సాహితి

అటకెక్కుతున్న నాటక రచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ భాషా సాహిత్యంలోనైనా వీరువారనకుండా అందరినీ అలరించే, ఆలోచింపజేసే ప్రక్రియ ‘నాటకం’. చదువు అక్కరలేదు, చదవనక్కరలేదు, కళ్ళు, చెవులుంటే చాలు నాటకం సొంతమవుతుంది. పాత్రల సంభాషణల ఆధారంగా కథ సాగిపోయే ఈ ఆబాల గోపాల మనోరంజకం క్రమంగా కనుమరుగవుతున్న సంకేతాలు వర్తమాన తెలుగు సాహిత్యంలో స్పష్టంగా కనిపిస్తున్నాయంటే నిష్ఠురంగా అనిపించవచ్చు. నాటక రచన సాలు సాగుతూ ఉంటేనే రంగస్థలంపై దీపాలు వెలుగుతాయి. రంగస్థల ప్రధానంగా రాసినవే అయినా ఇది చదవడానికి కూడా సులభగ్రాహ్యాలు, దృశ్యమానాలు, వర్ణనల బాదరబందీ లేకుండా కథలో లీనమవచ్చు. గురజాడ ‘కన్యాశుల్కం’ ప్రదర్శన చూసినా మళ్లీ మళ్లీ చదువు కోవడం ఎందరికో ఇష్టం. ఎక్కువగా కోర్టు సీన్లతో వున్న రావిశాస్ర్తీ ‘నిజం’ నాటకం చదవడంలో ఉన్న తాదాత్మ్యకతే వేరు. ఇలా హాయిగా చదువుకునే తెలుగు నాటకాలకు ఉదాహరణలు ఎన్నో ఈయవచ్చు.
తెలుగులో తొలినాట తిరుపతి వేంకటకవుల పాండవ విజయము, పాండవోద్యోగము మరియు చిలకమర్తి లక్ష్మీ నరసింహం గయోపాఖ్యానం తదితర పౌరాణిక పద్య నాటకాలు రాజ్యమేలాయి. నటులు తమ పద్యగాన ప్రజ్ఞతో ప్రేక్షకులను ఉర్రూతలూగించేవారు. ఆ వెంట వచ్చిన చారిత్రక నాటకాలైన బొబ్బిలియుద్ధం, బాలనాగమ్మలాంటి మరెన్నో నాటకాలు కూడా తరగని, చెరగని ముద్రవేశాయి.
నార్వే దేశపు రచయిత, నాటకకర్త అయిన హెన్రిక్ ఇబ్సన్ నాటక రంగంలో తెచ్చిన నవీకరణ మార్పులు ప్రపంచంలోని చాలా భాషల నాటక రంగంపై ప్రభావం చూపాయి. ఆధునిక సామాజిక వాస్తవిక నాటక సృజనకు ఆద్యుడుగా పిలువబడే ఇబ్సన్ ప్రభావం తెలుగు నాటక రచన, రంగస్థలంపై కూడా పడింది. 1892లో గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం ఆధునిక తెలుగు నాటకానికి బాటలు వేసింది. అయిదేళ్లు ప్రదర్శనకే పరిమితమైన కన్యాశుల్కం 1897లో పుస్తక రూపంగా వచ్చింది. ఇప్పటికీ 120 ఏళ్లయినా ఏ మాత్రం వనె్నతగ్గని, సాటిలేని నాటక రాజంగా కన్యాశుల్కాన్ని పేర్కొనవచ్చు.
గురజాడ తర్వాత సాంఘిక దురాచారాలపై, సంఘ సంస్కరణే లక్ష్యంగా రాసినవి కాళ్లకూరి నారాయణరావు వరవిక్రయం మరియు చింతామణి. హాస్య నాటకమైన చింతామణి పాత్రలు సజీవ పాత్రల్లా మరుపురానివి.
వీటి రాకతో తెలుగునాట పద్య నాటకములకు తోడుగా లేక ఓ అడుగు ముందుకేసి సాంఘిక నాటకాల కాలం మొదలైంది.
