సాహితి

మెట్లపై కూర్చుని చూస్తున్న నువ్వు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొద్దిగా సహనం కావాలి.. అంతే
చుట్టూ అత్యంత సహజంగానే,
దానంతటదే జరుగుతున్న ప్రతి సందర్భాన్నీ
సంయమనంతో, ఓపికతో,
నిరామయంగా చూస్తూ స్వీకరించడానికి
నీకు కొద్దిగా సహనం కావాలి -

నిప్పును కాల్చనీ, గాలిని వీయనీ
భూమిలో క్షిప్తమై వున్న తడి విత్తనాన్ని మొలకెత్తనీ
ఏ ఆధారమూ లేకుండా నిరంతరం నీపై ప్రేమతో
వ్రేలాడే ఆకాశాన్ని వ్రేలాడనీ
ఇప్పటిదాకా మొగ్గగా ఉండి..
ఈ రాత్రే వికసిస్తున్న పూవును పూయనీ
ఒక్క క్షణం.. ఈ ప్రాతఃవేళ
ఈ కాలిబాటపై నిలబడి వీక్షిస్తూంటే
ఎంత ప్రకృతి జీవ సంరంభమో నీ చుట్టూ.. గమనించు
రాత్రంతా కునికిపాట్లు పడ్డ శీతాకాల ఉదయం
మంచును తొడుక్కుని
పల్లె రైతుల.. గడ్డిమంట ప్రక్కన వణుకుతూ నిలబడ్తుంది కదా
అప్పుడు మార్మి గిలిగింతలతో
నరనరాన ప్రవహించే విద్యుదగ్నిని.. సుతారంగా దహించనీ వెచ్చగా
ఒక చిటికెడు సహనంతో
నీ వేగాన్నీ, పరుగునూ ఆపి నిలబడి చుట్టూ చూడు
తీవ్ర మగ్నతతో.. అంతా సహజ నిరంతర నిర్మాణ క్రియే అంతటా
ఎక్కడా ఏదీ ధ్వంసం కాదు.. ఎక్కడా ఏదీ విచ్ఛిన్నమూ కాదు
ఎక్కడా ఏదీ అదృశ్యమూ కాదు.. ప్రత్యక్షమూ కాదు
అన్నీ రూపాంతరతలే -

జరుగుతున్నదంతా ఒక నిరంతర నిత్యత్వమే
పాదాలు నడుస్తూనే ఉంటాయి.
గమ్యాలు లొంగిపోతూనే ఉంటాయి
దూరాలన్నీ పొగమంచులా అంతరించిపోతూ
ఎదుట.. నవ్వుతున్న పువ్వులు పువ్వులుగా
ముందర మెట్లపై కూర్చుని చూస్తున్న పసిపిల్లల గుంపులుగా
గడ్డిని మేస్తూ.. తలెత్తి అమాయకంగా చూచే గేదెల కళ్ళుగా
నేలపై రాలిన పున్నాగ పూల కుప్పలుగా
చివరికి.. ఎవరివో.. మిగిలిన పాదముద్రలుగా..
అంతా కళ్ళముందు పరుచుకుంటున్న చరిత్రే
చూడ్డానికి కొద్దిగా సహనం.. కొద్దిగా మనిషితనం
నీటిలా వ్యాపించే విశాలత్వం కావాలంతే.. కమాన్ స్ప్రెడ్

సృష్టి రేయింబవళ్ళూ ఎప్పుడూ సంతులితవౌతూనే ఉంటుంది
నిన్నటి నువ్వు.. ఈ రోజు ఎదుగుతావు
నిన్నటి రేయి.. ఈరోజు పగలౌతుంది
నిన్నటి కాలం.. ఒక్కో పొరను చీల్చుకుంటూ
ఒక్కో పుటను మార్చుకుంటూ.. నిర్మిస్తూనే చరిత్రవుతుంది
పక్షులూ, సముద్రాలూ
నీటిపూలుగా విచ్చుకునే వర్షపు చినుకులూ
నిశ్చల సాక్షులుగా పర్వతాలూ
కొద్దిగా సహనంతో చూస్తే.. ఎంత హృద్యమో అంతా -

ప్రక్కనున్న పసిబాలుని చేయికి
నీ చిటికెన వ్రేలును అందిస్తున్న క్షణం
నీకు ఒక విషయం స్ఫురిస్తుంది
మనం వంతెనలను నిర్మించాలి.. కాని గోడలను కాదని -

- రామా చంద్రవౌళి, 9390109993