సాహితి

కొత్త కోణాలలో సినారె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సి.నారాయణరెడ్డి గురించి ఆయన జన్మదిన సందర్భంగాను, మరికొన్ని సందర్భాలలోను సభలు సమావేశాలు ఎన్నో జరిగాయి. ఆయన్ని గురించి తమ అనుభవాలను, ఉద్దేశాలను కొందరు వెల్లడించారు. ఆ విధంగా నారాయణరెడ్డి బహుళ ప్రచారం పొందిన కవి, రచయిత, గుర్తింపు పొందిన విశిష్ట వ్యక్తి. వాటన్నిటికి భిన్నంగా ఆయనతో వున్న 50 సంవత్సరాల అనుభవాల దృష్ట్యా కొన్ని సమాజం దృష్టికి తీసుకురావడానికి ఈ వ్యాసాన్ని ఉద్దేశించాను. 1967 నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మేమిరువురం సన్నిహితులుగా మెలిగాము. ఆయన తెలుగు శాఖలోను, నేను ఫిలాసఫీ శాఖలోను పనిచేస్తుండేవారం. ఇంచుమించు రోజూ కలసి కుశల ప్రశ్నలు వేసుకునేవాళ్లం. అప్పుడు నేనొక పుస్తకాన్ని తెనిగించాను. ఎమ్.ఎన్.రాయ్ (మానవేంద్రనాథ్) రాసిన మారుతున్న భారతదేశం అనే గ్రంథానికి తెలుగు అనువాదం చేశాను. భారత చారిత్రక పరిశోధనా సంస్థవారు దీనిని నాకు అప్పగించారు. ఆ పుస్తకం 1922లో మాస్కోలో ఎమ్.ఎన్.రాయ్ రాసినప్పుడు లక్షలాది కాపీలు ప్రజలలోకి వెళ్లాయి. దాని విశిష్టత దృష్ట్యా భారతీయ భాషలలోకి తీసుకురావాలని అందులో తెలుగు అనువాదాన్ని నాకు అప్పగించారు. అది తెనిగించి పరిష్కర్తగా వున్న నారాయణరెడ్డికి చూపించాను. ఆయన నిర్మొహమాటంగా జనానికి అర్థమయ్యేటట్టు, చదివించేటట్టు తెనిగించమని స్పష్టంగా చెప్పారు. అంతటితో ఆ పుస్తకాన్ని మళ్లీ పూర్తిగా మార్చివేసి ఎవరు చదివినా ఆకళింపు చేసుకునేటట్టు అనువదించాను. అప్పుడు నారాయణరెడ్డి ఎడిటర్‌గా ఆమోదించి సంతకం పెట్టారు. దీనిని తెలుగు అకాడమీ వారు ప్రచురించవలసి వున్నది. ఆ విధంగా అనువాద విషయంలో పాఠాలు నేర్పిన నారాయణరెడ్డిని నేను ఎప్పుడూ విస్మరించలేదు. మేమిద్దరం సన్నిహిత మిత్రులమయ్యాము.
తెలుగు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్‌గా...
అందరివలె ఫైళ్లమీద సంతకాలు పెట్టి వచ్చిన జీతం జేబులో వేసుకుని సి.నారాయణరెడ్డి పబ్బం గడుపుకుని పోలేదు. తనదైన ముద్రవేస్తూ పోయాడు. వైస్ ఛాన్సలర్‌గా వుండగా నేనూ కొందరు మిత్రులతో కలిసి ఆయనకు ఒక విజ్ఞప్తి చేశాము. మీ విశ్వవిద్యాలయంలో జ్యోతిష్యం కోర్సుగా చెబుతున్నారు. దానికి శాస్ర్తియత లేదు. అది రుజువు చేస్తే తప్ప డిగ్రీలు ఇవ్వటం సమాజానికి ద్రోహం చెయ్యటమేనని విజ్ఞప్తి చేశాము. జ్యోతిష్యంతో పోల్చి ఖగోళ శాస్త్రాన్ని విద్యార్థులకు చెప్తే సత్యాసత్యాలు తెలుస్తాయని కనుక ఆ రెండిటిని పోల్చే కోచింగ్ పెట్టమన్నాము. నారాయణరెడ్డికి అది నచ్చింది. అలా ఎందుకు పెట్టకూడదు అని జ్యోతిష్య శాఖను అడిగారు. ఆ రోజులలో జ్యోతిష్య శాఖకు గవర్నింగ్ బోర్డులో సుప్రసిద్ధ జ్యోతిష్యుడు రామన్ (బెంగుళూరుకు చెందిన వ్యక్తి) వున్నారు. ఆయన నారాయణరెడ్డిపై కారాలు మిరియాలు నూరి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావుకు తీవ్ర ఆక్షేపణలు తెలియజేసి వైస్ ఛాన్సలర్‌గా వున్న నారాయణరెడ్డిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈలోగా నారాయణరెడ్డి తన ఛాంబర్‌లో ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు తెలుసుకోవటానికి నన్ను, కొత్తపల్లి వీరభద్రరావుగారిని సమావేశపరిచి అందరి ఎదుట చర్చ పెట్టారు. దానిలో కొత్తపల్లివారు శాస్ర్తియత రుజవుపరచటానికి నానా తిప్పలు పడి విఫలమయ్యారు. నారాయణరెడ్డి నా వాదం వైపుకు మొగ్గుచూపారు. ఈ విషయం తేలకముందే నారాయణరెడ్డి ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా వెళ్లిపోవటంతో ఆ సమస్య ఎటూ తేలలేదు. కాని నారాయణరెడ్డి మాత్రం రామన్‌ను ఎదుర్కోవటంలో గట్టిగా నిలిచి ముఖ్యమంత్రికి తన వాదన వినిపించారు. ఇది జనానికి తెలియని కోణం.
ఎమ్.ఎన్.రాయ్‌పై నారాయణరెడ్డి ఉపన్యాసం
తెలుగు అకాడమీ వారి పురమాయింపుపై ఎమ్.ఎన్.రాయ్ రచనలు ఆయనపై ఇతరులు చేసిన రచనలు అన్నీ తెలుగులోకి అనువాదం చేశారు. ప్రతి గ్రంథానికి ఒక విద్యావేత్త ఎడిటర్‌గా వుండేవారు. ఇవన్నిటినీ కలిపి ఒకసారి తెలుగు అకాడమీ కొండారెడ్డి డైరెక్టరుగా వుండగా ఆవిష్కరణ సభ పెట్టి విడుదల చేశారు. హైదరాబాద్‌లో వర్కింగ్ జర్నలిస్టు ఆఫీసులో జరిగిన ఆ సభకు వైస్ ఛాన్సలర్ నవనీతరావు అధ్యక్షత వహించగా నారాయణరెడ్డిని ఆవిష్కరించమన్నారు. అందులో బృహత్తర గ్రంథం వివేచన ఉద్వేగం విప్లవం అనే రెండు భాగాలు ఉన్నాయి. అవి యూరోపులో ప్రశంసలు పొందిన గ్రంథాలు. ఎరిక్ ఫ్రాం వాటిని గురించి రాస్తూ పునర్వికాసం గురించి తెలుసుకోవడానికి ఎవరైనా సరే చదవాల్సిందే అన్నారు. వాటిపై నారాయణరెడ్డి ఏం మాట్లాడతారు అని నేను సందేహించాను. కానీ నా ఉద్దేశ్యం సరైంది కాదని ఆయన ఉపన్యాసం విన్న తరువాత స్పష్టపడింది. దాదాపు గంటసేపు ఎన్నో లోతుపాతులతో ఆయన చేసిన సుదీర్ఘ ప్రసంగం విని వి.సతీష్ వంటి జర్నలిస్టులు నాలుగు పెగ్గుల విస్కీ సేవించినట్లుగా వున్నదని వ్యాఖ్యానించారు. అంత సమ్మోహనంగా ఆ రోజు ఆయన విషయ వివరణ చేశారు. హైదరాబాద్‌లో అశోక్‌నగర్‌లో వున్న సినారె ఇంట్లో సుప్రసిద్ధ రైతు నాయకుడు, పార్లమెంటేరియన్ ఆచార్య రంగా కొంతకాలం అద్దెకుండేవారు. అక్కడ తరచు సినారెతో నేను కలుస్తుండేవాడిని. అనేక విషయాలు మాట్లాడుకుంటుండేవాళ్ళం.
మిసిమి సంపాదకుడు రవీంద్రనాథ్‌తో...
1948 నుండి రవీంద్రనాథ్ ఆలపాటి సంపాదకత్వాన తెనాలి నుండి వెలువడిన జ్యోతి పత్రికలో సినారె రచనలు చేశారు. ఆ తరువాత హైదరాబాద్‌లో సినారె, రవీంద్రనాథ్ నేను కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ భోజనాలు చెయ్యటం ఆనవాయితీగా మారింది. ఎన్నో సంగతులు సినారె ఆసక్తికరంగా చెబుతుంటే అందుకు ధీటుగా రవీంద్రనాథ్ తనకు తెలిసిన అంశాలు ఎంతో బాగా చెప్పేవారు. అప్పుడు నేను చెప్పిన విషయాలు వారిరువురు శ్రద్ధగా వినేవారు. ఇవన్నీ నాకు మధురానుభవాలు. రవీంద్రనాథ్‌తో అంత చనువుగా సన్నిహితంగా మెలిగినప్పటికి మంచి చెడును విడమరచి నిస్పాక్షికతను నిలబెట్టుకోగల లక్షణం నారాయణరెడ్డికి ఉన్నది అన్నదానికి ఒక సంఘటన ఉదహరిస్తాను.