తద్వారా తెలుగు నాటకాల్లో డ్రామా సన్నివేశాలు తగ్గి సమాజంలోని సజీవ పాత్రలను ఎంచుకోవడం, వాటి ద్వారా సమాజంలో పాతుకున్న దురాచారాలను ఎండగడుతూ సందేశాత్మక ముగింపునీయడం ప్రధానం అయ్యింది. ఆంగ్లేయుల రాకతో, పాశ్చాత్య సాహిత్యపు వెలుగులో మన సమాజంలో కొనసాగుతున్న దురాచారాలు, స్ర్తిల పట్ల వివక్షను కథా వస్తువుగా ఎంచుకొని నాటక రచన సాగింది. సంఘ సంస్కరణను ఉద్దేశించిన నవలనైనా నాటకంగా మార్చి ప్రచురించడం, ప్రదర్శనాయోగ్యం చేయడం ఆనాటి సామాజిక అవసరం, బాధ్యత అయ్యింది. మాలపల్లి లాంటి ఎన్నో నవలల సందేశం ప్రజల్లోకి చొచ్చుకుపోవాలని నాటకీకరణ చేయడం జరిగింది.
సాంఘిక దురాచారాలను ఎత్తిచూపుతూ సాగుతున్న నాటక రచనలో ఓ అడుగు ముందుకేసి వైవాహిక బంధాన్ని ఎదిరిస్తూ రాసిన నాటకం రాజమన్నార్ ‘తప్పెవరిది?’. భర్త, ఆయన కుటుంబంతో మానసిక, శారీరక ఇబ్బందులపాలవుతున్న స్ర్తి జీవితాన్ని వస్తువుగా తీసుకొని 1929లో రాయబడ్డ నాటకమిది. సాంఘిక నాటక రచన పెరిగినకొద్దీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నాటక మండలులు, కళాపరిషత్తులు ప్రాణం పోసుకున్నాయి. తెలుగులో సాంఘిక నాటక రచన, ప్రదర్శన ఇరవైయవ శతాబ్దం తొలి ఆరేడు దశబ్దాలల్లో అప్రతిహతంగా సాగిందని ఘంటాపథంగా చెప్పవచ్చు. తెలుగులో ఏ సాహిత్య ప్రక్రియ ఎత్తుకోనంత సంఘ సంస్కరణ బాధ్యత నాటకం ఎత్తుకుందనడంలో సందేహం లేదు. అసలు ఆ సదుద్దేశ్యంతోనే తెలుగులో సాంఘిక నాటక రచన మొదలయ్యిందీ అని కూడా ఒప్పుకోవచ్చు. స్వాతంత్య్రానికి కాస్తా అటూ ఇటూ తెలుగు నేలపై మొలకెత్తిన సంఘ సంస్కరణోద్యమాలు కూడా నాటక రచనను ప్రభావితం చేశాయి. ఆనాటి సమాజంలో తాము చూస్తున్న, అనుభవిస్తున్న జీవితాలను ఎంచుకొని నాటక రచన సాగింది. ఆచార్య ఆత్రేయ 1945-55 మధ్య రాసిన నాటకాలు పూర్తిగా సమాజ పోకడలను ఆధారం చేసుకుని రాసినవే. పరివర్తన, వాస్తవం, కప్పలు, ఎన్.జి.వో, భయం, దొంగ ఎవరు? లాంటి గొప్ప నాటకాలు ఆత్రేయ సాంఘిక మార్పు తత్సరతకు దర్పణాలు.
ఇదేకాలంలో అనగా 1950-55 మధ్య వచ్చిన కొప్పారపు సుబ్బారావు ‘ఇనుపతెరలు’, కొడాలి గోపాలరావు ‘పేదరైతులు’, పినిశెట్టి శ్రీరాంమూర్తి ‘కులం లేని పిల్లలు’, బుచ్చిబాబు ‘ఆత్మవంచన’, బెల్లంకొండ రామదాసు ‘పంజరం’ నాటకాలు ఆనాటి సాంఘిక పరిస్థితులకు అద్దంపట్టిన రచనలు.
