సాహితి

సాహిత్యం.. విలువల్ని పాతరేయకూడదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహిత్య రంగంలో పాఠక లోకాన్ని ఆకర్షించే ప్రక్రియల్లో కవిత, కథ ముందువరుసలో ఉంటాయి. కవిగాని కథకుడుగాని తన అనుభవ సారాన్ని మనోవైజ్ఞానిక క్షేత్రంలో శుద్ధిచేసి అక్షరాల్లోకి అనువదిస్తుంటాడు. వారి వారి మనో వైజ్ఞానిక సామర్థ్యాన్ని బట్టి భావోత్పత్తి జరుగుతుంటుంది. ఆ భావాలు చక్కని అభివ్యక్తితో అలంకరించబడి, విషయ నవ్యతతో, దార్శనిక దృష్టితో మానవీయ స్పందనలు రేకెత్తే విధంగా సశాస్ర్తియమైన హేతుబద్ధమైనవిగా అక్షరరూపమెత్తుతుంటాయి. మనం సృష్టించే ఈ సాహిత్యపు పరుగు, ఏ గమ్యం లక్ష్యంతో ఎటునుంచి ఎటువైపు దారితీస్తుందో ముఖ్యంగా సాహితీవేత్తలు అవగాహనించుకోవాల్సిన అవసరం వుంది. నడుస్తున్న కాలాన్ని, కాలంలో వస్తున్న మార్పుల్ని, సక్రమంగా పట్టుకుని, వాస్తవాలను నిక్కచ్చిగా నిజాయితీగా ఏ విధమైన మత రాజకీయ ప్రలోభాలకు లోనుకాకుండా సాహితీవేత్తలు వెల్లడించాల్సిన అవసరం ఎంతైనా వుంది.
సాహిత్యం అద్భుతమైన మానసిక కళ. ఇది విషయ విశే్లషణ, వివరణ ఇవ్వడమే కాదు, విషయ పరిజ్ఞానానికి ఆకర్షణీయమైన రంగులద్ది, ప్రకాశవంతమైన తాత్త్విక స్పర్శతో, సౌందర్యవంతమైన సుగంధాన్ని గుండెల్లో గుబాళింపచేస్తూంది. తనివితీరని ఓ ఆసక్తిని రేపుతూంది. ఆత్మచక్షువులను తెరిపిస్తూ కాలాన్ని మరిపిస్తూ పాఠకుణ్ణి అక్షరం అక్షరం వెంట తేనెటీగలా తిరిగేట్టు చేసే ఓ వ్యాసంగం. యాత్రాదాహంతో నిరంతరం ఎక్కడెక్కడికో ఎగిరే పక్షిలా, కవి, కథకుడు కూడా సామాజిక అవగాహనా దాహంతో పరితపిస్తూ విస్తృతమైన విషయ పరిజ్ఞానాన్ని పిడికెడు గుండెలో నిక్షిప్తం చేసుకోవాల్సి వుంది. ప్రళయ భీకర బీభత్స తాండవ జగతి నృత్యాన్ని జాగ్రత్తగా గమనిస్తూ విభిన్న దృక్పథాల్ని విచ్చుకుంటున్న కోణాల్ని, మానవ పరిమళాన్నీ, దానవ విధ్వంసాల్ని పసిగట్టగలగాలి. భయాన్ని కప్పుకొంటున్న వర్గాల్లో నిర్భయాన్ని నింపాలంటే, నవ్వుల్ని రాల్చుకున్న పెదాలమీద చిరునవ్వుల్ని అంటించాలంటే, శ్రమదోపిడీ షాక్ తగిలి నష్టాల ఊబిలోకో, కష్టాల కొలిమిలోకో నెట్టబడుతున్న వారి మనో ఆకాశంలో, ఆత్మవిశ్వాసపు రెక్కలు తొడిగి వో నమ్మకం పక్షిని ఎగురవేయాలంటే, సాహితివేత్తలు తమ కాలాన్ని వెచ్చించి కఠోరమైన శ్రమచేయాల్సి వుంది. మేధోమథనం జరగాల్సి