సాహితి

కవిత్వం కాలక్షేపం కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిత్వమంటే తెచ్చిపెట్టుకునే ఆవేశాల వ్యక్తీకరణ కాదని, గ్రహించడానికయినా నవ కవులు, రచయితలు తప్పనిసరిగా, కళా విలువల ప్రాశస్త్యాన్ని అర్థం చేసుకోవడానికైనా ప్రాచీన రచనల్ని విరివిగా అధ్యయనం చేయడం మంచిదేమో.. కవిత్వం రాయాలన్న ఆరాటంతోపాటు, కంటికి కనిపించిన ప్రతీదానిని కవిత్వంగా చెప్పాలన్న తపన ఒక్కటే ఉంటే చాలదు. ఆ కవిత్వంలో అవసరమైన గాఢతను కోల్పోకుండా, కవిత్వ నిర్మాణంలో జాగ్రత్త వహించాలి. కవి సాహితీ సృజన ఊహాజనితమైందే కాని, పాఠకులని ఊహాలోకంలో తేలిపోయేలా చేసేది కాకూడదు. రచన వస్తుపరంగా, శిల్ప పరంగా కొత్తదనంతో అలరారేలా వుండాలి. ఎప్పటికప్పుడు సంభవించే మార్పులను కవిత్వంలో ప్రతిబింమించాలి. అలాగే కొత్త కొత్త ధోరణులను కలుపుకుంటూ సాహిత్య చరిత్రను మార్పులూ చేర్పులూ చేసుకోవాల్సిన అవసరం వుంది. వస్తురీత్యా శిల్ప రీత్యా ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగిన తెలుగు కవిత్వం ఎప్పటికప్పుడు వస్తున్న వాదాలతో, నూతన సిద్ధాంతాలతో మరింత పరిపుష్టమై వ్యాప్తి చెందుతున్నది. ఇవాళ్టి జీవితం, సమాజంలోని మార్పుల క్రమం ఇస్తున్న ప్రేరణ ఫలితంగా కవిత్వం విలక్షణంగా వస్తుంది. ప్రతిరోజూ మనం చూస్తున్న విషయాలనే, మనకు ఎదురవుతున్న అనుభవాలనే, మన ఆలోచన మంచు పర్వతాలనే కరిగించి, కవిత్వం అద్భుతమైన అభివ్యక్తితో అలరారుతుంది. కొన్ని రచనలు, కొందరి అనుభవాల సారాంశం అర్థం చేసుకుంటూంటే అనేక ఆసక్తిదాయకమైన, సాహిత్యపరమైన సంగతులు బోధపడతాయి. ఎక్కడ కవి, వస్తువుతో సంలీనమవుతాడో, ఎక్కడ స్పందన గాఢత తగ్గకుండా పదే పదే మననం అవుతుందో, ఎక్కడ అనుభూతి అచ్చంగా అకృత్రిమంగా, అనియంత్రితంగా వెల్లివిరుస్తోందో అక్కడ నిజమై ఉంటుంది. ప్రకృతిలో మాదిరే కవితా ప్రకృతిలోనూ ఒక అచ్చమైన స్వచ్ఛమైన కవితా లక్షణం ఉంటుంది. అలౌకికమైన అందానికి పరవశించినప్పుడో, అమానుషమైన నేరాన్ని ఘోరాన్ని చూసి, మనసు వ్యాకులమై పోయినప్పుడో అపురూపమైన ఆలోచన విరిసినప్పుడో ఒక రచన హృదయాన్ని చీల్చుకొని వెలువడుతుంది.
గ్లోబలైజేషన్ క్రమంలో కొత్త జీవన నమూనాలు ఏర్పడుతున్నాయి. మార్కెట్ మనిషి జీవన రీతిని శాసిస్తోంది. వాణిజ్య వలయాలు మానవ సంబంధాల చుట్టూ బిగుసుకుంటున్నాయి. కార్పొరేట్ సంస్కృతి మానవీయ కోణాల్ని కబళిస్తోంది. ఆర్ద్రమైన భావనలన్నీ చెదిరిపోతున్నాయి. శత్రువు కనిపించకుండానే మనం నిలబడ్డ - కాలి కింద నేలను లాగేస్తున్నాడు. తద్వారా మధ్య తరగతి జీవిత నమూనాలు మారిపోతున్నాయి. ఇవాళ్టి జీవితం, సమాజంలోని మార్పుల క్రమం ఇస్తున్న ప్రేరణ ఫలితంగా కవిత్వం విలక్షణంగా వస్తుంది. ఈ విషయాన్ని గ్రహించి- కవిత్వంలో వ్యక్తమయ్యే, అంతర్, బహిర్ ప్రపంచాల ఘర్షణ, ఈనాటి జీవిత వాస్తవికతకి దగ్గరగా వుంది. మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తుంది.