ఆ తర్వాతి కాలంలో వచ్చిన తరం నాటకకర్తలుగా డి.వి.నరసరాజు, ఎన్.ఆర్.నంది, భమిటిపాటి రాధాకృష్ణ, గొల్లపూడి మారుతిరావులను ప్రముఖంగా పేర్కొనవచ్చు. డి.వి.నరసరాజు ‘ఈ ఇల్లు అమ్మబడును’, ‘వాపసు’, భమిడిపాటి రాధాకృష్ణ ‘కీర్తిశేషులు’, ఎన్.ఆర్.నంది ‘మరో మహొంజదరో’, గొల్లపూడి ‘కళ్లు’, ఆర్.ఎస్.రామస్వామి ‘గాలివాన’, ఆరుద్ర ‘రాదారి బంగ్లా’ ప్రముఖ ప్రజాదరణ పొందిన నాటకాలు.
గణేశ్‌పాత్రో తనికెళ్ల భరణి, యండమూరి వీరేంద్రనాధ్, నండూరి పార్థసారథి, సి.ఎస్.రావు మరికొందరు ప్రముఖ రచయితలు సాంఘిక ప్రధానమైన, ఆర్ధ్రత, మార్మికత విషయాలను చెప్పడానికి నాటక ప్రక్రియను ఎంచుకున్నారు. ఉత్తరాంధ్ర రచయిత అయిన గణేశ్‌పాత్రో కళింగ ప్రాంత, రేవు జీవనాలను ప్రతిబింబించే ఎన్నో నాటకాలు రాశారు. ఆయన పావల, కొడుకు పుట్టాల, తనికెళ్లభరణి కొక్కొరకో, చల్ చల్ గుర్రం, యండమూరి ‘కుక్క’, సి.ఎస్.రావు ఊరుమ్మడి బతుకులు వెంటాడే నాటకాలు. నాటక రంగంలో ప్రయోక్తలు, నటీనటులుగా పనిచేసినవారు కూడా నాటకాలు రాసిన సందర్భాలున్నాయి. పాఠశాల, కళాశాలల వార్షికోత్సవాల సమయాన విద్యార్థులు సులువుగా వేసుకునేందుకు వీలుగా చిన్న చిన్న నాటకాలు, స్ర్తి పాత్రలేని నాటికలు రచింపబడ్డాయి. పై రచయితలే కాకుండా తెలుగులో నాటకాలు రాసిన ప్రముఖులు, ఔత్సాహికులు ఇంకా ఎందరో ఉన్నారు. ఇక్కడ ప్రస్తావించినంత మాత్రాన వారి కృషిని కురచ చేయడం కాదని మనవి.
1950 ఆ తర్వాత తెలుగులో సినిమా నిర్మాణం పెరగడం, స్వాతంత్య్రానంతరం సాంఘిక ఉద్యమాలు తగ్గుమొకం పట్టడం తదితర కారణాలవల్ల నాటక రచయితలు, ‘రంగ’ ప్రముఖులు సినిమాలవైపు మళ్లారు. వీరి చేరికతో సాంఘిక చిత్రాల నిర్మాణం పెరిగింది. అందుకే ఆ రోజుల్లో గర్వించదగ్గ సాంఘిక చిత్రాలు వచ్చాయి. వ్యాపారంగా కూడా లాభాలు తెచ్చిపెట్టాయి. ఇప్పటికే వనె్నతగ్గని జాతిరత్నాలవి. మంచి తెలుగు సినిమాలుగా ఉదాహరణగా ఇప్పటికీ వాటినే పేర్కొంటారు.
నాటక రచన మందగించినకొద్దీ ఆ రంగంపై ఆసక్తిగల రచయితలు సరాసరి సినిమాల్లోకి వెళ్తున్నారు. ఇలా కథారచయితల, గేయకర్తల సినీ రంగ ప్రవేశం పెరిగి అదే రహదారిగా స్థిరపడింది. సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి ఒక సినిమాకు కథో, మాటలో, పాటో రాసినవాడు సినిమా రచయిత అని ట్యాగు తగిలించుకుని అదో పెద్ద గౌరవ సూచకంగా భావిస్తున్న రోజులివి.
