సాహితి

అవధాన విద్యా సర్వస్వము వినూత్న విషయ సంగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవధాన విద్యా సర్వస్వము
రచన: డా. రాపాక ఏకాంబరాచార్య
పుటలు: 1100, వెల: 1000=00;

- ప్రతులకు -
(1) శ్రీమతి రాపాక రుక్మిణి, యం.ఐ.జి.11,
నెం.56, మస్క్‌మహల్ కాంప్లెక్స్ (హుడాకాలనీ),
అత్తాపూర్, బహదూర్‌పురా పోస్ట్
హైదరాబాదు-64,
ఫోన్: 8686825108/9440494752
(2) చిక్కా రామదాసు, తెలుగు సాహిత్య కళాపీఠం
1-6-197/1/ఇ, బాపూజీనగర్, ముషీరాబాద్
హైదరాబాద్-20; ఫోన్: 9963770587.

తెలుగువారి విశేష సాహిత్య ప్రక్రియల్లో ఒకటైన అవధాన విద్య- లేదా అవధాన కళ అనే ‘సాహిత్య సర్కసు’ మేధావదసాధారణ కార్యం, దీన్ని చిరంతనకాలం నుండి అలవోకగా నిర్వహిస్తూ వ్యాప్తిచేస్తున్న అవధానులందరికీ సాహితీ లోకం అప్పుపడిందనే భావించవచ్చు. ఈ విధమైన విశేష ప్రక్రియను గూర్చి డా.రాపాక ఏకాంబరాచార్యులవారు గడచిన నాల్గు దశాబ్దాలనుండి శ్రమైక సాధ్యంగా సంపాదించిన - గ్రహించిన అనేకానేక వినూత్న విషయాలతో ఇటీవల వెల్లడించిన ఒక బృహత్ గ్రంథం ‘అవధాన విద్యా సర్వస్వము’ ఏకాంబరాచార్యులవారు సేకరించి వ్యాస రూపంగా సిద్ధంచేసిన ఈ విషయాలను- అవధానులను గూర్చి- 90 వ్యాసాలను ఆంధ్రజ్యోతి పత్రిక, 60 వ్యాసాలను ఆంధ్రభూమి పత్రికలవారు ప్రచురించినారు. ఈ వ్యాసాలేగాక ప్రచురించవలసిన మరికొన్ని వ్యాసాలను సవరించి- సంస్కరించి- చేర్పులుమార్పులతో ఆయా అవధానుల సచిత్ర పరిచయం అవధాన విశేషాలు మొదలగు వాటిని తెల్పినారు. ఇట్లా 182 మంది అవధానులను- మరికొందరు అవధానుల సంక్షిప్త పరిచయం చేసి ఎన్నో నూతన విషయాలను వెల్లడించినారు. లోగా ఏకాంబరాచారిగారు ప్రకటించిన అవధాన సంబంధ గ్రంథాలైన హాస్య వల్లరి, అప్రస్తుత ప్రసంగం- అవధాన విద్యావికాసం అనే వాటిని ఈ గ్రంథంలో చేర్చటం సముచితం. కేవలం అవధాన విద్యావికాసం అనేదే 100 పుటలు దాటి బహువిషయ సముపేతంగా రాణిస్తున్నది.
రాపాకవారి గ్రంథం మన సంస్కృతాంధ్ర భాషల అవధాన విద్య- అవధానులేగాకుండా ఇతర భాషల్లో ఈ ప్రక్రియ ఎట్ల వ్యాప్తిలోవున్నదో తెల్పినారు. మన తెలుగు అవధానుల్లో హిందీ అష్టావధానం (456 పు.) సంగీత గేయధార (632 పు) వచన కవితావధానం (874పు) మొదలైన వాటిని సోదాహరణంగా వివరించారు. ఇక- అష్టావధానులు, శతావధానులు, సహస్రావధానులు- వీరిల్లో ద్విగుణీ, త్రిగుణీకృతాది పద్ధతుల్లో ఎన్నో నూతన రీతులను ప్రవేశపెట్టిన రాళ్లబండి, గరికపాటి, మేడసాని, మాడుగుల వంటి అవధాన శిరోభూషణుల ప్రత్యేకతలను వివరించారు. పూర్వ పూర్వంనుండి మన అవధానులు ఎవరున్నారు? అనే విషయాన్ని వివరిస్తూ మధురవాణి రంగాజమ్మ రామభద్రాంబ. కృష్ణాజి- మొదలగు మహిళావధానుల ప్రతిభను సమ్మునే్మషం చేసి- ఆధునిక