వుంది. నిజమైన కవి స్పందనలు అనువాద ప్రకంపనలు లేపుతూ, కొండల్ని సైతం కదిలిస్తాయి. కరిగిస్తాయి. ప్రవహింపజేస్తాయి. మట్టిగొట్టుకొని ఏదో మూలన నిర్నిద్రలో, నిశ్శబ్దంగా వున్న వస్తువులో సైతం చైతన్యవంతమైన జ్వాలను ఉద్భవింపజేస్తాడు కవి. ఎప్పుడూ ఎరుకతో జీవించడం, స్పృహతో జీవించడం, సజీవంగా బతకడం, సమయస్ఫూర్తిగా నడవడం, చుట్టుముట్టిన యాంత్రిక జీవన విధానాల్లోంచి బయటపడడం ఎరిగిన కవి మాత్రమే ప్రజ్వలిత సందర్భమైపోతున్న ప్రపంచాన్ని తనలో ఇంకించుకోగలడు. ఒక కల్లోల సంక్షుభిత ప్రపంచం నుండి ఒక ఉద్విగ్న మానవుణ్ణి విస్ఫోటింపజేయగలడు. తడిలేని ముడి శిలా హృదయాల్లోకి యాత్రించి మూల రహస్యాలు ఛేదించి తనలోని అక్షరాన్ని తట్టిలేపి విలువైన సమాచారంతో బయటకు వస్తాడు కవి. ఇంతటి నేపథ్యం నైతికతో, భావోద్రేకం, భాషాపటిమగల సాహితీవేత్తల్ని సైద్ధాంతిక ముసుగుల మాటున కట్టడి చేయడం. సాహిత్యాన్ని రాజకీయ పరిజ్ఞానాన్ని దట్టించిన సమాచారంగా మాత్రమే చూస్తూ, విషయం చెప్పడానికి యిన్ని వొంపులేమిటి ప్రతీకాత్మకంగా, కప్పి చెప్పడమేమిటి, జనంలో తిరగని ఓ కొత్త పదజాలాన్ని పట్టుకుని ఊరేగడమేమిటి అంటూ సాహిత్యంలోకి చొచ్చుకవస్తున్న సైద్ధాంతిక రాజకీయ నిపుణులెప్పుడూ ఎత్తిపొడుస్తుంటారు. ‘పాంప్లెట్’ రాతనే మహాకావ్యంగా భావిస్తుంటారు. సాహిత్యానికి ‘పాంప్లెట్’ గుణాలంటించ చూస్తుంటారు. ఒక అపూర్వ అసంపూర్ణ చిత్రంగా మిగిలియున్న సాహిత్యాన్ని ఇంతకుమించి మరేమీ లేదనే ముగింపు పాఠంగా తయారుచేయడానికి సలహాలిస్తుంటారు. అప్పుడప్పుడూ కథకు కవిత్వానికి ‘వర్క్’షాపులు పెడుతుంటారు. నైపుణ్యం లేనివారిచేత ఎట్లా రాయాలో బోధనలు చేయిస్తుంటారు. కవిత్వం ఎలా రాయాలో దానికో సిలబస్, మూల్యాంకనం నిర్దిష్ట పరిధిని, వస్తు నిర్దేశితను నిర్ణయించడానికి యత్నిస్తున్నారు. కవిత్వంలో కవిత్వపు పాళ్ళు లేక కథలో కథనా కౌశలం లేక యిప్పటికే సాహిత్యం, సమాజంలో పాఠకుల్ని కోల్పోతుంది. సాహిత్యం సినిమాల్లో హాస్య సన్నివేశానికి వస్తువుగా మారి ఎగతాళిపాలై కూర్చుంది. వ్యవహారికంగా సరదా సంభాషణల్లో సాహిత్యం మీద జోక్స్ అనేకం పుట్టుకొస్తున్నాయ్. వర్తమాన వస్తు వ్యామోహ ప్రపంచంలో ఆర్థిక బంధాలే అనుబంధాలుగా ఆత్మీయతలుగా విరాజిల్లుతున్న సమాజంలో సాహిత్యం సాహితీవేత్తలు అంటరానితనమనే వివక్షకు గురవుతున్నారు.
