సాహితి

‘పట్టు’ తప్పుతున్న కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ అనేది ఏ నిర్దిష్టమైన పాత్ర, కథాంశాల ఎన్నికపై ఆధారపడి తయారుచేయబడుతుంది. పాత్రలు, వాటి పరిధి, వ్యక్తిత్వం పాఠకుల కళ్ళకు కట్టినట్లుగా చిత్రించాల్సిన బాధ్యత రచయితపైన వుంది. ‘ముందు ఈ అంశాన్ని కథగానే రాద్దామనుకున్నాను. కానీ.. పాత్రలు నా మాట వినలేదు. నన్ను డామినేట్ చేసేశాయి. నవలగా మారింది’. ఇది ‘మూడు కథల బంగారం’ సమయంలో రా.వి.శాస్ర్తీగారు చెప్పిన మాటలు. అంటే రచయిత సృష్టించిన పాత్రలు.. ఒక్కొక్కసారి ఆయనను దాటి ముందుకు వెళ్లిపోతాయన్నమాట. ‘వేయిపడగలు’ విషయంలో విశ్వనాథవారు కూడా ఇదేరకమైన వ్యాఖ్యానం చేయటం గమనార్హం. ‘కార్డు కథగా అనుకొన్నది పెద్ద కథగా మారిన సందర్భాలు నాకు ఎదురయ్యాయి’ అంటారు కా.రా మాష్టారు. కథారచన అనేది రచయిత సృజనకు పరీక్ష పెడుతుంది. నిర్దిష్టమైన సమయం, నిర్దేశించే పాత్రలు మధ్యన కథను బిగించి, ఇక్కడ ప్రారంభించాలి, ఈ పాయింటు దగ్గర ముగించాలనే నిర్ణయాలను కొన్ని సందర్భాల్లో రచయితకు సాధ్యం కాకపోవచ్చును. ప్రారంభ, ముగింపులను ముందే ఊహించడం కూడా కష్టమే. ఇక్కడ ప్రారంభించాలనుకొని కాగితాలు ముందేసుకొని కూర్చుంటే.. ఆలోచనలు మరెక్కడికో తీసుకువెళతాయి. ముగింపు విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. చేయి తిరిగిన రచయితలు అందరికి ఇది అనుభవైకవేద్యమే. ‘కథ ముగింపు విషయంలో ఎందుకో నాకెప్పుడూ సంపూర్ణమైన సంతృప్తి కలుగదు. ఏదో అలజడి, అనుమానాలు నన్ను వెంటాడుతుంటాయని’ బుచ్చిబాబు లాంటి ప్రముఖులు చెప్పారంటే.. ఇహ.. కొత్తగా కలం పట్టినవారి విషయం చెప్పనవసరం లేదు.
కథారచనకు కొన్ని నియమాలు.. సూత్రాలు.. చట్రాలు ఏర్పరిచారు. వాటిమధ్యనే కొత్తగా చెప్పాలి. కొత్త కథలు లేవు.. కాని కథనాలు మాత్రం ‘రీడబిలిటీ’కి ప్రాధాన్యతనివ్వాలి. వర్తమానంలో ‘లుక్’ కల్చరే తప్పా.. ‘బుక్’ కల్చర్ లేదాయె.. ఎవరికీ సమయం లేదు. వేగవంతమైన జీవన విధానం పుస్తకం ‘కొని’ చదివే తీరుబడిని ఇవ్వటం లేదు. తమకున్న సమయాన్ని పెద్ద కథలపైన ఖర్చుచేసేంతగా పాఠకులకు ఆసక్తి లేదు. చిన్నకథలు.. సింగిల్ కాలమ్ కథలు అవసరమవుతున్నాయి. ఓ సంఘటనను లేదా ఓ జోక్‌ను ‘సాగదీసి’ ముక్కలుగా చేసి ఇదే కథలంటున్నారు. కా.రా మాష్టారు గారి తొలి రచన ‘కార్డు కథే’. వాటిని క్రొత్తవారు చదవాలి. కథకు క్లుప్తత అవసరమే. కాని.. అది కథాంశ విస్తరణకు.. వివరణకు అడ్డురాని విధంగా సూటిగా.. సరళంగా ‘కథ’ను చెప్పగలిగిన ‘్ఫట్’ రచయితకు తెలిసి ఉండాలి. ‘తెలివి’ ఉండాలి. వర్తమానంలో పత్రికలు కథలకు పెద్దగా ప్రాధాన్యతనివ్వటం లేదనేది ఓ నిష్ఠూరం లాంటి నిజం. కొన్ని పత్రికలు.. లార్జెస్టు సర్క్యులేటెడ్ అనే నేమ్‌ప్లేట్ ఉన్నవి కూడా ఒకటి, అరా కథలను వేస్తున్నాయి. వ్యాపార సూత్రాల కనుగుణంగా, ఆయా పత్రికా ఎడిటర్ల మనసెరిగి వ్రాసిన (వ్రాయగలిగిన) రచయితల రచనలు మాత్రమే ప్రచురణార్హతను సంపాదిస్తాయి. ‘స్ట్ఫా రచయితలు’ సర్వసాధారణం.
