సాహితి

కవిత్వంలో అనిర్వచనీయత అనుభూతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఆకాశం పెదవి మీద భూలోకం ఒక ముద్దు
ఆదిత్యుని హస్తంలో ఆకాశం ఒక వీవన’’
- ఆంగ్ల కవి డేవిడ్ గ్యాస్కాయిన్ రాసిన ఒక కవిత్వపాద యుగళానికి శ్రీశ్రీ అనువాదం ఇది. ‘ "The Earth is a kiss on the mouth of the sky/ and the sky is a fan in the hand of the Sun' అన్నాడు గ్యాస్కాయిన్.
పై రెండు పాదాలు చదవగానే ‘అబ్బ! ఏమన్నాడు! అద్భుతం!’ అని మాత్రమే అంటాం. అంతకుమించి మఱోమాట అనలేం కొన్ని క్షణాలదాకా. వాగతీతమైన ఒక మహానుభూతిలోకి వెళ్ళిపోతుంది మనస్సు. కవి అసలు ఈ వాక్యాలను ఏ సందర్భంలో అన్నాడు, దానికి సందర్భశుద్ధి ఉన్నదా, ఏదో యాంత్రికంగా అన్నాడా- లేక- బాగా ఆలోచించి ఎంతో భావగర్భితంగా పలకాలని పలికాడా, ఈ రెండు పాదాలకు ఎన్ని అర్థాలున్నాయి- ఇలాంటి ప్రశ్నలేవీ మన మనస్సులో మెదలవు. ఆ కవితలోని భావ సౌందర్యం గుఱించి గాని, భావ శబలత గుఱించి గాని వెంటనే చెప్పాలని గానీ, చర్చించాలని గానీ అనిపించదు. ఒకవేళ అలాంటివన్నీ ఏవైనా చేయాలనుకున్నా కొన్ని నిముషాల తరువాత రసానుభూతిలోంచి తేరుకున్నాక అప్పుడు ఆలోచిస్తాం విశే్లషణలు, వివరణలు, వ్యాఖ్యానాల గుఱించి. ఇలా ఆపాత మధురమైన అద్భుత అనుభూతిని కలిగించటమే కవిత్వంలో అనిర్వచనీయత (Inexplicability) అంటే.
శకుంతలను ‘అనాఘ్రాత పుష్పం’ అన్నాడు కాళిదాసు ‘శాకుంతలం’లో. ప్రాచీన సాహిత్యంలోని ఇలాంటి గంభీరార్థ పద బంధ కవితల అనిర్వచనీయతా సల్లక్షణం మాత్రం ఎన్ని సాహిత్య యుగాలు గడచి పోతున్నా నేటికీ అజరామరంగా చాలామంది కవితలలో కళకళలాడుతూ కనిపిస్తూనే ఉంది. కాబట్టే సైన్సు ఎంత విశృంఖల విహారం చేస్తున్నా సాహిత్యం తన విశిష్టతను, ఉదాత్తతను నిలుపుకుంటూ నిటారుగా నిలబడే ఉంది. స్వచ్ఛ కవిత్వం (Pure Poetry)గాని, అనుభూతి వాద కవిత్వం (Evocative Poetry) గాని నిండైన, నిజమైన కవిత్వం అనే ఉదాత్త కళకు అనిర్వచనీయతా రూప ఆత్మ. గరిమనాభి.
‘మాట్లాడని మల్లెమొగ్గ మాదిరిగా నడచిరా’- ఈ కవితా పంక్తి దాశరథిది. ఈ కవితా వాక్యాన్ని చదివినప్పుడు కవి ఎవరిని ఉద్దేశిస్తున్నాడో, సంబోధిస్తున్నాడో, ఆ మంత్రిస్తున్నాడో అనే సందేహం రసహృదయ పాఠకుడికి రానే రాదు. ఆ వ్యక్తిని మాట్లాడని మల్లెమొగ్గ అని ఎందుకంటున్నాడనే జిజ్ఞాసా మనకు కలగదు. కవితాపంక్తి మాత్రం చాలా బాగుందనిపిస్తుంది.
మల్లెమొగ్గ మాట్లాడదు. మాట్లాడలేదు. కదలలేదు. కానీ తాను ఎక్కడ ఉంటే అక్కడ తన అద్భుత సౌరభపు ఘుమాయింపుతో పరిసరాలను మొత్తాన్ని, అక్కడివారిని నాసికానంద సౌఖ్యానుభూతుల జడివానలో తడిపేస్తుంది అలాంటి మల్లెపూవు ఏకంగా తానే మనదగ్గరకు నడిచి వస్తే ఇంకెంత బాగుంటుంది?! ఇక్కడ మల్లెపూవును రమ్మనటం లేదు కవి. దాని గుణ గణ లక్షణాలను తన దగ్గరకు రమ్మంటున్నాడు అవతలి వ్యక్తిని.
ఇలా చెప్పుకుంటూ పోతే కవిత్వానికి అనిర్వచనీయత, అనుభూతులే ఊపిరితిత్తులు అని సిద్ధాంతీకరించగలం.
‘‘కన్నీటి గుండె పిండి/ కవిత మీద ఆరవేశాను/ జనతా శాలువ కప్పుకొని’’ అంటారు- కీ.శే.గుంటూరు శేషేంద్రశర్మ ఒక కవితలో. ఇక్కడ తాను ఎవరికోసం కవిత్వం రాస్తున్నాడో, ఏ పరిస్థితుల ప్రభావం చేత రాస్తున్నాడో పదాల వివరణ కనిపించదు. కానీ భావం రసార్ద్భ్రీతమై చదువరుని గుండె లోతుల్లోకి నేరుగా చొచ్చుకుపోతుంది ఒక తేనె పిచికారీ లాగా.
‘‘పచ్చ గడ్డి పరకల కొనల ముత్యాలను తొక్కుకుంటూ పోతూ మంచు ఋతువు ప్రాభాత సంధ్యా విహారంలో...’’ అంటాడు ఒక ఆధునిక అనుభూతి కవి- బహుశః ఆశారాజో అతని లాంటి మఱో అనుభూతి కవితా శిల్పకవో- ఎవరో గుర్తురావటం లేదు.
డాక్టర్ సి.నా.రె. తన ‘కర్పూర వసంతరాయలు’ కావ్యంలో లకుమా వసంతరాయల అన్యోన్యతను వర్ణిస్తూ లలిత శృంగారంలో ‘‘ఇరువురును పంతాన చదరంగ మాడెదరు/ ఎవ్వరోడినను బిగి కౌగిలి శిక్ష’’ అంటారు అనిర్వచనీయత- అనుభూతులకు అద్దంపడుతూను, ‘శిక్ష’ అనే చేదు మాటకు స్వాదుభావాన్ని ఆపాదిస్తూను, ఒక చమత్కార రమ్యోక్తిగాను- భావ సౌందర్య చమత్కారాల ఫ్లాష్ కొడుతూ.

- శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం