సాహితి

చరిత్రని తీర్చిదిద్దిన చేతులు (ప్రఖ్యాత చరిత్రకారుడు డా. పివి పర్రబహ్మశాస్ర్తికి నివాళిగా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రాజుల సొమ్ము రాళ్ళపాలు’ అని ఒక నానుడి. అక్షరాలలో చెక్కిన రాళ్ళలోనే ఆ రాజుల చరిత్ర దాగి ఉందని పరిశోధకుల భావన. ఆ అక్షర సంపదే తెలుగువారి చరిత్రకి దివిటీలుగా పనిచేస్తాయని నిరూపించినవాడు డా.పి.వి.పరబ్రహ్మశాస్ర్తీ.
రాళ్ళపాలైన చరిత్రని భూమాత తన గర్భంలో పదిలం చేస్తుంది. కొన్ని తిరిగి జన్మిస్తాయి. మరికొన్ని వెలుగుకిరణాల వేకువకోసం నిరీక్షిస్తుంటాయి. అలా నిరీక్షణలో ఉన్న రాతి చెక్కింపులు శాస్ర్తీగారి రాకకోసం క్రీస్తుపూర్వం నుండి మొన్నటిదాక వేచి ఉన్నాయి. శిక్షణవల్ల ఎవరూ చరిత్రకారులు కారు. పురాతత్వ శాస్తవ్రేత్తలు అసలే కాలేరు. అందుకు అవకాశం, జిజ్ఞాస, అభిరుచి నిబద్ధతలు ముఖ్యం. చరిత్ర ఎవరికోసం వేచి ఉండనట్లే చరిత్రకారుడు కూడా సరైన కాలంకోసం వేచి ఉండడు. కాలం అతడిని తీర్చిదిద్దుతుంది. తయారుచేస్తుంది. తన మట్టిచేతులతో అతడి పొదివి పట్టుకుని ఆలింగనం చేసుకుంటుంది. ఇరువురి మధ్యా నెలకొన్న బంధం ఏడడుగుల బంధాలకన్నా, తల్లి చనుబాల మమతలకన్నా బలమైనది.
పుచ్చా వెంకటేశ్వర్లు, రుక్మిణమ్మ దంపతులకు 1921 జూన్‌లో గుంటూరు జిల్లా పెదకొండూరు గ్రామంలో జన్మించాడు. విద్యాభ్యాసంకోసం మదరాసు చేరాడు. బనారస్ వెళ్ళి బి.ఎస్సీ చదివాడు. తల్లిదండ్రులు కొడుకుని విద్యకోసం, ఉద్యోగం కోసం, చరిత్రకోసం స్వేచ్ఛనిచ్చారు. పిఠాపురంలో వ్యాకరణ, తర్క వేదశాస్త్ధ్య్రాయనం చేశాడు. 1948లో పోలీసు చర్య ముగుస్తున్న కాలంలో వరంగల్ జిల్లా జనగామ హైస్కూలులో హెడ్ మాస్టర్‌గా చేరాడు. అది మొదటి ఉద్యోగం. ఆ తరువాత హైదరాబాదులో కేశవ మెమోరియల్ హైస్కూల్‌లో చేరాడు. 1959లో ఎఫిగ్రాపి సహాయకుడిగా పురాతత్వశాఖలో చేరాడు. 1981లో పదవీ విరమణ చేశారు. వృత్తిరీత్యా చరిత్ర, పురావస్తు తత్వాన్ని వంటబట్టించుకుని దాని ప్రేమలో పడిపోయాడు. శాస్ర్తీగారి భార్య పుచ్చా మహాలక్ష్మమ్మ చరిత్ర ప్రేమ జ్ఞానదాహాన్ని తీర్చుకోవడంకోసం ఆయనకు సహకరించింది. ఎన్నో రోజులు కాలికి బలపం కట్టుకుని, చేతిలో శాసనపాఠాల ప్రతులు తీసే సామాగ్రితో ఊరూరా తిరుగుతుంటే ఆమె సంసారాన్ని నడిపింది.
