సాహితి

పాటకు నోబెల్ పట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనలో ఎంతమందికి చుండూరు, కారంచేడు బాధితుల వేదన అర్థమవుతుంది? వారి న్యాయ పోరాటాలు, దేశవ్యాప్తంగా ఎలా నీరు కారిపోతుంటాయో, బడుగు ప్రజలపై జరిగే అసంఖ్యాక నేరాలలో, సామాజిక దౌష్ట్యాలలో, ఎలా కొంతమంది మాత్రమే విచారణ వరకూ వచ్చి, చాలా తేలికపాటి శిక్షలతో బయటపడుతూ ఉంటారో, చూస్తే, మనం ఒక అసమ సమాజంలో ఉన్నామని అర్థమవుతుంది. అయితే మన రాజ్యాంగం ఇలా అసమ విలువలను అంగీకరించలేదు. ‘ఒక మనిషికి ఒకే విలువ ఏ విషయంలో అయినా’ అని రాజ్యాంగం మనకు హక్కులు ఇచ్చింది కానీ వాస్తవంలో ధనవంతులు, అగ్రకులాలవారు పొందే మర్యాదలు, వెసులుబాట్లు, పేదలు, నిమ్నకులాలవారు పొందడం కష్టం అన్న సామాజిక వాస్తవం అయితే మనం కనుల ముందర బలంగానే ఉన్నది. స్ర్తిలు, యువత విషయంలో, పల్లెలో ఉండే తక్కువ కులాల ప్రజల పట్ల నిర్దయతో వ్యవహరించే ఖాప్ పంచాయతీలు కానివ్వండి, విశ్వవిద్యాలయాల్లో వివక్ష కానివ్వండి, ఇది కనిపించని కులం మీద, ఆ కుల దురహంకారం మీద ఆధారపడి మన సమాజంలో సంఘటనలుగా జరుగుతూ ఉంటుంది. దీనిపై మనకు కొంత సాహిత్యం, కళా రూపాలు ఉన్నాయి. ఇవి ఉండకూడదు అని చెప్పే ప్రభుత్వ ప్రభోదాత్మక కళారూపాలు, సాంస్కృతిక రూపాలు, పలు రచయితల రచనలు ఉన్నాయి. ఇది మన దేశం ఎరిగిన సాంస్కృతిక వాతావరణం.
అమెరికాలో ఇంకా క్రూరమైన వివక్ష. తెల్లవారు, నల్లవారు పేరిట 1960ల వరకూ అమలవుతూనే ఉండేది. ముఖ్యంగా దక్షిణ అమెరికాలో. దీనిపై మనుషులందరూ ఒక్కటే అన్న వాస్తవం ఎరిగినవారు, అబ్రహం లింకన్ కాలంనుంచీ అక్కడ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ, ఆ వివక్ష నేరమని ప్రకటించినా, కొన్ని హేట్ క్రైమ్స్ (ద్వేషపూరిత నేర చర్యలు) ఆ సమాజంలో జరుగుతూనే ఉన్నాయి. 1960 నాటి అమెరికన్ సమాజం అర్ధ శతాబ్దం కిందట వర్ణ వివక్ష విధానాలు ఇంకా బలంగా ఉన్న ఒక సాంఘిక వాస్తవం. ఆ రోజులనుంచీ పౌర హక్కుల కోసం పాటలు రాస్తూ, ప్రజలలో ఒక చైతన్య స్ఫూర్తి, న్యాయవర్తనం పట్ల స్పృహ కలిగించినవాడు బాబ్ డిలాన్. అలా యాభయ్యేళ్ల అమెరికా ఎన్ని ఒడుదుడుకులు ఎప్పుడెప్పుడు ఎదుర్కొన్నదో, అప్పుడల్లా, తమ సామాజిక ఇంగితంతో, యుద్ధ వ్యతిరేకత ప్రకటిస్తూ, మారుతున్న కాలంలో ప్రజలూ, ప్రభుత్వాలు కూడా మారాల్సిన అవసరం గుర్తుచేస్తూ వచ్చిన ఒక వివేక స్వరం బాబ్ డిలాన్.