సినీ రచయితగా కొనసాగుతూ ప్రదర్శనాయోగ్యమైన నాటకాలు రాసిన రచయితలు గతంలో మనకు ఉన్నారు. ఇప్పుడు ఆ వాతావరణం కానరావడంలేదు. వృత్తిరీత్యా సినిమా వాళ్లకు కోరింది రాసినా రచయితగా నిలబడడానికి వీరు రాసిన నాటకాలే కొండగుర్తులు. పదుల సంఖ్యలో సినిమాలకు కథ, మాటలు రాసినా రాని గుర్తింపు సంఘ ప్రయోజక, జనరంజక నాటకం ఒక్కటి రాసినా వస్తుందనడంలో సందేహం లేదు. జార్జ్ ఆర్వెల్ రాసిన ‘ఎనిమల్ ఫాం’తో పోల్చదగ్గ నాటకం గొల్లపూడి మారుతీరావు ‘కళ్లు’. గొల్లపూడి ఎన్ని సినిమాలకు కథ, మాటలు రాసారో తెలుసో తెలియదోగాని ఆయన పేరెత్తగానే ‘కళ్లు’ నాటిక కళ్లముందు మెదులుతుంది. సినిమాల్లో ఎంతో బిజీగా ఉండిన రోజుల్లో కూడా నటుడు నాగభూషణం ఊరూరా తిరిగి ‘రక్తకన్నీరు’ నాటకం ప్రదర్శించేవాడు, స్థానిక ప్రాధాన్యతను, సమస్యలను ముందే తెలుసుకొని, నాటకంలో చొప్పించి నవ్వులు పూయించేవాడు. అందులో వున్న తృప్తి నాగభూషణంకే తెలుసు. మద్రాసులోని ఆయన ప్రహరీగోడ ఫలకంపై పి.నాగభూషణం ‘రంగస్థల నటుడు’ అనే ఉండేదని చెప్పుకునేవాళ్లు.
నవలకన్నా నాటకాల నిడివి తక్కువ. నాటకాల్లో సామాజిక సమస్యలను ఎత్తుకొని విమర్శించడమైనా, పరిష్కారమైనా ఏమైనా ఓదారి చూయించవచ్చు. అవి సామాజిక అవసరాలే. టీవీ ప్రసారాల ఉదృత ప్రవాహంలో కొట్టుకుపోతూ సమయాన్నీ, మేధస్సును బూడిదపాలు చేస్తున్న మహిళ, యువతను ఒడ్డుకు చేర్చి కళ్లు తెరిపించే శక్తి నాటకలకుంది.
తెలుగునాట పండుగలకు, ఉత్సవాలకు కొదువలేదు. సంఘాలకు, వేదికలకు రోజు పనే ఉంటున్నది. ఇంటినుండి కాలు బయటపెట్టి ఇవి ఇష్టమున్నవాళ్లు అందులో పాలు పంచుకుంటున్న సంగతి చూస్తున్నదే. ఈ సందర్భాలలో నాటక ప్రదర్శన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. చిన్న చిన్న సమూహాలనే లక్ష్యంగా చేసుకుని అరగంటకు అటూ ఇటూ నిడివిగల నాటకాలు తప్పక అలరిస్తాయి. ఇప్పుడు టీవీలో వస్తున్న షార్ట్ ఫిల్మ్స్‌కన్నా వాటివల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది.
సినిమావాళ్లో, బయటివాళ్లో సంకల్పించి ఓ ఆటవిడుపుగా చక్కని సంఘ ప్రయోజన నాటకాలు రాసి ప్రదర్శిస్తే సంఘ సేవయే కాకుండా నిజమైన సంతృప్తి కూడా దక్కుతుంది. ఎప్పుడూ సినిమాలు, టీవీలేనా.. మీరు తెర దిగి నేలమీదికొస్తామంటే స్వాగతించని వారెవరు? ఒకరికొకరు కనబడని తెరచాటు బతుకులకన్నా కంటిస్పర్శ, కరచాలనంతో నిజమైన జీవకళ ఉట్టిపడుతుంది.

- బి.నర్సన్, 9440128169