ఏదిఏమైనా తెలుగు కవులు కథకులు, వారు ఉత్పత్తి చేసే సాహిత్య సృజనమీద చాలా తీవ్రమైన (సీరియస్) దృష్టి సారించాల్సి వుంది. ఆషామాషీగా, ఉపవృత్తికింద, పొద్దుపుచ్చడానికి తోచిందేదో రాస్తున్నామనే స్థితిలో కవులు, కథకులు ఉండకూడదు. శాస్ర్తియ పరిభాష పదాలనో, పరభాషా పదాలనో, రాజకీయ సైద్ధాంతిక సూత్రీకరణలనో, మతపరమైన వౌలికాంశాలనో మెరుపులుగా వాడిన అక్షర దండలు, సాహిత్యం కాదని ముందు సాహిత్యకారులకు తెలియాలి. సాహిత్య పేజీలను చూసే పత్రికలవారికి తెలియాలి. ఎందుకంటే కవిత్వం లేని కవితలను కథా వస్తు సామగ్రి లేని కథలను వెలుగులోకి తెచ్చేది వీరే కాబట్టి.
కవి తన అనుభవంలోకి వచ్చిన వస్తువును ఎలా స్వీకరించి, ఎలా భౌతికత నుండి శుద్ధి చేసి ఒక అభౌతిక ప్రపంచంలోకి యాత్రించడం నేర్చుకోవాలి. అందరకు తెలిసిన కొననుండి ఎవరికీ తెలియని ఒక అనిర్విచిత లక్ష్యానే్వషణతో కూడిన ఒక భావానే్వషణతో యాత్రిస్తున్నాడా? అనేది ముఖ్యం. భాష, శైలి, శిల్పం తనదైన ముద్రతో విషయ విస్తృతితో పాఠక హృదయాన్ని పట్టుకునేదిగా ఉండాలి.
కథకుడు జీవన సంఘర్షణ నుండి బహిర, అంతరంగిక ఘర్షణ నుండి విముక్తినొందే చైతన్యవంతమైన ఆలోచనలకు పురుడు పోయాలి. కథ ఎత్తుగడ, ముగింపు, కథనరీతి పాఠకుణ్ణి ఆకర్షించేవిధంగా ఉండాలి. ఒక స్టేట్‌మెంట్ లేదా సిద్ధాంతాలతో ముడివడిన రాజకీయాంశమో వరుసగా పేర్చి కథగా నమ్మించాలనుకోవడం కథా సాహిత్యాన్ని పలుచబరచడమే అవుతుంది. కవికిగాని కథకునికిగాని కొత్తచూపుతో పయనించే తాత్త్విక జ్ఞానం ఉండాలి. సాహిత్యంలో సామాజిక దృక్పథం అనే మాట అరిగిపోయిన పాత రికార్డులా ప్రతి సాహిత్య సభలోను వక్తల నోటినుండి జాలువారుతూనే వుంటుంది. ఈ ‘సామాజిక దృక్పథం’ భావన పెడదారి పట్టి పేపర్ స్టేట్‌మెంట్స్, లౌకికభావాలు కవితగా కథగా వస్తుదాస్యంతో వెలువడడం సాహిత్యానికి గొడ్డలిపెట్టుగా మారింది. సాహిత్యపు మూలధాతువు మసిబారిపోతుంది. పాఠకలోకం సాహిత్యాన్ని విస్మరించే దశకు చేరుకుంది. హాస్యపు జల్లులైన జోక్స్, వ్యక్తిత్వ వికాసాలు పాఠక లోకంలో సాహిత్యంగా చలామణి అయ్యేదశకు వచ్చాయి. ఆధునిక సామాజిక సంక్లిష్టతను, పరిపూర్ణతను భౌతికంగా, తాత్త్వికంగా సారభూతంగా పట్టుకునే సాహిత్యం రావాలి. సామాజిక దృక్పథం అంటూ సాహిత్యాన్ని పాతరేయడకూడదనే మెలకువతో సాహితీవేత్తలు శ్రమించాల్సి వుంది.

- కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, 9948774243