సాహితి

కథాతానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథావస్తువు ఏమి వుండాలి - అన్న విషయం రాయదలచుకున్నవాళ్ల అభిరుచిమీద ఎక్కువగా ఆధారపడి వుంటుంది. వాళ్ళు ఎవరిని ఉద్దేశించి రాస్తున్నారో ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి. పిల్లలకు పనికివచ్చే నీతి కథలు రాస్తున్నవాళ్లున్నారు, వయసులో వున్నవాళ్లను అలరించి ఆదరించే కథలు వ్రాసే వాళ్లున్నారు. సంసార సంబంధమయిన సమస్యలను గురించి వ్రాసే వాళ్లున్నారు. వయోధికుల బాధలు, బీదవాళ్ల ఇబ్బందులు, స్ర్తిలకు ప్రత్యేకంగా ఎదురయ్యే ఆటంకాలు, పర్యావరణ కాలుష్యం- వాతావరణ నిర్మల్యం గురించి బోధనాత్మకంగా కథలు వ్రాసే వాళ్లున్నారు. ఇదంతా అట్లా వుంచి, మనిషి మనస్సు- దాని సంకల్ప వికల్పాలు, బుద్ధి విశే్లషణలు మాత్రమే వ్రాసే వాళ్లున్నారు. ఎలాంటి వస్తువును తీసుకున్నా మానవ సమాజంలోని మనుషులు, జీవరాశులు- వాళ్ల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని రచనలు చేయడం శ్రేయోదాయకం. ప్రళయాంతకం అయిన ప్రణయ కథలు వ్రాయడం కంటే, సమాజ సమ నిర్మాణం, సర్వజన సోదరభావం ఎత్తిచూపే కథా వస్తువు ఎక్కువగా అందరినీ ఆకర్షిస్తుంది. అందరికీ ఉపకరిస్తుంది. దీనినే ‘సామాజిక స్పృహ’ అని ఒక్క మాటలో చెప్పుకోవడం కూడా ఇప్పుడు సామాన్యం అయిపోయింది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సామాజిక స్పృహ అంటూ లేని రచన ఏదీ వుండదు. అయితే ఈ స్పృహ రచయిత జీవన స్థాయిమీద, అనుభవాల విస్తరణ మీద ఎక్కువగా ఆధారపడి వుంటుంది. ఒకే విషయాన్ని అనేక రకాలుగా వివరించి చెప్పడం, విశే్లషణ చేయడం ఎలా సాధ్యమో- అలానే కథా వస్తువును కూడా ఎన్ని రకాలుగా నయినా చీలికలు, మాలికలు చేసుకోవచ్చును. చదువరులలో ఒక వర్గానికి ఆమోదయోగ్యంగా వుండేది మరో వర్గానికి అంగీకార యోగ్యం కాకపోవచ్చును. రచయిత కథనరీతిలో అవలంబించే పద్ధతి రుూ యోగ్యతలను సమతలం చేస్తుంది, తొలగించగలుగుతుంది. ఉదాహరణకు ఒక వస్తువు చూద్దాం.
ఒక నిరుద్యోగ యువకుడు అప్లికేషన్‌లు రిజిస్టర్ పోస్ట్‌లోనో, స్పీడ్ పోస్టులోనో పంపటానికి తరచుగా ఒక పోస్ట్ఫాసుకు వెడుతూ వుంటాడు. అక్కడ కౌంటర్‌లో వున్న అమ్మాయి అతనికి బాగా పరిచయం అవుతుంది. అతని ఉద్యోగ ప్రయత్నాలు, నిరసనలు, నిరాశలు అతనినుంచి పంచుకునేంతవరకు ఆ పరిచయం పెరుగుతుంది. పరిచయం పరిణయంగా ప్రగతి పొందితే అది మంచి కథ అవుతుంది. పరిణయంగా మారటానికి రెండు వైపులా అవరోధాలు వుంటే, వాటి వివరాలు, వాటికి మూల కారణం అయిన మనుషుల ప్రస్తావన కొంత దూరం నడిచి పెద్ద కథగా మారుతుంది. అవరోధం గడిచి గట్టెక్కగలిగితే కథ సుఖాంతం అయిందనుకుంటాం. అలా కాకుండా, యిద్దరూ పెళ్లి చేసుకోకపోతే దుఃఖాంతం అంటాం. వాళ్లు ఆ పరిస్థితులలో యిమిడిపోయి జీవితాలను కొనసాగించుకుంటే అది వేరే కథ. అలా కాకుండా, ఎవరో ఒకరు ఆత్మహత్య ప్రయత్నం చేసినా, కథ మరో రకం. ఆత్మహత్య ప్రయత్నం కొనసాగకపోతే పోలీసు కేసులు - మనుషుల కోర్టు కలాపం. ఆత్మహత్య కొనసాగి, ఫలవంతం అయితే అందుకు కారణం అయిన వాళ్ల కథ, కథనం మరో దిక్కు. ఇలా ఒక సన్నివేశం, సంఘటన ఎన్ని మెలికలు అయినా తిరగటానికి వీలవుతుంది. కథనంలో రాజకీయాలు, మతైక విషయాలు, ఆర్థిక అంతస్తులలో వ్యత్యాసం లాంటివి అన్నీ చోటుచేసుకుంటాయి. మనుషులు కులాసాగా వుండి, కుటుంబం శ్రేయస్కరంగా నడవడం సామాజిక అవసరం అయినా, ఇందుకు ఆటంకంగా వున్న అంశాలు ఎన్నో ప్రస్తావనలుగా బయటపడతాయి. వ్యక్తిగతం అనుకున్న ప్రేమ సన్నివేశం, సామాజికం అయి, క్రమంగా ‘గ్లోబలైజేషన్’ కూడా అయ్యే అవకాశాలు వున్నాయి. మనుషుల మనసులు గీసే గీతం ప్రపంచక పరిణామాన్ని ఎలా ప్రభావింపజేస్తున్నాయో చూపించటానికి కథ కంటే అనువైన మరో పదునైన సాహిత్య ప్రక్రియ లేదు. అతి సరళమైన విషయాలను కూడా సంకీర్ణం, సంక్లిష్టం చేసి వాటిని క్రమంగా సవరించుకు వెళ్లి మళ్లీ కథను కథ జీవితాన్ని సరళం చేయగలగడం ఒక క్లుప్తతను, ఏకతను తీసుకువస్తుంది. రచయిత ఉపయోగించిన భాష, శైలి కూడా అనుకూలంగా వుంటే ఆ కథ మంచిదే కాకుండా గొప్పది కూడా అవుతుంది.
ఇందుకు సోదాహరణగా మనకు అనేక కథలు, కథా ప్రపంచంలో నమూనాలుగా దొరుకుతాయి. ఇంతకూ, వస్తువు ఏదైనా కావచ్చును దాని సామాజిక పరిణామం ముఖ్యమైన విషయం. అందుకనే ఏ సందర్భమైన కథ కూడా రచనకు అనర్హం కాదు. దేనికైనా చదివించే గుణం రంగరించి కలిపి చదువరులను ఆకట్టుకోవడం సుసాధ్యం.

- శ్రీవిరించి, ఫోన్ : 09444963584