ఈయన రాసిన పాటలకు నోబెల్ బహుమతా అన్న ఆశ్చర్యం ఇంకా ప్రపంచ సాహిత్య రంగంలో ఉండనే ఉన్నది. ఉంటుంది కూడా. ఎందుకంటే, ఇవాళ ఆహా, బాబ్ డిలాన్‌కు సాహిత్య నోబెల్ వచ్చింది, ఆయనది ఏదైనా పుస్తకం కొందాం అని ప్రయత్నిస్తే, మనకు ఒక్క పుస్తకం కూడా దొరకదు. ఆయన విడుదల చేసిన పాటలన్నీ ఆల్బంల రూపేణా, ఆంగ్లంలో, అమెరికన్ యాసలో ఉన్నాయి. అవి ఇతర దేశాల వారికి ఎంతవరకు పాటలుగా అర్థమవుతాయి అన్నది కూడా ఒక ప్రశ్నగానే మిగిలివుంటుంది. అవి మన పాటల వలె ఉండవు. మనకి రెండే రకాల పాటలు తెలుసు. సంప్రదాయ పద్ధతిలో పాడే కీర్తనలు, కృతులు, అష్టపదులు, పదాలు, కొన్ని జానపదాలు. ఇవి సంగీతవేత్తలు, కాయకష్టం చేసుకునే ప్రజలు పాడుతారు. లేదా, అన్నిటినీ మింగేసే సినిమా పాటగా, మనకు పాటలు అంటే తెలుసు. కానీ అమెరికాలో అలా కాదు.
పాట అక్కడ ఒక ప్రజా సాంస్కృతిక రూపం. సినిమాలలో పాటలు, మన భారతీయ సినిమాలలో తప్ప ఎక్కడా ఉండవు. పాటగాళ్లు, తమ పాటల ద్వారా రికార్డుల ద్వారా, తమ ప్రత్యక్ష ప్రదర్శనల వల్ల వచ్చే ఆదాయం ద్వారా స్టార్ హోదాతో బతికే అవకాశాలు అక్కడి సమాజాలు కల్పించాయి. అలాంటి సమాజంలో ఈ గేయ రచయితలూ, సంగీత కళాకారులు, వీరి బృందాలూ, ప్రభుత్వంతో విభేదిస్తూ కూడా, తమ గీతాలను ప్రజలకు వినిపిస్తారు. అలా బడుగు, బలహీన అమెరికన్ ప్రజలకు, తన మద్దతు ఇచ్చిన వాడిగా బాబ్ డిలాన్‌కు అర్ధ శతాబ్దపు కీర్తి ఉన్నది. అది ఆయన బలం. ‘రాక్ ఎన్ రోల్ హాల్ ఆఫ్ ఫేమ్’లో ఆయనకు శాశ్వత స్థానం ఉన్నది. ఆయన సంగీత ఆల్బమ్‌లు పాశ్చాత్య దేశాలలో నూరు మిలియన్లకు పైగా అమ్ముడయ్యాయి. వాటి సంగీత విలువలు, మన అభిరుచులతో చూస్తే హాయిగా పల్లవి, చరణాలుగా ఉండవు. పైగా అమెరికన్ యాసలో, వారి ఇంగ్లీష్ ఉచ్ఛారణలో పాడుతారు కనుక, మనకు ఎంతవరకు అర్థమవుతాయి అన్నది కూడా, ఒక ఇబ్బందే. ఇన్ని ఇబ్బందుల ముందర ఎప్పుడూ మనం సాహిత్య నోబెల్‌తో ఎదుర్కోలేదు. నోబెల్ పొందిన సాహితీవేత్త వెలువరించిన పుస్తకాలు ఉండేవి. వాటిలో ముఖ్యమైన వాటిద్వారా, ఏం చెప్పారు, ఏ ప్రక్రియ, ఏ శిల్పం, ఏం సంవిధానం, ఇటువంటి విషయాలపై పాఠకులు, విమర్శకులు, విశే్లషకులు సాముదాయక చర్చలో పాల్గొనే ఒక వాతావరణం ఉండేది. ఇప్పుడు బాబ్ డిలాన్ విషయంలో మనకు అలా పుస్తకాలు దొరికే సౌలభ్యం ఏమీ లేదు. రాసిన పాటలను ‘లిరిక్’లు అంటారు తప్ప, వాటిలో కొన్ని ఏర్చి కూర్చి, కవిత్వం అంటూ ప్రత్యేకంగా సంపుటాలు వెలువడలేదు. అయినా నోబెల్ సాహిత్య సంఘం ఈసారి బాబ్ డిలాన్ తమ ఎంపిక అని తెలిపింది. మళ్లీ ఇలాంటి కళాకారుడికి నోబెల్ ఇవ్వడానికి చాలా కాలం పట్టవచ్చు.
