సాహితి

మరో మల్లినాథుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగువారికి చాలాకాలం నాడు ఒక మల్లినాథసూరి కాళిదాస కావ్యాలకు గొప్ప వ్యాఖ్యానాలు రాసి సంస్కృత సాహిత్య భిక్ష పెట్టినాడు. అటు తరువాత వేదాంత దేశికులు తమ సంస్కృత పాండితీప్రకర్ష చేత అనేక రచనలు చేస్తే అవన్నీ సంస్కృతంలో ఉండి కొందరికే తెలిసే స్థితి ఏర్పడింది. తమిళదేశం వారు వాటిని ఇంగ్లీషులోకి, తమిళంలోకి అనువదించుకున్నారు. తెలుగువారికి దేశిక సాహిత్యం పరిచయం కాకపోవడం అనే లోపాన్ని గ్రహించి కెవి రాఘవాచార్య గారు అసిధారావ్రతంగా పాదుకా సహస్రానే్న కాకుండా అనేక రచనలకు గొప్ప వ్యాఖ్యానాలను రచించారు. గొప్ప ప్రబంధమైన యాదవాభ్యుదయాన్ని వ్యాఖ్యానించటం కెవి రాఘవాచార్యగారి చిరకాల సముపార్జిత సంస్కృతాంధ్ర తమిళ సాహితీ వైభవానికి తార్కాణం. వీరి రచనల్లో దివ్య ప్రబంధాల శక్తి కూడా చోటు చేసుకోవటం తెలుగువారి అదృష్టం. ఈవిధంగా మన కాలానికి మళ్లీ మల్లినాథసూరి రాఘవాచార్య రూపంలో అవతరించి అపూర్వమైన సాహిత్యాన్ని అందించటం తెలుగు సాహితీ లోకానికి గొప్ప వరం అనటం అతిశయోక్తి కాదు. రాఘవాచార్య సంప్రదాయ విద్యలను గురుముఖత: కాకుండా స్వయంగా ఆనాటి పండితుల కృప వల్ల సాధించారు. ఏకోపాధ్యాయ పాఠశాల అధ్యాపకుడిగా జీవితం ఆరంభించి విద్యతోపాటు అంచెలంచెలుగా అనేక పదవులను పొందారు. ఎన్నడూ పరుషమైన పద్ధతికి చోటులేని సాహితీ తపస్విగా పేరుగాంచారు. ఆయన్ను అనేక సంస్థలు, పీఠాధిపతులు, విశ్వవిద్యాలయాలు సమ్మానించి, ఎన్నో బిరుదులిచ్చాయి. తిరుపతి వేదవిశ్వవిద్యాలయం శాస్త్ర విద్వన్మణి, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వారు వాచస్పతి, సద్గురు కందుకూరి శివానందమూర్తి సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ఎమినెంట్ సిటిజన్ పురస్కారం, అహోబిల పీఠాధిపతుల వారు మహావ్యాఖ్యాతృ పురస్కారాలనిచ్చి గౌరవించి వారి వ్యాఖ్యాన విద్యావైభవానికి గుర్తింపు తెచ్చిపెట్టారు. భగవధ్యాన సోపానం, భగవద్విషయం, పాదుకాసహస్రం (6 సంపుటాలు), నారాయణ శతక వ్యాఖ్య, రుక్మిణీకల్యాణం, సుదర్శనాష్టకం, యతిరాజ సప్తతి, శ్రీస్తుతి, శ్రీనివాస దయాశతకం, న్యాసవింశతి, యాదవాభ్యుదయం వంటి వారి అనేక రచనలు అద్భుతమైన తెలుగు వ్యాఖ్యానంతో తెలుగువారికి చాలా సులువుగా, తేలికగా, స్పష్టంగా అవగాహన కలిగే విధంగా అందించిన సాహితీ తపస్వి శ్రీమాన్ రాఘవాచార్యులు. జ్ఞానాన్ని అనుసరించి బుద్ధి, మేధ, స్మృతి ఉంటాయని అక్షర రూపంగా నిరూపించిన విద్వన్మణి ఆయన. 1929లో వెంకటమ్మ, మనోహరాచార్యులకు పెద్ద కుమారుడిగా రాఘవాచార్య జన్మించారు. వీరికి నలుగురు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ఆనాటి ప్రసిద్ధ పండితులైన శేషభట్టర్ శ్రీనివాసాచార్యుల వద్ద అక్షరాభ్యాసం చేశారు. జోగా వెంకటయ్యశర్మ, ఆర్చి వెంకటాచార్యులు వేదము, దివ్యప్రబంధాల మాధుర్యాన్ని చెప్పిన వారు. దోర్బల విశ్వనాథశర్మ, తిగుళ్ల వెంకటేశ్వర శర్మ వంటి పండితులు వీరికి సహాధ్యాయులు. రాఘవాచార్య 1950లో ఉద్యోగంలో చేరి 1989లో సిద్ధిపేట కళాశాలలో పదవీవిరమణ పొందారు. పాఠశాల నుంచి కళాశాల వరకు వేలకొద్దీ శిష్యులను, అభిమానులను సంపాదించుకున్న విద్యాతపస్వి. వారి జీవితం కఠోర ఆచార నియమాలతో నిరంతరం భగవద్విషయ ప్రవచనంలో, ఉభయ వేదాంత విద్యలలో గడిచింది. నిండు జీవితం గడిపిన రాఘవాచార్యులు మన సాహితీలోకానికి నిరంతరం వెలిగే ఒక జ్ఞానభాస్కరుడు. మన జీవితంలో ఎన్నైనా సంపాదించుకోవచ్చు కానీ, ఒక మహాకవిని, ఒక వ్యాఖ్యాతృ శిరోమణిని, సంపాదించుకుని, వారి మాటలు విని, రచనలు చదివి ఆనందించగలగటం పూర్వజన్మ సుకృతం. రాఘవాచార్యుల రూపంలో ఆ అదృష్టం మనకు దక్కింది.

chitram.... కెవి రాఘవాచార్య 1929 - 2016

- శ్రీరంగాచార్యులు, 9299451266