సాహితి

మార్క్స్ విశ్వాసులకు ఓ దిక్సూచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మానవుని జైత్రయాత్ర ముగిసి,
సర్వోన్నత దశకు చేరుకొనే స్థాయికి మనిషి ఎదిగేడనీ, అతడు అవతరించిన కొన్ని వేల సంవత్సరాలకు మార్క్సు
అనే ఆయన వివేచించేడు. కాని ఆ
వివేచన అర్థం కోల్పోయింది.
ఇంకా వేల యేండ్లు ప్రకృతితో
పోరాడుతూనే ఉంటాడనీ, ఆ పోరాటం అనంతమనీ అనుభవం చెప్తూంది.’’

ఇటీవల- ఏప్రియల్ 2016 - కావలిలోని సొసైటీ ఫర్ సోషల్ ఛేంజ్‌వారు మహీధర రామమోహనరావు రచించిన తొలి నవల ‘రథచక్రాలు’ అందంగా అచ్చులోకి తెచ్చారు. దీనిలో సింగమనేని నారాయణ ముందుమాట ఉన్నది. దాంతోపాటు ఎంతో విలువైంది కేతు విశ్వనాధరెడ్డి 1999లో ఆకాశవాణిలో రచయితతో చేసిన ‘ముఖాముఖి’- 52 పేజీల సుదీర్ఘమైంది అనుబంధంగా చేర్చారు. 20వ శతాబ్దంలో తెలుగు సమాజంలో- తెలుగు సారస్వతంలో తరంగాలు తరంగాలుగా వచ్చిన పరిణామాలు ఈ చర్చలో నిశితంగా పరిశీలింపబడ్డాయి. తొంభైయేండ్లు నిండుతూ వున్న రామమోహనరావుతో సుమారు రెండు తరాల తరువాతి వారైన విశ్వనాధరెడ్డి చర్చించటంలో దర్శించే కోణాలలో కొన్ని తేడాలు కానవచ్చినా- రామమోహనరావు స్పష్టంగా ఎదుటివారి అభిప్రాయాల ఒత్తిడికి లోనుగాకుండా తన అభిప్రాయాలను సరళంగా, విశదంగా వెల్లడిచేశారు.
రామమోహనరావుగారి తండ్రి బ్రాహ్మ సామాజికులు కావటంవల్ల ప్రాచీన ఆచారాల పట్ల వైముఖ్యం, నూత్న జీవన మూల్యాలవైపు ఆకర్షితులు కావటం, ఒక విధంగా ఆయన తరువాత వామపక్ష ధోరణిలోకి సరళంగా సాగిపోవటానికి కారణం అయింది. వీరేశలింగం మొదలైన వారితో ప్రారంభం అయిన సంస్కారం, బ్రాహ్మ సమాజంవల్ల సనాతన బ్రాహ్మణ సమాజంలో - ముఖ్యంగా కోస్తాజిల్లాలలో ఆనుకూల్యాన్ని తెచ్చిపెట్టింది. కాకినాడలో రఘుపతి వెంకటరత్నంనాయుడు ప్రచార ప్రాబల్యంతో చలం, కృష్ణశాస్ర్తీ, వర్తమానంవైపు ప్రయాణించారు. కన్యాశుల్కం నాటి పరిమితులు చెరిగిపోయాయి. స్ర్తివిద్య, వితంతు వివాహం రజస్వలానంతర వివాహం, వర్ణాంతర వివాహం ఇలా మార్పులు క్రమక్రమంగా అంగీకార దశకు చేరుకున్నాయి. మాలపల్లి నవలలో బోల్షివిక్ విప్లవ ప్రస్తావన ఆలోచనలకు పదునుపెట్టింది. జాతీయోద్యమానికి సోషలిస్టు ఆలోచన ఒక బలమైన పార్శ్వంగా రూపుదిద్దుకొన్నది. ఇంచుమించు ఇదే కాలంలో (1924-25) వరంగల్ జిల్లా ఇనుగుర్తినుండి వెలువడే తెనుగు పత్రికలో ‘ఒక వైష్ణవ నియోగి వితంతు వివాహం చేసుకోదలచినాడనీ, ఆసక్తిగలవారు వారి పేరులు తెలిపితే ఆహ్వాన పత్రికలు పంపగలమ’నే ప్రకటన ఉన్నది. సంస్కారోద్యమ ప్రాబల్యం నైజాం రాష్ట్రంలోనూ ప్రసరిస్తున్నదన్నమాట.