అయితే, పాటలలోని పౌర హక్కుల సమస్యలు, అమెరికా ప్రపంచ ఆధిపత్యం కోసం చేసే యుద్ధాలు వీటిపట్ల నిరసన, తమ బిడ్డలను కోల్పోయే అమెరికన్ తల్లులతో సంఘీభావం, స్ర్తిలకు, పేద పిల్లలకు మద్దతు, బాబ్ డిలాన్‌ను అమెరికాలో ఒక ప్రియమైన సాంస్కృతిక కార్యకర్తగా మలిచాయి. ఈ పాటలు కొన్ని చిన్నవిగా ఉన్నా, చాలావాటిలో నాలుగు వందల నుంచి ఐదువందల మాటల దాకా ఉంటాయి. అవి పల్లవి, చరణాలుగా కన్నా, గేయ కథలుగా ఉంటాయి. ఇదే బాబ్ డిలాన్ సాహిత్య సేవ. అవి కవితలైతే, ఒక పుస్తకంలో ఉండిపోయేవి.
బహుశా, గీతాలు కావడం వలన, ఆల్బమ్‌లుగా విడుదల కావడం వలన పదేపదే అమెరికన్ సమాజంలో రెండు తరాల ప్రజలు విని ఉత్తేజం పొందిన ఒక సంగీత వాతావరణంలో అమెరికాలో బాబ్ డిలాన్ లేని ఇరవయ్యో శతాబ్దపు సంగీత వాతావరణం ఊహించలేము. అదీ ఆయన ప్రాధాన్యత. సంగీత ప్రపంచం ఆయనకు ఇవ్వవలసిన అన్ని గౌరవాలు ఇచ్చింది. ఇవాళ సాహిత్య రంగం కూడా ఆయనకు అగ్రాసనం అందించి గౌరవించింది.
1960ల్లో ఒక నల్లజాతి స్ర్తి వర్ణవివక్ష అమలులో ఉన్న చార్లెస్ కంట్రీలో చావుకు గురైన దురంతంపై యువకుడైన బాబ్ డిలాన్ పాట, ఒక అఘాయిత్యంపై నిరసన స్వరం. యుద్ధోన్మాదాల అమెరికాను కూడా ఆయన క్షమించలేదు. ఇది అవధులకు దాటిన ప్రత్యేక నోబెల్ అయినప్పటికీ, పాశ్చాత్య సమాజాలలో ప్రజల సమస్యలు, శాంతి ప్రియత్వం, యుద్ధ వ్యతిరేకత, సామాజిక న్యాయంకై జనజాగృతి ఒక అర్ధ శతాబ్దంగా ప్రకటిస్తూ వచ్చిన ఒక సంస్కార స్వరానికి, సాహిత్య సంగీతాలు ఒక సమాహార కళగా నిలిపిన సంపన్న రూపానికి, ఈ గౌరవం అందినందుకు సంఘీభావం ప్రకటిద్దాం.

- రామతీర్థ, 9849200385