సాహితి

అబ్బురపరిచే ప్రదర్శన కళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పద్యమంటే ఛందస్సు తెలియాలి. గురు, లఘువుల విజ్ఞానం ఉండాలి. యతి, ప్రాసలు పద ప్రయోగ మర్యాదలు, పదాల బిగింపు, అలంకారాల గుబాళింపు ఇలా ఎన్నో విషయాలు తెలిసుండాలి. పద్య రచన మామూలు విషయం కాదు. ఎందుకొచ్చిన గొడవ. మన భావాలు హాయిగా వచన కవిత్వంగా మలుచుకుందాం అనుకునేవాళ్లు కొందరైతే, పద్యానికి కాలం చెల్లింది. ఇప్పుడంతా వచన కవితదే రాజ్యం అనేవాళ్లు ఇంకొందరు. పద్యమైనా, వచనమైనా, గేయమైనా కవిత్వాంశ ఉంటే చాలు అనుకునే కవిత్వ ప్రేమికులు మరికొందరు. ఎవరి వాదం ఎలా ఉన్నప్పటికీ పద్య కవిత్వం అవధాన వేదికలపై ఊరేగుతూనే ఉంది. తెలుగునాట అనునిత్యం ఎక్కడో ఒకచోట అవధానాలు జరుగుతూ ఉండడం పద్యం చిరంజీవి అనే విషయాన్ని ధృవపరుస్తోంది. తెలుగువారికి మాత్రమే సొంతమైన ప్రక్రియగా సాహితీ లోకంలో గుర్తింపు పొందిన అవధాన విద్యను ఆశుకవితా ప్రదర్శన కళగా పేర్కొనవచ్చు. అష్టావధానం, శతావధానం, సహస్రావధానం, పంచ సహస్రావధానం వంటి అనేక రూపాలుగా ఈ ప్రక్రియ విస్తరించినప్పటికీ, సాహితీ ప్రియులకు మాత్రం తక్కువ కాల వ్యవధిలో సుమారు ఒకటిన్నర, రెండు గంటల్లో పూర్తయ్యే అష్టావధానమంటేనే మక్కువ అని చెప్పవచ్చు.
రమారమి పదమూడవ శతాబ్దంలో నేటి మెదక్ జిల్లా కొల్చారం నివాసి ఐన మల్లినాథుడు తొలి శతావధానం చేసి ఉంటాడని పరిశోధకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు లభించిన ఆధారాలమేరకు ఇదే తొలి శతావధానం కాగా సుమారు 1750 ప్రాంతంలో మాడభూషి వెంకటాచార్యుల వారు అష్టావధాన ప్రక్రియకు రూపకల్పన చేశారు. తిరుపతి వేంకట కవులు, కొప్పరపు సోదర కవులు, వేంకట పార్వతీశ్వర కవులు జంటగా అవధానాలు నిర్వహించి అవధాన సరస్వతిని అర్చించారు. నాడు మొదలుకొని అయాచితం నటేశ్వరశర్మ, రంగనాథ వాచస్పతి వంటి జంట కవులు నిన్నమొన్నటి వరకు జంటగా అవధానాలు నిర్వహిస్తే ఇంకా మూడు పదుల వయస్సు దాటని ముత్యంపేట గౌరీశంకర్, ముదిగొండ అమర్‌నాథ్ జంటగా ఇప్పుడు అవధానాలు నిర్వహించడం ప్రక్రియా గౌరవానికి అద్దంపడుతోంది. స్వయంగా అవధానులైన సి.వి.సుబ్బన్న శతావధాని, రాళ్ళబండి కవితాప్రసాద్ అవధాన విద్యపై చక్కటి పరిశోధనా గ్రంథాలు సాహితీ లోకానికి అందించారు. మేడసాని మోహన్, మాడ్గుల నాగఫణిశర్మ, గరికపాటి నరసింహారావు, కరిమెళ్ళ వరప్రసాద్ వంటి పండితులు సహస్రావధానాలు నిర్వహిస్తుంటే, గండ్లూరి దత్తాత్రేయ శర్మ, జి.ఎం.రామశర్మ, మారడాన శ్రీనివాసరావు వంటి అవధానులు శతావధానాలు, ద్విశతావధానాలు చేస్తూ అవధాన కళను ఆరాధిస్తున్నారు. శతావధానంలో సమస్య, దత్తపది, వర్ణన, ఆశువు వంటి అంశాలను వంద మంది పృచ్ఛకులు అడిగే ప్రశ్నలకు అవధాని ఆశువుగా పద్యాలు చెప్పడం, చివరలో తాను చెప్పిన పద్యాలను అంశాలవారిగా ధారణచేసి అప్పగించడం శతావధాన విధానం. ‘‘అష్టావధాన కష్టావలంబనమన్న నల్లేరుపై బండి నడక మాకు’’అని తిరుపతి వేంకట కవులే చెప్పడం అష్టావధానం కష్టావలంబనమే అన్న విషయాన్ని ధృవపరుస్తోంది. శే్లషయమక చక్రవర్తి యామవరం రామశాస్ర్తీ, రాళ్లబండి రాఘవశాస్ర్తీ, గౌరిభట్ల రామకృష్ణశాస్ర్తీ, దివాకర్ల వెంకటావధాని, రాయప్రోలు, కోవెల సుప్రసన్నాచార్య, గుమ్మనగారి లక్ష్మీనరసింహశర్మ వంటి పండిత కవులు నిన్నమొన్నటి వరకు అష్టావధానాలు విరివిగా నిర్వహించి అవధాన సరస్వతిని ఊరూరా ఊరేగించినవారే. ఆధునిక అష్టావధానుల వరుసలో మొదట చెప్పుకోవలసిన పండితులు అష్టకాల నరసింహరామశర్మ వీరు అవధాన వేదికల ద్వారా లభించిన సన్మాన ద్రవ్యంతో మెదక్ జిల్లా అనంతసాగర్‌లో సరసర్వతీ ఆలయాన్ని నిర్మించి తెలుగు భాషకు అవధాన ప్రక్రియ వనె్నతెచ్చినట్లే అవధానులకు వీరు వనె్నతెచ్చారు.
సహజంగా అష్టావధానంలో సమస్య, దత్తపది, వర్ణన, నిషిద్ధాక్షరి, ఆశువు, ఛందోభాషణం వంటి కవిత్వాంశాలతోపాటు ఘంటాగణనం, వారగణనం, పుష్పగణనం, కావ్యగానం, పురాణ ప్రవచనం, చదరంగం, వ్యస్తాక్షరి, న్యస్తాక్షరి, అప్రస్తుత ప్రసంగం వంటి కవిత్వేతర అంశాలను కూడా అవధానుల ఆసక్తిని అనుసరించి తమ అవధానాంశాలుగా స్వీకరిస్తుంటారు. సమస్య, దత్తపది, నిషిద్ధాక్షరి, వర్ణన అనే నాలుగు అంశాలు మాత్రం తప్పనిసరిగా ఉండాలనే నియమాన్ని అవధానులందరూ పాటిస్తున్నారు. ముద్దురాజయ్య వంటి అవధానులు తమకుగల గణితశాస్త్ర పాండిత్యాన్ని అవధాన కళకు జోడించి ఎటు కూడినా ఒకే సంఖ్య వచ్చే విధంగా నలుచదరాన్ని చూడకుండానే రచించి అవధానం చివర ధారణ చేయడం వంటి వినూత్న అంశాలతో అవధాన విద్యకు కొత్తసొబగులు కల్పిస్తున్నారు.

- డా. చెప్పెల హరినాథశర్మ