భాషా వ్యవహారం విషయంలో తెలంగాణాకు, కోస్తా జిల్లాల వారికీ, ఎంత భేదం ఉండేదో ఈ ముఖాముఖిలో తెలియవస్తుంది. ‘ఆనాడు వస్తుండిన తెలంగాణావారు (పోరాట యోధులు) తెలుగే మాట్లాడేవారు. దానిలో ఒక్క మాట అర్థం అయ్యేదికాదు. రెండుమూడుమార్లు చెప్పించుకునేవాడిని. అప్పటికీ అర్థం కాకపోతే తెలంగాణానుంచి వచ్చి పనిచేస్తున్న సబ్ ఎడిటర్ లక్ష్మీనరసింహారెడ్డిగారిని దగ్గర పెట్టుకోవటం- ఆయన కాకపోతే మరొకరు. పోరాట రంగంనుంచి వచ్చిన కథ తెలుసుకోవటానికి యింత శ్రమ.’ (పే-390). ఈ ‘అర్థంకానితనం’ చాలావరకు తగ్గినా యింకా పూర్తిగాపోలేదు.
భారతీయ సమాజంలో సంస్కరణోద్యమాల ప్రధాన వస్తువు కులభేదాల నిర్మూలన. రామమోహనరావు కులం పట్టు యింతగా ఉండటానికి కారణం గూర్చి ప్రశ్నించితే- ఉత్తర భారతంలోని వర్ణవ్యవస్థ వేరు. దక్షిణ భారతంలోని కుల వ్యవస్థ వేరు అంటారు. కులాల పట్టు దక్షిణంలో ఉన్నంతగా ఉత్తరదేశంలో లేదు. ఉత్తర దేశంలో భక్తి ఉద్యమం- వర్ణ వాదాన్ని త్రోసిరాజన్నది. నిరంతరం ఇస్లాం దండయాత్రలవల్ల జనం ఒక్కటయ్యే ఒత్తిడి పెరిగింది. అయితే దక్షిణ దేశంలో రామానుజులు, బసవేశ్వరులు కుల నిర్మూలకు చేసిన కృషికి - భక్తి వేరు, బ్రాహ్మ్యం వేరుగానే ఉన్నాయి. ‘ఈనాడు వస్తూత్పత్తికీ కుల వ్యవస్థకూ ఉన్న సంబంధాన్ని ఒప్పుకోడం లేదు. వాటిని విడదొక్కింది. అంతటితో ఊరుకోలేదు. కులాల రీత్యా సంక్రమించిన వెనుకబాటుతనాన్ని స్వీకరిస్తూంది. ఆర్థిక పీడనకు గురైనవారిని దళితులుగా స్వీకరిస్తున్నారు. సహజక్రమంలో సమాజంలో వచ్చిన మార్పులు- సంస్కరణలు ఈ కొత్త పేరుతో భేదిస్తున్నాయి. ఇందులోంచి వచ్చిందే మాల-మాదిగ సంఘర్షణ’ (పే 372-373) అని అంటారు.
రామమోహనరావు కాంగ్రేసు సోషలిస్టు పార్టీలో ఉన్నప్పుడు అతికొద్దికాలం టెర్రరిస్టు గ్రూపులోనూ పనిచేశారు. ఆ మార్గం తప్పనుకున్నారా అని ప్రశ్నిస్తే, ‘ఆ మార్గం వదలినప్పుడనుకోలేదు. తరువాత కొన్ని ఏండ్లకు అనుకున్నాను’ అని బదులిచ్చారు.