రవీంద్రనాథ్‌కు అమెరికా డిగ్రీ
రవీంద్రనాథ్‌కు అమెరికాలో కాలిఫోర్నియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ డాక్టరేట్ డిగ్రీని ప్రసాదించినట్లు సర్ట్ఫికెట్ వచ్చింది. ఆయన మిత్రులంతా చాలా సంతోషించచారు. వర్కింగ్ జర్నలిస్టుల హాలులో పెద్ద సత్కారం సభ ఏర్పాటుచేశారు. దానిలో పాల్గొని ప్రసంగించవలసిందిగా పార్లమెంటు సభ్యుడు చిత్తూరు జిల్లా రైతు నాయకుడు ఆచార్య రంగా అనుచరుడు, సి.రాజగోపాలనాయుడు వచ్చి నారాయణరెడ్డిని ప్రత్యేకంగా కోరారు. ఆశ్చర్యకరమైన మలుపు ఏమంటే అలాంటి డిగ్రీ సరైనదేనని, అలాంటి యూనివర్సిటీ ఉన్నదని ఆధారాలు లభిస్తే అప్పుడు వస్తానన్నారు. ఆ సభకు ఆయన వెళ్ళలేదు. ఆ తరువాత తెలిసిన విషయం ఏమంటే నారాయణరెడ్డి ప్రశ్నించింది సరైనదేనని, అలాంటి యూనివర్సిటీ లేదని, అది బోగస్ డిగ్రీ అని స్పష్టపడింది. స్నేహానికి ఇలాంటి విషయాలు అడ్డురాకూడదని నారాయణరెడ్డి నిరూపించారు. అలాంటి దొంగ డిగ్రీలు ఆంధ్రప్రదేశ్‌లో ఇతర చోట్లా కొందరికి లభించగా అలాగే సన్మానాలు చేయించుకున్నారని తెలిసింది.
సినారె వాదోపవాదాలలో పాల్గొన్నప్పటికీ నేను ఆ రంగంలో ప్రవేశించేవాడిని కాదు. నా మిత్రులు డి.ఆంజనేయులు (రచయిత, జర్నలిస్ట్) తెలుగు కవులు, రచయితలను ఇతర రాష్ట్రాల వారికి, బయట ప్రపంచానికి తెలియపరుస్తూ అనేక సాహిత్య వ్యాసాలు రాసేవారు. అది గ్రంథస్థం అయినప్పుడు అందులో నారాయణరెడ్డిపై ఒక చక్కని వ్యాసం ఉన్నది. కానీ, అక్కడక్కడ వున్న నిశిత పరిశీలనలు మాత్రం సినారెకు నచ్చలేదు. ఆంజనేయులుగారిపై అభిప్రాయం వెల్లడిస్తూ అవగాహన లేకుండా తనపై వ్యాఖ్యానాలు చేశారని అన్నారు. డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలుగు భాష ప్రచారం కోసం కరీంనగర్ నుండి కథానిలయం (శ్రీకాకుళం) వరకు సాహిత్య యాత్ర చేశారు. అందులో సినారె, నేను, జస్టిస్ రమణ, జస్టిస్ చలమేశ్వర్, మండలి బుద్ధప్రసాద్, విజయకుమార్ పాల్గొన్నాము. ఇద్దరం విశాఖపట్టణంలో బహిరంగ సమావేశంలో మాట్లాడాము.
సాహిత్య పరంగా మానవ వాద దృష్ట్యా కొన్ని సమావేశాలు హైదరాబాద్‌లో జరిపాము. ముఖ్యమైన వాటికి సినారె, మామిడిపూడి వెంకట రంగయ్య, దేవులపల్లి రామానుజరావు, ఎం.వి.రాజగోపాల్ వచ్చి మాట్లాడేవారు. నా ఆహ్వానంపై వచ్చి మాట్లాడేవారు. సంజీవదేవ్ హైదరాబాద్ వచ్చినపుడు జరిపిన సమావేశాలలో సినారె పిలవగానే వచ్చి ప్రసంగించేవారు. మొత్తంమీద సినారెతో ఇలాంటి అనుభవాలు ఎన్నో వున్నాయి. సినారెకు వయసుతో నిమిత్తం లేని అనుభవం వున్నది. నారాయణరెడ్డి ప్రియశిష్యుడు తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా చేసిన ఎన్.గోపీ మా ఇద్దరికీ చాలా సన్నిహితుడు. గోపీ వివాహానికి నేను మంత్రాలు లేని లౌకిక పద్ధతిలో కార్యక్రమం జరిపించాను. నారాయణరెడ్డికి అలాంటి విషయాలు ప్రీతిపాత్రమైనవి. అమెరికా నుండి ఫోను చేసి పలకరిస్తే ఆప్యాయంగా మాట్లాడతారు. సినారెతో మధురానుభూతులు చిరస్మరణీయాలు.

సి.నారాయణరెఢ్డి పాల్గొన్న సమావేశంలో ప్రసంగిస్తున్న ఇన్నయ్య (ఫైల్ ఫొటో)

- నరిసెట్టి ఇన్నయ్య, 3019444653 innaiah@gmail.com