శాస్ర్తీగారు తన సహాయకుడు కొమురయ్యని వెంటేసుకుని తిరగని ఊరు లేదు. ఏ రూపంలోనైనా లభించిన చిన్నక్లూని ఆయన వదిలిపెట్టలేదు. తెలుగు, సంస్కృతం, ప్రాకృత, కన్నడ శాసనాలు సుమారు రెండువేల దాక తవ్వితీసి, వాటిని ప్రతులు, ఫొటోలు తీసి, అధ్యయనం చేశాడు. రాతి శాసనాలు, రాగి శాసనాలు అని తేడా లేదు. చరిత్ర పూర్వయుగం, చరిత్ర యుగం, మధ్యయుగం, ఆధునిక కాలం అన్న తేడా ఉండదు. ఏదైనా అది అక్షరమే. ఐతే అక్షరాల చెక్కింపు ఒకే తీరుగా ఉండదు. అందరూ ఒకేలా రాయరు. ఆయా కాలాలలో ఒక్కో తీరుతెన్నుతో రాయబడుతుంది. వాటిని చదవడం అంత సులభం కాదు. అది ఒక చరిత్ర విజ్ఞానశాస్త్రం. అది అందరికీ అలవోకగా అలవడదు. దాని మీద అవ్యాజమైన ప్రేమానుబంధం పెనవేసుకుపోవాలి. చరిత్ర చెలియ ఎప్పుడూ ఆకర్షణకు గురిచేస్తుంది. ఓపిక ఒక్కటే ప్రేమకు గీటురాయి. శాస్ర్తీగారు నిండైన చరిత్ర ప్రేమికుడు. ఆ అక్షరాల చెక్కింపులని తెలసినవి కొన్ని పిచ్చిగీతలు కావచ్చు. సగం విరిగిన, మలిగిన శాసనాలు కావచ్చు. ఎలాంటి ప్రాధాన్యతలేని శుష్కాక్షరాలు కావచ్చు. లోగడ చరిత్రకారులకు దొరికిన శాసనాలే అయ్యుండవచ్చు. ఐనా పట్టిన పట్టువిడవరాదు. కొనసాగే ప్రేమపాశం మధ్యలో విడవకూడదు. చిన్ని చిన్ని కారణాలవల్ల దూరం పెరగవద్దు.
మానవ పరిణామక్రమంలో ఓనాడు వెలువరించిన వస్తుసంస్కృతి ఆధారంగా చరిత్రను నిర్మించే పని తన భుజస్కంధాలపై వేసుకున్నారు శాస్ర్తీగారు. రాతి నిర్మాణాలు, రాతి శాసనాలు, రాతి విగ్రహాలు అన్నీ చరిత్రను తెలియజేసే ఫాలభాగాలే. జీవధాతువులే కాదు. పర్యావరణ, ప్రాదేశిక వస్తుసామగ్రి (ఇజ్య చ్ఘిషఆఒ, ళష్య చ్ఘిషఆఒ) అన్నీ చరిత్రకు ఆధారభూతాలే.
శాస్ర్తీగారు ఇంటిలోకన్నా ఆఫీసులోకన్నా క్షేత్ర పర్యటనలోనే ఎక్కువ రోజులు గడిపారని చెప్పవచ్చు. కర్నూలు జిల్లాలో ఒక ఊరిలో భూమిలోంచి శిలాశాసనం తీసి ఉత్సుకతతో దాని ప్రతి తీస్తుండగా వారిని, వారి సహాయకుడు కొమురయ్యని బంధించారు. తరువాత అసలు విషయం తెలుసుకుని వదిలిపెట్టారు. అలా శాసన సాహిత్యం సేకరణలో అనేక ఇబ్బందులు పడి చరిత్ర సమగ్రతకోసం పాటుపడ్డారు.