ఈమధ్యకాలంలో ఏ దిన, వార, మాస పత్రిక కథల పోటీలు నిర్వహించినా గత పదిహేనేళ్లుగా ‘రాస్తున్నవారే’ కనిపించటం జరుగుతున్నది. అనగా క్రొత్తగా కలం పడుతున్నవారు ‘కొరవడుతున్నారనే’ చెప్పాలి. ఎందువలన అని ప్రశ్నించుకుంటే ‘తెలుగు చదవడమే’ దండగ అనే యువజనం, వారిని ప్రోత్సహించే తల్లిదండ్రులు ఈనాడు ఎక్కువ. కార్పో‘రేటు’ విద్యాశాలల్లో ‘సృజన’ ఎక్కడో.. దానికోసం వెతికే ఓపిక, తీరిక యాజమాన్యాలకు లేదు.. అయినా దానివలన ప్రయోజనమేమిటని ప్రశ్నిస్తున్నారు. ర్యాంకులే ముఖ్యం వారికి. లక్షలు వారి ముఖాన కొడుతున్న తల్లిదండ్రులకు కూడా! కనుక.. క్రొత్త తరం కథలకు క్రమంగా దూరం. నలిగిన కథాంశాలలో.. నలిగిపోయిన కథనాలలో ఆరు నుంచి ఎనిమిది పదులున్న కథకులే కథలు రాయాలి. ఈ నేపథ్యంలో పత్రికలు (కొన్ని.. అనగా చాలావరకు) కథ ‘నాలుగు నుంచి ఐదు పేజీలు’ దాటరాదనే ఓ కొత్త నిబంధనను తెరమీదకు తెస్తున్నాయి. అంతకుమించి దాటితే ‘స్వీకరించమని’ నిష్కర్షగా చెబుతున్నాయి. చిన్న అక్షరాలలో తెలివిగా పేజీలను కుదిరస్తారనే తెలివైన రచయితలుంటారని ముందే ఊహించిన ‘సంపాదకులు’ ఒక పేజీకి ఎన్ని లైన్‌లు ఉండాలో.. లైనుకు ఎన్ని అక్షరాలు ఉండాలో కూడా నిర్దేశిస్తున్నారు. కథలు రాసేవారు ‘జామెట్రి బాక్సు’ను కూడా ముందుంచుకోవాలి కామోసు. పేజీలు కుదింపువలన ‘కథ’ను సమగ్రంగా చెప్పగలమా? పాత్రలను ఎలా పరిచయం చేయాలి? ఎక్కడ ప్రారంభించాలి.. ఎక్కడ ముగించాలి? లాంటి సందేహాలు అనేకం వస్తుంటాయి. ఇన్ని ఆలోచనలమధ్య ‘కథ’ యొక్క ‘పటుత్వం’ తగ్గిపోతుంది. కథనం పలుచనవుతుంది. కథలో రససిద్ధి కరువవుతుంది. పేలవమైన ‘కథ.. కథనాలు’ తయారవుతాయి. వాటినే ప్రచురించి ‘మమ’ అనిపించేస్తున్నారు. ఈ మధ్య కథల పోటీలలో బహుమతులను గెలుచుకుంటున్న కథలలో సహితం ఈ విధమైన ఇబ్బందులు కనిపిస్తున్నాయి. పాత్రలను పరిచయం చేస్తూ.. కథలోని ‘సమస్యను’ వివరిస్తూ.. వాటికి సమగ్రమైన ముగింపును ఇవ్వటంలో ఉన్న చిక్కదనం.. చక్కదనం ‘కుదింపు’లో ‘కత్తిరింపు’కు గురవుతుంది. మరో చిత్రమైన అంశమేమిటంటే కొన్ని పత్రికలవాళ్ళు వారికి నచ్చిన విధంగా కథలోని భాగాలను ‘తీసేస్తున్నారు’.. దీనివలన కంటిన్యూటీ దెబ్బతింటుందని వారికి తెలియక కాదు. పేజీల సంఖ్యే వారికి ముఖ్యం.
పేజీల కుదింపు వలన కథ ‘మదింపు’ చేయటం పాఠకునికి కష్టమవుతుంది. ప్రింట్‌లో తన కథ దుస్థితిని చూసిన రచయిత మనసు కన్నీరెట్టుకుంటుంది (ఇది ప్రముఖ రచయిత ఆరుద్రగారి వ్యాఖ్యానం.. ‘ఎంత నిజం’..). ఇటువంటి నిబంధనలు మంచివే కావచ్చు, ఆ పరిధిలోనే రచయితల ఆలోచనలను ‘ఆపేయటం’ వలన కథలోని ‘మెరుపు’ మాయమై.. ‘పటుత్వము’ కోల్పోయే అవకాశాలున్నాయి. ఈ దిశగా కొంత ఆలోచన చేయవలసిన అవసరం సాహితీకారులపై ఉంది.

- భమిడిపాటి గౌరీశంకర్ 9492858395