రామమోహనరావు ఆ కాలంలో గురుకుల విద్య ఎలా ఉండేదో వివరించారు. దానిలోని మేలిమిని చెబుతూనే - ఒక పద్ధతిలో అమలు జరిగిన విద్యావిధానం తరువాత వ్యవస్థలో కుదరదు’ అంటారు (పే-382). అగ్రహారం వంటి తన గ్రామాలు కాలంతోబాటు మారి ‘మాల మాదిగలు’ ప్రవేశానికి అంగీకరించటం వివరంగా చెప్పారు.
తమ ప్రచురణలలో చలం రచనలు వేయటానికి కారణం అడిగితే- వ్యక్తిగత జీవితం ఏమైనా స్ర్తి విముక్తికోసం ఆయన ఎన్నుకున్న మార్గం మాకు నచ్చింది అన్నారు. తెలంగాణాలో జరిగిన ‘నిజాం వ్యతిరేక, రజాకారు వ్యతిరేక పోరాటం తెలంగాణా సమాజ జీవితాన్ని చాలాముందుకు తీసుకుపోయింది. (పే-394).
ఈ ముఖాముఖిలో విశ్వనాథను గురించిన ప్రస్తావన విపులంగానే ఉన్నది. ‘విశ్వనాథవారి యెడ నాకు చాలా గౌరవం. బాల్జాక్‌ను గురించి మార్క్స్ ఎంగెల్సులు చెప్పింది ఆయనకూ సరిపడుతుంది. రాచరికపు వ్యవస్థ మీద ఆయనకు విశ్వాసం ఉంది. కాని ఆ వ్యవస్థ అన్ని కోణాలనించీ పూర్తిగా శిథిలమైందని ఆయన ‘వేయి పడగలు’ చెప్తుంది. నా మనమడు శరశ్చంద్రనూ, మనుమరాలు మంజులనూ ఒకమారు వారింటికి తీసుకెళ్లాను. ఆయనను చూపించి- ఎప్పుడైనా విశ్వనాథవారిని చూచేరా అని అడిగితే చిన్నప్పుడు మా తాతయ్య తీసుకెళ్లి చూపించేరనీ, చెప్పుకోదగిన మహావ్యక్తి అని అన్నారు. (పే-400). తరువాత విశ్వనాథకూ తనకూ జరిగిన వాదం, సమానతా అసమానతల మీద చమత్కారమైన చర్చ వివరించారు.
కేతు విశ్వనాథరెడ్డి అడిగిన ప్రశ్నలో ‘మీరు దళితుల అభివృద్ధి గురించి ఎందుకు రాయరు’ అని (పే-403). తొలినాళ్లలో దళితులకు తాము పడుతున్న బాధల గురించి జ్ఞానం లేదనీ- ఆ దశలో వారి ఎదుగుదలకు తాము (కమ్యూనిస్టు పార్టీ) గాంధీ అనుయాయులూ ప్రయత్నించామనీ, తరువాత వారిలో సామాజిక చైతన్యం కలిగిందనీ, ఈమధ్యనే వారిలో కవులు పుట్టేరనీ, చైతన్యపు ప్రథమ దశలో సాహిత్య ప్రక్రియారూపం అదే అనీ అందువల్లనే ఈమధ్యనే తలనెత్తిన ప్రజలను విశేషించి రాయలేదని చెప్పారు (పే-402).
సామాన్యంగా కమ్యూనిష్టు ఆలోచనలలో కనిపించే నిర్దిష్ట భవిష్యత్తుమీద రామమోహనరావుకు విశ్వాసం లేదు.
‘పురాతన సమాజం, క్రమంగా సహజ పరిణామమని చెప్పే వ్యాసాలు, పుస్తకాలు దొరికినవన్నీ చదివేను. చదవడానికన్నా ఆలోచించేను. మన సమాజంలో ఆ లక్షణాలు ఏమన్నా ఉన్నాయా అని ఆలోచన. నాకు కొన్ని కనిపించేయి. వాటిని బయటకు చెప్పినప్పుడు కమ్యూనిష్టు పార్టీ కేంద్ర కమిటీ నాయకుడు ఘాటే అభ్యంతరం చెప్పడం, నేను వదలకుండా ఆయన తన అభ్యంతరాన్ని మార్చుకొనేలా చేయటం ఒక జైలుకథ 1940 నాటిది. దాని ఫలితమే నా రచనలలో ముందు అడుగు. ఏమిటో చెప్పను’ (పే-404).