నిజమైన కవిత్వం సాధారణంగా నిరలంకారంగానే ఉంటుంది. అయితే ఎటువంటి కవిత్వమైనా అలంకారానికి పూర్తి దూరంగా వుండగలదా? ఉపమ, రూపక ఇత్యాది అలంకారాలు లేకుండా కవిత్వంలో గొప్ప అభివ్యక్తి ఎంతవరకూ సాధ్యవౌతుంది? అంటే కవిత్వంలో అలంకారాలు అతికినట్టు కాకుండా అంతర్భాగమై ఉంటే మంచిది. గొప్ప కవిత్వాన్ని చదువుతున్నపుడు మన ఊహాశక్తి రెక్కలు విప్పి ఎగురుతుంది. మన సృజనాత్మక ఆలోచనలకి కావలసినంత పని దొరుకుతుంది. ఆ కవితాక్షరాల్ని మన సొంత దృశ్యాలుగా మలచుకొని రసానుభూతి పొందుతాం. ఆ కవిత్వం బహుముఖమైనపుడు ఆలోచనలో తీవ్రత పాలు ఎక్కువగా వుంటుంది. అది గతి తార్కిక చారిత్రక అవగాహనతో ఉద్దీపనమైప్పుడు వ్యక్తిలోకి వివిధ చైతన్య ముఖాలు సామరస్యంలో వ్యక్తవౌతాయి. అప్పుడు ఒక బిందువునుంచి వివృతమై, చైతన్యంతో సమన్వయాన్ని సాధించుకున్న పరిపూర్ణత అభివ్యక్తమవుతూ, అక్షర తటాకంలో అందంగా విరిసిన కవితాపద్మం అవుతుంది. మానవ సంబంధాల్లోని వైశిష్ట్యం, విషాదాలు, మోహ పారవశ్యాలతో కూడిన అనుభూతుల పరంపరని ఆర్ద్రంగా చిత్రించే కవిత్వం- మానవ మనస్తత్వాన్ని, మనిషి పోకడల్ని హృద్యంగా, ఎలానో తెలుసుకోవాలంటే, మళ్లీ మళ్లీ చదవాలనిపిస్తుంది. కవిత్వాన్ని కాలక్షేపంగానో, కెరీరిజంకు ఒక మెట్టుగానో భావించేవారి మధ్య కవిత్వం పట్ల ఆరాధనతో, తన్మయత్వంగా పరవశించే బుద్ధి జీవులు కొద్దిమందే కనిపిస్తారు. వీరి సాహిత్యానుభవాలు, ఆసక్తిగల చదువరులకు కొత్త పాఠాలు నేర్పుతాయి. కవిత్వానికి, కవి అస్తిత్వ నేపథ్యానికి మధ్య నుండే కార్యకారణ సంబంధంపై, అంతరాంతరాల్లో ఆరా మొదలవుతుంది. కవి పలాయనవాది కాకుండా ఫక్తు సామాజికుడైనప్పుడు, కవితామూలం, కవి అస్తిత్వపు అంతర్ ఆవరణంలోనే ఉంటుంది. ఈ సంబంధాన్ని అర్థం చేసుకునే కుతూహలం వల్ల, వ్యక్తిగా కవి, పాఠకులకు మరింత దగ్గర కావడమో, దూరంగా వెళ్ళడమో జరుగుతుంది. అందువల్ల ఒక కవి తన స్వీయ రచనల్లో మంచి రచనగా ఎంపిక చేసినదాన్ని ఆయన నేపథ్యం నుంచి చదవడం పాఠకునికి మంచి అనుభవం ఇస్తుంది.
నగరంలో ఉంటూ, మధ్యలో ఎప్పుడైనా, తన గ్రామం వెళ్తే, కనిపించే దృశ్యాలు, సంఘటనలు, మనల్ని మరో లోకంలోకి తీసుకువెళ్తాయి. స్మృతులు ధారలు ధారలై గుండెను పొడుచుకుంటాయి. ఒకసారి కవి తన గ్రామానికి వెళ్లినపుడు- చిన్నప్పటి అభిమానాలు అవమానాలు అగుపించి అక్షరాకృతి చేయమంటాయి. ఇదంతా కవిత్వమేనా అంటే- కొలిచే కొత్త కొత్త పడికట్టు రాళ్ళను బట్టి కాకపోవచ్చునేమో గానీ, హృదయం తెరిచి చదువుతున్నప్పుడు, కమనీయమైనది కవిత్వం కాకుండా ఎలా పోతుందన్న భరోసా, దిలాసా కనీసం పాఠకుడికి ఇవ్వాలి కదా..!

- ఎస్.ఆర్. భల్లం, 9885442642