సాహితి

కథా భూమిక (శ్రీవిరించీయం 9)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందరు రచయితలు, పూర్తిగా ఉత్తరాలతోనే కథనంతటినీ నింపేస్తారు. కొందరయితే కేవలం సంభాషణల్లోనే కథనం అంతా నడుపుతారు. అలాగే కథంతా వర్ణనలతో నింపేసే రచయితలూ ఉన్నారు. ఏ పద్ధతిని అవలంబించినా, ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే-కథ నడవాలి. పాత్రలను కాగితంమీద, చదువరని మన్ఫఃలకంమీద ముందుకు లాక్కుపోవాలి. ఇటుకలు పేర్చుకుంటూ, గోడను ఎత్తుకు లేపుకుపోయినట్టుగా కథ బలిష్టంగా పైకి ఎదగాలి. అలా ఉత్కంఠతో కథను నడిపినప్పుడు ఏ పద్ధతిలో రాశాం అనేది గుర్తు రాదు. కొందరు కవులు కథనంతటినీ పద్యాలతోనో గీతలతోనో రాసేస్తే, దానికి ‘ఖండకావ్యం’ అనో ‘కావ్యగీతం’ అనో నామకరణం చేయడం కూడా అమలవుతోంది. సంభాషణలతో కథంతా నడిపినంత మాత్రం చేత అది ‘నాటిక’ అయిపోదు. కథ అంతటిలోను ఏకత, అనుకూలత, పఠనీయత ఉండాలి. రూపం ఎలాంటిది ఎన్నుకున్నా, నిర్మాణంలో సమతుల్యత, సమరసత ఉండడం అవసరం. కథా వస్తువు, ప్రయోగాత్మకత, సాధారణంగా ఈ రకాలుగా విభజన చేసుకోవచ్చును. దైనందిన జీవనాన్ని ప్రతిబింబించడం; ఆచార వ్యవహారాల యదార్థ ప్రదర్శనం - వాటిపట్ల ఆప్యాయత, మక్కువ చూపడం- లేదా సహేతుకమైన పరిహారం చూపడం; మాండలిక పదజాలాన్ని పాత్రోచితంగా ఉపయోగించడం; ఇంకా లోతులకు వెళ్లి గ్రామ్య పలుకుబడులను సమయోచితంగా ప్రయోగించడం; నైతికతకు విలువలు ఇవ్వడం, విలువలలో జానపద లాలిత్యం చూపడం సహజత, క్లుప్తత, నిజాయతీ కొరవడకుండా వుండడం, కథా వ్యూహం సరళంగా ఉండడం శ్రేయోదాయకం. ఎక్కువ మలుపులు, విరుపులు, తిరుగుబాట్లు చూపించి కథను పద్మవ్యూహం లాగ తయారుచేయడం చదువరికి అభిలషణీయం అనిపించకపోవచ్చును. తెలివైన రచయిత చదువరులను ఆకట్టుకోవడానికి తనతో కట్టిపడవేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అతను ఎంతమందిని తన చుట్టూ పోగుచేసుకోగలిగితే, అంతగా కృతకృత్యుడు అయినాడు అనుకోవచ్చు. అల్పాక్షరాలతో బహుళార్థ ప్రయోజనం కథానికలో సాధించవచ్చు. విరామ చిహ్నాలు, శైలిలో ఒక ప్రత్యేక భాగం అనే విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఎక్కడ కామా, ఫుల్‌స్టాప్, సెమీకోలన్, వరసగా చుక్కలు అవసరమో రచయిత ప్రత్యేక శ్రద్ధతో వినియోగించాలి. విరామ చిహ్నాలలో తప్పుదారి ఏర్పడితే కథా గమనం, పరమార్థం మారిపోతాయి, చెదిరిపోతాయి. ‘రామునితో కపివరుండు ఇట్లనియె’ అన్న వాక్యంలో పదాల మధ్య విరామం ఎక్కడ ఇవ్వాలో గమనించకపోతే ‘తోక’ మిగులుతుంది కదా! కథా రచయితలు ఎంతమంది ఉన్నారో అన్ని రకాల రచన శైలులు కూడ ఉండడానికి అవకాశం ఉంది. ఎవరి శైలి, ఎవరి పద్ధతి వారిది. యువ రచయితలు ప్రారంభ దశలో అప్పటికే లబ్ధప్రతిష్ఠులైన రచయితల ధోరణికి దాసులు అయిపోయినా, వాళ్లు పరిణతి పొందిన తరువాత తమదే అయిన శైలిని, సరళిని నిర్మాణం చేసుకుంటారు. అంటే అంతకుముందు తాము చిక్కుకుపోయిన మూస (గూడు)లోంచి బయటపడి బతికిపోతున్నాడన్నమాట. కథ సామాన్య లక్షణాలకు దూరం కానంతవరకు, ఏ రచయిత అయినా తన శైలిని శక్తిమంతంగా సాధించుకోగలుగుతాడు.

- శ్రీవిరించి, ఫోన్ : 09444963584