శాసనాలు ఎక్కువగా రాజుల పాలనకు సంబంధించి ఉంటాయి. అలాంటి శాసనాలు ఆయా రాజవంశాలకు చెందిన చరిత్రని తెలియజేసాయి. కాకతీయ రాణి రుద్రమదేవి ఎప్పుడు ఎలా మరణించిందని చాలా కాలంగా తెలియని విషయాన్ని కాకతీయ రాజుల కాలక్రమంలో అసంగతులు, అసంపూర్ణతని వరంగల్ జిల్లాలోని బయ్యారం శాసనం తదితర ఆధారాలతో సమగ్రం చేశారు. వాటిలోని అంశాలతో కాకతీయులపై సమగ్ర పరిశోధన చేయడానికి వీలు ఏర్పడింది. ఆ పరిశోధనని తన పి.హెచ్‌డి పట్టాకోసం రూపొందించారు. ఆయన పనిచేస్తున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ పార్ట్‌టైం పి.హెచ్‌డి. చేసే వీలు లేదు. అందుకే కర్ణాటకలోని కన్నడ విశ్వవిద్యాలయంలో పరిశోధించారు. కోటి లింగాలలో లభ్యమైన నాణేల ఆధారంగా శాతవాహనులు, పూర్వ శాతవాహనులు, ‘‘శాతవాహన ఎపోక్- ఎన్సులైట్’ అనే పుస్తకం రాశారు. కరీంనగర్, నలగొండ, కడప జిల్లాల శాసన సంపుటాలు తయారుచేశారు. విస్తృతమైన శాసన సాహిత్యంపై అనేకమైన వ్యాసాలు, పరిశోధన పత్రాలు రాశారు. ఈ రచనలన్నీ తెలుగునేలపై పరిపాలన సాగించిన పాలకుల, పాలితులకు సంబంధించిన రాజకీయ చరిత్ర, సామాజిక సాంఘిక చరిత్రలకు ఉపయోగపడ్డాయి. తెలుగు-ఆంధ్రాము వంటి పదాల చరిత్రని ప్రాదేశిక చరిత్రనే పథ్యంలోంచి వివరించారు. రామాయణంలో పేర్కొన్న ‘లంక’తెలుగు పదం అని నొక్కిచెప్పారు. ప్రాకృత శాసనాలలో, గ్రంథాలలో తెలుగు పదాలను పీరినాటిపై వ్యాసాలు రాశారు. ఎఫిగ్రఫిస్టు తప్పక లింగ్విస్ట్, ఫైలాలొజిస్ట్ కావలసిన ఆవశ్యకత ఉంది. అలా శాస్ర్తీగారు వివిధ అధ్యయన రంగాలలో కృషిచేశారు. ‘ప్రాచీనాంధ్ర దేశ చరిత్రలో గ్రామీణ జీవనం మీద సాధికార గ్రంథాన్ని వెలువరించారు.
శాస్ర్తీగారికి ప్రచారం ఇష్టం లేదు. నిశ్శబ్దంగా తన మానాన తాను పని చేసుకుంటూ పోవడమే ఇష్టం. తన కృషికి విద్యాత్మక గుర్తింపులు వస్తే కాదనలేదు. ప్రభుత్వం, ఇతర సంస్థల నుండి రాజకీయ రంగంలోంచి గుర్తింపురావాలని ఆశించలేదు. తాను గడిపిన ధార్మిక జీవనంలో ఆయన వ్యక్తిగత సంతృప్తిని పొందాడు. చరిత్రని తన వృత్తి, ప్రవృత్తిగా మార్చుకున్నాడు. నిజానికి దక్షిణ భారతదేశం స్థాయిలో అతనికి గుర్తింపు రావలసి ఉండింది. కాని అతని చుట్టూ తనలాగే పరిశోధన రంగానికి చెందిన పరిశోధకులే ఎక్కువ. అదే ఆయనకు సంతృప్తి. చరిత్ర తన చరిత్రని రాసుకుంటే అందులో శాస్ర్తీగారిది ఒక ప్రత్యేక అధ్యాయం ఉంటుంది. ఆయన ఫొటో అక్కడ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయనకి అలాంటి గిట్టవు. అందుకే శాస్ర్తీగారి వ్యక్తిత్వం పట్ల అభిమానం చాలామందికి.
కుహనా చరిత్రకారులు పెచ్చుపెరిగిపోతున్న కాలం ఇది. రాసిన చరిత్రని, చూసిన చరిత్రలని తిరిగి తామే కనుక్కుంటున్నట్లు చెప్పుకుంటున్న ఈ రోజుల్లో శాస్ర్తీగారిని తలుచుకోక తప్పదు. పత్రికల వార్తగా వేలాదిసార్లు అచ్చెక్కేవారు. కాని ఏనాడూ అలాంటి ప్రచారార్భాటానికి ఇష్టుడు కాదు. ఆధారాలతో చరిత్రని నిర్మించడం ఆగిపోతున్న సమయంలో శాస్ర్తీగారు లేని లోటు మరీ మరీ గుర్తొస్తుంది. అదే ఆయన ప్రత్యేకత!
ఆధారాల అధ్యయనం లేకపోవడమే చరిత్రకు అవమానం. చరిత్రని సగౌరవంగా తీర్చిదిద్దిన చేతులను నమస్కరిద్దాం.

- జయధీర్ తిరుమలరావు, 9951942242