కాలంలో వున్న మహిళావధానులు- వీరిలో జంటగావున్నవారు- ఏకాకిగా అవధానం చేసేవారిని గూర్చి విశేష పరిచయాలతో వివరించి వీరి అవధానాల్లోను కొత్తనైన రీతులను తెల్పి- వారి అవధానాలను వీక్షించని వారికొక- చక్కని ఆమెతనందించగలగడం ఒక విశేషం. ఇట్లా విషయవిస్తృతి గల ఈ గ్రంథం 1100 పుటల్లో క్రౌన్‌సైజు గట్టి బైండు. చక్కని ముద్రణతో వెల్వడి మన సాహితీ లోకానికి గొప్ప వెలుగును నింపింది.
అవధానం, అవధానులు. అవధాన రీతి. భేదాలనేగాక అష్ట. శత. సహస్రావధానుల జాబితాను పూర్వపూర్వంనుండి నేటివరకు చేర్చి పాఠకులకే గాదు, అవధానులైన వారికి కూడా సిద్ధాన్నప్రాపకశాద్యలస్థలిగా సిద్ధంచేసిన ఈ ‘అవధాన విద్య సర్వస్వం’ ఒక రకంగా. ‘అవధానుల సర్వస్వం’ అనవచ్చు.
ఏకాంబరాచార్యులవారి బృహత్తరమైన ఈ కృషిలో- అక్కడక్కడ చిన్న పొరపాట్లు చోటుచేసుకున్నాయి. 52, 95 పుటల్లో మరింగంటి జగన్నాథాచార్యులు- ‘సింగరాచార్యుల తాత’ అన్నారు. ఇది పొరపాటు. జగన్నాథ, సింగరాచార్య, అప్పలాచార్యులు- సహోదరులు. మరింగంటి వారి గ్రంథాల పీఠికల్లో వీరిని గూర్చి యున్నది. రాపాకవారు అవధాన విద్యాచతురులైన మరికొందరు మరింగంటి కవులనుగూర్చి తెల్పితే ఒక సమగ్రత ఏర్పడేది.
వివిధ అవధానులగూర్చి గ్రంథం విషయం లోపలనేగాక మళ్లీ జాబితాలినీయటం గ్రంథ పారణ కారణమైంది, దీనికితోడు అవధానులు, వారి అవధానం సమస్యాది విషయాల చేర్చి ‘అనుబంధం’ అనే శీర్షికలో వీరివే మరికొన్ని పద్యాలనిచ్చినారు. అవధానిని పద్యపూరణలనిస్తూ మళ్లీ ‘అనుబంధం’ శీర్షిక ఎందుకు? ‘అనుబంధం’ పద్ధతే వేరుగదా! పోకూరి కాశీపత్యవధానిగారి కాఫీ దండకం చేర్చటం చాల బాగున్నది (పు202). అట్లే శతావధాని డా.ఆర్.గణేశ్‌గారి కన్నడ గీర్వాణాంధ్ర శతావధానం మాత్రమేగాక అష్ట్భాషల్లో వారు చూపిన నేర్పును వివరించటం వినూత్న విషయం.
ఏకాంబరాచార్యులుగారు ఎంతో శ్రమించి సిద్ధం చేసిన ఈ గ్రంథంలో చేరని కొందరు అవధానులున్నారు. 1.సురభి హనుమంతరావు, 2. దూపాటి వేంకట సీతారామాచార్య, 3. కె.వీరరాఘవశాస్ర్తీ 4. బాలసుబ్రహ్మణ్య నారాయణం 5. మానేపల్లి నాగకుమారశర్మ 6. చక్రవర్తుల పీతాంబరాచార్య 7. చక్రవర్తుల జగన్నాథాచార్య 8. పుల్లాపంతుల 9. గౌరావఝల మొదలైనవారు. పునర్ముద్రణలో సవివరంగా వీరిని గూర్చి తెలుపుతారనుకుంటాను. ప్రాయపు ప్రొద్దు పడమట చేరుతున్న సమయంలో- ఆరోగ్యరీత్యా శరీర సహకారం లేని సమయంలో- ఇంతటి బృహద్రచనను మనకందించిన రాపాకవారికి మనం కృతజ్ఞులం.
అవధానంబొక పారిజాత తరువై అందమ్ములన్ జిందు- ప
ద్యవితానోజ్వలశాఖలున్ గవన విద్యా హృద్య హాస్యోక్తులే
చివురాకుల్ సరసంపు రాగమధుర శ్రీవాక్సభన్ నవ్వులే
పువులై విప్పవధానికే విజయమొప్పున్ బంధురోద్గంధమై.

- డా. శ్రీరంగాచార్య, 9299451266