూనె వేసి దోసెను బాగా కాల్చాలి. దీన్ని వేడిగా సాంబార్ లేదా కొబ్బరి చట్నీతో వడ్డిస్తే చాలా బాగుంటుంది.