ఇంకా ఇలా అన్నారు మహీధరవారు. ‘సమాజం చాలా విస్తృతం. లోకోభిన్నరుచిః ఎవరి రుచిని సమాజం అంగీకరిస్తుంది. కనుకనే భవిష్యత్తు భావితరాలకే వదిలెయ్యాలని, ఆనాటి వారే నిర్ణయించుకుంటారనీ నా అభిప్రాయం’ (పే-405) ఈ మాట అన్నాక ప్రశ్న మనం సైంటిఫిక్‌గా కూడా ఊహించలేమా అని దానికి మహీధరవారంటారు- మహానుభావులైన మనం అనుకునే మార్క్స్, లెనిన్‌లకు కూడా పెట్టుబడిదారీ విధానంయొక్క నేడు కనిపించే పొటెన్షియాలిటీనే ఊహకు అందలేదు. మరవవద్దు’- కేతు ప్రశ్న రచయిత ఏ పార్టీకి చెందినా అతని జీవితాన్ని ప్రమాణంగా తీసుకోవాలా, పార్టీ ఆలోచనలకు ప్రమాణంగా తీసుకోవాలా అనే చర్చ ఉంది కదా అంటే- రామమోహనరావు ఇలా అన్నారు. జీవితాలు మాత్రమే ప్రమాణం నా దృష్టిలో. కొన్ని వేల సంవత్సరాల తరువాతనే కాదు. పదితరాల పిదప మగవాళ్లనీ, ఆడవాళ్లనీ వ్యవహార సరళి ఎలా ఉంటుందో చెప్పలేము. కనుక మనం రాస్తున్న దాంట్లో నిజమే ఉండాలి. రచయితగా నాకది సాయపడింది అని చెప్పుతూ (పే-405) రచనకు జీవితమే ప్రమాణం. జీవితాన్ని అర్థం చేసుకోవడంలోనే ఉంది కీలకం. (పే-406).
వర్తమాన రచయితలకు చేసే సూచనగా మహీధరవారు- జీవితాన్ని కల్పన పేరుతో అబద్ధాలమయం, అసందర్భాలమయం చేయవద్దు. విస్తృతమైన పరిజ్ఞానం ఉంటేనే అది సాధ్యం. విస్తృతమైన పరిజ్ఞానం విస్తృతంగానే చదివితేనే సాధ్యం. అప్పుడే వందలాది మంది జీవితానుభవాలు కూడా మన జీవితానుభవాలకు తోడవుతాయి. (పే-407).
ఇంటర్వ్యూ చివరలో ఆయన తేల్చిన అంశం ఒకటే. అజ్ఞానంతో, బద్ధకంతో, మన ఆత్మవంచనతో (మన పోరాటం)... ఈ పోరాటం ఓ నాడు ముగియదు. అది నిరంతరాయం, సర్వాంతర్యామి..’ దీనిని యింకా వివరిస్తూ- ‘అతని (మానవుని) జైత్రయాత్ర ముగిసి, సర్వోన్నత దశకు చేరుకొనే స్థాయికి మనిషి ఎదిగేడనీ, అతడు అవతరించిన కొన్ని వేల సంవత్సరాలకు మార్క్సు అనే ఆయన వివేచించేడు. కాని ఆ వివేచన అర్థం కోల్పోయింది. ఇంకా వేల యేండ్లు ప్రకృతితో పోరాడుతూనే ఉంటాడనీ, ఆ పోరాటం అనంతమనీ అనుభవం చెప్తూంది. (పే-412).
మానవ సమాజ రుగ్మతలన్నింటికీ ఏకైక పరిష్కారం మార్క్సిజం అని మూఢ విశ్వాసంతో ఆత్మవంచన చేసుకునే మేధావులకు మహీధర రామమోహనరావు వివేచన మంచి మార్గాన్ని దర్శింపజేస్తుందని విశ్వసిద్దాం.
- కోవెల సుప్రసన్నాచార్య
9052629093